ఎత్తుమనూర్ మహాదేవ ఆలయం భారతదేశం కేరళలోని కొట్టయం ఎత్తుమనూర్ గ్రామములో ఒక పురాతన శివాలయం. ఇది ఈ ప్రదేశానికి కీర్తిని ఖ్యాతిని తెచ్చిపెట్టినది. ఈ ఆలయంలో పాండవులు, వ్యాసముని పూజలు చేసినట్లు ఆలయ సంప్రదాయం తెలుపుచున్నది. ఈ ప్రదేశం యొక్క పేరు ‘మనూర్’ అనే పదం నుండి వచ్చినది, అంటే జింకల భూమి. కేరళలోని ప్రసిద్ద శివాలయాలు వైకోం ఆలయం, చెంగన్నూర్ మహాదేవ ఆలయం, కడుత్రుతి మహాదేవ ఆలయం, ఎర్నాకుళం శివాలయం, వజప్పల్లి మహా శివాలయం మరియు వడక్కునాథన్ ఆలయములలో ఒకటిగా ఈ ఆలయం పరిగణించబడినది.
ప్రస్తుత ఆలయ భవనం, దాని గోపురం మరియు దాని చుట్టూ ఉన్న కోటతో 717 ME (క్రీ.శ 1542) లో పునర్నిర్మించబడినది. ప్రధాన ద్వారం లోపల మరియు వెలుపల గోడలపై ద్రవిడ కుడ్య చిత్రాలు ఉన్నాయి. ప్రదోష నృతం (శివుడి నృత్యం) యొక్క గోడపై చిత్రము భారతదేశంలోని అత్యుత్తమ నటరాజ కుడ్య చిత్రము. ఈ కుడ్య చిత్రము గోపురము దక్షిణము వైపు లోపల గోడపై యున్నది. ఇది 3.6మీటర్ వెడల్పు*2.17మీటర్ల ఎత్తు ఉన్న చిత్రము. తాలసంస్ఫొతిత నాట్యమని భరత ముని నాట్య శాస్త్రములో వివరించినారు. ఈ కుడ్య చిత్రము పక్కన అఘోర మూర్తి కుడ్య చిత్రము కలదు. పశ్చిమ గోపురము ఉత్తర గోడపై భూదేవి, శ్రీ దేవి సమేత పద్మనాభస్వామి శయన చిత్రము కేరళలో అంత్యంత పెద్దది 5.8మీటరులు పొడవు, 2.47 మీటరులు ఎత్తు గల కుడ్య చిత్రము కలదు. చిన్న కుడ్య చిత్రములు ప్రధాన ద్వారము గోడలపై కలవు. ఆలయం లోపల బంగారు ధ్వజస్థంభము ఉన్నది. దాని పైభాగంలో చిన్న గంటలు మరియు మర్రి చెట్టు యొక్క లోహపు ఆకులతో చుట్టుముట్టిన నంది విగ్రహం ఉన్నది మరియు వాస్తుశిల్ప పరంగా ఈ దేవాలయాలు విశ్వకర్మ స్థపతీలకు, వారి శిల్పవిద్య నైపుణ్యాలకు అంతిమ సాక్ష్యంగా నిలుస్తాయి. ఆలయ పైకప్పులు రాగి పలకలతో కప్పబడి ఉన్నాయి మరియు దీనికి 14 అలంకార బల్లలు ఉన్నాయి. భగవతి, శాస్త, దక్షిణమూర్తి, గణపతి మరియు యక్షి ఇక్కడ అధీన దేవతలుగా స్థాపించబడ్డాయి. కృష్ణుడికి ప్రత్యేక ఆలయం ఉన్నది. గొప్ప తత్వవేత్త ఆది శంకరాచార్యులు ఆలయంలో ఉంటున్నప్పుడు ‘సౌందర్య లహరి’ రాశారని నమ్ముతారు.
