అంతర్వేది నరసింహుడు - Antarvedi Narasimha Swamy - Konasima

అంతర్వేది శ్రీలక్ష్మి నరసింహస్వామి వారి తీర్థం
అంతర్వేది శ్రీలక్ష్మి నరసింహస్వామి వారి తీర్థం 
' శ్రీమతృధ్యాసవస్థం వశిహిమ ధవళం
శాంతమానంద కందం వామాంకారూఢ లక్ష్మి
కుచయుగళ తట వ్యస్తహస్త ప్రశస
ఉర్బేద్వ శంఖంచ చక్రం దదతు మభయదం
దక్షిణే సత్యహస్తం వందే లక్ష్మీనృసింహం
వరద మభయదం వాసవాద్యాది వంద్యం ”

కొనసీమవాసుల కొంగు బంగారం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి. సఖనేటిపల్లి మండలం అంతర్వేదిలో కొలువై ఉన్నాడు.

దక్షిణ కాశీగా పిలుచుకునే ఈ అంతర్వేది గోదావరి, సాగర సంగమ పవిత్ర ప్రదేశం. గోదావరి పాయ వశిష్ఠానది బంగాళాఖాతంలో సంగమించే ప్రాంతంగా ఈ క్షేత్రం వైష్ణవక్షేత్రంగా విరాజిల్లుతున్నది.  సాధారణంగా సంగమ స్థలాలు శివక్షేత్రాలుగా ఉండగా ఈ క్షేత్రం వైష్ణవక్షేత్రంగా తన విశిష్ఠతను నిలుపుకొంటున్నది.  సృష్టికర్త చతుర్ముఖుడు ఈ స్థల మహత్యమును గ్రహించి లోక శాంతి కోసం మహరుద్ర యాగం మనసారా ముగించి ఈశ్వరానుగ్రహమునకు పాత్రులై బ్రహ్మదేవుడే క్షేత్ర పాలకుని చేసి నీలకంఠేశ్వరుని ప్రతిష్టించాడని ప్రతీతి. అందువల్లనే అంతర్వేది దక్షిణ కాశీగా ఖ్యాతి గడించింది.
అంతర్వేది పుణ్యక్షేత్రం
అంతర్వేది పుణ్యక్షేత్రం - చిత్రం: కటకం వీరభద్ర రావు 
       అంతర్వేది ఒక పుణ్యక్షేత్రంగా ఎంత సందర్శనీయ స్థలమో ప్రకృతి రామణీయకతకు కూడా అంతే ప్రసిద్ధి. కోనసీమకు ఆ కొసన సాగరం అంచున ఉన్న ఆ ఆలయ సౌందర్యం హృదయం మీద ముద్ర వేస్తుంది.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి లాంచీ మీదుగా కొందరు అంతర్వేది చేరితే, ఇంకొందరు తూర్పు గోదావరి జిల్లాలోనే రాజోలు, మలికిపురం, మోరి గ్రామాల మీదుగా ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. గోదావరి బంగాళాఖాతంలో సంగమించే స్థలాన్ని అన్నాచెల్లెళ్ల గట్టుగా పేర్కొంటూ ఉంటారు. ఇదొక అద్భుత దృశ్యం. సాగరం, నది సంఘర్షించుకుంటూ కనిపిస్తాయిక్కడ.  ఈ ప్రదేశానికి కొంచెం దూరంగానే ఉంది దీపస్తంభం (లైట్హౌస్), కొబ్బరితోటల ఆ నడుమ, కాలవ గట్ల వెంట అంతర్వేది యాత్ర ఎంతో సుందరంగా కూడా సాగుతుంది. నిజానికి రావుల పాలెం నుంచి అంతర్వేది వరకు విస్తరించి ఉన్న సువిశాల కోససీమ ఆ యాత్రతో చాలా వరకు మన కంటి ముందు నిలుస్తుంది.

స్థల పురాణం:
నారద మహర్షికి బ్రహ్మ తెలిపినట్టు పురాణాలు ఉటంకించే ఉదంతాన్ని పరిశీలిస్తే అంతర్వేది క్షేత్ర  ఔన్నత్యం ప్రస్పుటమవుతుంది. పవిత్రతకు పరాకాష్ఠగా ఉన్న అంతర్వేదిని "బ్రహ్మర్షి వశిష్ఠ మహర్షి" ఆశ్రమానికి తగిన స్థలమని ఎంపిక చేసుకున్నారు.

