ఐన్ స్టీన్ సిద్ధాంతం - హైందవ దృక్పథం : టైమ్ మెషీన్ - EINSTEIN'S THEORY IN HINDU PERSPECTIVE: The Time Machine

ఐన్ స్టీన్ సిద్ధాంతం - హైందవ దృక్పథం : టైమ్ మెషీన్ - EINSTEIN'S THEORY IN HINDU PERSPECTIVE: The Time Machine
టైమ్ మెషీన్
అసలు కాలంలో ప్రయాణించడం సాధ్యమేనా? టైమ్ మెషీన్ లాంటి యంత్రాల తయారీ సాధ్యమవుతుందా? వాటిలో కూర్చుని మనం భూతకాలానికీ, భవిష్యత్తుకీ వెళ్ళగలమా? అనే విషయాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.

ఐన్ స్టీన్ సమీకరణాలకు సాధించబడిన పరిష్కారాలు సిద్ధాంతపరంగా కాలంలో ప్రయాణం సాధ్యమేనని తెలియజేసాయి. ప్రిన్స్ టన్ లో ఐన్ స్టీన్ పొరుగువాడైన గణిత శాస్త్రవేత్త కుర్ట్ గోడెల్, కాలంలో ప్రయాణించదానికి ఉపకరించేలా ఐన్ స్టీన్ సమీకరణాలకు ఒక సరికొత్త పరిష్కారాన్ని కనుగొన్నాడు. కాలమనే నదీప్రవాహంలో సుడిగుండాలలాంటివి ఉంటాయనీ, అక్కడ కాలమనేది గుండ్రంగా చుట్టబెట్టబడి ఉంటుందనీ గోడెల్ తెలిపాడు.
   ఈ విశ్వమంతా కాలమనే నదీ ప్రవాహం చక్రంలా పరిభ్రమిస్తూ ఊంటుందనీ, ఆ చక్ర పరిభ్రమణం దిశలో ఎవరన్నా ప్రయాణిస్తే అతడు తిరిగి తను ప్రారంభించిన చోటికే తిరిగి వచ్చినట్లు గ్రహిస్తాడని, అయితే అది భూతకాలమనీ గోడెల్ వివరించాడు. కానీ కాలంలో ప్రయాణానికి ఉపకరించేలా తన సమీకరణాల నుండి పరిష్కారాలు ఉండటం తనను కదిలించి వేస్తోందని ఐన్ స్టీన్ తన స్వీయ చరిత్రలో వ్రాశాడు.

విశ్వమనేది చక్రీయంగా పరిభ్రమించదనీ, అది కేవలం విస్తరిస్తూ ఊంటుందనీ (బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం), కాబట్టి గోడెల్ చూపిన పరిష్కారాలను ఈ కారణంతో పక్కన పెట్టవచ్చని ఐన్ స్టీన్ భావింఛాడు. అంటే ఒకవేళ బిగ్ బ్యాంగ్ అనేది చక్రంలా తిరిగేది గనక అయితే విశ్వమంతటా కాలంలో ప్రయాణీంచడం సంభవమవుతుందని దీని అర్థం.
   1963 లో రాయ్ కెర్ర్ అనే గణిత శాస్త్రవేత్త చక్రీయంగా పరిభ్రమించే కృష్ణ బిలాలకు సంబంధించి ఐన్ స్టీన్ సమీకరణాలకు ఒక పరిష్కారాన్ని కనుగొన్నాడు. కృష్ణ బిలాలు నాశనమయ్యాక అవి గిరగిరా తిరిగే ఒక న్యుట్రాన్ల వలయంలా ఏర్పడతాయనీ, అవి గురుత్వాకర్షణ శక్తికి లోనవకుండా అంతటా వ్యాపిస్తాయని ఇతడు తెలిపాడు.
    ఆ వలయాలు కాలంలో ప్రయాణించడానికి ఉపకరించే సొరంగ మార్గాలలాంటివని, వాటి గుండా ప్రయాణీంచే వానికి చావు అనేది ఉండదనీ, దాని గుండా ప్రయాణిస్తే మరో సమాంతర విశ్వానికి చేరుకోవచ్చనీ ఇతడు వివరించాడు. ఈ వలయాలనే “వార్మ్ హొల్స్” లేదా "ఐన్ స్టీన్ - రోసెన్ బ్రిడ్జ్" అంటారు. అప్పటి నుండి, ఐన్ స్టీన్ సమీకరణాలకు సంబంధించి వందలాది “వార్మ్ హోల్” పరిష్కారాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

