శ్రీ రామానుజులు - Ramanujulu

శ్రీ రామానుజులు - Ramanujulu

శ్రీ రామానుజాచార్య

సాక్షాత్ అదిశేషులు లక్ష్మణస్వామి బలరాముడు మన రామానుజులు
బ్రహ్మరాక్షసిని పారద్రోలి రాజును ఆకర్షించి అందరి మతం మార్చాడని జైనులకు రామానుజుని మీద విపరీతమైన కోపం వచ్చింది. జైన గురువులు రామానుజుడు నరసింహాలయంలో ఉన్నారని తెలిసి అక్కడికి దండెత్తి వెళ్లారు. ఒకేసారి పన్నెండు వేలమంది రామానుజుడిని శాస్త్ర చర్చకు రమ్మన్నారు. ముందు తమను జయించాలని, ఆ తరువాతే రాజుతో మాట్లాడాలని సవాలు చేశారు. ఓడిపోతే తమ మార్గాన్ని, మతాన్ని అనుసరించాలన్నారు. రామానుజులు వారి సవాల్‌ను స్వీకరించారు. ‘మేమంతా ఒకేసారి ప్రశ్నిస్తాం. అన్నింటికీ సమాధానాలు చెప్పాల’ని వారు నిబంధన విధించారు. వచ్చిన జైనులలో దిగంబరులూ ఉన్నారు. శ్వేతాంబరులూ ఉన్నారు. రామానుజ యతీంద్రుడికి ఒక కట్టుబాటు ఉంది. దిగంబరులను చూడరు, మాట్లాడరు. కనుక ‘‘నా చుట్టూ తెర కట్టండి, మీరు చుట్టూ చేరి ప్రశ్నలు అడగండి. నా నుంచి సమాధానాలు వినిపిస్తాయి వినండి. నా తెరలోకి తొంగి చూస్తే మీకే నష్టం జాగ్రత్త’’ అన్నారు.

రామానుజులు కనిపించకుండా తెర కట్టారు. చర్చ మొదలైంది. వాదప్రతివాదాలు జరుగుతున్నాయి. వేలాది గొంతులు వినిపిస్తున్నాయి. ఒక్కో జైనుడికి ఒక్కో గొంతుక వినిపిస్తున్నది. సూటిగా ఒక్కో ప్రశ్న వేసిన వ్యక్తికే వినిపించే సమాధానం దూసుకుని వస్తున్నది. జైన మునులు ఆశ్చర్యపోతున్నారు. ఏం జరుగుతున్నదో తెలియడం లేదు. ప్రశ్నించడమో ప్రతిపాదించడమో జరిగిందో లేదో, సమాధానాలు శరాల్లా వస్తున్నాయి. శరవేగంగా ప్రతివాదాలు, ఖండన మండనలు వెలువడుతున్నాయి. శాస్త్ర, పురాణ ప్రమాణాలు, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తుల వాక్యాలు, ఈటెల్లా వస్తున్నాయి. రాను రాను జైనుల ప్రశ్నాస్త్రాలు వడిసిపోతున్నాయి. నిరస్త్రమై నిస్తేజమై పడిపోతున్నాయి. అడగడానికేమీలేక జైనుల నోళ్లు మూతబడుతున్నాయి. కొందరికి అనుమానం వచ్చింది. తెరలోపల ఏం జరుగుతున్నది? ఒక్కవ్యక్తి ఇన్ని గొంతులతో ఏవిధంగా మాట్లాడుతున్నారు? ఇది వాస్తవమా లేక కనికట్టా? అని తెరతీసి చూశారు. చూసిన వారు వెంటనే మతిభ్రమించినట్టు పడిపోయారు. పిచ్చిబట్టినట్టు పరుగెత్తిపోయారు.

