నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Thursday, June 25, 2020

భారత ప్రజాస్వామ్యంలో చీకటి రోజు జూన్ 25, 1975 ఎమర్జెన్సీ - June 25, 1975 Emergency is the darkest day in Indian democracy

భారత ప్రజాస్వామ్యంలో చీకటి రోజు జూన్ 25, 1975

స్వతంత్ర భారతదేశ చరిత్రలో చీకటి రోజులకు తెరలేచిన రోజు ఇది.. 'ఇండియాయే ఇందిర.. ఇందిరయే ఇండియా' అని వంది మాగదులు కొనియాడుతున్న వేళ ప్రధానమంత్రి ఇందిరాగాంధీలోని నియంత నిద్ర లేచారు.. తన పదవిని కాపాడుకునేందుకు రాజ్యాంగాన్ని కాలరాసింది.. 11.45గం కు అత్యవసర పరిస్థితి అమల్లోకి వచ్చింది.. నిద్రిస్తున్న దేశమంతా అర్ధరాత్రి సమయంలో చెరసాలగా మారిపోయింది..1947లో దేశానికి స్వాతంత్రం వస్తే.. 28 ఏళ్ళకే దేశ దేశ ప్రజలు దాన్ని కోల్పోయారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యానికి చీకట్లు కమ్ముకున్నాయి..

తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తనయగా దేశానికి పరిచయమైంది ఇందిరాగాంధీ.. లాల్ బహద్దూర్ శాస్త్రి హఠాన్మరణం తర్వాత దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. కానీ పార్టీలోని సీనియర్ నేతలు ప్రతిపక్ష నాయకులను ఆమె ఎప్పుడూ ముప్పుగానే భావించేవారు.. బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు, బంగ్లాదేశ్ యుద్దంలో విజయంతో ప్రజల్లో ఇందిరాగాంధీ ఖ్యాతి అమాంతం పెరిగిపోయింది. క్రమంగా గర్వం పెరిగింది.. తానేమీ చేసినా చెల్లతుందనే అహంభావం వచ్చేసింది.
తన వారసునిగా తనయుడు సంజయ్‌ గాంధీని ఎంపిక వంశపారం పర్యపాలన శాశ్వతం చేసే ప్రయత్నాలు ప్రారంభించింది.. సంజయ్‌ రాజ్యాంగేతర శక్తిగా, షాడో పీఎంగా ఎదిగారు. పరిపాలన గాడి తప్పి విచ్చల విడితనం వచ్చేసింది. కేంద్రంతో పాటు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అవినీతి పెరిగిపోయింది. ఇందిర పాలనపై దేశంలో క్రమంగా వ్యతిరేకత ప్రారంభమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ గాంధేయవాది లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ అవినీతికి వ్యతిరేకంగా ప్రారంభించిన సంపూర్ణ విప్లవ ఉద్యమం యావత్తు దేశాన్ని కదిలిస్తోంది..

సరిగ్గా అప్పుడే ఇందిరా గాంధీపై పిడుగు పడింది.. రాయబరేలీ నుండి పోటీ చేసి విజయం సాధించిన ఇందిర ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పు.. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకున్నారని ఆమెపై పోటీ చేసి ఓడిపోయిన రాజ్‌ నారాయణ్‌ ఈ కేసు ఫలితం ఇది. ఇందిర గద్దె దిగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.. సుప్రీంకోర్టు షరతుల మీద బెయిల్ తీర్పుపై స్టే ఇచ్చినా, తనను చుట్టు ముట్టిన సమస్యల నుండి బయట పడటం ఎలాగో ఆమెకు అర్థం కాలేదు. చివరకు ఒక కీలక నిర్ణయానికి వచ్చేశారు. అర్ధరాత్రి వేళ రాష్ట్రపతి ఫకృద్దీన్‌ అలీ అహ్మద్‌కు కీలక పత్రాన్ని పంపించారు.. ఫకృద్దీన్ మారుమాట్లాడకుండా సంతకం చేశారు.. 352వ నిబంధన క్రింద అత్యవసర పరిస్థితి అమలులోకి వచ్చింది.. అర్ధరాత్రి వేళ భారత ప్రజాస్వామ్యం హత్యకు గురైంది.. చీకటి రోజులకు తెరలేచింది. ఆ రోజు జూన్ 25, 1975..
దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులను రాత్రికి రాత్రి అరెస్టు చేసి జైళ్లకు తరలించారు.. జయప్రకాశ్‌ నారాయణ్‌, మురార్జీ దేశాయి, అటల్‌ బిహారీ వాజ్‌పేయి, లాల్‌ కృష్ణ అద్వానీ, చరణ్‌ సింగ్‌, ఆచార్య కృపలానీ, అశోక్ మెహతా, జార్జ్ ఫెర్నాండెజ్‌, మధుదండావతే, రామకృష్ణ హెగ్డే, రాజ్‌నారాయణ్‌ తదితర నాయకులను కటకటాల పాలు చేశారు.. పత్రికలపై సెన్సార్ షిప్ విధించడంతో దేశ ప్రజలకు ఏమి జరుగుతోందో తెలియదు.. ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే ప్రయత్నం చేసిన పత్రికలపై తీవ్ర నిర్భందం విధించారు.. ఆకాశవాణిలో ప్రభుత్వ అనుకూల వార్తలు మాత్రమే వినిపించేవి. ఆరెస్సెస్‌తో పాటు ఎన్నో సంస్థలను రద్దు చేశారు. ప్రశ్నించే మేధావులు, పాత్రికేయుల గొంతు నొక్కారు.. వారినీ మీసా చట్టం కింద జైళ్లకు పంపారు. దేశంలోని చెరసాలలన్నీ రాజకీయ ఖైదీలతో కిక్కిరిసి పోయాయి.

