యోగి వేమన - Yogi Vemana

0
యోగి వేమన - Yogi Vemana
వేమన పద్యాలు తెలుగు సాహిత్యవనంలో విరబూసిన రత్నాలహారాలు. వేమనయోగి పండిత లోకానికే పరిమితమైన 'వేదాంతము' ను అతి సామాన్య మానవునికి కూడా అందుబాటులో వుండేటట్లు స్వచ్ఛమైన అచ్చమైన తేనెలాంటి తేట తెలుగు పద్యాలలో వివరించిన మహానుభావుడు వేమన. తన భావాలను సూటిగాను, స్పష్టముగానుూ తన పద్యాల ద్వారా మృదుమధురమైన భాషలో విప్పి చెప్పినాడు. ఈ స్పష్టత ప్రాపంచిక విషయాలందు మరీ ఎక్కువ. కాని వేదాంత విషయం జటిలమైనది. కనుకనే ఈ జటిలత్వము వేమనయోగి చెప్పిన వేదాంత విషయ సంబంధమైన కందాది పద్యాలలో కూడా కనిపించుచున్నది. కొన్ని పద్యాలు ప్రపంచ విషయాలకు సంబంధించినట్టు కనిపించుచున్నప్పటికినీ, అవి వేదాంత విషయాలను ప్రకటపరచుచున్నట్టు సూక్ష్మదృష్టి కలవారికి తెలియబడును. 
   ప్రతి పద్యానికి ఆనాటి చారిత్రక, నైసర్గిక, సాంఘిక నైతిక, ఆర్థిక, రాజకీయ, మత వ్యవస్థలతో సంబంధం ముడిపడివుంది. అందువల్లనే ఒకే పద్యం అనేక కోణాలలో అనేక అర్థాలను ఇవ్వగలుగుతుంది. ఇందులకు ఈ క్రింది వేమన పద్యమే నిదర్శనము.

ఆ|| వేయు విధము లమర వేమన పద్యంబు
లర్ధ మిచ్చు వాని నరసి చూడ
చూడ జూడ గలుగు చోద్యమౌ జ్ఞానంబు
విశ్వడాభిరామ వినుర వేమ ||

వేమన మొదట అన్ని రకాల సాధనలు, యోగాలు చేసి నిజం తెలియలేక చివరకు అంభికా శివయోగి' అను గురువును చేరుకొని సేవించి, ఆతని నుండి ' అచల పరిపూర్ణ రాజయోగము' ను సంపూర్ణముగా గ్రహించినాడు. గురువ్యాజ్త ప్రకారం తాను తెలిసికొన్న యోగాన్ని ప్రజలందరకు తెలియజేయుటకు మేమన ఉద్యుక్తుడయ్యాడు. అందుకు సాధనంగా వేమన పద్యాన్ని ఎన్నుకున్నాడు.
  కనుక వేమన మొదట వేదాంతి. తదుపరి కవి. కనుక ఎవరైతే వేమన యొక్క సంపూర్ల వేదాంత వైఖరిని తెలిసికోగలరో, వారే వేమనయోగి పద్యాలకు సరియైన వ్యాఖ్యానాన్ని అందించగలరు ప్రతి పద్యానికి శబ్ద, శబ్దార్థ, లక్ష్య, లక్ష్యార్ఖాలు వుంటాయి. సంపూర్ణమైన విషయాన్ని తెలుసుకోగోరువాడు మొదట శబ్దమును విని, తర్వాత దాని అర్ఖమును గ్రహించి, ఆ తర్వాత లక్ష్యమును తెలిసికొని, అటు తర్వాత లక్షార్థమును సాధించవలెను. ఈ గమనమును సులభతరము చేయుటకు వేమన ప్రతీ పద్యంలో ఏదో ఒక ఉపమానాన్ని చాలా అందముగా ఉపయోగించాడు. ఆ ఉపమానాలన్నియు జన జీవన స్రవంతిలో నుండి పుట్టినవే. అవి సామాన్య మానవులకు అతి చేరువలో యుండుట వల్ల ఇంకనూ వారి నాలుకల్లో నాట్యమాడుచూనే వున్నాయి.

  ఇప్పటి వరకు వేమన యోగి పద్యాలకు సి.పి. బ్రౌన్ మొదలుకొని అనేక మంది వ్యాఖ్యానాలు వ్రాసారు. సి.పి.బ్రౌన్ కు వేమన యొక్క సంపూర్ణ వేదాంత స్వరూపము తెలియబడనప్పటికినీ ఎంతో శ్రమపడి తన సహచర పండితుల సమక్షంలో తర్జనభర్జనలు జరిపి, మూలం మీద గౌరవం వుంచి, విపరీతార్థాలకు పోకుండా వేమన పద్యాలకు లఘు వ్యాఖ్యలు ఆంగ్లంలో వ్రాసాడు మిగతావారు ఎక్కువ వరకు వేమన చెప్పిన నీతి పద్యాలనే ఏరుకొని, వాటికి చిలుక పలుకులు పలికినట్లు వ్యాఖ్యానాలు వ్రాసినారు. కాని వేమన కేవలం నీతి సూత్రాలను తన పద్యాలయందు వల్లించిన నీతిబోధకుడే కాడు. ఆతడు మొదట 'తత్వవేత్త' అని మరువరాదు. వేమన చెప్పిన కర్మ, భక్తి, జ్ఞాన, వైరాగ్య, తత్వ, ముముక్కశ్వ, యోగముల గూర్చి మనవారు అసలేపట్టించుకొనలేదు.

ఈ విషయంలో బ్రౌనే కొంతవరకు నయం. ఈతనికి నిజాయితీ ఎక్కువ. అందువల్లే తనకు ఆర్థంగాని కొన్ని పద్యపాదాలను వేమనకే వదలి పెట్టినాడు. ఇక దేశీయులు నీతి ఒక్కటే ముఖ్యం కాదని తెలిసికోవాల్సివుంది. అంటే నీతి అవసరం లేదని కాదు. నీతి అనగా నడక. ఏమీ తెలిసికోకుండా తాను సంఘంలో చాలా మంచిగా నడచుకొనుచున్నాననుకోవడం భ్రమ మాత్రమే. అందువల్ల మానవుడు ప్రాపంచిక ఫలాలను మాత్రమే పొందగలడు. కాని పారమార్థికమైన పురోగతిని సాధించలేడు. కాని వేమన లక్ష్యం ప్రాపంచిక పారమార్చికములందు అభివృద్ధిని సాధించుట. అందులకు మొదట గురువుచే తత్వవిచారణ చేసి పారమార్టికంగా అభివృద్ధిని సాధించవలెను. ఇది జ్ఞాన సంబంధమైనది. తదుపరి తాను తన గురువుచే గ్రహించిన జ్ఞానాన్ని ప్రాపంచిక విషయాలయందు ప్రవేశపెట్టి ఆచరణ (కర్మ) లో చూపవలెను. ఇది వాక్కునకు మరియు శరీరమునకు సంబంధించినది. ఈ రెండు విధములందు ఏకత్వమును చూపుటే భక్తి లేక 'యోగము'. ఇందులో మొదటిది తత్వజ్ఞానమునకు, రెండవది నీతికి సంబంధించినది.

కనుక తత్వజ్ఞానము లేని నీతి గ్రుడ్డిది. నీతిలేని తత్వజ్ఞానము కుంటిది. అందువలన ఇహపరసాధనమునకు ఈ రెండూ అత్యవసరమే. కనుక వేమన యోగి బోధించిన ‘వేదాంత తత్వజ్ఞానమును లోకమునకు ప్రకటపరచుచే ఈ నా వ్యాఖ్యానము యొక్క ప్రధానాశయము.

