కళాసరస్వతి శ్రీ తిరుమల రామచంద్ర - Tirumala Ramachandraతెలుగు భాషకు ‘నుడి-నానుడి’-తిరుమల రామచంద్ర.
తెలుగు సాహిత్యం, పత్రికారంగాలలో ప్రాతః స్మరణీయుడు . ప్రాకృత, సంస్కృతాం ధ్ర సారస్వతాల్లో నిష్ణాతునిగా, ద్రావిడ భాషల పరిశోధకునిగా విశిష్ట సేవలందించారు. స్వాతంత్య్ర సమరయోధునిగా, మద్రాసు కుట్రకేసులో ముద్దాయిగా స్వాతంత్య్ర సమరంలో పాలుపంచుకున్నారు.

అనంతపురం జిల్లా ధర్మవరం తాలుకా రాఘవంపల్లెలో జన్మించిన రామచంద్ర తెలుగు సంస్కృతాలలో ‘విద్వాన్’గా, హిందీలో ‘ప్రభాకర’గా పట్టాలు పొందారు. తిరుపతిలో చదువుతున్నపుడు వ్యష్టి సత్యాగ్రహంలో పాలొని, ఏడాది జైలు శిక్ష అనుభవించారు. సహాయ నిరాకరణ సభల కోసం మార్చింగ్ సాంగ్స్ రాశారు.

తిరుమల రామచంద్ర సంపాదకుడు, రచయిత, స్వాతంత్ర్యసమరయోధుడు, భాషావేత్త. తిరుమల రామచంద్ర మాతృభాష తెలుగుతో పాటు కన్నడ, తమిళ, సంస్కృత, ప్రాకృతాది భాషల్లో ప్రావీణ్యం కలిగిన బహుభాషావేత్త. రకరకాల వృత్తులు చేసి, వివిధ అనుభవాలు సంపాదించి విస్తృత లోకానుభవశాలి ఐన రామచంద్ర తనను తాను వినమ్రంగా భాషాసేవకుడు అని అభివర్ణించుకునేవారు.

విద్యాభ్యాసం: 
అనంతపురం జిల్లా ధర్మవరం తాలూకా రేగటిపల్లె లో జన్మించిన రామచంద్ర హంపీ శిథిలాలలోని గ్రామమైన కమలాపురంలో తన బాల్యం గడిపారు. వీరు సాక్షాత్తూ విజయనగరసామ్రాజ్యంలో కానవచ్చే తాతాచార్యుల వంశీయులు. సంస్కృత భాష, శాస్త్రాలను గురుశుశ్రూష చేసి నేర్చుకోవడం ప్రారంభించాకా కారణాంతరాల వల్ల తిరుపతిలోని కళాశాలలో చేరారు. తెలుగు, సంస్కృతాలలో విద్వాన్ గా హిందీలో ప్రభాకరగా పట్టాలు పొందారు.

ఉద్యమరంగం:
స్వాతంత్ర్య సమరయోధునిగా మద్రాసు కుట్ర కేసులో ముద్దాయిగా స్వాతంత్ర్య సమరంలో పాలుపంచుకున్నారు. తిరుపతిలో చదువుతున్నపుడు వ్యష్టి సత్యాగ్రహం లో పాల్గొని ఏడాది జైలు శిక్ష అనుభవించారు. సహాయ నిరాకరణ సభల కోసం మార్చింగ్ సాంగ్స్ రాశారు.

విస్తృత లోకానుభవం:
ద్వితీయ ప్రపంచ యుద్ధ కాలంలో సైన్యంలో హవల్దార్ గుమాస్తాగా ఆప్ఘనిస్థాన్, బెలూచిస్థాన్, సరిహద్దుల్లో పనిచేశారు. ఆ ఉద్యోగాన్ని ఆత్మాగౌరవానికి భంగం కలిగిన కారణంగా విడిచిపెట్టిన రామచంద్ర ఆ సమయంలోనే ఉత్తర భారతదేశంలో విస్తృతమైన పర్యటన చేశారు. ఉమ్మడి పంజాబులో భాగమైన లాహోర్ పట్టణంలో కొందరు మహాపండితులను, పంజాబు పల్లెల్లో భారతీయ గ్రామీణ జీవితం, మొహెంజదారో, హరప్పా ప్రాంతాల్లో ప్రాచీన నాగరికతా చిహ్నాలను దర్శించారు.