ఈ ఆలయం వైకోమ్ సమీపంలోని ఎట్టుమనూర్ అనే చిన్న పట్టణంలో ఉంది. ఖారా అనే అసురుడు హిమాలయ ప్రాంతములో మోక్షము కొరకు తపస్సు చేసెను. అతని తపస్సుకు శివుడు ప్రసన్నుడై మూడు శివలింగములిచ్చి వాటిని పూజించిన మోక్షము కలుగునని తెలిపి అంతర్ధాన మాయెను. హిమాలయ నుండి అతను ఆ లింగములను ఒకదానిని పళ్ళతో, ఎడమ మరియు కుడి చేతిలో ఒక్కొక్కటి పట్టుకొని కేరళకు వచ్చాడు. అతని దంతాలతో పట్టుకున్న లింగముని కడుతురుతిలో ప్రతిష్ట చేసి, కుడి చేతిలో పట్టుకున్నది వైకోంలో ప్రతిష్ట చేయబడినది. అతని ఎడమ చేతిలో పట్టుకున్నలింగమును ఎత్తూమనూర్లో ప్రతిష్ట చేయబడినది. ఈ మూడు దేవాలయాలన్నింటినీ ఒకే రోజున ప్రతిష్ట చేసిన తరువాత, ఖారా జింకగా మారి దేవుళ్ళకు సేవ చేస్తున్నట్లు నమ్ముతారు. ఎత్తూమనూర్ లోని శివుడు జింకను తన చేతిలో తీసుకొని అక్కడే ఉంచాడని నమ్ముతారు, ఆ కారణంగా, ఈ స్థలాన్ని ఉద్రుతైనా పురం అని పిలిచారు. దీనిని మలయాళ భాషలో ఎత్తూమనూర్ గా అనువదించిరి. భక్తులు ఈ మూడు ఆలయములలో ఉచ్చ పూజ ముందర స్వామిని పూజించిన వారి కోరికలు తీరునని నమ్మకము.
ఇచటి ప్రధాన ఆరాధన, ఆలయంలోని దీపాలను వెలిగించడం. మీరు ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే ఎప్పుడూ మెరుస్తున్న, చాలా పెద్ద దీపం చూడవచ్చు. భక్తులు ఈ దీపానికి నూనె పోస్తారు. ఇటీవల, దీపానికి అవసరమైన దానికంటే ఎక్కువ నూనె అందుతున్నందున, దీపం నిండి ఉంటే, భక్తులు వారు తెచ్చిన నూనెను అచట ఉంచిన పాత్రలో పోయవచ్చు. దీని వెనుక ఒక ఉదంతమున్నది. ఒక ఇత్తడి లోహ కార్మికుడు ఒకసారి ఒక భారీ కాంస్య దీపం తయారు చేసి, దానిని ఈ ఆలయానికి తీసుకువచ్చి దానిని కొనమని ఆలయ అధికారులకు విజ్ఞప్తి చేశాడు. వారు అతనిని చూసి నవ్వి ఆలయానికి ఇప్పటికే తగినన్ని దీపాలు ఉన్నందున దీపం కొనవలసిన అవసరం లేదని అతనికి తెలియజేశారు. దిగాలుపడిన ఆ లోహ కార్మికుడు స్వామిని వేడుకొని అక్కడ ఆ దీపమును ఉంచాడు! అకస్మాత్తుగా ఆలయం చుట్టూ ఒక పెద్ద తుఫాను ప్రారంభమైనది. ఆలయ యాజమాన్యం వారి ప్రవర్తనపై దేవుడు కోపంగా ఉన్నాడని గ్రహించి, దీపం కొని అక్కడే ఏర్పాటు చేసింది. అప్పటినుండి దీపం నిరంతరం స్వామి ముందు వెలుగుతోంది. అది అప్పటి నుండి వెలుగుతునే ఉన్నదని భక్తుల విశ్వాసము.
రౌద్ర భావములో ఉన్న అష్ట భుజముల శివుని శరభ మూర్తి ఉత్సవ విగ్రహము కలదు. (చాలా కోపంగా ఉన్న భంగిమలో కనిపిస్తుంది). స్వామి రౌద్ర బావ రూపములో యున్నను భక్తులు ఆయనను దయగల రూపంగా మాత్రమే చూస్తారు.