వేమన కాలం   
  వేమన జీవించియుండిన కాలానికి బలమైన చారిత్రక ఆధారాలేమీ లేవు. వేమన కాలన్నర్ణయానికి వేమన పద్యాలపై ఆధారపడటం తప్ప వేరే మార్గం లేదు. ఈ క్రింది వేమన పద్యము వేమనయోగి జనన కాలాన్ని సూచిస్తుంది. 
కం'' నందన సంత్సరమా
నందిత కార్తీక శుద్ధ పున్నమ నాడే
వింధ్యాద్రి సేతుబంధన
సందున నొక వీరుడేలు చాటర వేమా ||

  పై పద్యంలో వేమన జన్మించిన తేదీ అస్పస్టముగా తెలియబడుచున్నది. ఎందుకనగా ఈ పద్యంలో తిథిని సూచించడానికి కావలసిన సాధనాలు అన్నీ వున్ననూ, వారం మాత్రం తెలియబడుటలేదు. చివరి రెండు పాదాల్లో ఏమైనా గుప్తంగా వుందో ఏమో? కనుగొనాల్సి వుంది. నందన సంవత్సరం 60 సంవత్సరాలకు ఒక సారి వస్తుంది. కనుక వారం లేకుండా, ఏ నందన సంవత్సరమో తెలుసుకోవడం కష్టం.
  అయినను వేరొక విధంగా వేమన కాలాన్ని గుర్తించుటకు అవకాశం కలదు. వేమన ఆంధ్రదేశం అంతటా తిరిగి తన శిష్యులకు అచల బోధ చేసినట్టు కనపడుచున్నది. కనుక వారి శిష్యుల సాంప్రదాయం నందు ఏమైనా ఆధారం దొరకవచ్చును. పరిశోధించి చూడగా వేమన ' అచల సిద్ధాంతం' ను వ్యాప్తి చేసినట్టు తెలియబడింది. వేమన తర్వాత సుమారు 150 సం॥ ఈ అచల సిద్ధాంతం ఎక్కువగా వ్యాప్తిలో లేదు. ఆ తర్వాత క్రీ.శ. 1690 సం॥ న నల్లగొండ జిల్లాలోని నారాయణపురం అను గ్రామమునందు పుట్టిన శ్రీ శివరామదీక్షితులు వేమన సాంప్రదాయంనకు చెందినవాడే. కాని అప్పటికే వేమన గతించి దాదాపు 150 సం లు కావడం వల్ల వేమన శిష్యప్రశిష్యులచే గురుపరంపరగా వచ్చిన ఈ సిద్ధాంతమును వీరు శ్రీధరస్వామి ద్వారా పండరీపురం (మహారాష్ట్ర) నందు ఆమూలాగ్రముగ గ్రహించెను. అదివరకే శ్రీ శివరామదీక్షితుల వారు శతాధిక జ్ఞానయ్జ్ఞములను కాశీ మొదలుకొని అనేక ప్రాంతాలయందు నిర్వహించి గొప్ప కీర్తి ప్రతిష్ఠలు పొందియుండుట వల్ల నూతనంగా గ్రహించిన ఈ అచల సిద్ధాంతంను వ్యాప్తి చేయుటలో సఫలీకృతుడయ్యోను. 
  1712 నాటికి శ్రీ రామదుగు శివరామదీక్షితుల వారు ఈ అచల సిద్దాంతంనకు నిర్లుప్టమైన స్వరూపమునునిర్ణయించును ఈ సిద్దాంత గ్రంథాలను వ్రాసిపెట్టెను. ఈ గ్రంథాలలో వేమన ఉపయోగించిన బయలు, ఎరుక, పరిపూర్ణ బ్రహ్మము, బట్టబయలు మొదలగు పదాలు కనిపించుచున్నవి. ఆనాటికి వేమన పద్యాల సంకలనాలు వెలువడలేదు. వేమన శిష్యులు వేమన పద్యాలను తమ వద్దే వ్రాసిపెట్టుకొని యుండుటవల్లనూ మరియు అవి వారసత్వ సంపదగా వారిపోవుటవల్లనూ శ్రీ శివరానుదీక్షితులవారు వాటిని తమ గ్రంథాలలో వుటంకించుటకు దొరకకపోయి వుండవచ్చును.
   ఏమైననూ ఆ కాలంలో నీతి సంబంధమైన పద్యాలే ఎక్కువ గా ప్రజల నాలుకల్లో ఆడుచుండవచ్చును. కాని జటిలమైన వేదాంత విషయాలను చెప్పే పద్యాలు తాళ ప్రతుల్లోనే దాగియుండెననవచ్చును. శ్రీ శివరామదీక్షితుల వారు సుమారు 1690 నుండి 1791 సంవత్సరాల మధ్య జీవించియున్నారు. శ్రీ డా|| బి. రామరాజు గారు వ్రాసిన ఆంధ్రయోగులు, రెండవ భాగములో శ్రీ శివరామదీక్షితుల సంగ్రహ చరిత్ర మరియు వారి కాలము పై విధముగా తెలిపియున్నారు.
   దీక్షితులవారు వంద సంవత్సరాల కంటె ఎక్కువ రోజులు బ్రతికారని జనవాక్యము. కనుక ఒక వేళ వేమన 1600-1700 సం॥ల మధ్య జీవించివుంటే శ్రీ శివరామదీక్షితులవారు వేమనను గూర్చి తప్పనిసరిగా తమ గ్రంథాలలో వివరంగా పేర్కొనివుండే వారు. మరియు శ్రీ శివరామదీక్షితుల వారు వారి గ్రంథంలో వేమన గూర్చి ఒక ప్రార్థనా శ్లోకంతో మాత్రమే సరిపెట్టేవాడు కాదు. కనుక వేమన శివరామదీక్షితుల కంటె సుమారు రెండు వందల సంవత్సరాల ముందు పుట్టినవాడై యుండి వుండాలి. అదే నిజమైతే వేమన 14 72(నందన సంవత్సరం)లోనైనా లేక 1412 (నందన సంవత్సరం)లోనైనా జనించియుండవలెను.

    అదియునుగాక 1590-1620 సం||లకు చెందిన యెల్లనార్యుడు రచించిన 'తొభ్య చరిత్రము' నందు వేమన స్తుతించబడుటచేతను, వేమన తన పద్యాలలో రాయని భాస్కరుని, ముత్తయ మంత్రిని పొగుడుట చేతనూ, శివయోగీంద్రుడు, తురగా రామకవి, ప్రసన్నాంజనేయ శతక కర్త అయిన నరసింహదాసు మొదలైన కవులచే మేమన కీర్తించబడుట చేతనూ, వేమన కాలము 1412-1570 సం॥|ల మధ్య కాలముగా నిర్ణయింప వీలుంది. కనుక వేమన ఖచ్చితంగా 1600-1750ల మధ్య కాలంలో యున్నవాడు కాడని చెప్పవచ్చును. 1712-1791 కాలంలో శివరామదీక్షితుల వారు అచలయోగాన్ని ఆంధ్ర దేశంలో బాగా వ్యాప్తిలోకి తీసుక వచ్చారు కనుక వేమన, శివరామదీక్షితులు సమకాలికులు కారని తెలియబడుచున్నది. దీనికి ఈ క్రింది శ్లోకాలే నిదర్శనం:

శ్లో|| అంభికా శివయోగీశం వేమనయోగి సద్గురుం
నిరంజన వెంకయార్యం తిరువెంగళహంభజే  ||

శ్లో|| శ్రీధరస్వామి యోగీంద్రం శివరామాఖ్య దీక్షితం
కంబాలూరి అప్పబ్రహ్మం సద్గురుభ్యో నమో నమః

   పై శ్లోకాలు శ్రీ శివరామదీక్షితులు వ్రాసిన 'బృహద్వాశిష్ఠం' అను గ్రంథం నుండి తీసుకోబడినవి కనుక శిష్య పరంపర ఈ విధంగా తెలియబడుచ్నుది. అంభికా శివయోగి శిష్యుడు వేమన. వేమ తిరువెంగళాచార్యుడు. ఈతని శిష్యుడు శ్రీధరస్వామి. ఈతని శిష్యుడు శివరామదీక్షితులు. కాని శ్రీ శివరామదీక్షితులు 1690-1791 ల మధ్య కాలంలో జీవించి వున్నాడు. కనీసం ఒక్కొక్క తరానికి 50 సం||ల అంతరం వుండి వుండవచ్చును. కనుక వేమన సుమారు 200 సంవత్సరాలు శివరామదీక్షితుల కంటె ముందటివాడు. నిరంతర పరిశోధనాశీలియైన బ్రౌన్ చివరిసారిగా 1839 లో 'మేమన పద్యములు' అనే పుస్తకమలి ముద్రణకు చేర్చిన మలి పీరికలో వేమన పద్యాలు పూర్తి నాలుగు వందల యేళ్ళ ముందు నాటివైనట్లు భావింపబడుతున్నాయని వ్రాసాడు. కనుక వేమన జీవించిన కాలము క్రీ.శ. 1412 - 1570 సం॥ ల మధ్యన వుండెనని నిర్ణయించవచ్చును.