‘‘ఏమైంది.. ఏం కనిపించింది..’’ అని వారిని అడిగితే ‘‘అక్కడ రామానుజ వీర వైష్ణవ తేజం ప్రజ్వరిల్లుతున్నది. వేలాది పడగల ఆదిశేషుడై రామానుజుడు విజృంభించి వాదనా కదన రంగంలో వీరవిహారం చేస్తున్నాడు. ఆ భయానక దృశ్యం చూడగానే మాకు మతిపోయింది. నాతోపాటు చూసిన వారు, తెరతీయడానికి భయపడేవారు, తెరతీసి భయపడి పారిపోయినారు. వేలాది ప్రశ్నల వేగాన్ని బట్టి సమాధాన సహస్రాలు మహాగ్ని జ్వాలలై వచ్చాయి’’ అని చెప్పుకున్నారట. న్యాయనిర్ణేతగా ఉన్న రాజు వాద ప్రతివాదాలు వినడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రశ్నలూ ప్రతిపాదనలూ ముగియగానే తెరవెనుక ఆదిశేషుని అవతారమైన యతిరాజు ప్రత్యక్షమైనాడు. తెరతొలగగానే దివిలో జ్ఞాన సూర్య సహస్ర కాంతులతో రామానుజుడు దుర్నిరీక్షుడై కనిపించాడు. కాసేపటి తరువాత జైన శాస్త్రవేత్తలు, పండితులు, తర్కశాస్త్రజ్ఞులు మౌనం పాటించారు. ఆ మౌనం పరాజయానికి ప్రతీక కనుక జైనులు పరాజితులని రాజు ప్రకటించారు. తొండనూరులో జైనుల ఆధిక్యం సమసిపోయి వైష్ణవం వెల్లివిరిసింది.
శ్రీమతే రామానుజాయ నమః
ఇళయపెరుమాళ్! ఇళయాళ్వార్! లక్షణముని! రామానుజ!
యతిరాజ! శ్రీభాష్యకార! ఉడయవర్! ఎమ్బెరుమానార్! పెరియకోయిల్అణ్ణా!

గోదాగ్రజ! శఠకోపన్ పొన్నడి! తిరుప్పావైజీయర్! భవిష్యదాచార్య!
దేశికేంద్ర! యతిపతి! ఆదిశేషామణి! శ్రీపెరంబూదూర్ మాముని!

యతిరాజసార్వభౌమ! యతివరచూడామణి! యతికులచంద్ర! యతిశైలశేఖర!
యతిశైలరాజేంద్ర! యతివరభాస్కర! యతివరగోవింద! యతిశైలమఙ్గలమణి!

శ్రీరఙ్గేశవిజయద్వజ! ఆచార్యరత్నాకర! దివ్యసూరిదాస! ఉభయవిభూతినాయక!
శ్రీభూతపురిక్షమావల్లభ! శ్రీభూతపురీశ! ఆచార్యకులతిలక! శ్రీకలివైరిదాస!

శ్రీదేశికశిఖామణి! రామానుజదివాకర! శ్రీరఙ్గప్రవణ! యతిరాజశేఖర!
యతిశైలచక్రవర్తి! శ్రీసంపత్కుమారజనక! శ్రీకృపామాత్రప్రసన్నాచార్య!

శ్రీరఙ్గరాజచరణాంబుజరాజహంస! శ్రీవిష్ణులోకమణిమండపమార్గదాయి!
గురుకులాంబుధిచంద్ర! కాంతిమతీనందన! యామునాచార్యకారుణైకపాత్ర!

వేదార్ధప్రకాశక! అఖిలలోకైకపూజ్య! విజయశీల! విశిష్టాద్వైతనిర్వాహక!
శఠజిత్ సూక్తివర్ధన! శ్రీశఠకోపచరణరూప! సర్వజ్ఞశిరోమణి!

శ్రీభూతపురినిలయ! భవబంధవిమోచక! సర్వోత్తమోత్తమ!
యతీంద్ర! క్షమాగుణనిధి! శ్రీరఙ్గనాథప్రియ! భక్తజనచింతామణి!

నిత్యసూరిశ్రేష్ఠ! అఖిలలోకరక్షక! రామానుజమునిశేఖర! అపారకరుణాంబుదే!
సర్వవిజ్ఞానసాగర! అప్రమేయదివ్యమఙ్గలస్వరూప! సర్వజగదాచార్య!

శ్రీవైష్ణవగురుకులధుర్య! శ్రీవైకుంఠఫణిపుంగవ! శ్రీపరాంకుశపాదభక్త!
ముముక్షులోకబాంధవ! మోక్షఫలసంధాయక! ఆచార్యరత్నాహారమధ్యమణి!
దివ్యదేశ కైంకర్యదీక్షాపర! శ్రీమన్మాహాభూతపురినాథన్! యతిరాజన్!🙏


సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top