ఎన్నెన్నో యజ్ఞయాగాదులను నిరంతరం నిరాటంకంగా నిర్వహించుకున్నారు. అంతటి మహామునికి ముప్పు వాటిల్లకపోలేదు. ఈశ్వరదత్త వరప్రసాద గర్వితుడైన హిరణ్యాక్ష కుమారుడు రత్నలోచనుడు విధ్వంసకాండకు పూనుకున్నాడు. ఈ కిరాత కృత్యాలు ఆశ్రమ వాటికకు ఆవేదన ఆందోళన కలిగించాయి. వశిష్టుని అర్ధాంగి అరుంధతిని హింసించాడు. ముని వనితలను చెరపట్టాడు. రుచి మొదలుగా గల నూర్గురు పుత్రులను పొట్టన పెట్టుకున్నాడు. పసిపాపలనైనా చూడకుండా చంపి కసితీరా పచ్చినెత్తురు త్రాగసాగాడు. మహర్షి సహనం నశించిపోయింది. భరింపజాలని బాధతో విష్ణువుకు వివరించాడు. దీనితో శ్రీమహా విష్ణువు నరసింహవతారమెత్తి రణరంగ ప్రవేశం చేశారు. రత్నలోచనుని సంహారం సాధ్యం కాలేదు. రక్కసుని ఒంటి మీది గాయం నుంచి పడి రక్తసికతమైనత మృత్తిక నుంచి అక్షౌహిణుల కొద్దీ రత్నాలోచనులే పుట్టుకు రాసాగారు. అప్పుడు అశ్వరూఢాంబిక ఆదిశక్తిగా అన్నకు తొడుగా రణరంగంలో నిలిచింది. రక్తపు బొట్టును నేలపై పడనియక యుద్ధభూమిలో నాలుక చాపి పరిచింది. మహా విష్ణువు రత్నలోచనుని వధ పూర్తి చేసి కళేబరాన్ని అంతర్వేదికి విసిరివేశాడు.

వశిష్ఠ మహర్షి ఆలయం , అంతర్వేది
వశిష్ఠ మహర్షి ఆలయం , అంతర్వేది - చిత్రం: కటకం వీరభద్ర రావు
    శ్రీమన్నారాయణుని కృప కలిగిన వశిష్ఠ మహర్షి తెచ్చిన ఉపనది ఈ ప్రాంతంలో వశిష్ఠ సార్ధథక నామంతో ప్రవహిస్తున్నది. అశ్వరూఢాంబిక నాలుక నుంచి జారిన రత్నలోచననుని రుధధార రక్తకుల్యగా అంతర్వేది దగ్గరగా పారుతున్నది. అశ్వరూఢాంబికను స్థానికులు గుర్రాలక్కగా పిలుచుకుంటారు. ఆ దేవతక్షేత్ర ప్రతిపత్తికి ప్రతీకయై ప్రాముఖ్యతతో వెలసింది శ్రీఆంజనేయ స్వామి క్షేత్ర - పరిరక్షకునిగా విధి నిర్వాహణలో ఉన్నాడు.

     అంతరాలకు అతీతం అంతర్వేది తీర్థం అన్న ఏకాభిప్రాయంతోనే ద్వైత, విశిష్టాద్వైత శాక్తికేయులు సహితమూ అపురూప సమప్ఠి పవిత్ర యాత్రా స్థలమన్న నమ్మకంతోనే సమైక్యతతో సేవిస్తున్నారు బ్రహ్మయాగం చేసిన యజ్ఞవేదిక అంతర్భాంగంలో ఉండడంతో ఆ గ్రామానికి అంతర్వేది అనే పేరు వచ్చింది. కృతయుగంలో వశిష్ఠుడు, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపరయుగంలో అర్జునుడు, ఈ క్షేత్రాన్ని నందర్శించారని నృథలపురాణాలు చెబుతున్నాయి.
అంతర్వేది ఆలయం - చిత్రం: కటకం వీరభద్ర రావు
ఆలయ చరిత్ర:
కలియగం ప్రవేశానికి ముందే వశిష్ఠుడు అంతర్వేదిని వదిలి వెళ్లడంతో ఆయన నిర్మించిన నరసింహ ఆలయం అర్చనాదులు లేక శిథిలవమైంది, అదే కాలంలో కేశవదాసు అనే వ్యక్తి అడవిలాగా  ఉన్న ఈ ప్రాంతంలో గోవులను మేపుకుంటూ ఉండేవాడు. ఒక గోవు ప్రతిరోజు ఒక పుట్ట వద్దకు పుట్టలో ధారగా పోస్తుండడం అతడు గమనించాడట. గోవులను ఇంటికి తోలుకెళ్లిన కేశవదాసుకు ఆ రాత్రే నరసింహస్వామి కలలో కనిపించి ఆ పుట్టలో తాను నివాసమున్నాని చెప్పడంతో, మరునాటి ఉదయమే పుట్టను తవ్వి పందిరి వేసి పూజలు ప్రారంభించాడట.