‘వార్మ్ హొల్స్’ అనేవి శూన్యాకాశంలోని రెండు ప్రాంతాలనే కాక కాలంలోని వివిధ సమయసీమలను కూడా కలుపుతాయి. అంటే సిద్ధాంత పరంగా ఇవి ‘టైమ్ మెషీన్లు’ గా పనిచేస్తాయి. ఈ ‘వార్మ్ హోల్స్’ విశ్వమంతా వ్యాపించి ఉంటాయి. ఇవి కేవలం సైద్ధాంతిక బిలాలు మాత్రమే. ఈ ప్రత్యేక నిర్మాణాలు విశ్వంలో ఉండవచ్చునని శాస్తవ్రేత్తల నమ్మిక. ఇవి కాలంలో ప్రయాణించడానికి అనుకూలమైన రోడ్డు మార్గాలవంటివని ఐన్స్టీన్ భావించారు.
   అయితే ‘టైమ్ మెషీన్’ నిర్మాణంలో ఉన్న సమస్య ఏమిటంటే, కారుకు పెట్రోలు లేదా డీజిల్ ఎలా అవసరమో ఈ ‘టైమ్ మెషీన్’ పనిచేయాలంటే నక్షత్రాల శక్తిని నియంత్రించగలిగే సామర్థ్యం కావాలి లేదా ఏదైనా అసాధారణమైన పదార్థాన్ని కనుక్కో గలగాలి లేదా ఏదైనా మహత్తరమైన శక్తి అవసరం. దీనినే శాస్త్రవేత్తలు “నెగటివ్ ఎనర్జీ” (ఋణాత్మక శక్తి) అంటున్నారు.
   రెండు సమాంతర ప్లేట్ల సహాయంతో అతి కొద్ది పరిమాణంలో ఈ ఋణాత్మక శక్తిని శాస్త్రవేత్తలు సృష్టించగలిగారు. దీనినే ‘కాసిమిర్ ప్రభావం’ అంటారు. అయితే ఒక టైమ్ మెషీన్ పని చేయాలంటే భారీ పరిమాణంలో ఈ నెగటివ్ ఎనర్జీ అవసరమవుతుంది. మరి కొన్ని శతాబ్దాల దాకా ఆ సాంకేతికత మనకు లభించే అవకాశం కనబడట్లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రస్తుతం ప్రపంచంలోని ఇద్దరు ప్రఖ్యాత భౌతిక శాస్తవ్రేత్తలు మాత్రం కాలంలో ప్రయాణించడం సాధ్యమేనని చెబుతున్నారు. ఒకరు జపనీస్ - అమెరికన్ భౌతికశాస్తవ్రేత్త 'మిఛియో కకు' కాగా, రెండవ వారు బ్రిటన్కు చెందిన ప్రఖ్యాత భౌతిక శాస్తవ్రేత్త 'స్టీఫెన్ హాకింగ్'.
    "విశ్వంలో మనం స్వేచ్ఛగా ముందుగు వెనక్కు కదలవచ్చు. కాకపోతే వీటిని కాలంలో చేయాలంటే కొంచెం కష్టం." అని మిఛియో కకు అంటున్నారు.
     అయితే ఈ పరిజ్ఞానాన్నంతా కలిగిన వారు మన భవిష్యత్ కాలంలో ఉండవచ్చునని, వారు తమ గతంలోకి ప్రయాణించి ఇప్పుడు వర్తమానంలో ఉన్న మనల్ని సందర్శించే అవకాశం లేకపోలేదని మిఛియో కకు అభిప్రాయపడుతున్నాడు.
అందుకే ఆయన ఇలా అన్నారు :
  • "ఏదో ఒకరోజు ఎవరో ఒకరు వచ్చి మీ ఇంటి తలుపు తట్టి 'నేను మీ ముని ముని ముని ముని మనవణ్ణి' అని చెబితే ఆశ్చర్యపోవద్దు. బహుశా అతడు చెప్పేది నిజమే కావచ్చు."
  • ఈ విశ్వంలో కనిపించే కృష్ణబిలాలు (బ్లాక్హోల్స్) కూడా కాలంలో ప్రయాణించడానికి మరో మార్గమని ఐన్ స్టీన్ చెప్పారు. ఈ కృష్ణబిలాలు, స్థలం-కాలం అల్లికను చాలా వరకు మార్చేస్తాయి.
  • ఈ కృష్ణబిలాలను కాల యంత్రాలుగా చూడవచ్చునని మిఛియో కకు అంటున్నారు.
  • ‘మీరు ఈ కృష్ణబిలం గుండా ప్రయాణించారనుకోండి. స్థలము-కాలానికి సంబంధించిన మరో కేంద్రం వద్దకు చేరుకుంటారు,’ అని కకు వివరించారు.
  • బ్రిటన్కు చెందిన భౌతిక శాస్తవ్రేత్త స్టీఫెన్ హాకింగ్ కూడా కాలంలో ప్రయాణించడానికి వార్మ్హోల్స్, బ్లాక్హోల్స్ ఉపయోగపడతాయని చెబుతున్నారు.
స్టీఫెన్ హాకింగ్ అభిప్రాయం ప్రకారం ఎవరైనా కాలంలో ప్రయాణించాలంటే అందుకు తగిన వేగం అవసరం. ఆ వేగం ఎంత ఉండాలంటే, ప్రస్తుతం అపోలో నౌక ప్రయాణించే వేగంకంటే రెండువేల రెట్లు అధికంగా ఉండాలి. (అపోలో వ్యోమనౌక గంటకు 25వేల మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది). ఆ వ్యోమనౌక యొక్క త్వరణం, ఇంచుమించు కాంతివేగానికి సమాన స్థాయికి చేరుకోగలిగేలా దాని నిర్మాణం, పరిమాణం ఉండాలి.
   అయితే క్వాంటం సిద్ధాంతాన్ని, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని సమన్వయం చేసే ఏకీకృత సిద్ధాంతం అనేది ఇంకా రూపుదిద్దుకోలేదు. కాబట్టి కెర్ర్ చెప్పిన బ్లాక్ హోల్ లో ప్రయాణీంచే టప్పుడు అది అస్థిరంగా మారినా, కొన్ని క్వాంటం ప్రభావాలు వార్మ్ హోల్ ను నాశనం చేసినా కాలంలో ప్రయాణం అన్నది సాధ్యం కాదు.

