వసిష్ఠ మహర్షి - Vasishta Maharshi

వసిష్ఠ మహర్షి - Vasishta Maharshi
వసిష్ఠుడు
వసిష్ఠ మహర్షి బ్రహ్మర్షులలో అగ్రగణ్యుడు, నవబ్రహ్మలలో కీర్తించదగినవాడు. సప్త ఋషులలో ఉత్తముడు, ఇక్ష్వాకు వంశీయులకు కులగురువు, త్రిలోకపూజ్యురాలైన అరుంధతికి ప్రాణనాధుడైనవాడు.

బ్రహ్మమానసపుత్రునిగా జన్మించిన వసిష్ఠుడు దక్షుని కూతురైన ఊర్జను వివాహం చేసుకున్నాడు. అతని సంతానమైన ఏడుగురు పుత్రులు తమ తపఃప్రభావముచే ఉత్తర మన్వంతరంలో సప్తమహర్షులుగా విరాజిల్లారు. ఆ తరువాత వసిష్ఠుడు ఘోరతపస్సులో నిమగ్నుడై వాలఖిల్యాదులు వంటి బ్రహ్మర్షి శిష్యులను కలిగి, బ్రహ్మతేజంతో వెలుగొందాడు.
వశిష్ఠుడితో రామ లక్ష్మణులు
వశిష్ఠుడితో రామ లక్ష్మణులు 
ఒకనాడు అయోధ్య రాజైన ఇక్ష్వాకుడు, వసిష్ఠుని వినయంతో ప్రార్థించాడు భూతభవిష్యద్వేది అయిన వసిష్ఠుడు, విష్ణుమూర్తి శ్రీరామునిగా ఆ వంశంలో అవతరించనున్నాడని గ్రహించి, అతని ప్రార్థనను తమ కులగురువుగా ఉండమని వినయంతో ప్రార్ధించాడు. ఆనాటి నుండి ఇక్ష్వాకు వంశీయులకు కులగురువైనాడు వసిష్కుడు.

ఇక్ష్వాకుని కుమారుడైన నిమిచక్రవర్తి, తండ్రివలె, తను కూడా వసిష్ఠుని ఎడల భక్తిప్రపత్తులను కలిగి ఉండేవాడు. అతనికి కొంతకాలానికి సత్రయాగం చేయాలని సంకల్పం కలిగి వసిష్ఠుని వద్దకు వెళ్ళి, విషయం తెలిపి, హోతగా ఉండమని ప్రార్ధన చేశాడు. అపూర్వమైన ఆ యజ్ఞానికి హోతగా ఉండటానికి తనకు అభ్యంతరం లేదని, అయితే ఇంద్రుడు చేసే యజ్ఞానికి వస్తానని ముందే చెప్పానని, అది పూర్తయ్యాక దీనిని ఆరంభిద్దామని తెలిపి వెళ్ళిపోయాడు వసిష్టుడు.

నిమిచక్రవర్తి సత్రయాగానికి అన్నీ సిద్ధపరుచుకుని, వసిష్ణుడు వచ్చేంతవరకు ఆగక, అసహనాన్ని కలిగి, గౌతమమహర్షిని పురోహితునిగా పిలిచి యజ్ఞారంభం చేశాడు. వసిష్ఠుడు తిరిగివచ్చేటప్పటికే యాగం జరుగుతుండడం చూసి, తృణీకారభావంతో తనకు తెలియజేయకుండా యాగం ఆరంభించినందుకు విదేహుడివి (శరీరం లేకుండా) కమ్మని నిమిచక్రవర్తిని శపించాడు. అంతట నిమిచక్రవర్తి కూడా క్రోధావేశంతో, వసిష్ఠునికి తిరిగి అదే ప్రతిశాపమిచ్చాడు. ఆ తరువాత గౌతముడు, ఇత్యాది మహర్షులంతా ఆ నిమిచక్రవర్తి శరీరం పాడవకుండా సంరక్షిస్తూ యాగాన్ని పూర్తిచేసారు.

అయితే నిమిచక్రవర్తి యజ్ఞారంభంలో, చిరంజీవిత్వం సంకల్పించినందున, అతనిని సమస్త జీవుల నేత్రపద్మాలకు కనురెప్పయై ఉండేలా వరమిచ్చారు ఇంద్రాదిదేవతలు. మన కంటిరెప్పపాటే శాశ్వతంగా నిమిదేహం అయింది. ఇంక వసిష్ఠుడు కూడా నిమిశాపం వలన విదేహుడై, మిత్రావరుణులయందు తేజోరూపాన ప్రవేశించాడు, ఊర్వశి కారణంగా మిత్రావరుణుల నుండి బహిర్గతమైన తేజం నుండి వెలువడి కుంభంలో భద్రపరచబడ్డాడు.

