మాతృదేవోభవ - Mathrudevobhava

0

మాతృదేవోభవ
మానవ సంబంధ బాంధవ్యలన్నింటిలోనూ మాతాబిదడ్డల సంబంధం విశిష్టమైంది.ఆత్మీయతకు, అనుభూతికి, ఆర్ద్రతకు, అర్పణకు ఆనవాలు “అమ్మ". ప్రేమ, త్యాగం, సేవ,  సహనానికి మరోపేరు “అమ్మ". సృష్టి, స్థితి, లయలకు కారకులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. స్థితి లయలకు మూలకారణం సృష్టి, ఆ సృష్టించేది బ్రహ్మ. బ్రహ్మ ఉపకరణాలకు అన్నింటికీ కేంద్రబిందువు "అమ్మ" ఆమెలో బ్రహ్మ అంశే లేకపోతే స్పష్టి జరిగే అవకాశం లేనేలేదు.
           అందుకే 'న మాతుః పరదైవతమ్' అని శ్లాఘిస్తారు. జన్మనిచ్చిన తల్లి, పోషణ భారం వహించే తండ్రి, ప్రతీ శరీరధారికి తొలిదైవాలని, వారిని మొదట సేవించాలని హిందూ సంప్రదాయం ఉద్భోదిస్తుంది. శిశువు ఆరోగ్యంగా పుట్టేందుకు నవమాసాలు ఆహార నియమాలు పాటిస్తూ, చక్కటి బిడ్డకై భగవంతుణ్ణి ప్రార్ధిస్తుంది. వికారాల్ని ఇబ్బందుల్ని భరిస్తూ, ప్రసవ వేదననుభవిస్తూ జన్మనిస్తుంది. తన రక్తాన్ని పాలుగా మార్చి పోషిస్తుంది. బిడ్డను చూసి మురిసిపోతుంది. ఆనందంతో తబ్బిబ్బు అవుతుంది. తల్లి ప్రేమ అనూహ్యం, అనిర్వచనీయం. ప్రతీ ప్రసవం స్త్రీకి పునర్జన్నే అయినా తల్లి కాకుండా ఉండటాన్ని ఇష్టపడదు. కనుకనే, తల్లికి ఉత్తమ స్థానం ఇచ్చారు. 'మాతృదేవోభవ' అని కీర్తిస్తున్నారు. 
       సన్యాసం పుచ్చుకున్న వ్యక్తికి అందరు నమస్కరించడం సంప్రదాయం. పూర్వాశ్రమంలో తండ్రి అయినా సన్యాసాశ్రమం స్వీకరించిన కుమారునికి సాష్టాంగ నమస్కారం చేయవలసిందే. లోకంలో అన్ని బంధాలు త్యజించి సన్యాసం స్వీకరించిన వ్యక్తి తల్లికి మాత్రం తానే నమస్కరించాలి. తల్లి స్థానం అంతటి గొప్పది. సనాతనధర్మం సన్న్యాసయినా, గృహస్థుడైనా కన్నవారిని సాక్షాత్తు దైవాలుగా భావించి, వారికి సముచిత స్థానాన్నిచ్చి గౌరవించడం అత్యున్నత ధర్మంగా అభివర్ణించింది.
       మహాభారతంలో యక్షుడు యుధిష్ఠురుని భూమికంటే గొప్పదేదని ప్రశ్నించాడు. దానికి 'మాతా గురుతరా భూమే' మాతృమూర్తి పృథ్వి కంటే గొప్పదని, విలువైందని, ఉన్నతమైందని సమాధానమిచ్చాడు. ఎందుకంటే ‘నాస్తి మాతృ నమో గురుః' పరమాత్ముని సృష్టికి మరల ప్రతిసృష్టిని చేసే దివ్యమైన శక్తులను భగవంతుడు తల్లికి ప్రసాదించాడు. ఆ తల్లిని శ్రద్ధతో పోషించడం దేవతలను సేవించడంతో సమానమని ఉపనిషత్కారులు అంటున్నారు. 

"తల్లి శ్రద్ధామూర్తి ఆమె చల్లని నీడలో శాంతి లభిస్తుంది. తల్లిని సేవించేవారు మాతృదేశాన్ని ప్రేమిస్తారు. మాతృదేశానికి ప్రాధాన్యతనిస్తారు."

ప్రతీ ఒక్కరి తల్లితండ్రులు తమ బిడ్డలవల్ల ధన్యత పొందాలని వారి ప్రేమ వాత్సల్యంతో ఆనందంగా జీవించాలని కోరుకుంటారు. తల్లితండ్రుల మనస్సులకు సంతోషం కలిగేటట్లు జీవించడం వారిని సేవించడం, గౌరవించడం, వృద్ధాప్యంలో పోషించడం,  ఆదరించడం, మన సంప్రదాయంలో ప్రధానమైంది.
       మాతృత్వం అంటే భౌతికంగా ఓ బిడ్డకు జన్మనివ్వడం కాదు. మాతృభావన భౌతికస్థాయికి మించింది. సాక్షాత్తు ఆ జగన్మాతే వాత్సల్యం, దయ, శాంతి, శ్రద్ధ, ప్రేమ, త్యాగం, ఓర్పు మొదలగు సమస్త సద్గుణాల రూపంతో స్త్రీ హృదయంలో దాగి ఉందని, లోకంలోని స్త్రీలందరిలోను ఆమె అంశ ఉందని దేవి మహత్యంలో వర్ణించారు. అందుకే పై సద్గుణాలతో శోభిల్లే స్త్రీలందరూ మాతృస్వరూపులే. సాక్షాత్తు శక్తి స్వరూపిణి అయిన జగన్మాతలే!
__జాగృతి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top