ఖగోళ విజ్ఞానమయం రామాయణం - Astronomical Ramayana

0
ఖగోళ విజ్ఞానమయం రామాయణం - Astronomical Ramayana
దికవి, రామాయణ కావ్యాన్ని మనకందించిన మహర్షి వాల్మీకి గొప్ప ఖగోళవేత్త అని చాలమందికి తెలియదు. ఆయనకు ఖగోళవిజ్ఞానంపై ఉన్న పట్టు రామాయణ కావ్యంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రామాయణంలో పేర్కొన్న ఖగోళ విషయాలు, సందర్భాలు నూటికి నూరుపాళ్లు సరైనవని ఆధునిక శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ ల ద్వారా తేల్చారు..

రామాయణం గురించి 13 సంవత్సరాలు పరిశోధన చేసిన వైజ్ఞానిక శోధ్ సంస్థాన్ మాజీ అధ్యక్షురాలు సరోజ్ బాలా `రామయణ్ కీ కహానీ, విజ్ఞాన్ కీ జుబానీ’(రామాయణం ఒక వైజ్ఞానిక గాధ) అనే పుస్తకం వ్రాసారు. ఇందులో అనేక ఆసక్తికరమైన విషయాలు వివరించారు. అందులో కొన్నింటిని చూద్దాం.
    రామాయణాన్ని జాగ్రత్తగా చదివితే అందులో శ్రీరాముడికి సంబంధించిన సంఘటనలన్నింటి ఖగోళపరమైన స్థితిగతులను వాల్మీకి వివరంగా తెలిపారని అర్ధమవుతుంది. 25920ఏళ్లనాటి నక్షత్ర, గ్రహ స్థితిగతులు ఇప్పుడు తెలుసుకోవడం అధునాతన సాఫ్ట్ వేర్ వల్ల సాధ్యపడింది. ప్లానేటెరియమ్ గోల్డ్ సాఫ్ట్ వేర్ 4.1 వర్షన్ ఉపయోగించి ఈ విషయాలు సరోజ్ బాలా తెలుసుకోగలిగారు. ఈ సాఫ్ట్ వేర్ ద్వారా ఏ కాలంలోనైనా, ఏ ప్రదేశానికి సంబంధించిన ఖగోళ వివరాలు పొందవచ్చును. ఆ కాలానికి, నిర్ధారిత సమయంలో, నిర్ధారిత ప్రదేశంలో ఖగోళ చిత్రాన్ని ఈ సాఫ్ట్ వేర్ మనకు ఇస్తుంది.
   అలాగే రామాయణంలో మహర్షి వాల్మీకి పేర్కొన్న ఖగోళ విశేషాలను నిర్ధారించుకునేందుకు పరిశోధకులు స్టెలిరియమ్ సాఫ్ట్ వేర్ ను కూడా ఉపయోగించారు. దీని ద్వారా తెలుసుకున్న ఆనాటి ఖగోళ విషయాలు, నక్షత్ర, గ్రహ స్థితిగతులు రామాయణంలో వర్ణించినట్లుగానే ఉన్నాయని నిర్ధారణ అయింది. రామాయణంలో ఏ సమయంలో ఎలాంటి ఖగోళ స్థితి ఉందని వర్ణించారో సాఫ్ట్ వేర్ కూడా అలాంటి చిత్రాన్నే ఇచ్చింది.
    కావాలంటే ఎవరైనా ఈ పరిశీలన చేయవచ్చును. ఎందుకంటే స్టేలెరియమ్ సర్వత్ర లభించే, ఎవరైనా ఉపయోగించగలిగే సాఫ్ట్ వేర్. దీనిని ఇంటర్ నెట్ ద్వారా ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చును.
    అలాగే స్కైగైడ్ సాఫ్ట్ వేర్ కూడా స్టేలెరియమ్ సాఫ్ట్ వేర్ ఇచ్చిన ఖగోళ చిత్రాన్ని, తిథులను నిర్ధారించిందని సరోజ్ బాలా తన పుస్తకంలో వివరించారు. ఈ రెండు సాఫ్ట్ వేర్ లను ఎవరైనా పొందవచ్చును, వాడవచ్చును కాబట్టి రామాయణంలో వర్ణించిన ఖగోళ సంఘటనలను బట్టి ఆనాటి తిథులను నిర్ధారించుకోవచ్చును.

