మహాశివరాత్రి రోజున చేయవలసిన కార్యములు - Things to do on Mahashivratri

0
మహాశివరాత్రి రోజున చేయవలసిన కార్యములు  - Things to do on Mahashivratri
శివలింగము
: మహాశివరాత్రి రోజున చేయవలసిన కార్యములు :
   శివునికి భక్తులంటే ప్రీతి. భక్తులకు శివుడంటే అపార విశ్వాసం. అందుకే భక్తులు మహాదేవుడిని ప్రతిరోజూ స్తుతిస్తూ నిత్య శివరాత్రి జరుపుకొంటారు. ఆద్యంత రహితుడుని ఎన్నిసార్లు స్తుతించినా తనివిదీరదంటూ పక్షానికి, మాసానికీ, సంవత్సరానికీ.. ఒక్కో శివరాత్రి పేరుతో శివయ్యను అభిషేకిస్తారు.  వాటన్నింటిలో విశిష్టమైనది మాఘ బహుళ చతుర్దశి నాటి మహా శివరాత్రి. మాఘ మాస కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి 12గడియల వరకు లింగోద్భవ కాలం సమయంలో చతుర్దశి ఉండటం వల్ల 11న రాత్రి మహా శివరాత్రి ఏం చేయాలి?

   మహాశివరాత్రి పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. 
మహా శివరాత్రి రోజు ప్రతిఒక్కరూ ఉపవాసం, జాగరణ ఉండటం, రోజంతా శివనామస్మరణతో గడపడం, ప్రదోషవేళయందు శివుని అభిషేకించడంతో పాటు విశేషించి శివుడికి బిల్వార్చన, రుద్రాభిషేకం వంటివి చేయడం శ్రేయస్కరం. ఉపవాసం అంటే ఉప+ ఆవాసం. 
అంటే శివనామస్మరణతో శివుడికి దగ్గరగా ఉండటం. ఈ పర్వదినాన ఎలాంటి ఆహారం తీసుకోకుండా శివుడిని పూజించడం, అభిషేకించడం వంటివి చేయాలి. 
  • ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యపరిస్థితుల రీత్యా పూర్తి ఆహార నియమాలు పాటించలేనివాళ్లు ద్రవ పదార్థాలతో, శంకరుడిని అభిషేకించిన ప్రసాదాలతో ఉపవాస నియమాలను భక్తిశ్రద్ధలతో పాటిస్తే పుణ్యఫలం దక్కుతుంది. 
  • శివరాత్రి రోజున జాగరణ ఉండటం వల్ల రాత్రి పూట చేసే శివార్చన, శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు వస్తుంది. 
  • అలాగే, భగవంతుడి మీద సాధకులకు, మోక్షమార్గంలో ప్రయత్నించేవారికి ఇది విశేష సమయం. 
  • అలాగే, గృహస్థులకు ఆయురారోగ్యపరంగా పుణ్యార్చన పరంగా, శుభఫలితాలు కలిగిస్తాయని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి.
ఐదు శివరాత్రులు..
మహా శివరాత్రి రోజున శాస్త్రోక్తంగా శివయ్యను ఆరాధించినా, ఎలాంటి మంత్రాలూ తెలియక కేవలం భక్తితో శివలింగం మీద చెంబుడు నీళ్లుపోసినా రెండూ తనకి సమానమే అంటాడు ఆ కైలాసనాథుడు.  భక్త కన్నప్ప ఉదంతం ఈ కోవకు చెందిందే. హైందవ సంప్రదాయంలో నిత్య, పక్ష, మాస, మహా, యోగ అనే ఐదు రకాల శివరాత్రులు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. 
రోజూ శివుడిని ఆరాధించడం నిత్య శివరాత్రి. ప్రతి మాసంలో శుక్ల, బహుళ చతుర్దశి రోజున శివారాధన చేయడం పక్ష శివరాత్రి. 
  మాసంలో బహుళ చతుర్దశి రోజున దేవదేవుడిని అర్చించేది మాస శివరాత్రి.  అలాగే, మాఘ బహుళ చతుర్దశిని సర్వశ్రేష్ఠమైన మహా శివరాత్రిగా శివపురాణం పేర్కొంటోంది. సాధకుడు తన యోగమహాత్మ్యంతో యోగనిద్రకు ఉపక్రమించడాన్ని యోగ శివరాత్రి అంటారు. శివరాత్రి రోజున శివుడి అభిషేకం/శివారాధన అత్యంత పవిత్రమైనదిగా, ప్రాధాన్యతతో కూడినదిగా పురాణం/జ్యోతిష శాస్త్రం తెలియజేస్తున్నాయి. 
   శివుడు అభిషేక ప్రియుడు గనక మహా శివరాత్రి రోజు సాయంత్రం 6గంటల సమయం నుంచి అర్ధరాత్రి 2గంటల సమయం మధ్య చేసే రుద్రాభిషేకం, శివార్చనలు, బిల్వార్చనలు ఆయురారోగ్య ఐశ్వర్యప్రదం. 