ఈ ఆలయం చాలా కళాత్మకంగా నిర్మించబడింది. ఆలయం చుట్టూ అనేక చెక్క శిల్పాలను చూడవచ్చు. ఈ ఆలయంలో రెండు నంది విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయంలో దక్షిణామూర్తి (కేరళలో చాలా అరుదు), గణపతి మరియు శాస్త దేవాలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో ఒక చెక్కడం ఉంది, ఇది సుమారు 400 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని సూచిస్తుంది.
ఈ ఆలయంలో పండుగను కుంభం (ఫిబ్రవరి-మార్చి) నెలలో జరుపుకుంటారు మరియు పది రోజుల పాటు ఉంటుంది. ఈ ఆలయంలో తిరువదిర పండుగ, శివరాత్రి కూడా జరుపుకుంటారు. శివరాత్రికి పద్దెనిమిది భాగాల ఆరాధన ప్రసిద్ధి. ప్రజలు ఈ ఆలయంలోని దేవుణ్ణి “ఎత్తూమనూర్-అప్పన్” అని పిలుస్తారు.
ఎట్టూమనూరప్పన్ యొక్క మూలం కొట్టాయం జిల్లాలోని కట్టంపక్ అనే చిన్న గ్రామం. వైప్పు స్థలం తమిళ శైవ నాయనార్ సుందరార్ పాడిన తేవర వైప్పు స్థలాల పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి.
ప్రఖ్యాత ఎళర పొన్నాన పండుగ
ఎళర పొన్నాన ఏడున్నర బంగారు ఏనుగులను ఆలయ ఖజానాలో ఉంచి సంవత్సరానికి ఒకసారి భక్తుల దర్శనం కోసం ఉంచుతారు. ఎనిమిది విగ్రహాలు, ఏడు రెండు అడుగుల ఎత్తు విగ్రహాలు మరియు ఎనిమిదవ విగ్రహము సగం పరిమాణం, (అందుకే ఎజారా (ఏడున్నర) పేరు పొన్నాన (గోల్డెన్ ఏనుగు) దాని వెనుక గొప్ప కధ ఉన్నది.
ఆలయ పురాణ కధ: దీనిని ట్రావెన్కోర్ రాజ్య స్థాపకుడు అనిళమ్ తిరునాల్ మార్తాండ వర్మ ఆలయానికి సమర్పించారు. మరొక కథనము ప్రకారం, మార్తాండ వర్మ ‘పొన్నానా’ని స్వామికి సమర్పించడానికి వాగ్దానము చేసెను కాని ఆ వాగ్దానమును మార్తాండ వర్మ వారసుడైన మహారాజా కార్తిక తిరునాల్ “పొన్నాని” స్వామికి సమర్పించి మార్తండ వర్మ వాగ్దానమును నెరవేర్చెను. స్వామికి ఈ “పొన్నాన” సమర్పణ గురించి భిన్నమైన కథలు కూడా ఉన్నాయి: కొందరు దీనిని థెక్కూమ్కోర్ను ట్రావెన్కోర్తో విలీనము చేసిన సమయంలో ఆలయంకు సంభవించిన నష్టాలకు జరిమానాగా అందించారని కొందరు నమ్ముతారు. మరికొందరు దీనిని టిప్పు సుల్తాన్ సైన్యము ట్రావెంకోర్ పై దాడి చేసినప్పుడు చేసిన సమర్పణ అని నమ్ముతారు. విగ్రహాలు పనస చెట్టు కలపతో తయారు చేయబడి దాదాపు 13 కిలోల బంగారు రేకుతో కప్పబడి ఉన్నాయి.
