వెంకన్న ఆస్తులపై కన్ను - Venkanna astulapai Kannu

0
గన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) పాలక మండలి ప్రస్తుతానికి ఒక అడుగు వెనక్కి వేస్తే వేసి ఉండవచ్చు. కానీ, ఏడుకొండల వెంకన్న దేవుడి ఆస్తులను ఏదోలా దారి మళ్లించి ప్రభుత్వ ఖజానాకు.. అక్కడి నుంచి ఇంకెక్కడికో తరలించే 'సంకల్పం' మాత్రం చెక్కుచెదరలేదు.
  టీటీడీ చాటున ప్రభుత్వం కుట్రలు కొనసాగిస్తూనే ఉంది. ఆ దిశగా అడుగులు వేస్తూనే ఉంది. అందుకు ఇటీవల వెలుగులోకి వచ్చిన బ్యాంకు డిపాజిట్లు, బంగారం నిల్వల విషయంలో వెలుగు చూసిన తాజా ఉదంతాలే సాక్ష్యం.
  నిజమే. పత్రికలలో వస్తున్న వార్తలన్ని అక్షర సత్యాలు కాకపోవచ్చు. అలాగని, అన్నీ అసత్యాలే అని కూడా కొట్టి పారేయలేం. గత అనుభవాల దృష్ట్యా ప్రభుత్వంపై అనుమానాలు బలపడడం సహజం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి హిందూ ధర్మం, హిందూమత విశ్వాసాల పట్ల విశ్వాసం సంగతి పక్కన పెడితే, కాసింత గౌరవం కూడా లేదు. 
   ఇటీవల వైసీపీ మంత్రి కొడాలి నాని తదితరులు అంతర్వేది రథదహనం, విజయవాడ కనకదుర్గమ్మ వెండి సింహాల మాయం, మరో ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసమైన ఘటనలపై చేసిన వ్యాఖ్యలను గమనిస్తే జగన్ కి హిందూధర్మం పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో వేరే చెప్పనక్కర లేదు. ఆయన వ్యవహార సరళి గమనించినా, కొన్ని సందర్భాలలో ఆయన కుటుంబ సభ్యులు తమ మత  విశ్వాసాల విషయంలోనే కాకుండా హిందూ మతం, హిందూ ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలు గమనించినా వారు హిందువుల మనోభావాలను కించపరచడంలో, హిందువుల ఆచార వ్యవహారాలను అవహేళన చేయడంలో ఒక విధమైన ఆత్మానందం
పొందుతారేమోననే అనుమానం కూడా కలగక మానదు.
   స్వామివారి బ్రహ్మోత్సవాలలో జగన్ వెంకన్న దేవునికి ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాలయితే సమర్పించారు కానీ, ఆ దేవునిపై తనకు విశ్వాసం ఉందని ఒక సంతకం చేసేందుకు మాత్రం ససేమిరా అన్నారు. ఆ విధంగా హిందువుల మనోభావాలను అవమానపరచి ఆనందం పొందారు. హిందూధర్మం పట్ల ముఖ్యమంత్రికి విశ్వాసం లేకపోవచ్చు. కానీ వెంకన్న ఆస్తులు, ఆదాయాలపై మాత్రం సంపూర్ణ  విశ్వాసం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎలాగైనా  స్వామివారి ఆస్తులు కొల్లగొట్టే పని చాలా వేగంగా జరుగుతోందని చెప్పేందుకు వరసగా
సాగుతున్న కుట్రలు, కుతంత్రాలే సాక్ష్యం. 
   వెంకన్న దేవుని ఆస్తులపై జగన్ కే కాదు, ఇంకా చాలా మందికి ప్రేమ ఉంది. మైసూరు మహారాజులు స్వామివారికి బహుకరించిన పింక్ డైమండ్ (గులాబీ వజ్రం) సహా అనేక ఆభరణాల విషయంలో ఇంకా స్పష్టత లేదు. స్వామివారికి నలభై ఏళ్లపాటు ప్రధాన అర్చకునిగా సేవచేసిన రమణ దీక్షితులు ఆ వజ్రం ఉందని, అనేక సందర్భాలలో స్వయంగా స్వామివారికి దానిని అలంకరించానని చెప్పారు. అదే వజ్రాన్ని స్విట్జర్లాండ్ లోని జెనీవాలో రూ. 500 కోట్లకు వేలం వేశారని కూడా ఆయన ఆరోపించారు. అందుకు సంబంధించిన చిత్రాలను మీడియాకు విడుదల చేశారు. అయినా 'పింక్ డైమండ్' ఇప్పటికీ ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. ఉందో లేదో అన్న మీమాంసను పాలకులు కొనసాగిస్తున్నారు. 
   ఒక కమిటీ ఉందని, ఇంకొక కమిటీ లేదని భక్తులకు స్పష్టత లేకుండా చేస్తున్నాయి. గత ప్రభుత్వ హయంలో గుట్టుచప్పుడు కాకుండా జరిపిన తవ్వకాల విషయంలోనూ సందేహాలున్నాయి. పింక్ డైరైపండ్ మాత్రమే కాదు, ఇంకా అనేక ఆభరణాలు మాయమైపోయాయి. ఇటీవల గోవిందరాజులస్వామి ఆలయంలో అమ్మవారి ఆభరణాలు, స్వామివారి కిరీటాలు మాయమయ్యాయి. సింహాచలం భూములు సహా అనేక ఆలయ భూములు, ఇతర ఆస్తులను గత పాలకులు కబ్జా చేశారు. నిజానికి భక్తులు విరాళంగా ఇచ్చిన వందల వేల ఎకరాల మాన్యాలను ఎంచక్కా ఆరగించేందుకే ఎండోమెంట్స్ చట్టం రూపొందింది అన్యమత ప్రార్థనా స్థలాల మీద లేని ప్రభుత్వ అజమాయిషీ ఒక్క హిందూ ఆలయాల పై మాత్రమే ఎందుకు?
ఎస్వీ సుబ్బారెడ్డి
ఎస్వీ సుబ్బారెడ్డి

   వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు గత ప్రభుత్వాల కంటే ఘనంగా హిందూ ఆలయాల సంపద పై కన్నేసింది. ఒక చేత్తో దేవాలయాలు, మరో చేత్తో దేపుని ఆస్తుల ధ్వంస రచన సాగిస్తోందనే అభిప్రాయం బలపడుతోంది.
   ఈ క్రమంలోనే కొన్నిరోజుల క్రితం వెంకన్న దేవుని స్థిరాస్తులు, భూములను వేలం వేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానం చేసింది. చైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి సారథ్యంలో దేశవ్యాప్తంగా భక్తులు స్వామివారికి సమర్పించుకున్న భూములు, ఇతర స్థిరాస్తుల విక్రయానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే, ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రంలోనే కాకుండా జాతీయస్థాయిలోనూ దుమారం చెలరేగడంతో ఆ ఆలోచనను తాత్కాలికంగా విరమించుకున్నారు. నిజానికి వ్యూహాత్మకంగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారంటే బాగుంటుంది.
   ప్రభుత్వం, టీటీడీ టీటీడీ పాలక మండలి సంయుక్తంగా రచించిన ఈ కుట్ర పట్ల గతంలో భూముల వేలం విషయంలో ఎలాగైతే అనుమానాలు, ఆగ్రహం వ్యక్తమయ్యాయో ఇప్పుడు కూడా అలాంటి అనుమానాలు, అగ్రహాలే వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టాలన్న నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని దేవస్థానం ట్రస్టు బోర్డు మాజీ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి టీటీడీకి లీగల్ నోటీసులు జారీ చేశారు. ఆ నిర్ణయాన్ని అమలుచేస్తే హైకోర్టులో పిల్ దాఖలు చేస్తామన్నారు. కాగా ఈ అంశంపై టీటీడీ పూర్తి వివరాలతో వివరణ ఇస్తే బాగుంటుందని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. అసలు ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టే అర్హత, అధికారం టీటీడీకి ఉందా అంటూ సందేహం వ్యక్తంచేశారు. 
   మరోవైపు తిరుపతి సహా రాష్ట్రంలో అనేక చోట్ల బీజేపీ, జనసేన కార్యకర్తలు, విశ్వహిందూ పరిషత్ ఇతర హిందూ ధార్మిక సంస్థలు ఆందోళనకు దిగుతున్నాయి. జనసేన నేతేలు తిరుపతిలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. టీటీడీ నిధులను మళ్లించే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ ప్రశ్నించారు. శ్రీవారి డిపాజిట్లు ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఉంచాలనుకోవడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని అనేక మంది గళం విప్పారు. దీంతో ప్రభుత్వం తాత్కాలికంగా వెనకడుగు వేసినట్లుగా తెలుస్తోంది

     టీటీడీ నిధులను ఎప్పట్లాగానే బ్యాంకుల్లోనే డిపాజిట్  చేస్తామని తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. 'ఇప్పటివరకు కేంద్రం లేదా రాష్ర ప్రభుత్వాల సెక్యూరిటీల్లో టీటీడీ పెట్టుబడులు పెట్టలేదు. అయితే వడ్డీరేట్లు తగ్గుతున్న సమయంలో టీటీడీ బోర్డు ఈ సెక్యూరిటీల్లో పెట్టుబడులపై అధ్యయనం చేసింది. ప్రస్తుతం దీనిని పరిగణించాల్సిన అవసరంలేదు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్లాక్ మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంకుల్లో వడ్డీ రేట్లు పెరిగే అవకాశమున్నందున ఇక పై బ్యాంకుల్లోనే ఎఫ్డీలను కొనసాగిస్తాం' అని స్పష్టం చేసింది. 
   కానీ, శ్రీవారి సొమ్ములు ప్రభుత్వ ఖజానాకు చేర్చుకోవాలనే సంకల్పం మాత్రం అలాగే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఓ వైపు వరదలు, మరోవైపు కరోనా, ఈ అన్నిటినీ మించి ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ బొబ్డేకు రాసిన లేఖపై వివాదం నడుస్తున్న సమయంలోనే ప్రభుత్వం టీటీడీ బంగారాన్ని పరోక్షంగానే అయినా కుదువపెట్టి, బ్యాంకురుణాలు పొందే మరో మహా ప్రణాళికను నిశ్శబ్దంగా, విజయవంతంగా అమలు చేసింది.
  ఇంతవరకు తిరుపతి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో డిపాజిట్ చేసిన సుమారు 1500 కిలోల బంగారాన్ని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), ముంబైలో డిపాజిట్ చేసేంది. అందుకు ఆ బ్యాంకు ఎక్కవ వడ్డీ చెల్లిస్తుందన్న సాకు చెప్పినా అసలు కారణం ఆ బ్యాంకు ఇస్తామన్న అప్పులేనని తెలుస్తోంది. కాబట్టి స్వామివారి సొమ్ములకు, ఆ మాటకొస్తే రాష్ట్రంలోని దేవాలయ భూములు, ఆస్తులకు రోజురోజుకి రక్షణ లేకుండాపోతుందన్నది వాస్తవం.

వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్ - 
వ్యాస మూలము: జాగృతి  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top