పత్రికా రంగం: 
వేటూరి ప్రభాకర శాస్త్రికి ఏకలవ్య శిష్యునిగా చెప్పుకుంటున్న తిరుమల రామచంద్ర విద్వాన్ విశ్వం వంటి సహాధ్యాయులతో పనిచేశాడు. అనంతరం ఢిల్లీ వచ్చి డెయిలీ టెలిగ్రాఫ్ ఆంగ్ల పత్రికలో చేరి పాత్రికేయ వృత్తిలో స్థిరపడ్డాడు. 1944 లో పత్రికా రంగంలో పనిచేశాడు. తొలుత

సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణ రెడ్డి , బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల దంపతులతో ఏర్పడిన సాన్నిహిత్యంతో సోషలిష్టు భావజాలానికి దగ్గరయ్యాడు. ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, హిందుస్తాన్ సమాచార్ లలో వివిధ హోదాలలో పనిచేశాడు. భారతి మాసపత్రిక ఇన్ చార్జ్ ఎడిటర్ గా పనిచేసిన కాలంలో దేవరకోండ బాలగంగాధర తిలక్ వ్యాసం ప్రచురించిన కారణంగా తలెత్తిన భేదాభిప్రాయాలతో రాజీనామా చేశాడు. నార్ల వెంకటేశ్వరరావు తో విభేధించి ఆంధ్రప్రభలో ఉద్యోగం వదులుకున్నాడు. పరిశోధన అనే ద్వైమాసపత్రికకు సంపాదకత్వం వహించి 1953-1956 మధ్యకాలంలో ప్రచురించాడు.

రచన రంగం:
పదమూడవ యేట ఒక శృంగార రచన చేసినా మానపల్లి రామకృష్ణ కవి మందలింపుతో దేశ భక్తి గీతాలవైపు మళ్ళారు రామచంద్ర. కొన్ని వందల వ్యాసాలు సమీక్షలు రాశారు.

"హైదరాబాద్ నోట్ బుక్" వంటి 15 శీర్షికలు నిర్వహించారు."సత్యాగ్రహ విజయం" నాటకం, రణన్నినాదం గీతాన్ని సంస్కృతంలో రాశారు. తిరుమల రామచంద్ర తన 84 ఏళ్ళ జీవితంలో అర్ధ శతాబ్ది పత్రికా రచనకే అంకితమైనారు. తెలుగు నాట, భారతావనిలో ప్రసిద్ధులైన కవిపండితులు, కళాకారులు, భాషావేత్తలు, తత్వ్త చింతకులు అయిన ప్రతిభాశాలురు అనేక మందిని ఆయన ఇంటర్వ్యూ చేశారు. సుమారు 50 పుస్తకాల దాకా ఆయనవి అచ్చైనాయి.

రాహుల్ సాంకృత్యాయన్‌ను స్వయంగా కలుసుకున్నారు. బహుభాషా కోవిదుడైన రఘువీర తన ప్రపంచ భాషా నిఘంటు నిర్మాణంలో తనతో కలిసి పనిచేయవలసిందిగా సహాయ సహకారాలు అర్థించగా, జీవనోపాధికి ఆ పని కలిసిరాదని ఉత్సుకత చూపలేకపోయానని, అటువంటి గొప్ప అవకాశం వదులుకోవలసినది కాదనీ పశ్చాత్తాపం చెందినట్లు స్వీయ చరిత్రలో చెప్పుకున్నారు.  'మన లిపి - పుట్టు పూర్వోత్తరాలు' భాషా చరిత్రకే తలమానికం.ఇతర భాషలలో కూడా ఇలాంటి రచన లేదనిఆంధ్ర విశారద తాపీ ధర్మారావు అన్నారు.

వ్యక్తిత్వం: 
చిన్నతనంలోనే భారతదేశపు సాంస్కృతిక వైశాల్యాన్ని దర్శించిన రామచంద్ర ఆ కారణంగా తన దృక్పథంలో ఏర్పడ్డ సమ్యక్ దృష్టి, సంస్కృతి పట్ల ప్రేమను జీవితాంతం నిలబెట్టుకున్నారు. నార్ల వెంకటేశ్వరరావుతో విభేదాలు, "భారతి" పత్రికలో ఒక వ్యాసం గురించిన వివాదాలు వంటి సందర్భాల్లో రాజీనామాలు చేసి తన ఆత్మగౌరవాన్ని ప్రదర్శించారు. గాంధీని దర్శించారు. వారితో హరిజనోద్యమంలో పాల్గొన్నారు. ఖద్దరు దుస్తులు కట్టేవారు. నాస్తికునిగా, హేతువాదిగా ప్రకటించుకున్న వీరే దేవాలయంలో పూజ చేయడం, ఉన్నవ లక్ష్మీనారాయణ గారి వద్ద సహాయకునిగా పౌరోహిత్యం చేయడం వంటివి చేశారు. ప్రతి ఉత్తరంలోనూ ఇట్లు భాషాసేవకుడు తిరుమల రామచంద్ర అంటూ సంతకం చేసే రామచంద్ర భాషాసేవలోనే జీవితాన్ని గడిపారు.

