కైలాశ ఆలయంలో అంతుచిక్కని రహస్యాలు - Kailāśa ālayanlō antucikkani rahasyālu - Mysteries of the Kailash Temple

అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్న. కైలాశ ఆలయం. మహారాష్ట్రలోని ఔరంగబాద్‌కు 50 కిలోమీటర్ల దూరంలో గల 32 ఎల్లోరా గుహల్లోని కేవ్ 16‌లో ఈ ఆలయం ఉంది.

రాళ్లు, సిమెంట్ వంటివి ఏవీ ఉపయోగించకుండా కేవలం రాతి కొండను ఆలయంగా మలచడం దీని ప్రత్యేకం. పైగా దీన్ని కొండ దిగువ భాగం నుంచి కాకుండా పై భాగం నుంచి కిందికి చెక్కుకుంటూ వెళ్లడం మరో అద్భుతం. అయితే, ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు. ఎందుకు నిర్మించారనేది ఇప్పటికీ రహస్యమే. టెక్నాలజీ అందుబాటులోలేని రోజుల్లో ఇంత అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారంటే.. అస్సలు నమ్మబుద్ధి కాదు.

టెక్నాలజీ లేకుండానే..: 
ఈ రోజుల్లో ఇలాంటి ఆలయాన్ని నిర్మించాలంటే.. పక్కా బ్లూప్రింట్, ఇంజినీర్లు అవసరం అవుతారు. కానీ, అప్పట్లో అవేవీ లేకుండానే.. కేవలం శిల్పులంతా కలిసి 100 అడుగుల ఎత్తైన కొండను ఆలయంగా చెక్కారంటే నిజంగా అద్భుతమే. పురావస్తు పరిశోధకుల అంచనాల ప్రకారం 4 లక్షల టన్నుల రాయిని 18 ఏళ్లపాటు చెక్కి ఈ ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. కానీ, శాసనాల ప్రకారం ఈ ఆలయాన్ని క్రీ.శ.783లో పూర్తిచేసినట్లు ఉంది. ఇందులోని విగ్రహాలను పరిశీలించగా.. దాదాపు 600వ సంవత్సరంలో నిర్మాణం ప్రారంభించినట్లు తెలుస్తోంది.
కైలాశ ఆలయం లోపలి భాగం
కైలాశ ఆలయం లోపలి భాగం 
కూల్చలేనంత దృఢమైనది: 
ఈ ఆలయాన్ని నాశనం చేసేందుకు ఔరంగ జేబు తన సైన్యాన్ని పంపాడని, వారంతా మూడేళ్లు కష్టపడి కేవలం 5 శాతం మాత్రమే నాశనం చేయగలిగారని చెబుతుంటారు. ఈ ఆలయానికి వెళ్తే ఆ ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. మూడు అంతస్తుల ఎత్తు ఉండే ఒకే రాయిని తొలుస్తూ అంత భారీ నిర్మాణం చేపట్టారంటే చాలా అద్భుతం అనిపిస్తుంది. ఆలయ గోడలపై రామాయణం, భాగవతం, మహాభారత గాథలను శిల్పాలుగా మలిచారు. ఆలయ ఆవరణలోని స్తంభం, దాని భాగంలోని సింహాలు, గ్రహాల శిల్పాలు ఆకట్టుకుంటాయి.

అద్భుతం ‘కింద’.. మరో అద్భుతం: 
ఇప్పటివరకు అంతా ఈ ఆలయ నిర్మాణమే పెద్ద మిస్టరీగా భావించారు. కానీ, దీని ‘కింద’ మరో మిస్టరీ దాగి ఉంది. అదే ‘అండర్ గ్రౌండ్’ సిటీ. దీని నిర్మాణాన్ని పరిశీలిస్తే.. దీన్ని నిర్మించడం మనుషుల వల్ల కాదని తెలుస్తోంది. ఆలయంలోని చెక్కిన రెండు అడుగుల సొరంగంలోకి మనిషి వెళ్లడం అసాధ్యం అనిపిస్తుంది. అలాగే, ఆలయం దిగువన గుండ్రని రంథ్రాలు సైతం ఎంతో లోతుగా ఉన్నాయి. ఇవన్నీ పరిశీలిస్తే.. ఈ ఆలయం కింద ఓ అండర్ గ్రౌండ్ సిటీ ఉందని తెలుస్తోంది. ఈ చిన్నని గుహల నుంచి కిందికి వెళ్లాలంటే అతి చిన్న మనుషులు లేదా పిల్లల వల్లే సాధ్యం.

ఆ నీళ్లు ఎక్కడికి పోతాయి?: 
ఆలయంలో ఉన్న శివలింగంపై పోసే నీళ్లు ఎక్కడికి వెళ్తాయో తెలియదు. అవి ఆ కింద ఉన్న అండర్ గ్రౌండ్ సిటీలోకి వెళ్తాయనే సందేహాలు ఉన్నాయి. ఆలయం నేలకు ఉన్న రంథ్రాలు గాలి, వెలుతురు కోసం ఏర్పాటు చేసినవి కావచ్చని పలువురు చెబుతుంటారు. అయితే, ఆ రంథ్రాల్లో చిన్నారులు పడిపోయే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ప్రభుత్వం వాటిని మూయించి వేసింది. మనుషులు వెళ్లడానికి వీలులేని ఆ గుహల్లోకి డ్రోన్లను పంపినట్లయితే.. మరిన్ని విషయాలను తెలుసుకోవచ్చు.

అందుకే పైనుంచి చెక్కారా?: 
ఈ కైలాశ ఆలయం గురించి మరాఠీ ఇతిహాసల్లో ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. స్థానిక రాజు తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో అతడి భార్య శివుడిని ప్రార్థించింది. ఈ సందర్భంగా రాజు పూర్తిగా ఆరోగ్యవంతంగా కోలుకుంటే ఆలయాన్ని కట్టిస్తానని తెలిపింది. ఆ లయం గోపరం చూసేవరకు తాను ఉపవాసం చేస్తానని మొక్కుకుంది. దీంతో ఆ రాజు కోలుకున్నాడు. రాణి మొక్కు తీర్చేందుకు అప్పటి శిల్పులు కొండను తొలచి ఆలయ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న ఓ శిల్పి.. అలా నిర్మాణం చేపడితే.. ఆమె ఆలయ గోపురాన్ని చూసేందుకు కొన్ని వందల ఏళ్లు పడుతుందని చెప్పాడు. దీంతో ఆలయాన్ని ముందు నుంచి కాకుండా కొండ పై భాగం నుంచి చెక్కుకుని వచ్చారు. ముందుగా ఆలయం గోపురాన్ని చెక్కి.. రాణిని ఉపవాస దీక్ష విరమించేలా చేశారు. అందుకే, ఈ ఆలయానికి అంత ప్రత్యేకత వచ్చిందని ఆ కథలో పేర్కొన్నారు.

రచన: హైందవ సేన

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top