ఆంధ్రుల అన్నపూర్ణేశ్వరి "డోక్కా సీతమ్మ" జీవిత చరిత్ర - Dokka Sithamma

ఆంధ్రుల అన్నపూర్ణేశ్వరి "డోక్కా సీతమ్మ" జీవిత చరిత్ర - Dokka Sithamma
ఆంధ్రుల అన్నపూర్ణేశ్వరి "డోక్కా సీతమ్మ"
అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అని అంటారు. ఎందుకంటే, ఆకలికి కులమత బేధాలు లేవు, ధనిక, పేదల తేడాలు లేవు. అందరినీ సమానంగా బాధించేది ఆకలి బాధ. ధనం ఉండి కూడా ఆకలి బాధ బారినుండి తప్పించుకోలేం, ఒక్కొక్కసారి. అటువంటి ఆకలి బాధితులను ఆపన్న సమయంలో ఆదుకున్న మహిళా శిరోమణే శ్రీ మతి డొక్కా సీతమ్మ గారు.

జననం:
శ్రీ మతి డొక్కా సీతమ్మ గారు తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం తాలుకా , మండపేట గ్రామంలో 1841, అక్టోబరు రెండోవారంలో జన్మించారు. ఈమె తండ్రి అనుపింది భవానీశంకరం, తల్లి నరసమ్మ గార్లు. సీతమ్మ గారి తండ్రి శంకరం గారిని గ్రామస్తులు 'బువ్వన్న' గారనే పేరుతో పిలుస్తుండేవారు. దానికి కారణం ఆయన అడిగిన వారందరికీ 'బువ్వ'(అన్నం) పెట్టటమే! అటువంటి తండ్రికి కూతురిగా జన్మించిన సీతమ్మ గారు అన్నార్తుల ఆకలిని తీర్చిన మహా ఇల్లాలు. విద్యావాసనలు లేని లేని సాధారణ గృహిణి ఆమె.

బాల్యం:
బాల్యంలో సీతమ్మ గారికి తల్లితండ్రులు కథలు, పాటలు, పద్యాలు అన్నింటినీ నేర్పారు. ఆ రోజుల్లో స్త్రీలు విద్య నేర్చుకునే అవకాశాలు సరిగా లేకపోవడంతో ప్రాచీన సంప్రదాయాలకు తలవంచి పెద్దబాలశిక్ష వంటి గ్రంధాన్ని కూడా పూర్తిగా అధ్యయనం చెయ్యకుండానే పెళ్ళికి సిద్ధపడాల్సి వచ్చింది. సీతమ్మ గారి బాల్యంలోనే ఆమె తల్లి నరసమ్మ గారు మరణిస్తే, ఇంటిని చక్కదిద్దే భారం సీతమ్మ గారి మీద పడింది. దానిని ఒక పవిత్రమైన బాధ్యతగా ఆమె స్వీకరించింది.

జీవన ప్రయాణం:
గోదావరినదీ పరీవాహక ప్రాంతంలోని కొన్ని గ్రామాలను లంక గ్రామాలని అంటారు. అటువంటి ఒక లంక గ్రామం లంకగన్నవరం. ఆ గ్రామంలో డొక్కాజోగన్న పంతులు గారనే పెద్ద ధనవంతుడు ఉండేవాడు. ఆయన ధనవంతుడే కాకుండా పెద్ద రైతు కూడా. వీటన్నిటినీ మించి మంచి వేదపండితుడు.

ఒక రోజున పండిత సభకు వెళ్లి వస్తూ మండపేట వచ్చేటప్పటికి మధ్యాహ్నమయ్యింది. భోజనం చేసే సమయం అయింది. వారు మంచి ఆకలితో ఉన్నారు. సమయానికి వారికి భవానీ శంకరం గారు గుర్తుకు వచ్చారు. వెంటనే దగ్గరలో ఉన్న భవానీ శంకరం గారింటికి వెళ్లి ఆ పూట వారి ఇంటి ఆతిధ్యాన్ని స్వీకరించారు. జోగన్నగారికి అతిధి మర్యాదలను చేయటంలో సీతమ్మగారు చూపించిన ఆదరాభిమానాలకు ఆయన సంతృప్తి చెందాడు, పరమానందభరితుడయ్యాడు. యవ్వనంలో ఉన్న సీతమ్మగారు చూపించిన గౌరవ మర్యాదాలు, ఆమె వినయ విధేయతలు నచ్చి జోగన్నగారికి ఆమెను వివాహం చేసుకోవాలనే భావన కలిగింది.