వేమన ప్రాంతము
  వేమన దేశసంచారం చేస్తూ తన సిద్ధాంతాన్ని దక్షిణ భారతదేశం అంతటా బోధించి యున్నాడు కాని ఆతని స్వగ్రామం మాత్రం ఖచ్చితంగా తెలియబడుటలేదు. అయిననూ వేమన పద్యాలలోని పదసమూహమును, మాండలికాలను పరిశీలించగా వేమన రాయలసీమ ప్రాంతంనకు చెంది వుండవచ్చునని చెప్పవచ్చును. కొండరు పరిశోధకులు వేమన నివాస స్థలమును ఈ క్రింది పద్యం సూచిస్తుందనుకొన్నారు

ఆ|| ఊరు కొండవీడు ఉనికి పశ్చిమ వీధి
మూగ చింతపల్లె మొదటి వీడు
అరశి చూడ బయలు అది ముక్తి శివుడయా
విశ్వదాభిరామ వినుర వేమ ||

..ఇదే పద్యం వేరే ప్రతులలో పాఠభేదాలతో

ఆ| ఊరు కొండపల్లె ఉనికి పశ్చిమ వీధి
మూక చింతపల్లె మొదల యిల్లు
ఆత్మ రాక పోక అదియే పో తత్వంబు
విశ్వదాభిరామ వినుర వేమ ||

ఆ||  ఊరు కొండవీడు ఉనికి పశ్చిమ వీధి
మూగ చింతపల్లె మొదటివీడు
అరశి చూడ బయలు ఆడనే శివుడుండు
విశ్వదాభిరామ వినుర వేమ ||

కానీ ఈ పద్యం వారనుకొన్నట్టు కవియొక్క ప్రాంతంను సూచించదు. ఎందుకనగా ఈ పద్యంలో విషయం మూడవ పాదంలో వుంది. దానిని వివరించుటకు పై రెండు పాదాలు ఉపయోగపడినాయి. తప్ప, కవి యొక్క ఊరు పేరు తెలిపే అవకాశం లేదక్కడ. ఆందువల్ల బ్రౌన్కూ డా వేదాంత సంబంధమైన వ్యాఖ్యానాన్ని మాత్రమే ఈ పద్యానికి వ్రాసియున్నాడ.

పై పద్యానికి బ్రౌన్ వ్యాఖ్యానం ఇలా వుంది. "The village of our body in which the deity dwells is Hill Town (the head); his is in back street (the spine). There in silence is the first house. We gaze and continually view it, this is the road of beatitude".
  అచల సిద్దాంతంననుసరించి ఈ పద్యానికి అర్థం: మహాకాశమే కొండ, దాని పరిణామమే పంచభూతాలు. ఈ పంచభూతాలేపల్చిమ (స్టూల) వీధి. చింతలకెల్ల నిలయమైన సమిష్ఠి మనస్సే మొదటి ఇల్లు. ఇది తెలిసికొన్నచో ఆత్మయొక్క రాకపోకలు తెలియబడగలవు. కనుక ఈ పద్యాన్ని బట్టి వేమన ప్రాంతాన్ని చెప్పలేము.
   ఏది ఏమైనప్పటికినీ వేమన పద్యాలలోని పద ప్రయోగాలను బట్టి వేమన రాయలసీమ ప్రాంతంనకు చెందియుండవచ్చునని నిర్ణయించవచ్చును.

వేమన కుటుంబం, కులం, విద్యాభ్యాసం
  వేమన సామాన్య రైతు కుటుంబంలో జన్మించి యుండవచ్చును. వీరి వృత్తి వ్యవసాయం అయివుండవచ్చును. వీరు కాపు కులానికి చెంది యుండవచ్చును. దీనికి రుజువు ఈ క్రింది వేమన పద్యమే:

ఆ|| కలియుగమున నున్న కాపు కులానకు
వేమన దన కీర్తి విక్రయించే
నున్న ధర్మమెల్ల నుర్విలో నరులకు
కోరు బెట్టె పరము గోరి వేమ ||

   వేమనది రాజకుంటుంబం మాత్రం కాదు. కాని రాజులయొక్క అండదండలు వేమనకు వున్నట్టున్నాయి. కనుకనే వేమన తన భావాలను నిర్భయంగా ప్రజలకు బోధించుటయేగాక  హిందూ సాంప్రదాయంలోని దురాచాలను ఖండించాడు. వేమనయోగి తన గ్రామమందే గురువుద్వారా అక్షరాఖ్యాసం కావించినట్టున్నాడు. సంస్కృత పండితుడు కాకపోయినప్పటికీనీ, వేమనయోగి ఆ భాషను అర్థము చేసికొనిన సమర్థుడని చెప్పవచ్చును. 

వేమనకి చిన్నప్పటినుండే పద్యరచన అలవడినట్లుంది. అచలమును ' అంభికా శివయోగి' ద్వారా తెలిసికొన్న తర్వాత ఆ పద్యరచననే అచలయోగ ప్రచారమునకు ఆయుధముగా వాడుకొన్నాడు. మేమన కేవలం ఆటవెలదులను మాత్రమే చెప్పాడని కొందరి నమ్మకం. అది నిజం కాదు. ఎట్టులనగా తాళప్రతుల యందు అక్కడక్కడ ఆటవెలదులతో ఇతర పద్యాలు కూడా ఎక్కువ సంఖ్యలోనే వుండివున్నాయి. కనుక లేఖకులు వాటిని చొప్పించారనుకోవటం పారపాటే. 

వేమన వేదాంత విషయాలను చెప్పుటకు కందాలను, తేటగీతులను ఎక్కువగా ఎన్నుకొన్నాడు. ఆటవెలదులను ఎక్కువగా లోక సంబంధమైన పద్యాలకు ఎన్నుకొన్నాడు.  వేమన చెప్పిన కంద, తేటగీతి పద్యాల భావములు మతవాదుల చట్రములలో ఇమడక పోవుటవల్లనూ, వాటి నిగూఢ భావములు వారికి అంతుచిక్కక పోవుటవల్లనూ, ఆ పద్యాలు వేమన చెప్పినవి కావని వారు భావించుచున్నారు. కాని బ్రౌన్ కందాది పద్యాలు వేమనవి కావని అంగీకరించలేదు. కనుకనే వాటిని ఉన్నవున్నట్లు తన సంకలన గ్రంథంలో ప్రచురించియున్నాడు. ఎట్టులైననూ అచటచట కొన్ని పద్యములు మాత్రమే లేఖకులు స్వయంగా వ్రాసినట్లున్నారు. వాటిని తొలగించాల్సిన పని అచల సిద్దాంతం తెలిసినవారి భుజస్కంధములపైన వున్నది. 
   ఈ గ్రంథంనందు ప్రక్తిస్తములను వదలి, వేమన స్వయంగా చెప్పిన పద్యాలనే ఏరుకోవడం జరిగింది. వేమన యుక్త వయస్సులో వేశ్యాలోలుడని లోకములో ఒక వాడుక కలదు. ఇందులో ఎంతమాత్రం నిజం లేదు. ఎందుకనగా అసలు వేమన చరిత్ర గూర్చి రవ్వంతైననూ ఖచ్చితంగా తెలియుటలేదు. ఇకవేమన చెప్పిన కొన్ని పద్యాలు ఆ కాలంనాటి వేశ్యా లోలతను నిరసించాయి. వాటి ఆధారంగా కొందరు వేమనను వేశ్వాలోలుడిగా చిత్రీకరించారే తప్ప, వారికి నిజము తెలిసికాదు. నిజానికి వేమనయోగి తన కాలంలో ఎనలేని క్ర్తి ప్రతిష్ఠలు పొందుట వల్ల, తదుపరి కాలంలో కొందరు బూటకపు వేమనలు తయారయ్యారు. ఈ వేమన వేషధారుల్లో ఎవరికైనా
ఒకరికి వేశ్యాలోలత యుండి యుండవచ్చును.

