నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Thursday, January 14, 2021

సంక్రాంతిలో..పాయసం..గారెలు పిండివంటలు ఎందుకు ? - Sankranti Pindivantalu

సంక్రాంతిలో..పాయసం..గారెలు పిండివంటలు ఎందుకు ? - Sankranti Pindivantalu
: సంక్రాంతిలో..పాయసం..గారెలు :
సంక్రాంతి నాడు కొన్ని పదార్థాలను ప్రత్యేకంగా వాడతారు. వాటి వినియోగం వెనుక విశేషాలివీ..
  • 1. కొత్త బియ్యం: సంక్రాంతి నాడు కొత్త బియ్యంతో పిండివంటలు తయారు చేస్తారు. ఇలా చేయడం వెనుక అర్థం, పరమార్థం రెండూ ఉన్నాయి. సంక్రాంతి నాటికి పొలాల నుంచి వచ్చిన ధాన్యంతో గాదెలతో పాటు రైతుల మనసులూ నిండుగా ఉంటాయి. ఇలా కొత్తగా వచ్చిన బియ్యంతో నిజానికి ఎవరూ అన్నం వండుకోరు. ఎందుకంటే, కొత్త బియ్యం అజీర్తి చేస్తాయి. అందుకని వాటిని బెల్లంతో జోడించి పరమాన్నంగానో, అరిసెలుగానో చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల అటు పిండివంటా చేసుకున్నట్టు అవుతుంది, ఇటు జీర్ణ సమస్యలూ తలెత్తవు. తమిళనాడులో అయితే, సంక్రాంతి నాడు ఇలా పొంగలి చేసుకోవడమే ముఖ్యమైన కృత్యంగా ఉంటుంది. అందుకే అక్కడ ఈ పండుగను ‘పొంగల్’ అంటారు. మరోవైపు- కొత్త బియ్యంతో వండిన పిండివంటలను నైవేద్యంగా అర్పించడం అంటే- పంట చేతికందినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞత తెలపడం.
  • 2. నువ్వులు: సంక్రాంతి నాడు తయారు చేసే పిండివంటలన్నింటిలో నువ్వులను ధారాళంగా వాడతారు. అరిసెలకూ, సకినాలకూ నువ్వులు దట్టిస్తారు. బిహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అయితే కేవలం నువ్వులతో పిండి పదార్థాలను తయారు చేసి ఒకరికొకరు పంచుకుంటారు. సంక్రాంతి సమయంలో ఇలా నువ్వులను వాడటం వెనుక ఒక ఆరోగ్య రహస్యం ఇమిడి ఉంది. నువ్వులు చాలా శక్తివంతమైన ఆహారం. అందుకే నువ్వుల నుంచి నూనె తీసిన తరువాత ఆ తెలగ పిండిని సైతం పారేయకుండా పశువులకు పెడతారు. అయితే, నువ్వులలో ఉండే అధిక పోషకాల వల్ల ఒంటికి బాగా వేడి కలిగిస్తాయి. అందుకనే మన ఆహారంలో మిగతా రోజుల్లో నువ్వులను పెద్దగా వాడరు. కానీ, సంక్రాంతి సమయంలో సూర్యుని దిశ మారి నిదానంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఆ సమయంలో నువ్వులను తినడం వల్ల, మారుతున్న వాతావరణానికి అనుగుణంగా శరీరం అలవాటు పడుతుంది. ఈ కారణంగానే సంక్రాంతి పర్వదినాల వేళలో నువ్వులు ఎక్కువగా వాడతారు.
  • 3. మినుములు: తెలుగు నాట కనుమ నాడు తప్పనిసరిగా చేసుకునే పిండివంటల్లో గారెలు ఒకటి. ‘కనుమ నాడు మినుములు తినాలి’ అని సామెత. ఇది వట్టి సామెత మాత్రమే కాదు, ఆచారం, సంప్రదాయం కూడా. గతించిన పెద్దలకు మొదట గారెలను నివేదించాలని కూడా అంటారు. ఈ సమయంలో గారెలను తినడం వెనుక ఆరోగ్య సూత్రం ఇమిడి ఉంది. మినుములు ఒంట్లో ఉష్ణాన్ని కలిగిస్తాయి. చలికాలం తారస్థాయిలో ఉన్న సంక్రాంతి సమయంలో మినుములు తినడం వల్ల మన శరీరం ఆ చలిని తట్టుకోగలుగుతుంది. అలాగే మినుములతో మినప సున్నుండలు కూడా చేస్తారు. వీటిని కొత్త అల్లుళ్లకు నెయ్యి దట్టించి తయారు చేస్తారు. ఇవి శరీరానికి బలిమిని, వీర్యపుష్టిని కలిగిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. మినుములను వివిధ ఆహార పదార్థాల రూపంలో ఈ కాలంలో తగినంతగా తీసుకోవడం ద్వారా.. ఆధ్యాత్మికులు రాబోయే మాఘ మాసంలో జరగబోయే శుభకార్యాలకు చక్కని దేహదారుఢ్యాలతో కళకళలాడుతూ ఉంటారని అంటారు.
రచన: చాగంటి కనకయ్య (fb)
« PREV
NEXT »

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com