కొన్ని రచనలు: 
హంపి నుంచి హరప్పా దాక ముఖచిత్రం సాహితీ సుగతుని స్వగతం : రామచంద్ర గారు, చాలా చిన్న వయసులోనే భారతి పత్రిక కు వ్యాసాలు రాసే వారట. అప్పట్లో భారతి పత్రికలో వ్యాసం పడ్డం అంటే, అదో గొప్ప గౌరవమట. ఆ వ్యాసాల సంకలనం ఈ పుస్తకం.

ఇందులో కొన్ని అద్భుతమైన వ్యాసాలు:
  • 1. ఆంధ్రచ్చందో విశేషములు : "ఎసగు , ఒసగు" అన్న పదాల చర్చకు సంబంధించి శ్రీ వజ్ఘల చిన సీతారామశాస్త్రి గారి వాదనను ఆక్షేపిస్తూ వ్రాసినది. ఈ వ్యాసం చదివిన పండితుడొకాయన ప్రభాకర శాస్త్రి గారి వద్ద ప్రస్తావిస్తూ, భారతి లో ఎవరో గొప్ప వ్యాసం రాసేరని అన్నాట్ట. శాస్త్రి గారు పక్కనున్న రామచంద్ర గారిని చూపించేరట. ఆ పండితుడు విస్తుపోయి, "ఎవరో శాలువా పండితుడనుకున్నాను. ఈ కుర్ర వాడా?" అని మెచ్చుకున్నారుట. ఈ ప్రస్తావన "హంపి నుండి..." లో ఉన్నది.
  • 2. నువ్వులు కొట్టిన ఇడి నూటిడి : నన్నెచోడుడి కుమారసంభవం పరిష్కరిస్తూ, వేదం వెంకటరాయ శాస్త్రి గారు ఓ చోట, "నూటిడి" అన్న భక్ష్య విశేషాన్ని, "నూబిడి (నువ్వు + పిడి - పిడికిలి మేర నువ్వులు)" గా పేర్కొంటే, రామచంద్ర గారు, "నూటిడి" పదాన్ని అన్నమయ్య కీర్తనలోనూ, శ్రీనాథుని హరవిలాసం లోనూ వాడినట్టు ఋజువు చేశారు. ఇదో అత్యద్భుతమైన వ్యాసం.
  • 3. బుద్ధుడికి ముందే ఉన్న ధూమపానం : ధూమపానం పైని వివరణ. ఇంకా ఇందులో ఆఫ్రికా కాల్పనిక సాహిత్యం, అనువాద సమస్యలు వంటి అద్భుతమైన వ్యాసాలున్నాయి. సాహితీ ప్రేమికులు మరువకూడని అద్భుతమైన పుస్తకం ఇది. విశాలాంధ్ర ప్రచురణ. ఇప్పుడు దొరకం లేదు!
ఇంకా తెలుగు పత్రిక సాహిత్య సేవ, బృహదారణ్యకం, మరపురాని మనీషులు, గాథాసప్తశతిలో తెలుగు పదాలు, హిందువుల పండుగలు - పర్వాలు, హాల గాథలు, వీరగాథలు, దక్షిణాంధ్రవీరులు, కాటమరాజు కథ,శశాంకవతి, ధర్మదీక్ష మొదలైన పుస్తకాలు వ్రాశాడు. సంస్కృతంలో సత్యాగ్రహవిజయం, సుమతీశతకం వ్రాశాడు. అనువాదకుడిగా కన్నడనవల శాంతల, తమిళం నుండి రాజాజీ కథలు,ఆంగ్లం నుండి భక్తి వేదాంతస్వామి కమింగ్ బ్యాక్, హిందీనుండి సుశీలా నయ్యర్ వ్రాసిన గాంధీజీ కారాగారగాథ, సంస్కృతం నుండి క్షేమేంద్రుని బృహత్కథామంజరి, ప్రాకృతం నుండి లీలావతి కావ్యం తెలుగులోనికి అనువదించాడు.

అవార్డులు:
న్యూఢిల్లీ శనివారం, డిసెంబర్ 22, 2001: ప్రముఖ సాహితీవేత్త దివంగత తిరుమల రామచంద్ర పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

ఆయన రాసిన ఆత్మకథ హంపీ నుంచి హరప్పా దాకా అనే పుస్తకానికి ఈ అవార్డు లభించింది.తిరుమల రామచంద్ర నిరుడు స్వర్గస్థులయ్యారు. ఆయన తన హంపీ నుంచి హరప్పా దాకా అనే పుస్తకాన్ని కేవలం ఆత్మకథగానే రాయలేదు. ఈ పుస్తకంలో సాంఘిక పరిస్థితులకు, వందేళ్ల సాహితీ చరిత్రకు అద్దం పట్టారు.

బిరుదులు: 
  • 🖝 పత్రకార శిరోమణి. 
  • 🖝 కళాసరస్వతి, 
  • 🖝 మహామహోపాధ్యాయ
రచన: శ్రీ మేధా దక్షిణామూర్తి

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top