ఎమర్జెన్సీ ముసుగులో సంజయ్‌ గాంధీ, కాంగ్రెస్‌ నేతల అరాచకాలకు అంతు లేకుండా పోయింది. భుత్వ యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకొని విచ్ఛల విడిగా అరాచకాలు సాగించాడు. ఢిల్లీ సుందరీకరణ పేరిట వేలాది పేదలు, మధ్యతరగతి ప్రజల ఇళ్లు కూల్చి నిరాశ్రయుల్ని చేశాడు. టీనేజర్లు, పెళ్లికాని యువకులు అనే తేడా లేకుండా బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించడం ఇందుకు పరాకాష్ట.. గుట్టుగా సాగిన రాజకీయ హత్యలు ఎన్నో.. ఇవన్నీ తన పదవిని కాపాడుకునేందుకు ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ ముసుగులో సాగించిన దౌర్జన్యాలు..

తన పదవిని కొనసాగించుకోవడానికి ఇందిరా గాంధీ లోక్ సభ కాల పరిమితిని ఆరేళ్లకు పెంచారు.. దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా రహస్య ఉద్యమం ప్రారంభమైంది. ప్రజలు జాగృతం కావడం మొదలు పెట్టారు.. ఎక్కడిక్కడ తిరుగుబాటు వాతావరణం కనిపిస్తోంది.. దీంతో 19 నెలల చీకటి రోజుల తర్వాత ప్రధాని ఇందిరాగాంధీలో ఆందోళన ప్రారంభమైంది. ఈ పరిస్థితి ఏనాటికైనా తనకు ముప్పు తెస్తుందని భయపడిపోయింది. ఇక తప్పని పరిస్థితుల్లో 1977 మార్చి 21న ఎమర్జెన్సీ ఎత్తేసింది ఇందిరాగాంధీ.. అలా దేశానికి పట్టిన సుదీర్ఘ గ్రహణం తొలగి పోయింది..

ఎమర్జెన్సీ సమయంలోనే ప్రధాన రాజకీయ పార్టీల్లో కదలిక వచ్చింది.. జయప్రకాశ్ నారాయణ సూచన మేరకు భిన్న రాజకీయ పక్షాలు కలిసిపోయి జనతా పార్టీ ఆవిర్భవించింది.. లోక్ సభ ఎన్నికల్లో దేశ ప్రజలు ఇందిరా గాంధీకి బుద్ది చెప్పుతూ, జనతాకి ఘన విజయం చేకూర్చారు.. మురార్జీ దేశాయి ప్రధానమంత్రిగా కేంద్రంలో జనతా ప్రభుత్వం ఏర్పడింది.. దురదృష్టవశాత్తు భిన్న సైద్దాంతిక నేపథ్యాలు ఉన్న నాయకుల కారణంగా ఈ ప్రభుత్వం ఎక్కవ కాలం నిలవలేదు.. ప్రతిపక్షాల అనైక్యత ఫలితంగా మళ్లీ ఇందిర నేతృత్వంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది.

భారతీయులకు మతి మరుపు ఎక్కువ.. చరిత్రను తేలికగా మరచిపోతారు. ముఖ్యంగా నేటి తరం యువత ఎమర్జెన్సీ గురుంచి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.. 45 ఏళ్ల నాటి ఎమర్జెన్సీ విషాద ఘటనకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పులేదు.., ఈనాటికి విచారం కూడా వ్యక్తం చేయలేదు.. కుటుంబ, వారసత్వ, నియంతృత్వం పాలన ఏ రూపంలో ఉన్నా ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.. చరిత్ర నుంచి మనమంతా గుణపాఠం నేర్చుకుందాం.

రచన: పెంజర్ల మహేందర్ రెడ్డి (ఓసి సంఘం - జాతీయ అధ్యక్షులు)


« PREV
NEXT »

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com