వేమన శతకం - వేమన పద్యాలు - Vemana Padyalu

పద్యము భావం
1. వేచిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచమైన నదియు గొదవుగాదు విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: మంచి మనసుతొ చేసిన చిన్న పనియైన మంచి ఫలితాన్నిస్తుంది. పెద్ద మర్రిచెట్టుకి కూడ విత్తనము చిన్నదేకదా!
2. ఉప్పుగప్పురంబు న్రొక్కపోలికనుండు చూడచూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులువేరయ విశ్వదాభిరామ వినుర వేమ! భావం: ఉప్పూ,కర్పూరం రెండూ చూడటానికి ఒకేలా ఉంటాయి.కానీ వాటి రుచులు మాత్రం వేరు వేరు.అలాగే పురుషుల్లో పుణ్యపురుషులు వేరుగా ఉంటా..
3. గంగిగోవు పాలు గరిటడైనను చాలు కడివెడైన నేల ఖరముపాలు భక్తికలుగు కూడు పట్టెడైననుజాలు విశ్వదాభిరామ వినుర వేమ. భావం: కడవ నిండా ఉన్న గాడిద పాలు కంటే చక్కని ఆవు పాలు ఒక్క గరిటెడు ఉన్నా సరిపోతుంది.
4. ఆత్మశుద్ధి లేని యాచారమది యేల భాండశుద్ధి లేని పాకమేల? చిత్తశుద్దిలేని శివపూజలేలరా? విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: మనసు నిర్మలముగా లేనట్లయితే ఆచారములు పాతించతంవల్ల ప్రయోజనం లేదు. పాత్రలు శుభ్రముగాలేని వంట, మనసు స్థిరముగా లేని శివ పూజ వ్యర్థములే అవుతాయి. ఏమీ ప్రయోజనముండదు.
5. గంగిగోవుపాలు గరిటెడైనను చాలు కడివెడైన నేమి ఖరము పాలు భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: కడివెడు గాడిదపాలకంటె గరిటెడు ఆవుపాలు మేలును కలిగించును. భక్తితో పెట్టిన కూడు పట్టెడు అయినప్పటికి తృప్తిని కలిగిస్తుంది.
6. నిక్క మైన మంచినీల మొక్కటి చాల తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల? చాటుపద్యములను చాలదా ఒక్కటి విశ్వదాభిరామ! వినుర వేమ భావం: తట్టెడు గులకరాళ్ళ కంటె ఒకమంచి నీలము శ్రేష్ఠము. అదే విధముగ వ్యర్ధమైన పద్యముల వంటె ఒక చక్కని చాటు పద్యము శ్రేష్ఠమవుతుంది.
7. మిరపగింజచూడ మీద నల్లగనుండు కొరికిచూడు లోనచురుకు మనును సజ్జను లగునారి సారమిట్లుండురా విశ్వదాభిరామ! వినురవేమ! భావం: మిరియపుగింజ మీద నల్లగానుప్పటికి దానిని కొరికిన వెంటనే చురుక్కుమంటుంది. మంచి వారు పైకి ఏవిధముగా కనిపించినప్పటికీ అతనిని జాగ్రత్తగా గమనించినచో అసలు విషయము బయటపడుతుంది.
8. మృగమదంబు చూడ మీఁద నల్లగనుండు బరిఢవిల్లు దాని పరిమళంబు గురువులైన వారి గుణము లీలాగురా విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: కస్తూరి చూడటానికి నల్లగా ఉన్నప్పతికి దాని సువాసన నాలుగు దిక్కులకు వెదజల్లునట్లు పెద్దలైన వారు బయటికి ఆడంబరముగ కనపడక గొప్ప గుణములు కలవారై ఉండురు.
9. మేడిపండు చూడ మేలిమై యుండు పొట్టవిప్పి చూడ పురుగులుండు బిరికి వాని మదిని బింకమీలాగురా విశ్వ దాభిరామ! వినుర వేమ! భావం: అత్తిపండు పైకందముగా కనపడుతుంది. దానిలొపల పురుగులుంటాయి. అదే విధముగ పిరికి వాని ధేర్యము కూడ పైన పటారము లొన లొటారముగ ఉంటుంది.
10. నేర నన్నవాఁడు నెరజాణ మహిలోన నేర్తునన్న వాఁడు నింద జెందు ఊరుకున్న వాఁడె యుత్తమయోగిరా విశ్వదాభిరామ! వినురవేమ! భావం: తనను ఏమీ రాదు అని చెప్పుకొనే వాడు నిజముగా తేలివైనవాడు. అన్నీ వచ్చుటకు చెప్పువాడు గౌరవాన్ని పొందలేడు. మౌనముగానున్నవాడే ఉత్తమ యౌగి అనిపించుకొంటాడు.
11. గంగ పాఱు నెపుడు కదలని గతితోడ ముఱికి వాగు పాఱు మ్రోఁతతోడ పెద్ద పిన్నతనము పేరిమి యీలాగు విశ్వదాభిరామ! వినురవేమ! భావం: గొప్పదైన గంగానది కూడ ప్రశాంతంగా ప్రవహిస్తుంది. చిన్నదైన మురికి కాలువ పెద్ద శబ్ధం చేస్తూ ప్రవహిస్తుంది. గొప్పవారికి, నీచునికి ఈ రకమైన భేదమే ఉన్నది.
12. నిండునదులు పారు నిల్చి గంభీరమై వెఱ్ఱివాగు పాఱు వేగబొర్లి అల్పుడాడు రీతి నధికుండు నాడునా విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: ఓ వేమా ! నీటితో నిండియున్న నదులు గంభీరముగ నిల్లిచి ప్రవహించుచుండును. చిన్న సెలయేరులు పైకి పొర్లి వేగముగ ప్రవహించుచుండును. చెడ్డగుణములు గలవారు మాటలాడినంతటి తొందరగా, మంచిగుణములు గలవారు మాట్లాడరు.
13. అల్పుడెపుడు పల్కు నాడంబరము గాను సజ్జనుండు బల్కు చల్లగాను కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా విశ్వ దాభిరామ! వినుర వేమ! భావం: ప్రపంచములొ ఉన్న జనులకు ప్రియమైన పలుకులతో ఆనందము కలిగించు వేమనా! అల్పుడు శాంతముతో మాట్లాడతాడు. కంఛు ధ్వని చేసినట్లుగా బంగాము ధ్వని చేయదుకదా! అల్పుడు కంచుతోనూ, సజ్జనుడు బంగారముతోనూ సమానము.
14. కులము లోన నొకడు గుణవంతుడుండిన కులము వెలయు వాని గుణము చేత వెలయు వనములోన మలయజంబున్నట్లు విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: కులములో ఒక వ్యక్తి గుణవంతుడన్నట్లయితే ఆ కులమంతా అతనివలన గౌరవాన్ని పొందుతుంది. వనములో ఒక్క మంచి గంధపు చెట్టు ఉన్నప్పటికీ ఆ వనమంతా వాసన వెదజల్లుతుంది.
15. పూజకన్న నెంచ బుద్ధి నిదానంబు మాటకన్న నెంచ మనసు దృఢము కులముకన్న మిగుల గుణము ప్రధానంబు విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: పూజపునస్కారముల కంటె బుద్ధి ప్రధానము. మాటకంటె మనసు ప్రధానము. కులముకంటె గుణము ప్రధానము.
16. ఉత్తముని కడుపున నోగు జన్మించిన వాఁడె చెఱకు వాని వంశమెల్లఁ జెఱకు వెన్నుపుట్టి చెరపదా! తీపెల్ల విశ్వదాభిరామ! వినురవేమ! భావం: చెరకు మొక్క చివర కంకిపుట్టి చెరకు యొక్క తీపిని చెరచునట్లుగా, ఉత్తమ వంశములో దుష్టుడు పుట్టిన ఆ వంశము యొక్క గౌరవము నశించును.
17. కులములోన నొకఁడు గుణహీనుఁడుండిన కులము చెడును కాని గుణము వలన వెలయు జెఱకునందు వెన్ను వెడలి నట్లు విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: చెరకు గడకు చివర వెన్నులడితే చప్పబారినట్లుగా గుణహీనుడైనవ్యక్తి వలన ఆ కులమంతా చెడిపోవును.
18. రాముఁడొకఁడు పుట్టి రవికుల మీడేర్చె కురుపతి జనియించి కులముఁ జెఱచె ఇలనుఁ బుణ్యపాప మీలాగు గాదొకో విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: రాముని పుట్టుకతో రఘువంశము ఉద్ధరింపబడింది. దుర్యోధనుని పుట్టుకతో కురువంశము నశించింది. ప్రపంచములో పుణ్య పాపములు విధముగానే ఉంటాయి.
19. హీనగుణమువాని నిలుజేరనిచ్చిన నెంతవానికైన నిడుము గలుగు ఈఁగ కడుఁపు జొచ్చి యిట్టట్టు సేయదా విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: నీచుణ్ణి ఇంటిలో పెట్టిన ఎటువంటి వానికైన కష్టము కలుగుతుంది. ఈగ కడుపులోకి వెళితె వికారమును కలిగిస్తుంది.