వివాహం:
ఆయనకు జ్యోతిష్య శాస్త్రంలో కూడా ప్రవేశం ఉంది. ఇద్దరి జాతకాలు సరిపోయినట్లుగా ఆయన తృప్తి చెందారు. బువ్వన్నగారు సీతమ్మను డొక్కా జోగన్న గారికిచ్చి అతి వైభవంగా వివాహాన్ని జరిపించారు. సీతమ్మగారు అత్తవారింట్లో అడుగు పెట్టగానే ఆమె ఇంటి పేరు 'డొక్కా' గా మారింది. ఆమెలో సహజంగా ఉన్న ఉదారగుణం, దాతృత్వం రోజు రోజుకూ పెరగసాగాయి. జోగన్న, సీతమ్మ గార్ల దాంపత్యం అన్యోన్యమైనది. ఆ పుణ్య దంపతులను చూసి చుట్టుపక్కల గ్రామాల వారందరూ గొప్పగా చెప్పుకునే వారు. ఆప్యాయతా, ఆదరణలకు నిలయంగా వారి ఇంటిని గురించి ఆచుట్టుపక్కల గ్రామస్తులందరూ ఆ రోజుల్లో గొప్పగా చెప్పుకునేవారు. లంక గ్రామాలకు చేరుకోవాలంటే, నేటికీ కూడా పడవే ముఖ్యమైన ప్రయాణ సాధనం. జోగన్నగారి గ్రామమైన లంకగన్నవరం త్రోవలో ఉండటంచేత, చాలామంది ప్రయాణీకులు వారి ఇంటనే భోజనాలు చేసేవారు. ఏ వేళ అతిధులు వచ్చినా వారికి అన్నపానాదులు లేవని చెప్పకుండా వారికి సకల మర్యాదాలు చెయ్యటం ఒక పవిత్రకార్యంగా ఆ దంపతులు స్వీకరించారు.

'అపర అన్నపూర్ణ':
అచిరకాలంలోనే ఉభయ గోదావరి జిల్లాలలో 'అపర అన్నపూర్ణ' గా శ్రీమతి సీతమ్మ గారు పేరుపొందారు. లంక గ్రామాలకు తరచుగా వరదల వల్ల ప్రమాదాలు ఏర్పడేవి. నిలువ నీడలేని బాధితులను ఆదుకొని వారికి వసతి, భోజన సదుపాయాలను నిరాటంకంగా ఏర్పాటు చేసే ఉదాత్త గుణశీల సీతమ్మగారు. మగవాడు సంపాదించి ఎంత తెచ్చినా, ఔదార్యం లేని స్త్రీ ఉంటే ఆ సంపాదనకు అర్ధం, పరమార్ధం ఉండవు. అన్నదానం చేసి మానవతకు అర్ధం చెప్పిన మహిళాశిరోమణి సీతమ్మగారు. అలా అచిరకాలంలోనే ఆమె ఖ్యాతి భారతదేశమంతా వ్యాపించటమే కాకుండా, ఆంద్ర దేశపు కీర్తిని ఇంగ్లండు వరకు వ్యాపింపజేసిన మహా ఇల్లాలు సీతమ్మ గారు. అన్నం పెట్టేటప్పుడు ఆమె చూపే మాతృప్రేమ మరువరానిది. జీవితమంతా మాతృప్రేమను పంచిన మహనీయురాలు ఈమె.
డొక్కా సీతమ్మ గారు తన సొంత వనరులతో, నిధులతో నిత్యాన్నదానాన్ని చేసి అన్నార్తుల క్షుద్బాధను తొలగించారు. ఏ వనరులూ లేని ఆ రోజుల్లో సీతమ్మ గారు చూపించిన మాతృప్రేమ'ను మనం మరచి పోయామన్నదే వాస్తవం !
అన్నదానాన్ని మించిన దానంలేదని చెప్పటమే కాకుండా నిస్వార్ధంగా జాతి, కుల, మత విచక్షణ చూపించకుండా అన్నార్తులందరికీ మాతృప్రేమను పంచి జీవితాన్ని చరితార్ధం చేసుకున్న 'అపర అన్నపూర్ణమ్మ'మన డొక్కా సీతమ్మ గారు! అన్నదానమే కాకుండా మరెన్నో శుభాకార్యాలకు విరాళాలు ఇచ్చిన దాత కూడా ఈ మహా ఇల్లాలు. ఈ జాతిరత్నం 1909 లో మరణించింది. నేను చిన్నప్పుడు ఈమె జీవిత చరిత్రను పాఠశాలలో తెలుగు పాఠ్యాంశముగా చదువుకున్నాను. ఈమె జీవిత చరిత్రను గురించి నేటి తరానికి తెలియచేయటం, ఆమె చేసిన నిస్స్వార్ధ సేవలను గుర్తుచేసి ఆమె చరిత్రనుండి స్ఫూర్తివంతులను చేయటమే ఆ మహానీయురాలికి మనం ఇచ్చుకునే ఘనమైన నివాళి!

సంకలనం: రాజేశ్వరీ శంకర్

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top