`ప్లానటేరియమ్ సిమ్యులేషన్ సాఫ్ట్ వేర్ ద్వారా రామాయణ కాలపు ఖగోళ, తిథుల నిర్ధారణేకాక పురాతత్వ విజ్ఞానం, పురా వనస్పతి విజ్ఞానం, సముద్ర విజ్ఞానం, భూ విజ్ఞానం, జలవాయు విజ్ఞానం, ఉపగ్రహ చిత్రాలు మొదలైనవాటిని కూడా తెలుసుకోవచ్చును.

రామాయణంలో ఖగోళ విషయాలు ఎంత కచ్చితంగా చెప్పారో శ్రీరామ జనన వర్ణన చూస్తే అర్ధమవుతుంది. శ్రీరామ జనన సమయంలో గ్రహ, నక్షత్ర స్థితులను వాల్మీకి ఇలా వర్ణించారు –

తతొ యెజ్ఞే సమాప్తే ఋతునాం షట్ సమత్యయుః
తతశ్రచ ద్వాదశే మాసౌ చైత్రే నవమికే తిథౌ ||
నక్షత్రే దితిదైవత్యే స్వొచ్చసంస్తేషు పుంచసు
గ్రహేషు కర్కాటక లగ్నే వాక్పతావిందునా సః ||
ప్రోద్యమానే జగన్నాధం సర్వలోక నమస్కృతం
కౌసల్య జనయద్ రామం దివ్యలక్షణ సంయుతం ||

శ్రీరాముడు జన్మించినప్పుడు సూర్యుడు, శుక్రుడు, గురుడు, శని, బుధ గ్రహాలు ఉచ్చ స్థానంలో ఉన్నాయి. లగ్న స్థానంలో చంద్రుడితోపాటు బుధుడు ఉన్నాడు. ఇలా జనన కాలంలో గ్రహాలు, నక్షత్రాల స్థితులను నమోదుచేయడం వైదిక కాలం నుంచి వస్తున్న ఆచారం. దీని ఆధారంగా జాతక చక్రాన్ని నిర్ధారిస్తారు.

రామాయణంలో ఇచ్చిన ఈ ఖగోళ వివరాలను ఆధునిక సాఫ్ట్ వేర్ ద్వారా పరిశీలిస్తే ఆ సమయం అయోధ్య అక్షాంశం, 27 డిగ్రీలు ఉత్తరం, 82 డిగ్రీల తూర్పు రేఖాంశంలో క్రీ.పూ 5114 సంవత్సరం మధ్యాహ్నం 12గం. 2 ని.ల సమయమని నిర్ధారణ అవుతుంది. అది చైత్ర మాసం, శుక్ల పక్షం, నవమి తిథి. సరిగ్గా ఇదే సమయానికి ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా రామనవమి వేడుకలు జరుగుతాయి. సీతారామ కళ్యాణం చేస్తారు. ఈ పరంపర వేలాది సంవత్సరాలుగా సాగుతోంది. 7వేల సంవత్సరాల క్రితం శ్రీ రాముని జనన సమయంలో ఏర్పడిన ఈ ఖగోళ స్థితి ఆ తరువాత 25వేల ఏళ్లలో మళ్ళీ ఎప్పుడు ఏర్పడలేదు.
  ఇది రామాయణానికి చెందిన ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా అనేక వర్ణనలను ఆధునిక సాఫ్ట్ వేర్ ద్వారా పరిశీలించినప్పుడు అవన్నీ నూటికి నూరుపాళ్లు సరైనవని నిర్ధారణ అయింది. దీనినిబట్టి శ్రీరాముడు ఏదో ఒక కల్పిత పాత్ర, రామాయణం ఒక కాల్పనిక గ్రంధం కాదని కూడా స్పష్టమవుతుంది. శ్రీరాముడు సూర్యవంశంలోని 64వ రాజు. అలాగే మహర్షి వాల్మీకి ఆయన సమకాలీనుడు. అయోధ్యా రాజుగా శ్రీరాముడి పట్టాభిషేకం జరిగిన తరువాత మహర్షి వాల్మీకి రామాయణ రచన ప్రారంభించారు. 24వేల శ్లోకాల్లో శ్రీరామ గాధను వాల్మీకి రామాయణ కావ్యంగా వ్రాసారు. ఉత్తర కాండతోపాటు రామాయణంలో బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధ కాండలు ఉన్నాయి.

__విశ్వ సంవాద కేంద్రము

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top