20.వేరుపురుగుచేరి వృక్షంబుజెఱచుఁను చీడ పురుగు జేరి చెట్టుఁజెఱచుఁ కుత్సితుండు చేరి గుణవంతుఁజెఱచురా విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: వేరువురుగు పెద్ద వృక్షాన్ని పాడుచేస్తుంది. చీడ పురుగు చిన్న చెట్టుని నశింపజేస్తుంది. చెడ్డవాడు గుణవంతుని చేరి అతన్ని నాశనము చేస్తాడు.
21. హీనుఁడెన్ని విద్యలు నేర్చినఁగాని ఘనుఁడుఁగాడు హీనజనుఁడె కాని పరిమళములు మోయ ఖరము తా గజమౌనె విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: నీచుడైన వ్యక్తి ఎంత చదువు చదివినా అతడు గొప్పవాడుకాలేడు. సుగంధ ద్రవ్యములు మోసినంత మాత్రాన గాడిద ఏనుగు కాలేదు.
22. విద్యలేనివాడు విద్వాంసు చేరువ నుండగానె పండితుండు గాడు కొలని హంసలకడ గొక్కెర లున్నట్లు విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: హంసలతో కలిసినంత మాత్రమున కొంగమారనట్లుగా, పండితులతో కలిసినప్పటికి మూర్ఖుడు మారడు.
23. అల్పజాతి వాని కధికార మిచ్చిన దొడ్డవారినెల్ల తొలగగొట్టు చెప్పు తినెడు కుక్క చెరకు తీపెరుగునా? విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: దుష్టునకు అధికారము నిచ్చిన యెడల మంచి వారందరినీ వెడల కొట్టును. చెప్పుతినెడి కుక్క, చెరకుతీపియేరుగదు.
24. అల్పుఁ డైన వాని కధిక భాగ్యము గల్గ దొడ్డవారి దిట్టి తొలగఁ గొట్టు అల్పబుద్ధి వా డధికుల నెఱఁగునా విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: మూర్ణునికి సంపదగలిగినట్లయితే పెద్ద వారినందరిని తిరస్కరించి తిరుగుతాడు. అల్పుడైన వానికి గొప్ప వారి యొక్క శక్తి గురించి ఏమి తెలుస్తుంది.
25. ఎద్దుకైనఁగాని యేడాది తెల్పిన మాట దెలసి నడచు మర్మ మెఱిఁగి మొప్పె తెలియలేడు ముప్పదేండ్లకునైన విశ్వదాభిరామ! వినురవేమ! భావం: ఒక సంవత్సరముపాటు బోధించినట్లెతే ఎద్దుకూడ మర్మములను తెలిసికొని నడుచుకుంటుంది. కాని ముప్ప్తె సంవత్సరాల నేర్పినప్పటికీ మూర్ఖుడు తెలిసికొనలేడు.
26. ఎలుకతోలుఁదెచ్చి యేడాది యుతికిన నలుపు నలుపేగాని తెలుపురాదు కొయ్యబొమ్మను దెచ్చి కొట్టినఁ బలుకునా విశ్వదాభిరామ! వినురవేమ! భావం: ఎలుక తోలు ఎంతసేపు ఉతికినప్పటికీ అది తెలుపుగా మారదు. కర్ర్తో చేసిన బొమ్మ ఎంత కొట్టినప్పటికీ మాట్లడదు.
27. పాము కన్న లేదు పాపిష్టి జీవంబు అట్టి పాము చెప్పినట్లు వినును ఖలుని గుణము మాన్పు ఘను లెవ్వరును లేరు విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: పామువంటి పాపిష్టి జీవికూడ ఏదైన చెఊఇన వింటుంది కాని మూర్ఖునికి ఎంత చెప్పిన అతని గుణము మారదు.
28. వేము పాలువోసి ప్రేమతో బెంచిన చేదువిరిగి తీపజెందబోదు ఓగు నోగెగాక యుచితజ్ఞు డెటులౌను విశ్వదాభిరామ! వినురవేమ! భావం: వేప చెట్టుకి పాలు పోసి పెంచినప్పటికి చేస్దు విరిగి తీపెక్కదు. అదే విధంగా చెడ్డవాడు చెడ్డవాడే కాని మంచివాడు కాలేడు.
29. ముష్టి వేపచెట్లు మొదలంట ప్రజలకు పరగ మూలికకుఁ బనికివచ్చు నిర్దయాత్మకుండు నీచుఁడెందునకౌను విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: ఎంత పంచదార పోసి వండినప్పటికి పాపరపండ్లలో తీపి ఎక్కడు. అదే విధముగ దోష్టులకు మంచి గుణము అలవడదు.
30. పాలు పంచదార పాపర పండ్లలోఁ జాలఁబోసి వండఁ జవికిరావు కుటిల మానవులకు గుణమేల కల్గురా విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: ఎంత పంచదార పోసి వండినప్పటికి పాపరపండ్లలో తీపి ఎక్కడు. అదే విధముగ దోప్పులకు మంచి గుణము అలవడదు.
31. పాల నీడిగింట గ్రోలుచునుండెనా మనుజులెల్లఁగూడి మద్యమండ్రు నిలువఁదగని చోట నిలువ నిందలు వచ్చు విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: ఈడిగవాని ఇంటిలో పాలు తగినా అవి మద్యమని లోకులు భావిస్తారు. నిలువ గూడని స్థలములో నిలిస్తే అపకీర్తి కలుగుతుంది.
32. కానివాతోడఁ గలసి మెలఁగుచున్నఁ గానివానిగానె కాంతు రవని తాటి క్రింద పాలు ద్రాగిన చందమౌ విశ్వదాభిరామ! వినుర వేమ! 30 భావం: పనికిరానివానితో తిరిగిన వారిని అందరూ పనికిరానివానిగానే చూస్తారు. తాటిచెట్టు కింద పాలు త్రాగినప్పటికి కల్లు త్రాగినట్లుగానే అందరూ భావిస్తారు.
33. తామసించి చేయఁదగ దెట్టికార్యంబు వేగిరింప నదియు విషమెయగును పచ్చికాయదెచ్చి బడవేయ ఫలమౌన ? విశ్వదాభిరామ! వినురవేమ! భావం: కోపముతో ఏపనీ చేయకూడదు. అలా చేసినట్లై ఆపని జరగదు. వ్యతిరేకంగా కూడ జరుగుతుంది. పచ్చికాయనుతెచ్చి మూసలో వేసినంత మాత్రాన అది పండు కాదుగదా!
34. కోపమునను ఘనత కొంచమైపోవును కోపమును మిగులఁగోడు గలుగుఁ గోపమడచెనేని గోర్కెలునీడేరు విశ్వదాభిరామ! వినురవేమ! భావం: కోపము వలన గొప్పతనము నశించటమే గాక దుఃఖము కలుగుతుంది. కోపమును తగ్గించుకొన్న యెడల అన్ని కోరికలు ఫలిస్తాయి.
35. నీళ్ళలోన మొసలి నిగిడి యేనుఁగు దీయు బయట కుక్కచేత భంగపడును స్థానబలిమిగాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: నీటిలో నున్నపుడు మొసలి ఏనుగును కూడ జయింస్తుంది. కాని బయట కుక్కను కూడ ఏమి చేయలేదు. అది స్థానమహిమేకాని తనమహిమకాదు.
36. నీళ్ళలోన మీను నిగిడి దూరముపారు బైట మూరుడైన బారలేదు స్ధానబల్మిగాని తనబల్మి కాదయా విశ్వదాభిరామ! వినురవేమ! భావం: నీటిలో స్వేచ్చగ సంచరించే చేప భూమి మీదకు రాగానే చనిపోతుంది. అదిస్థాన మహిమకాని తనమహిమ మాత్రం కాదుకదా!
37. నీళ్ళమీదనోడ తిన్నగఁబ్రాకు బైట మూరుడై బారలేదు నెలవు దప్పుచోట నేర్పరి కొఱగాడు విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: నీటిమీద ఏ ఆటంకము లేకుండ తిరిగి ఓడ భూమి పై ఒక మూరెడు కూడ వెళ్ళలేదు. ఎంత నేర్పరి అయినప్పటికీ తన స్థానము మారిన పనికి రాని వాడవుతాడు.
38. కులము లేని వాడు కలిమిచే వెలయును కలిమిలేనివాని కులము దిగును కులముకన్న భువిని కలిమి ఎక్కువ సుమీ విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: తక్కువ కులము వాడైనప్పటికి ధనమున్నట్లయితే అతడు గౌరవాన్ని పొందును. ధనము లేనట్లయితే ఉన్నత కులస్థుడు కూడ రాణింపదు. కాబట్టి కాలముకంటే ధనము ఎక్కువ.
39. కులము గలుగువాఁడు గోత్రంబు గలవాఁడు విద్యచేత విఱ్ఱవీగువాఁడు పసిడి గలుగువాని బానిస కొడుకులు విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: మంచి కులము గలవాడు , మంచి గోత్రముకలవాడు, చదువు కలిగిన వాడు బంగారము గలవానికి బానిసలవు అవుతారు. లోకములో ధనమే ప్రధానము.