     ఓడలరేవు (అంతర్వేదికి సమీపంలోని సముద్రతీరం) ప్రాంతంలో ధనవంతులైన కొపనాతి ఆదినారాయణ ఆదినారాయణ ఓడల ద్వారా విదేశాలకు సరుకులు రవాణా చేసేవారట. ఆయన నౌకలు కొన్ని ఒకసారి తప్పిపోయాయి. ఆదినారాయణను కేశవదాసు కలిసి ఆలయం గురించి చెప్పగా తప్పిపోయిన తమ ఓడలు తిరిగివస్తే ఆలయం నిర్మిస్తామని మొక్కుకున్నాడట. ఆ ప్రకారమే వారి ఓడలు తిరిగి రావడంతో వారి ఆధ్వర్యంలోనే బేడా మండపాల నిర్మాణం చేపట్టి మధ్యలో మరణించడంతో ఆయన కుమారుడు  కోపనాతి కృష్ణమ్మ 1822 ఆలయ నిర్మాణం పూర్తి  చేసినట్లుగా ఆలయంలో ఉన్న శిలా శాసనం ద్వారా తెలుస్తోంది.

1844 సంవత్సరంలో అప్పటి బ్రిటిష్ పాలకులు ఈ ఆలయం ధర్మకర్తృత్వాన్ని మొగల్తూరు రాజా కలిదిండి కుమార లక్ష్మీనర్సింహరాజు బహదూర్కు అప్పగించారు. మొగల్తూరు సంస్థానాధీసులు స్వామి వారి కైంకర్యానికి వందలాది ఎకరాల భూములు కొట్లాది రూపాయల విలువ చేసే 'జవహరీ'ని సమకూర్చారు. నేటికీ వారి కుటుంబీకులే వంశపారంపర్య వ్యవస్థాపక ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు.

ప్రతియేటా మాఘశుద్ధ దశమి నాటి రాత్రి స్వామి వారి కల్యాణం, మరునాడు భీష్మ ఏకాదశి పర్వదినాన స్వామివారి రథయాత్ర కన్నుల పండుగగా లక్షలాదిమంది భక్తుల సమక్షంలో నిర్వహిస్తారు.

"ఏటేటా పెళ్లి ఏమిట్రా వెర్రి నాగాన్నా" అంటూ నరసింహుని సహోదరి అశ్వరూఢాంబిక (గుర్రాలక్క) మూతి తిప్పుకుందట. అయినా సోదరిపై ఉన్న వాత్సల్యంతో కల్యాణ శోభితుడైన నరసింహుడు రథంపై ఊరేగింపుగా సోదరి ఆలయానికి వెళ్లి చీరె సారెలు ఇచ్చి రావడం ఆనవాయితీగా వస్తోంది.

తుపానులకు పెట్టింది పేరయిన బంగాళఖాతం ఒడ్డున వెలసిన నరసింహుడు ప్రణవ స్వరూపుడై సముద్రతీరం వెంబడి సంచరిస్తూ ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రజలను కాపాడతారని ప్రజల అపార విశ్వాసం. ఎన్ని ఉప్పెనలు, సునామీలు, తుపానులు వచ్చినా నరసింహుడే రక్షించాడనేది ఇక్కడి ప్రజల విశ్వాసం.

భీష్మ ఏకాదశి మొదలు పౌర్ణమి లోపు ఏదో ఒక రోజున సూర్యభగవానుడి కిరణాలు మూల విరాట్ పాదాలను తాకుతాయట. ఈ అంశాలను పరిశీలిస్తే స్వామివారి విశిష్టత తేట తెల్లమవుతుంది, మరొక యదార్థ నంవటన కూడా పరిశీలించాలి. స్వామి ఆలయం వెనుక వైపు ఉన్న నదీ పాయలో ఒక జాలరి నిత్యం వేటాడుకునే వాడు ఒక రోజు అతని వలతో రెండు శిలలు పడ్డాయి, జాలరి వాటిని విసిరికొట్టాడు. మరల వల వేయగా అవే శిలలు వలకు చిక్కాయి. దాంతో జాలరి ఆ రాళ్లను మరల విసిరి కొట్టగా వాటి నుండి రక్తం ధారగా కారడంతో జాలరి ఆ శిలలను ఆలయానికి తీసుకువచ్చి అర్చకులకు అందించగా ఆ శిలలే సాలగ్రామాలుగా నేటికీ ఆలయంలో నిత్యపూజలు అందుకుంటున్నాయి.
    స్వామివారి రథయాత్ర ఎంతో శోభాయ మానంగా ఉంటుంది. దేవస్థానం చేసే అలంకరణ ఒక ఆకర్షణ కాగా, ఎంతో ఎత్తయిన ఆ రథానికి భక్తులు మొక్కులు చెల్లించుకుంటూ కట్టే అరటి గెలలు, గుమ్మడికాయలు మరొక ఆకర్షణ నిత్యం స్వామి వారికి అభిషేకాలు, సుదర్శన యాగం జరుగుతూనే ఉంటాయి.

భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం వారు సత్రం నిర్మించారు. నిత్యం వేలాదిమంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. ఉచిత అన్నప్రసాదం కూడా లభ్యమవుతున్నది.

రచన: గోపరాజు జవహర్ లాల్ (సీనియర్ జర్నలిస్ట్)
మూలము: జూగృతి

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top