కాలంలో ప్రయాణానికి భౌతిక శాస్త్ర నియమాలేవీ సిద్ధాంత పరంగా అడ్డు చెప్పట్లేదు. కానీ ఆచరణలోనే అనేక సమస్యలున్నాయి.
   ప్రస్తుతం కాంతి వేగంతో ప్రయాణించే ఫోటాన్లను కాలంలోకి కాకుండా శూన్యాకాశం(space) లోని ఒక స్థానం నుండి మరో స్థానానికి, వాటి మధ్య దూరాన్ని దాటే అవసరం లేకుండానే పంపడానికి (Quantum Teleportation) మాత్రమే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రానున్నదశాబ్దాలలో మొట్ట మొదటి వైరస్ ను ఇలా పంపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
 గతంలోకి ప్రయాణించడం సాధ్యమైతే కొన్ని వైరుధ్యాలు ఎదురవుతాయి. అందులో పితామహుల వైరుధ్యం (Grandfather Paradox) ఒకటి. ఒక వ్యక్తి భూతకాలంలోకి ప్రయాణం చేసి అతడి తల్లితండ్రులను చంపితే ఏమవుతుంది అనే దుర్మార్గపు ఆలోచన శాస్త్రవేత్తలకు వచ్చింది. అలా జరిగితే ఆ వ్యక్తి పుట్టే అవకాశం ఉండదు. కానీ అతడు పుట్టాడు కాబట్టే వెనకటి కాలానికి ప్రయాణం చేశాడు కదా? మరి ఈ వైరుధ్యానికి సమాధానం ఏమిటి?
    దీనికి రష్యా శాస్త్రవేత్త నొవికోవ్ ఒక పరిష్కారాన్నిసూచించాడు. ఈయన అభిప్రాయంలో మనం కాలంలో ప్రయాణిస్తే మన స్వతంత్రేఛ్చ (Freewill) కు కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి. తన తల్లి తండ్రులను చంపాలనే ఆ వ్యక్తి ప్రయత్నాన్ని ఏదో శక్తి అడ్డుకుంటుంది. అంటే విధి రాతను కాలంలో ప్రయాణించి మార్చలేము.
  మనం కాలంలో ప్రయాణించి 1945లో విమాన ప్రమాదంలో చనిపోయారని భావిస్తున్న నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ను కాపాడుకోగలిగితే? అప్పుడు భారత దేశ ముఖచిత్రం మరోలా ఉండేదేమో? మరి అది సాధ్యమా? గతాన్ని మార్చగలమా? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఈ వైరుధ్యానికి శాస్త్రవేత్తలు ఇస్తున్న మరో వివరణ ఏమిటంటే ఇప్పుడు మనం ఉంటున్న విశ్వమేకాకుండా అనేక విశ్వాలుంటాయి. వాటి కాల రేఖలు వేర్వేరుగా ఉంటాయి. దీనినే బహుళ విశ్వ భావన అంటారు. మనం గతంలోకి ప్రయాణించి నేతాజీని కాపాడినా, అతడు వేరే విశ్వంలో, వేరే సమయసీమలో ఉన్న నేతాజీనే అవుతాడు కానీ, మన విశ్వంలోని, మన కాలరేఖలోని నేతాజీ మాత్రం అదృశ్యమయ్యే ఉంటాడు. ఈ బహుళ విశ్వ భావనలో వైరుధ్యానికి ఆస్కారం ఉండదని మిఛియో కకు అభిప్రాయపడుతున్నాడు. అయితే బహుళ విశ్వాలున్నాయనడానికి ఇంకా శాస్త్రీయ ఆధారాలు దొరకలేదు. ప్రస్తుతానికి ఇది ఒక ఊహా గానం లాంటిది మాత్రమే.