40. కనియు గానలేఁడు కదలింపఁడా నోరు వినియు వినగలేడు విస్మయమున సంపద గలవాని సన్నిపాతంబిది విశ్వదాభిరామ! వినురవేమ! భావం: ధనమున్నవాడు సన్నిపాత రోగం వచ్చిన వచ్చినవలె ఎవరైన తనని చూచిన చూడనట్లుగా , వినినప్పటికీ విననట్లుగా నటిస్తాడు.
41. ఏమి గొంచువచ్చె నేమితాఁ గొనిపోవుఁ బుట్టువేళ నరుడు గిట్టువేళ ధనము లెచటికేగు దానెచ్చటికినేగు విశ్వదాభిరామ! వినురవేమ! భావం: మనిషి పుట్టీంపుడు తన కూడ తీసికొని రాలేదు. చనిపోయినప్పుదు కూద ఏమి తీసికొని వెళ్ళలేడు తానెక్కదికిపోతడో, సంపదలు ఎక్కడికి పోతాయో తెలియక లోభియై గర్వించటం వ్యర్ధము.
42. తనువ దెవరి సొమ్ము తనదని పోషించి ద్రవ్య మెవరిసొమ్ము దాచుకొన cగ ప్రాణ మెవరిసొమ్ము పారిపోవక నిల్వ విశ్వదాభిరామ! వినుర వేమ! 40 భావం: తనస్వంతమని పోషించుటకు ఈ సరీరము ఎవరిదీకాదు. దాచినపెట్టుటకు ధనము ఎవరిదీకాదు. పారిపోకుండ నిలుచుటకు ఈ ప్రాణము ఎవరిదీకాదు. ఇవి ఏమియు శాశ్వతములు కావు.
43. గొడ్డుటావు బదుక గుండ గొంపోయిన పాలనీక తన్ను పండ్లురాల లోభివాని నడుగ లాభంబు లేదయా విశ్వదాభిరామ! వినురవేమ! భావం: గొడ్డు బోతైన ఆవు దగ్గరకి పాలుపితకటానికి కుండను తీసికొనివెళ్తే పండ్లు రాలేటట్టు తన్నుతుంది కాని పాలు ఇవ్వదు అదే విధముగా లోభిని యాచించటం కూడ వ్యర్థము.
44. మేక కుతికబట్టి మెడచన్ను గుడవంగ ఆఁకలేల మాను ఆశగాక లోభివాని నడుగ లాభంబు లేదయా విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: మేక మెడకిందనున్న చన్నులను కుడిచిన పాలు దొరకవు. ఇదే రీతిగాలోభిని యాచించిన ప్రయోజనముండదు.
45. పెట్టిపోయలేని వట్టి నరులు భూమిఁ పుట్టనేమి వారు గిట్టనేమి పుట్టలోనఁ జెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: ఎదుతి వారికి సహాయము చేయనివాడు పుట్టినా చచ్చినా ఒకటే. పుట్టలో చెదలు పుట్టినా , చచ్చినా ఒకటే కదా!
46. ఆశచేత మనుజు లాయువు గలనాళ్ళు తిరుగుచుండ్రు భ్రమను ద్రిప్పలేక మురికి భాండమందు ముసుగు నీగల భంగి విశ్వదాభిరామ! వినురవేమ! భావం: ఆయువు ఉన్నంత కాలము మనుష్యులు ఆశ వదలలేక కాలము గడుపుచుందురు. మురికి కుండలో ఈగలు ముసిరినట్లే వారు సంచరించుదురు.
47. నీళ్ళలోని చేప నెరి మాంస మాశకు గాల మందు చిక్కి గూలినట్లు ఆశ బుట్టి మనుజు డారీతి చెడిపోవు విశ్వదాభిరామ! వినురవేమ! భావం: నీళ్ళలోని చేప నెరి మాంస మాశకు గాల మందు చిక్కి గూలినట్లు ఆశ బుట్టి మనుజు డారీతి చెడిపోవు విశ్వదాభిరామ! వినురవేమ
48. ఆశ పాపజాతి యన్నింటికంటెను ఆశచేత యతులు మోసపోరె చూచి విడుచువారె శుద్ధాత్ములెందైన విశ్వదాభిరామ! వినురవేమ! భావం: ఆశ చాలా పాపమయినది. అశచే మునులు సహితము చెడిపోయిరి. ఆ ఆశను విడిచినవారే నిష్కల్మషమయిన మనసు గలవారు.
49. అన్నిదానములను నన్నదానమె గొప్ప కన్నతల్లికంటె ఘనములేదు ఎన్న గురునికన్న నెక్కుడులేదయా విశ్వదాభిరామ! వినురవేమ! భావం: అన్ని దానములకంటె అన్నదానము గొప్పది. కన్నతల్లి కంటె మించినదిలేదు. గురువుకంటె గొప్పదిలేదు.
50. ఆశకోసి వేసి యనలంబు చలార్చి గోఁచి బిగియగట్టి గుట్టు దెలసి నిలిచి నట్టివాఁడె నెఱయోగి యెందైన విశ్వదాభిరామ! వినురవేమ! భావం: ఆశ వదలి , ఆశలను అగ్ని చల్లార్చుకొని, కామమువదలి గోచిబిగించి కట్టి, జ్ఞానము తెలుసుకొనువాడే నేర్పరియైన యోగి.
51. చచ్చిపడిన పశువు చర్మంబు కండలు పట్టి పుఱికి తినును పరగ గ్రద్ద గ్రద్ద వంటివాడు జగపతి కాడొకో విశ్వదాభిరామ! వినురవేమ! భావం: గ్రద్ద చనిపోయిన పశువుయొక్క చర్మమును , కండలను ఊడబెరికి తినును, ఈ రాజులును ఆ గ్రద్దవంటివారే కదా.
52. ఆలను బుగ్గ పుట్టినప్పుడే క్షయమౌను గలలఁ గాంచులక్ష్మి గనుటలేదు ఇలను భోగభాగ్య మీతీరు గాదొకో విశ్వదాభిరామ! వినురవేమ! భావం: కెరటములో బుట్టిన బుడగలు అప్పుడే నిశించును. కలలోకనబడులక్ష్మిని పొందలేము. ఈభూమిలో భోగభాగ్యములుకూడా ఇట్టివేకదా!
53. కోతి నొనరదెచ్చి కొత్త పుట్టము గట్టి కొండముచ్చులెల్ల గొలిచినట్లు నీతిహీనునొద్ద నిర్భాగ్యుడుండుట విశ్వదాభిరామ! వినురవేమ! భావం: కొండముచ్చులు కోతిని తెచ్చి , క్రొత్తవస్త్రమునట్టి పూజించినట్లే నిర్భాగ్యులు గుణము లేనివారిని కొలుచుచుందురు.
54. కల్లలాడువాని గ్రామకర్త యరుగు సత్యమాడువాని స్వామి యరుగు బెక్కుతిండపోతుఁబెండ్లా మెరుంగురా విశ్వదాభిరామ! వినురవేమ! భావం: అబద్ధమాడు వానిని గ్రామపెద్ద తెలుసుకొనును. సత్యవంతుని భగవంతుడు తెలుసుకొనును. తిండిపోతుని భార్య యెరుగును.
55. కల్ల నిజమెల్ల గరకంఠు డెరుగును , నీరు పల్లమెరుగు నిజముగాను తల్లితానెరుగు తనయుని జన్మంబు విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: నీరు పల్లమెరుగును , సత్యము అసత్యము భగవంతుడు తెలుసుకొనును. కుమారుని పెట్టుక తల్లికే తెలుసును.
56. మైలకోకతోడ మాసినతలతోడ ఒడలు మురికితోడ నుండెనేమి అగ్రకులజుఁడైన నట్టిట్టు పిల్వరు విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: మాసిన చీరతోను , మాసినతలతోను, మురికిగాయున్న శరీరముతోనువున్నచో గొప్పకులమునందు బుట్టినవారినయినను హినముగాచూతురు.
57. ఉప్పులేనికూర హీనంబు రుచులకు పప్పులేని తిండి ఫలములేదు యప్పులేనివాడె యధిక సంపన్నుండు విశ్వదాభిరామ! వినురవేమ! భావం: ఉప్పులేని కూర రుచిగావుండదు. పప్పులేని భోజనము బలవర్ధకముకాదు. అప్పులేనివాడే ధనవంతుడు.
58. చెట్టుపాలు జనులు చేదందు రిలలోన ఎనుపగొడ్డు పాలదెంత హితవు పదుగురాడుమాట పాటియై ధరజెల్లు విశ్వదాభిరామ! వినురవేమ! భావం: ఈ ప్రపంచములో జనులు చెట్లపాలు మంచివి గావందురు. గేదెపాలు వారికి హితముగా నుండును. ఈ ప్రపంచములో పదిమందీ ఆడుమాటయే చెల్లును.
59. పట్టుపట్టరాదు పట్టి విడువరాదు పట్టేనేని బిగియ బట్టవలయు బట్టివిడుచుకన్న బరగ జచ్చుటమేలు విశ్వదాభిరామ! వినురవేమ! భావం: పట్టుదలయే వహింపరాదు. వహించినచో ఆ పట్టు వదలరాదు. పట్టినపట్టు నడిమిలోనే విడచుటకంటే మరణము మేలు.
60. తప్పులెన్నువారు తండోపతండంబు లుర్విజనులకెల్ల నుండు తప్పు తప్పులెన్నువారు తనతప్పులెరుగరు విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: ఇతరుల తప్పులను పట్టుకొనువారు , అనేకులు గలరు. కాని తమ తప్పులను తాము తెలుసుకొనలేరు.
61. అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తియ్యనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వధాభిరామ! వినుర వేమ! భావం: తరచుగ పాడుచుండిన కంఠధ్వని మాధుర్యముగ నుండును. ప్రతిదినము తినుచుండిన వేపవేరైనను తియ్యగ నుండును. ప్రయత్నము చేయచుండిన పనులు నేరవేరును. ఈ ప్రపంచమున పద్ధతులు యీ విధముగ ఉండును.
62. తమకుగల్గు పెక్కు తప్పులునుండగా ఓగు నేరమెంచు నొరులగాంచి చక్కిలంబుగాంచి జంతిక నగినట్లు విశ్వదాభిరామ! వినురవేమ! భావం: తనయందు అనేక్ తప్పులు పెట్టుకొని , దుర్మార్గులు ఇతరుల తప్పులను యెన్నుచుదురు. చక్కిలమునుచూచి జంతిక నవ్వినట్లు వుండును కదా!
63. ఇనుము విరిగె నేని యిరుమారు ముమ్మారు కాచి యతుకవచ్చు క్రమముగాను మనసు విరిగెనేని మరియంట నేర్చునా విశ్వదాభిరామ! వినురవేమ! భావం: ఇనుము విరిగిన కాల్చి , అతుకవచ్చును, మనసు విరిగినచో మరల అంటీంచుట ఎవరితనము కాదు.
64. ఒరుని చెరచదమని యుల్లమం దెంతురు తమకుచే టెరుగని ధరణి నరులు తమ్ము జెఱచువాడు దేవుడు లేడొకో విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: ఇతరులను పాదుచేయవలెయునని కొందరు ఆలోచనచేయుదురు. కాని, తమకు కలుగు ఆపదలను గ్రహింపలేరు. ఒకరిని పాదుచేయ వలయుననిన, భగవంతుడు వారినే పాడుచేయును
65. కానివాని చేతగాసు వీసంబిచ్చి వెంటదిరుగువాడె వెఱ్రివాడు పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకునా విశ్వదాభిరామ! వినురవేమ. భావం: దుర్మార్గుని చేతికి ధనముయిచ్చి , దానికై మరల అతని వెంట తిరుగుట తెలివితక్కువతనము. పిల్లిమ్రింగినకోడి పిలిచిననూ పలుకదుకదా.
66. మాటలాడనేర్చి మనసు రాజిలజేసి పరగఁ బ్రియము చెప్పి బడలకున్న నొకరి చేత సొమ్ము లూరక వచ్చువా విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: ఇతరులకు సంతోషము కలుగునట్లు మాటలాదు విధానము నేర్చుకొని వారి మనస్సు ఆనందపరచి, శ్రమపడకుండ వారి నుండి చేతిలో సొమ్ము తేరగనే రాదు.
67. చంపదగినయట్టి శత్రువు తనచేత జిక్కెనేని కీడు సేయరాదు పొసగ మేలు చేసి పొమ్మనుటె చాలు విశ్వదాభిరామ! వినురవేమ! భావం: చంపదగినట్టి శత్రువు తన చేతిలో చిక్కిననూ , అపకారము చేయక, దగిన ఉపకారమునే చేసి విడిచిపెట్టుట మంచిది.
68. వాన గురియకున్న వచ్చును క్షామంబు వాన గురిసెనేని వరదపారు వరద కరవు రెండు వలసతో నెరుగుడీ విశ్వదాభిరామ! వినురవేమ! భావం: వానగురియనచో కరువు వచ్చును , వానకురిసిన వరద వచ్చును. వరదా కరువూ రెండునూ కదాని వెంటా మరియెకటి వచ్చునని తెలుసుకొనవలెను.
69. పుట్టిన జనులెల్ల భూమిలో నుండిన పట్టునా జగంబు వట్టిదెపుడు యముని లెక్క రీతి అరుగుచు నుందురు విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: పుట్టిన వారందరూ మరణించనిచో యీ భూగోళము పట్టదు. యమునిలెక్క ప్రకారము ఒకరి తరువాత ఒకరుచనిపొవుచునే యుందురు.
70. వాన రాకడయును బ్రాణాంబు పోకడ కానబడ దదెంత ఘనునికైన కానపడిన మీద కలియెట్లు నడచురా విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: ఈ కలియుగములో వానరాకడ , ప్రాణము పోకడ ముందుగా యెవరునూ తెలుసుకొనలేరు. ఇది కలియుగ ధర్మము.
71. చిప్పబడ్డ స్వాతిచినుకు ముత్యంబాయె నీటిబడ్డ చినుకు నీటఁగలిసె బ్రాప్తిగల్గుచోట ఫలమేల తప్పురా విశ్వదాభిరామ! వినురవేమ! 70 భావం: స్వాతికార్తిలో ముత్యపు చిప్పలో పదినచినుకు ముత్యమగును నీటబదినది నీటిలో కలిసిపోవును. ప్రాప్తించుచోట ఫలము తప్పదు.
72. ఎన్నిచోట్లు తిరిగి యేపాట్లు పడినను అంటనియ్యక శని వెంటదిరుగు భూమి క్రొత్తలైన భుక్తులు క్రొత్తలా విశ్వదాభిరామ! వినురవేమ! భావం: ఎన్నిచోట్ల తిరిగి ఎన్ని కష్తములు పడినను, లాభము కలుగునీయక శని వెంటాడి తిరుగుచుండును. తమ ప్రదేశము క్రొత్తదైననూ, తినువారు క్రొత్తవారు కాదుగదా.
73. కర్మ మధికమై గడచి పోవగరాదు ధర్మరాజు దెచ్చి తగని చోట గంకుబటుఁ జేసిఁ గటకటా దైవంబు విశ్వదాభిరామ! వినురవేమ! భావం: పూర్వజన్మమున చేసిన కర్మ అనుభవింఒపక తప్పదు. ధర్మరాజు వంటివాడు. ఒక సామాన్యమైన చిన్నరాజు దగ్గర కొంతకాలము కంకుభట్టుగా వుండెను.
74. అనువుగాని చోట అధికుల మనరాదు , కొంచెముండుటెల్ల కొదువ కాదు కొండ అద్దమందు కొంచమై యుండదా ? విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: విలుగానిచోట అధికుదనని సంచరించరాదు. సామాన్యముగనుండుట నీచముగాదు. అద్దములో కొంత చిన్నదిగ కంపించిననూ అసలు చిన్నది కాదుగకా.
75. ఇమ్ము దప్పువేళ నెమ్మెలన్ని యుమాని కాలమొక్కరీతి గదపవలయు విజయ డిమ్ము దప్పి విరటుని గొల్వడా విశ్వదాభిరామ! వినురవేమ! భావం: చెడ్డకాలము వచ్చినపుదు భోగములన్నియు వదులుకొని సామాన్యముగ కాలము గడుపవలయును. అర్జునుడు రాజ్యము పోగొట్టుకొని విరాటరాజు కొలువులో చేరెనుగదా.
76. చిక్కియున్ననేళ సింహబునైనను బక్కకుక్క కరచి బాధచేయు కలిమిలేనివేళఁ బంతంబు చెల్లదు విశ్వదాభిరామ! వినురవేమ! భావం: బలము బలము లేనప్పుదు సింహమునైనను బక్కకుక్క కరచి బాధపెట్టును. సక్తిలేనప్పుడుపంతంములకుపోకతలవంచుకొని తిరుగుటమంచిది.
77. లక్ష్మి యేలినట్టి లంకాధిపతి పురి పిల్ల కోతి పౌజు కొల్ల పెట్టెఁ జేటు కాలమయిన జెఱుప నల్పులె జాలు విశ్వదాభిరామ! వినురవేమ! భావం: గొప్ప ధనవంతుదైన రావణుని లంకను సామాన్యమైన కోతులు నాసనము చేసెను. చెడ్డకాలము వచ్చినప్పుదు సామాన్యులైనను అపకారము చేయుదురు.
78. మొదట ఆశపెట్టి తుదిలేదుపొమ్మను పరలోభులైన పాపులకును ఉసురు తప్పకంటు నుండేలు దెబ్బగా విశ్వదాభిరామ! వినురవేమ! భావం: మొదట ఉపకారము చేసెదననిచెప్పి , త్రిప్పిత్రిప్పి తరువాత పొమ్మను లోభులకు, అపకారము వుండేలు దెబ్బవలె తప్పక తగులును.
79. ఇచ్చువానియొద్ద నీయని వాడున్న ఇచ్చుగాని యీవి సాగనీడు కల్పతరువు క్రింద గచ్చ చెట్టున్నట్లు విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: దాతదగ్గర లోభిచేరినచో, చచ్చినను ధర్మము, పరోపకారము చేయనీయుడు. సకల కోరికలనిచ్చు కల్పవృక్షము క్రింద ముండ్లపొదవుండినచో కల్పవృషము దగ్గరకు పోనీయదుగదా.
80. అరయ నాస్తియనక యడ్డుమాటాడక పట్టుపడక మదిని దన్ను కొనక తనది గాదనుకోని తాబెట్టునదె పెట్టు విశ్వదాభిరామ! వినురవేమ! భావం: ఆలోచింపగా , లేదనక అడ్డుచెప్పక తట్టుపడక మనస్సులో "యీయనా ? వద్దా ! అని ఆలోచింపక తనది కాదని ఇతరులకు పెట్టుటే మంచిదే.
