నాటి మహా భారతంలో అంతుచిక్కని అద్భుత శాస్త్ర విజ్ఞానం - Mahabharata, Sastra Vignanamనాటి భారతంలోని విజ్ఞానంతో, నేటి విజ్ఞానం సరితూగ లేదు !
మహాభారతం అద్భుత విజ్ఞానశాస్త్రంగా కూడా వ్యాస భగవానుడి చేతుల్లో రూపుదిద్దుకుంది. బహుపురాణ సముచ్ఛయమని, నీతిసారమని ఇలా ఎన్నెన్నో రకాలుగా కీర్తినొందిన భారతంలో భారతీయుల మేథస్సు గొప్పతనమంతా ఆధునిక యుగంలో ఎన్నెన్నో అద్భుతాలుగా చెప్పుకుంటున్న విషయాలన్నీ ఆనాడే జరిగినట్టుగా వ్యాసుడు చిత్రించాడు. ఈనాటి వారికి ఇంకా రుజువుకాని గొప్ప గొప్ప విషయాలు ఆనాడు జరిగాయన్న సంగతిని ఉదాహరణ పూర్వకంగా సజీవంగా ఎప్పటికీ ఉండేలా ఆయన కథ నడిపిన తీరు అనితర సాధ్యం.

భారతమంటే ఏదో జ్ఞాతుల మధ్య జరిగిన పోరాటపు కథ మాత్రమే కాదు. ఎంతో గొప్ప శాస్త్ర విజ్ఞానాన్ని విడమరచి చూపిన గ్రంథరాజమని కూడా అందరూ ఒప్పుకుంటారు. పాశ్చాత్యులు కూడా భారత గ్రంథంలోని అనేక విషయాలను ఆధునిక వైజ్ఞానిక దృష్టితో సరిపోల్చుకుని భారతీయుల మేథస్సు చాలా గొప్పదని ప్రశంసించారు.

భారతం ఆదిపర్వంలోనే కొన్ని వైజ్ఞానిక అంశాలు కనిపిస్తాయి. మానసిక స్థితిగతులు స్త్రీ గర్భాన్ని ధరించే సమయంలో ప్రభావాన్ని చూపుతాయని, వాటి వల్లనే లింగ నిర్ణయం కూడా జరుగుతుందని, అన్ని అవయవాలు బాగుండి ఆరోగ్యకరమైన బిడ్డ జన్మించటానికి మానసిక స్థితిగతులు బాగా ఉండాలని, ప్రధానంగా గర్భం ధరించబోయే తల్లి ఈ విషయంలో ఎంతో జాగ్రత్త వహించాలని తెలియచెప్పే విధంగా ధృతరాష్ట్ర, పాండురాజ, విదురుల జనన సంఘటనలు మనకు వివరిస్తాయి.
పంచపాండవులు
పంచ పాండవులు 
అలాగే కౌరవుల జనన ఘట్టం కూడా ఒక అద్భుత వైజ్ఞానిక అంశాన్ని వెల్లడిస్తుంది. గాంధారి కుంతికంటే ముందుగా బిడ్డను కని హస్తినకు అధిపతిని చెయ్యాలనుకుంది. కానీ గాంధారికి ఎంత కాలానికీ ప్రసవం కాలేదు. ఆమె బాధను భరించలేక తన గర్భాన్ని విచ్ఛిన్నం చేసుకుంది. తనకంటే ముందు కుంతికి ధర్మరాజు జన్మించాడన్న అసూయతో ఆమె అలా ప్రవర్తించింది. కానీ వ్యాస భగవానుడు భవిష్యత్తులో జరగాల్సిన కార్యాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని గాంధారిని మందలించి ఆమె గర్భం నుంచి జారిన మాంసపు ముద్దను నూటొక్క భాగాలుగా విభజించి నేతి కుండలలో భద్రపరచి ప్రతిరోజూ నిర్ణీత సమయంలో గాంధారి వెళ్ళి ఆ కుండలను వాత్సత్యంతో స్పృశించాలని నిర్థేశించాడు.

ఈ పరిస్థితిని గమనిస్తే ఈనాటి కృత్రిమ గర్భోత్పత్తి విధానం ఆనాడే వ్యాసుడి చేత జరిగిందని తెలుస్తుంది. ఈనాడు ఇంకా కృత్రిమ గర్భోత్పత్తికి మరొక మాతృగర్భాన్ని మాత్రమే వాడుతున్నారు.

కానీ వ్యాసుడు నేతి కుండలలో గాంధారి జారవిడిచిన పిండముక్కలను భద్రపరచటం, వాటి నుంచి సంతానం ఉద్భవించేలా చేయటం చూస్తే ఈనాటి వైజ్ఞానికులకన్నా అధిక విజ్ఞానం ఆనాటివారు కనపరచినట్టు అవగతమవుతుంది.

అలాగే లింగమార్పిడి విధానం ఈనాటి ఆధునిక పద్ధతులలో జరుగుతోంది. శస్త్ర చికిత్సల ద్వారా లింగమార్పిడిని ఇప్పటి వారు చేస్తున్నారు. కానీ భారతంలో కాశీరాజ్య పుత్రిక అయిన అంబ అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు ఒక యక్షుడి వల్ల పురుషుడిగా మారిన సందర్భం చూస్తే ఆనాడే ఈ విధానం వెలుగులో ఉన్నట్టుగా అర్థమవుతుంది. దీంతోపాటు అవసరమనుకున్నప్పుడు కొన్నిసార్లు నపుంసకత్వాన్ని కూడా పొందగలిగినంతటి జీవ విజ్ఞాన సూత్రం విరాటపర్వంలో బృహన్నలగా మారిన అర్జునుడి విషయంలో గమనించవచ్చు.

అగస్త్యుడు, వశిష్ఠుడు, ద్రోణుడు, కృపి, కృపాచార్యుడులాంటివారు కుంభ సంభవులుగా ఉన్న విధానం కృత్రిమ గర్భోత్పత్తికి ఉదాహరణగా కూడా తీసుకోవచ్చు. మయసభ నిర్మాణంలో కనిపించే వింతలు, విశేషాలన్నీ అద్భుత శిల్పశాస్త్ర రహస్యాలుగా కనిపిస్తాయి.

శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించటం, ఆనాడు ఉపయోగించిన అస్త్రాలు ఇలాంటివన్నీ భారతీయ వైజ్ఞానిక విజయాలేనని పాశ్చాత్యులు రూఢీగా ప్రకటిస్తున్నారు. ఈ ప్రపంచంలో భారతావని అందరికంటే ఎంతో ముందుగా నాగరికతను అలవాటు చేసుకుని తన విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకొని ఉన్నత స్థితిలో విరాజిల్లిందని ఇలాంటి ఉదాహరణలన్నీ నిలువెత్తు సాక్ష్యాలుగా దర్శనమిస్తాయి.

సంకలనం: శ్రీ 

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top