హిందు పురాణాల్లోని రైవతుడు, ముచికుందుడు వంటి వారు కూడా తమ యోగ శక్తి ద్వారా భవిష్యత్తులోకి ప్రయాణం చేయగలిగారు కానీ భూత కాలంలోకి ప్రయాణించి అప్పటి సంఘటనలను ప్రభావితం చేసి విధి వ్రాతను మార్చలేదు. కాబట్టి పైన చెప్పుకున్న వైరుధ్యాలకు వారు ఆస్కారం ఇవ్వలేదు.
   పైగా యోగ సిద్ధి పొందిన ప్రాచీన భారతీయ మహర్షులు భూత, భవిష్యత్ కాలాలను తమ తప:శ్శక్తితో దర్శించగలిగారు కానీ దైవ నియమాలను, కర్మ సూత్రాలను వారు అతిక్రమించలేదు.
   ప్రస్తుతం మనకు తెలిసిన శాస్త్ర నియమాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని పక్కనబెడితే తప్ప 'కాలంలో ప్రయాణించడం' అనే వాస్తవాన్ని అంగీకరించడం సాధ్యం కాదు. ఇప్పుడు మనం 'వార్మ్హోల్' లేదా 'బ్లాక్ హోల్' గుండా ప్రయాణిస్తే కలిగే ప్రమాదమేంటి? అనేది ప్రధాన ప్రశ్న. కాబట్టి ప్రస్తుతానికి కాలంలో ప్రయాణం అన్నది కేవలం సిద్ధాంతానికే పరిమితమయింది. దానిని ప్రయోగాత్మకంగా నిరూపించాలంటే చాలా ఆచరణాత్మక సమస్యలున్నాయి.

రచన/సంకలనం: మణి కుమార్

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top