81. ధనము కూడబెట్టి దానంబు చేయక తాను దినక లెస్స దాచుకొనగ తేనె టీగ గూర్చి తెరువరి కియ్యదా విశ్వదాభిరామ! వినురవేమ! 80 భావం: ధనము సంపాదించి , దానమీయక, తాను తినక, దాచుకొనుట, తేనెటీగ తేనెను ప్రోగుచేసి బాటసారికి యిచ్చునట్లుగనే ఇతరుల పాలు చేయుట అగును.
82. దాత కాని వాని దరచుగా వేఁడిన వాఁడు దాత యౌనె వసుధలోన ఆరు దర్భయౌనె యబ్ధిలో ముంచినా విశ్వదాభిరామ! వినురవేమ! భావం: దాతృత్వము లేనివానిని యెన్ని సార్లు అడిగినను యేమియు లాభములేదు. సముద్రములో ముంచిననూ అవురుగడ్డి దర్భగాదు.
83. పరగ రాతి గుండు పగుల గొట్ట వచ్చు కొండలన్ని పిండి కొట్టవచ్చు కట్టినచిత్తు మనసు కరిగింపగారాదు విశ్వదాభిరామ! వినురవేమ! భావం: రాతి గుండు పగులగొట్టవచ్చును. కొండలన్నియు డండిగొట్ట వచ్చును. కఠిన హృదయుని మనసు మాత్రము మార్చలేము.
84 వంపుకర్రగాల్చి వంపు దీర్పగవచ్చు కొండలన్ని పిండి గొట్టవచ్చు కఠినచిత్తు మనసు కరిగింపగరాదు విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: వంకరగా నువ్నె కర్రను కాల్చి దాని వంపు తీయవచ్చును. కొండ లన్నిటినీ పిండిగొట్ట వచ్చును. కాని కఠిన హృదయము మనసు మాత్రము మార్చలేము.
85. విత్తముగలవాని వీపు పుండైనను వసుధలోన జాల వార్తకెక్కు బేద వానియింట బెండ్లయిననెరుగరు విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: ధనవంతుని వీపుపై పుండు పుట్టినను , ఆ విషయమును లోకములో అందరును చెప్పుకొందురు. పేదవాని యింటిలో పెండ్లి అయినను చెప్పుకొనరు.
86. ఆపదల వేళ బంధులరసిజూడు భయమువేళ జూడు బంటుతనము పేదవేళ జూడు పెండ్లాము గుణమును విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: కష్టములు కలిగినప్పుడు బంధువులు దగ్గరకు పోయిపరిశీలిపపుము, భయము కలిగినప్పుడు, ధైర్యమును పరీక్షింపుము. దరిద్రముగా వున్నప్పుడు భార్యగుణము పరీక్షింపుము.
87. ఆలిమాటలు విని అన్నదమ్ములబాసి వేఱె పొవువాడు వెఱ్రివాడు కుక్క తోకబట్టి గోదావ రీదునా విశ్వదాభిరామ! వినురవేమ! భావం: భార్యమాటలు విని అన్నదమ్ములను వదలిపోవుట అజ్ఞానము కుక్కతోక పట్టుకొని గోదవరి ఈదుట అసాధ్యము అనితెలుసుకొనుము.
88. మగని కాలమందు మగువ కష్టించిన సుతుల కాలమందు సుఖమునందు కలిమి లేమి రెండు గల వెంతవారికి విశ్వదాభిరామ! వినురవేమ! భావం: భర్తకాలములో కష్టపడి గృహమును కాపాడినచో, కొడుకులు పెద్దవారైనప్పుడు సుఖపడ వచ్చును. ఎంతవారికైననూ కలిమి, లేమి రెండునూ జీవితములో వచ్చుచుండును.
89. చెప్పులోని రాయి చెవిలోని జోరీగ కంటిలోని నలుసు కాలిముల్లు ఇంటిలోనిపోరు నింతింత గాదయా విశ్వదాభిరామ! వినురవేమ! 90 భావం: చెప్పులో ఉన్నరాయి , చెవిలో దూరిన జోరీగ, కంటొలోపడిన నలసు కాలిముల్లు, ఇంటిలోని జగడం వెంటనే తగ్గక చాలా బాధిస్తాయి.
90. తల్లిదండ్రి మీద దయ లేని పుత్రుండు పుట్టనేమి ? వాడు గిట్టనేమి? పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ! వినురవేమ! భావం: తల్లిదండ్రులపై ప్రేమ లేని పుత్రుడు పుట్టినా చనిపోయినా నష్టములేదు. పుట్టలో చెదలు పుడుతూ ఉంటాయి. నశిస్తూ ఉంటాయి.
91. తనకు లేనినాడు దైవంబు దూరును తనకు గల్గెనేమి దైవమేల ? తనకు దైవమునకు దగులాట మెట్టిదో విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: మనిషి తనకు లేనప్పుడు దేవుని దూషిస్తాడు. ఉన్నప్పుడు దేవుని మరచిపోతాడు. ఇదే మనిషికి దేవునికి సంబంధమై ఉంటుందేమోకదా!
92. మాటలాడు నొకటి మనసులోన నొకటి ఒడలి గుణము వేరె యోచన వేరె ఎట్లుగల్గు ముక్తి యీలాగు తానుండ విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: మనసులో ఉన్నది ఒకటి , పైకి మాటాదేది మరొకటి. తన గుణము ఒకటి, అలోచన వేరొకటి ఉన్నవానికి మోక్షము దొరకదు.
93. మ్రుచ్చు గుడికి పోయి ముడివిప్పునే కాని పొసగ స్వామిజూచి మ్రొక్కడతడు కుక్క యిల్లుసొచ్చి కుండలు వెదుకదా విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: ఇంటిలో ప్రవేశించిన కుక్క కుండలు వెదనుకునట్లుగ గదిలోకి వచ్చిన దొంగ ధనము కొరకు వెదుకునుగాని దేవునికిమ్రొక్కడు.
94. అంతరంగమందు సపరాధములు చేసి మంచివానివలెను మనుజు డుండు ఇతరు లెరుగకున్న నీశ్వరుఁ డెరుంగడా విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: మనిషి చాటు మాటూగ అనేక తప్పుచేసి ఇతరుల ఎదుట మంచివాడుగా నటించవచ్చును. కాని సర్వము తెలిసిన భగవంతుడు మనిషి చేసిన తప్పులనుగుర్తిస్తాడు.
95. వేషభాష లెరిగి కాషాయవస్త్రముల్ గట్టగానె ముక్తి గలుగబోదు తలలు బోడులైన తలుపులు బోడులా విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: వేష భాషలు నేర్చుకొని కాషాయ బట్టలు కట్టినంత మాత్రాన మోక్షమురాదు. తలలు చేసినంత మాత్రాన అతని మనసు బోడిది కాదుకదా!
96. ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని భావమిచ్చి మెచ్చు బరమలుబ్ధు పంది బురద మెచ్చు బన్నీరు మెచ్చునా విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: మూర్ఖుణ్ని మూర్ణుడే మెచ్చుకొంటాడు. అజ్ఞానియైన వాడు లోభివానినే మెచ్చుకుంటాడు. పంది బురదనే కోరుకుంటుంది. కాని పన్నీరును కోరుకోదు.
97. గాజుకుప్పెలోన గడఁగుచు దీపంబ దెట్టు లుండు జ్ఞాన మట్టులుండు దెలిసినట్టి వారి దేహంబులందును విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: గాజు బుడ్డిలో ఏవిధముగా దీపము నిలకడతో వెలుగుతుందో అదే విధముగ తెలివిగల వారియండు జ్ఞాన దీపము ప్రవేశిస్తుండి.
98. అన్న మిడుటకన్న అధిక దానంబుల నెన్ని చేయనేమి యేన్నఁబోరు అన్న మెన్న జీవనాధార మగునయా విశ్వదాభిరామ! వినుర వేమ! భావం: ఇతర దానములు ఎన్ని చేసిననూ అన్నదానముతో సాటిగావు. లేలోచించినచో అన్నమే యీ లోకములో జీవనాధారము.
99. ఇహరంబులకును నిది సాధనంబని వ్రాసి చదివిన విన్నవారికెల్ల మంగళంబు లొనరు మహిలోన నిది నిజము విశ్వదాభిరామ! వినురవేమ! భావం: ఈ లోక మందును, పరలోక మందును గూడసుఖపడుటకు మార్గముగ, నుందునని ఈ శతకము వ్రాసితిని. దీనిని చదివిన వారికిని విన్నవారికిని శుభములు కలుగును. ఇది నిజము.
100. చిక్కియున్న వేళ సింహంబునైనను బక్కకుక్క కరచి బాధచేయు బలిమి లేనివేళ బంతంబు చెల్లదు విశ్వదాభిరామ వినురవేమ. భావం - అడవికి మృగరాజు అయిన సిమ్హం చిక్కిపోయి ఉంటే వీధిన పోయే బక్క కుక్క కూడా భాద పెడుతుంది.అందుకే తగిన బలము లేని చోట పౌరుషము ప్రదర్శించరాదు.కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top