పది రోజుల పండుగ ఎనిమిదో రోజు అర్ధరాత్రి జరిగే ఆలయ ఉత్సవంలో ఎజారా పొన్నన దర్శనం ఒకటి. ఎజారా పొన్నాన దర్శనం ఏనుగుల ఎనిమిది బంగారు విగ్రహాలను మోస్తున్న ఉత్సవ ఊరేగింపుతో ప్రారంభమవుతుంది మరియు తరువాత వాటిని భక్తుల వార్షిక దర్శనం కోసం ఆస్తాన మండపం వద్ద ఉంచుతారు.
ఈ ఆలయంలోని ముఖ్యమైన ఆచారాలలో తులాభారం ఒకటి. కోరుకున్న కోరికలు తీరిన అనంతరము భక్తులు దేవునికి తులా భారము అర్పణ చేస్తారు. స్వామికి నైవేద్యములు వాగ్దానము చేసిన సరుకులు గాని బంగారం నుండి పండ్ల వరకు నైవేద్యాలను తమకు సరి సమానమైన బరువును స్వామికి సమర్పించి కొనుదురు.
ఆరట్టు, (పవిత్ర స్నానము)
ఎత్తూమనూర్ మహాదేవర్ ఆలయంలోని భగవంతుడు శివుడి వార్షిక ఆరట్టు, (పవిత్ర స్నానము) మీనాచిల్ నదిలో పెరూరు, నీరికాడు మరియు త్రివంచూరు గ్రామాల వద్ద ఉన్న రేవుల వద్ద నిర్వహిస్తారు.
భౌగోళికంగా ఎక్కడుంది:
ఎట్టుమనూర్ మహాదేవర్ ఆలయం ఎర్నాకుళం జిల్లా మరియు కొట్టాయం జిల్లా మధ్య ఉంది. ఇది ఎర్నాకుళం నుండి 54 కిలోమీటర్ల దూరంలో మరియు కొట్టాయం నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఎత్తూమనూర్ మహాదేవర్ ఆలయం యొక్క ఇతర సమీప పట్టణాలు, కిడంగూర్, పాల, మరియు కడుతురుతి.
ఎలా చేరుకోవాలి:
ఎర్నాకుళం సిటీ మరియు త్రివేండ్రం నగరం నుండి ఎత్తూమనూర్ పట్టణానికి రైలు మరియు బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. తరచుగా బస్సులు- ప్రైవేట్ మరియు పబ్లిక్ కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎటుమనూర్ పట్టణం నుండి కేరళలోని ఏ ప్రాంతానికైనా అందుబాటులో ఉన్నాయి. బెంగుళూరు, చెన్నై, సేలం, కోయంబత్తూర్, హోసూర్ వెళ్లే ఇంటర్సిటీ బస్సులు ఎట్టుమనూర్ నుండి సాయంత్రం మరియు రాత్రి సమయాల్లో అందుబాటులో ఉన్నాయి. ఎట్టుమనూర్ మహాదేవర్ ఆలయానికి సమీప విమానాశ్రయం కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం.
ఎత్తూమనూర్ మహాదేవర్ ఆలయం ఇతర రాష్ట్రాల భక్తులకు కేరళలోని శబరిమల ఆలయాన్ని సందర్శించే ప్రధాన కేంద్రంగా ఉన్నది.
పూజలు వాటి సమయములు:
- Morning:
 - Palliunarthal - 3.00
 - Nadathurakkal - 4.00
 - Nirmalyadarsanam - 4.00 – 4.30
 - Abhishekam - 4.30 – 5.00
 - Madhavipally pooja - 5.30 – 6.00
 - Ethruthu Pooja - 6.00 – 6.30
 - Ethruthu Sreebali - 6.30 – 7.00
 - Pantheradi Pooja - 8.00 – 8.30
 - Abhishekam - కె – 10.30
 - Ucha pooja - 11.00 -11.30
 - Ucha Sreebali - 11.30 – 12.00
 - Evening
 - Nada Thurakkal - 5.00
 - Deeparadhana - 6.15 – 6.45
 - Athazhapooja - 7.30 – 8.00
 - Athazha Sreebali - 8.00
 
సంకలనం: జి.వి.ఆర్ కె ప్రసాద్