లింగోద్భావంపై పురాణ గాథ..
   బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరు గొప్ప అనే వాదన ఏర్పడినప్పుడు.. ఆ సమయంలో ఈశ్వరుడు లింగరూపం ధరిస్తాడు. ఆ లింగానికి ఆది, అంత్యాలు కనుక్కోవాలని బ్రహ్మ, విష్ణువులకు చెబుతాడు.  విష్ణువు శ్వేత వరాహ రూపంలో ఆ మహాలింగం మూలం కనుగొనేందుకు ప్రయత్నిస్తాడు. ఆది తెలుసుకోలేకపోవడంతో అదే సమయంలో బ్రహ్మ శివులింగానికి పైభాగం వైపు వెళ్తాడు. అయితే, ఆయన ఆది ఎక్కడో తెలుసుకోలేకపోతాడు. ఆ సమయంలో బ్రహ్మకు కేతకి పుష్పం (మొగలిపువ్వు), గోవు దర్శనమిస్తాయి. మొగలి పువ్వు, గోవుకి తాను శివుడికి ఆది కనుగొన్నానని, దానికి సాక్ష్యం చెప్పాలని వాటికి చెప్పి వారితో శివుడి వద్ద సాక్ష్యం చెప్పిస్తాడు. 
శివుడు.. మహా విష్ణువు, బ్రహ్మ చెప్పిన విషయాన్ని గ్రహించి బ్రహ్మను, మొగలిపువ్వుని, గోమాతను శపిస్తాడు. బ్రహ్మదేవుడికి భూలోకంలో గుడి గానీ, పూజలు గానీ ఉండవని శపిస్తాడు. 
అలాగే,  మొగలిపువ్వుకి పూజార్హత ఉండదని.. గోవు ముఖంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పడం వల్ల గోముఖం చూడటం పాపంగా, గోపృష్ట భాగాన్ని చూస్తే పాపపరిహారంగా శపిస్తాడు. 
అలాగే, శ్రీ మహావిష్ణువు సత్యం పలకడం వల్ల ఆయనకు విశ్వవ్యాపకత్వం అనుగ్రహిస్తాడు. 
బ్రహ్మద్వారా సృష్టించిన ప్రాణికోటిని రక్షించే భారం, మోక్షమును ఇచ్చే అధికారం, మహా విష్ణువుకు ఇవ్వడం ఇవన్నీ శివలింగోద్భవ సమయంలో జరిగాయని కూర్మ, వాయు, శివ  పురాణాల్లో ఈ కథ కనపడుతుంది. బ్రహ్మ కూడా శివుడికి లింగరూపంలోనే ఉంటావని శపించడం ఈశ్వరుడికి మహాశివరాత్రి రోజు  శివలింగ అభిషేకానికి చేసే ప్రాధాన్యతను ఈ కథ తెలియజేస్తోంది.

   సనాతన ధర్మంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులందరికీ  ఒకే రూపమైనప్పటికీ శివరూపమే సనాతనం అని, ఇదే సకలరూపాలకు మూలమని శ్రీహరి, శివుని వామభాగం నుంచి, బ్రహ్మ దక్షిణ భాగం నుంచి ప్రకటితమైనట్టు శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ కాళరాత్రే శివరాత్రి!
  • - అంటే శివుడు, వ అంటే శక్తి అని శివ పదమణి మాల చెబుతోంది. 
  • శివ - అంటే శుభం, ఆనందం, మంగళం, కైవల్యం, శ్రేయం అని అర్థాలు. 
శివరాత్రివేళ అభిషేక ప్రియుడైన శివుడి పార్ధివ లింగాన్ని మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకంతో గానీ, నమకచమకాలతోగానీ పురుష సూక్తంతోగానీ ఎవరైతే పూజిస్తారో వాళ్లకు శివుడి అనుగ్రహం లభిస్తుంది. శివరాత్రి రోజు ఏ వ్యక్తి అయినా వారింట్లో ఉన్న శివలింగానికి లేదా బొటనవేలికి మించని ఓ శివలింగానికి (స్పటిక లింగమైనా/వెండి లింగమైనా) శివనామస్మరణ చేస్తూ పంచామృతములతో, బిల్వ పత్రాలతో ఎవరైతే అభిషేకిస్తారో, పూజిస్తారో వారి పాపాలు నశించి పుణ్యం ప్రాప్తించి శివానుగ్రహం కలుగుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి.  
  క్షీరసాగర మథన సమయంలో  నిప్పులు చిమ్ముతూ విషం బయటకు రావడం ఆ విషాన్ని శివుడు తన గరళం నందు నిలిపి ముల్లోకాలను కాపాడటం.. ఇలా కాపాడిన ఆ కాళరాత్రే శివరాత్రి అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి.

టెలిగ్రామ్‌లో తెలుగు-భారత్ ను అనుసరించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. ప్రతిరోజు మేము అందించే ఉత్తమ కథనాలను పొందండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top