ధనం - మోహం - ఖర్మ ఫలితం !

ధనం - మోహం - ఖర్మ ఫలితం - Money - Passion - The Result of Karma
  ఒక సాధువు నడిచి వెళుతూ అలసటగా ఉంటే ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఎదురుగా ఉన్న ఇంట్లోని గృహస్టుడు ఆయన్ని చూసి తమ ఇంట్లోకి వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకోమని కోరాడు. సాధువుకి మంచి భోజనం పెట్టి, చీకటి పడింది కదా ఈ పూటకి ఇక్కడే ఉండమని కోరాడు.
   మాటల్లో తన కష్టసుఖాలు ముచ్చటిస్తూ, యజమాని, “ఏమిటో నండీ! సంసారంలో సుఖం లేదండీ.. మీ జీవితమే హాయి!! అన్నాడు. వెంటనే ఆ సాధువు "అయితే- నా వెంట రా నీకు మోక్ష మార్గం చూపిస్తాను" అన్నాడు. యజమాని కంగారు పడుతూ. "అలా ఎలా కుదురుతుంది? పిల్లలు చిన్నవాళ్లు. వాళ్లను పెంచి పెద్ద చేయాలి కదా" అన్నాడు. సాధువు మాట్లాడలేదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ సాధువు మరల అదే మార్గంలో వస్తూ ఆ ఇంటిని చూసి ఆగాడు. అయన్ని చూసి యజమాని సాదరంగా ఆహ్వానించి, అతిథి మర్యాదలు చేశాడు. మాటలలో సాధువు అన్నాడు. "పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు కదా నా వెంట రా! నీకు మోక్ష మార్గం చూపిస్తాను. యజమాని తడబడుతూ ఇప్పుడే కాదు స్వామీ! పిల్లలు స్థిరపడాలి వాళ్ల పెళ్లిళ్లు చేయాలి" అన్నాడు.
   ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి. సాధుపు మళ్లీ అదే యజమాని ఆతిథ్యం సాధువు అదే మాట.. యజమాని జవాబు కొంచెం విసుగ్గా పిల్లలకి డబ్బు విలువ తెలియదు. అందుకని నేను దాచినంతా ఆ చెట్టు కింద పాతిపెట్టాను. వీలు చూసుకుని చెబుతాను. ఒక పెద్ద ఇల్లు కట్టాలి, మీలాగా నాకు ఎలా కుదురుతుంది" అన్నాడు.
  ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి. సాధువు మళ్లీ అదే మార్గంలో పసూ ఆ ఇంటి వంక చూడకుండా వెళ్లి పోతుండగా ఆ యజమాని కొడుకు గమనించి ఆహ్వానించాడు. అతను తమ తండ్రి మరణించాడని చెప్పాడు. సాధువుకి కొంచెం బాధనిపించింది. అతిథ్యం స్వీకరించి బయటికి వచ్చాడు. చెట్టు కింద ఒక కుక్క కూర్చుని ఉంది యజమాని అనుమానంగా దాని వంక చూశాడు. సందేహం లేదు యజమాని కుక్కగా పుట్టాడు. సాధువు మంత్రజలం దాని మీద జల్లి, "ఏమిటి నీ పిచ్చి మోహం? కుక్కగా పుట్టి ఇంటికి కాపలా కాస్తున్నావా? నా వెంట రా. నీకు మోక్ష మార్గం చూపిస్తాను" అన్నాడు. యజమాని ఆ మాట మాత్రం వినలేను. ఎందుకంటే నేను డబ్బు ఇక్కడ దాచిన సంగతి పిల్లలకి చెప్పలేదు. ఎవరూ దోచుకోకుండా చూడాల్సిన బాధ్యత నాదే కదా అన్నాడు. మళ్లీ కొన్నాళ్లకి సాధువు ఆ దారిన వస్తూ ఆ ఇంటి వైపు చూశాడు. కుక్క కనపడలేదు పక్కవారిని అడిగితే అది పోయిందని చెప్పారు. అయినా సాధువు అనుమానంగా చుట్టూ చూస్తుంటే చెట్టు కింద ఒక పాము కనిపించింది. పరీక్షగా చూసాడు ఖచ్చితంగా ఆ యజమాని మళ్లీ పాముగా జన్మించాడు. 
   మంత్రజలం చల్లి, "ఇంకా ఈ ఇంటిని వదిలి వెళ్లవా? నాతో రా" అన్నాడు. ఆ ఒక్క మాట మాత్రం అనకండి. నా సొమ్ము పిల్లలకి కాకుండా ఇతరులకి దక్కనీయకుండా చూడాలి కదా అన్నాడు దీనంగా. సాధువు వెంటనే అతని ఇంట్లోకి వెళ్లి, అతని కొడుకులతో "మీ నాన్న ఆ చెట్టు కింద డబ్బు దాచిపెట్టాడు. కానీ జాగ్రత్త! అక్కడ పాము ఉంది" అన్నాడు. ఆ మాట వినగానే కొడుకులు ఎగిరి గంతేసి కర్రలు తీసుకుని బియలుదేరారు. తన కొడుకులే తనను కర్రలతో చావగొడుతుంటే అతను దీనంగా సాధువు వంక చూశాడు కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది.

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top