అగస్త్యునితోపాటు కుంభసంభవునిగా తిరిగి దేహధారి కాగలిగాడు. అయితే తన తపః శక్తితో నిమిశాపాన్ని ఉపసంహరించ గలిగినా, దానికి తపోధనాన్ని వినియోగించక, స్వేచ్ఛాజన్ముడై, ద్విజన్ముడై, తన ఆత్మశక్తిని లోకానికి చాటి చెప్పాడు. పిదప కర్థమ ప్రజాపతి కుమార్తె అయిన అరుంధతిని వివాహం చేసుకున్నాడు.
ఈవిడ ఇసుక రేణువులను కూడా ఇయ్యంగింజలుగా మార్చి అన్నం వండగల మహాత్మురాలు, పరమ పతివ్రతాశిరోమణిగా, సాధ్వీమణిగా, అరుంధతి పేరు లోకాన శాశ్వతంగా నిలిచి ఉన్నది.
వసిష్ఠుడు, జనకమహారాజు ప్రార్ధన మేరకు 'అక్షరం' గురించి చేసిన తత్త్వబోధ గుహ్యమైనది, ఆనందభరితమైనటువంటిది. అంతేకాక భృగువిద్యాధర వృత్తాంతం, సుందోప సుందోపాఖ్యానం, మాఘస్నాన ఫలాదులతో పాటు, అష్టాకరీ మంత్ర మహాత్త్వం మున్నగునవి అనేక మోక్షదాయకాలను వివరించాడు.

       సత్యవ్రతుడనే రాజు (అతడే త్రిశంకుడు) సశరీరంగా స్వర్గానికి వెళ్ళేలా యాగం చేయమని అడిగితే వసిష్ఠుడు అతనిని అటువంటి అసమంజసమైనవి అడగరాదన్నాడు.

అయితే సత్యవత్రునితో విశ్వామిత్రుడు యజ్ఞం చేయించి, త్రిశంకుస్వర్గానికి పంపగలిగాడు.
కానీ వసిష్ఠుని మాటకి తిరుగులేక స్వర్గానికి చేర్చలేకపోయాడు. సకల సంపదలతో తులతూగే మాంధాత చక్రవర్తికి, కర్మ స్వరూపం, బ్రహ్మస్వరూపం, భక్తియోగ స్వరూపం వంటివి వసిష్ణుడు వివరించాడు.

వసిష్ఠ మహర్షి స్కృతికర్తలలో ఒకరు. వసిష్ఠ స్మృతిలో ముప్పయి అధ్యాయాలు కలవు. దీనికే 'వసిష్ఠ ధర్మసూత్రమని' ఇంకొక పేరు కూడా ఉంది. ఋగ్వేద్రంలోని దశమండలాలలో, సప్తమమండలానికి ద్రష్ట వసిష్ఠుడు., అందుచే ఆ సప్తమ మండలాన్ని 'వాసిష్ఠ మండలం' అంటారు.

బారతీయ సనాతన సంస్కృతి నిర్మాతలలో ఒకడైన వసిష్ఠుడు శ్రీవిష్ణావతారమైరామచంద్రునికి గురువుగా నిలిచి, ఆయనకు ఉపదేశించిన జ్ఞానమే 'యోగవాసిష్ఠం'గా పేరుపొంది తత్త్వశాస్త్రాల్లో అగ్రస్థానాన్ని పొందింది. యోగవాసిష్ఠం ఆరుప్రకరణాలతో, నలభైవేల శ్లోకాలతో కూడి ఉన్నది. ఇది రెండు భాగాలుగా (పూర్వార్ధం, ఉత్తరార్ధం) విభజించబడింది.

ఆ తత్త్వబోధలోని కొంత సారాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం:
  • 🝒 అజ్ఞానదశలో జీవునికి జగత్తుగా భాసించేది, జ్ఞాని దృష్టిలో మిధ్య మాత్రమే. కలలోని వివిధ దృశ్యాలను మేల్కొన్నవాడు, ఏ విధంగా కలగా గుర్తిస్తాడో, 
  • 🝒 అలాగే జ్ఞాని కూడా జాగ్రదవస్థలో తాను చూసేదానిని భ్రమగా గుర్తిస్తాడు. 
  • 🝒 జగత్తు జగత్తుగా కనిపించడానికి చిత్తమే కారణం. దీనికే అవిద్య అని సంస్కారమని, వాసన అని వివిధ నామాలు. 
  • 🝒 అన్నింటిని సంపూర్ణంగా త్యజించగలిగిననాడు, సాధకుడు దేహధారుడైననూ, శరీర భ్రాంతిని
  • 🝒 విడనాడి శాంతి స్వరూపుడై, చిదానందంలో సుస్థిరంగా నెలకొని ఉంటాడు. 
  • 🝒 ఈ జగత్తు మనకంటే భిన్నమైనది కాదు. మనం కల్పించుకున్నది. 
  • 🝒 'నేను అన్న భావన సహితం కల్పసనలో ఒక భాగమేనని సంకల్పం వల్లనే జగత్తు సృష్టించబడి, లయిస్తోందనే' మహాబోధను మనకు యోగవాసిష్ఠం అందజేస్తోంది.
  • 🝒 జ్ఞానవాసిష్ఠమని, జ్యోతిర్వాసిష్ఠమని పిలువబడుతోంది,
ప్రవృత్తిమార్గానికి, నిషృకత్తిమార్గానికి అదర్శప్రాయుడైన వసిష్ఠుని యొక్క కుమారులలో ఒకడైన శక్తి కుమారుడు పరాశరుడు, ఆ పరాశరునికి పుత్రుడైనవాడు వ్యాసుడు, అతని పుత్రుడు శుకుడు, వీరంతా మహనీయులే. వీరందరిని స్మరిస్తూ, వ్యాసుని స్తుతిస్తూ ఉన్న శ్లోకం లోకవిదితమైనదే.
వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||

    పరమ పావన భారతవర్షంలో, బ్రహ్మతేజోమయమైన రూపంతో నిలిచిన వసిష్ఠుని కీర్తి ఆచంద్రార్కం చిరస్థాయిగా నిలిచిపోతుంది.

రచన: డా.. అపర్ణా శ్రీనివాస్

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top