దేవాలయాలలో 'ధ్వజస్థంభం' - Significance of 'Dwajasthambam' in the temple

దేవాలయాలలో 'ధ్వజస్థంభం' - Significance of 'Dwajasthambam' in the temple?
ధ్వజస్థంభం

దేవాలయాలలో 'ధ్వజస్థంభం' ఎందుకుంటుంది? ధ్వజస్థంభ చరిత్ర!

ధ్వజస్థంభం చుట్టూ ప్రదక్షిణం చేసిన తరువాత దైవదర్శనం చేసుకోవటం, అనాదిగా వస్తున్న ఆచారం. ధ్వజస్థంభం దగ్గర కొట్టే గంటను, బలి అంటారు. నిత్యహారతులు జరిగే దేవాలయాలలో, షోడశోపచార పూజా విధానం చేయాలంటే, ధ్వజస్థంభం తప్పనిసరి. దీపారాధనలూ, నైవేద్యం వంటి ఉపచారాలు, ధ్వజస్థంభానికి కూడా చేస్తారు. ఆలయంలో మూలవిరాట్టు ఎంత ముఖ్యమో, ధ్వజస్థంభం కూడా అంతే ముఖ్యం. ధ్వజస్థంభం ఉంటేనే దేవాలయానికి ఆలయత్వం ఉంటుంది. లేకపోతే అవి కేవలం మందిరాలు మాత్రమే..*

ధ్వజస్థంభానికి జీవధ్వజం అనే మరో పేరు ఉంది. దీనిని దారు బేరం అని కూడా అంటారు. విగ్రహాల అనుష్ఠాన, అర్చనల వల్ల, భగవంతుని చూపు ఈ ధ్వజస్థంభానికి తగులుతుంది. అందువల్ల, ఈ స్థంభానికి పవిత్రతతో పాటు, శక్తి కూడా లభిస్తుంది. ధ్వజస్థంభానికి కూడా బలిహరణాలూ, అర్చనలూ జరుగుతుంటాయి. ధ్వజస్థంభాలకు కేవలం ఈ వృక్షాలనే ఉపయోగిస్తారు. మోదుగ, అశ్వత్థ, మారేడు, బంధూకం, పనస, వకుళ, మద్ది, వంటి వృక్షాలను ఉపయోగించినట్లయితే, సంవత్సరాల పాటు బలంగా ఉంటాయి. వైష్ణవాలయాల్లో ధ్వజస్థంభం జెండా మీద గరుత్మంతుని చిహ్నం, శివాలయాల్లో నందీశ్వరుని చిహ్నం, అమ్మవారి దేవాలయాల్లో సింహ చిహ్నం ఉంటాయి. కొన్ని దేవాలయాలలో రాతిధ్వజస్థంభాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు అడవిలో దారి తప్పిన బాటసారులకు, ఎత్తున కనిపించే ధ్వజస్థంభ దీపాలే దారి చూపించేవి. వీటి ఆధారంగా, ఏ గుడినో, పల్లెనో చేరుకుని, ప్రజలు తలదాచుకునేవారు. ఇప్పుడా అవసరం లేకపోయినా, కార్తీకమాసమంలో ప్రజలు ధ్వజస్థంభం మీద ఆకాశదీపం వెలిగించి, మహాదాత మయూరధ్వజుని గౌరవిస్తున్నారు.

ఆలయాలలో ప్రతిష్టించే ధ్వజస్థంభం వెనుక, మయూరధ్వజుని కథ దాగి ఉంది. కురుక్షేత్ర యుద్ధానంతరం, సింహాసనాన్ని అధిష్టించిన ధర్మరాజు, అధర్మానికి తావులేకుండా రాజ్యపాలన చేస్తున్నాడు. ధర్మమూర్తిగా, ఎదురులేని దాతగా, కీర్తి పతాకం అందుకోవాలనే కాంక్షతో, ఎడతెరిపి లేకుండా దానధర్మాలు చేయడం మొదలుపెట్టాడు. ఇది గమనిస్తున్న కృష్ణుడు, అతనికి తగు గుణపాఠం నేర్పాలనుకున్నాడు. అశ్వమేధ యాగం చేసీ, శత్రురాజులను జయించీ, దేవ, బ్రాహ్మణులను సంతుష్టుల్ని చేసీ, రాజ్యాన్ని సుస్థిరం, సుభిక్షం చేసుకొమ్మని, ధర్మరాజుకి సలహా ఇచ్చాడు కృష్ణుడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసావహించి, అశ్వమేధానికి సన్నాహాలు చేయించాడు. నకుల సహదేవులు సైన్యంతో యాగశ్వరక్షకులై బయలుదేరారు. ఆ యాగాశ్వం చివరికి మణిపుర రాజ్యం చేరింది. ఆ రాజ్యాన్ని మయూర ధ్వజుడు పాలిస్తున్నాడు. ఆయన మహా పరాక్రమవంతుడిగా, గొప్ప దాతగా పేరుగాంచాడు. మయూరధ్వజుని కుమారుడైన తామ్ర ధ్వజుడు, పాండవుల యాగాశ్వమును బంధించాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకులసహదేవులూ, భీమార్జునులూ ఓడిపోయారు.

ఈ విషయం తెలిసిన ధర్మరాజు, ఆగ్రహంతో మణిపురానికి బయలుదేరగా, కృష్ణుడు అతన్ని వారించి, మయూరధ్వజుణ్ణి జయించేందుకు, ఒక కపటోపాయాన్ని వివరించాడు. శ్రీకృష్ణుడి పథకం ప్రకారం, ధర్మరాజుతో పాటు వృద్ధ బ్రాహ్మణుల రూపంలో, మణిపురం చేరాడు కృష్ణుడు. వారిని చూచిన మయూరధ్వజుడు, వారికి దానం ఇవ్వదలచి, ఏం కావాలో కోరుకోమని అడిగాడు. అందుకు శ్రీకృష్ణుడు, తమ దర్శనార్ధమై మేము వస్తున్న దారిలో, ఒక సింహం అడ్డు వచ్చి, ఇతని కుమారుణ్ణి పట్టుకుంది. బాలుని విడిచిపెట్టవలసిందని పార్థించగా, అందుకా సింహం, మీ కుమారుడు మీకు కావాలంటే, మణిపుర రాజ్యాధిపతయిన మయూరధ్వజుని శరీరంలో సగభాగం ఆహారంగా కావాలని కోరింది. ప్రభువులు, మా యందు దయదలచి, తమ శరీరంలో సగభాగం దానమిచ్చి, బాలుని కాపాడమని వేడుకుంటున్నాం. ఆ మాటలు విని, అందుకు అంగీకరించిన రాజుకు, కృష్ణుడు మరో షరతు విధించాడు. శరీరంలో సగ భాగాన్ని, ఆయన భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వాలని చెప్పాడు. దానికి కూడా అంగీకరించిన మయూరధ్వజుడు, అందుకు తగిన ఏర్పాట్లు చేయించాడు.

భార్యాసుతులు ఆయన శరీరాన్ని సగానికి కోయటం చూచిన ధర్మరాజు, అతని దాన గుణానికి నివ్వెరబోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమకన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు, 'తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు' అని అన్నాడు. అందుకు మయూరధ్వజుడు, 'మహాత్మా.. తమరు పొరబడుతున్నారు. బాధతో నా శరీరాన్ని మీకివ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది. కానీ, ఆ భాగ్యం తనకు కలగటంలేదు కదా! అని ఎడమ కన్ను బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది.' అని వివరించాడు. మయూరధ్వజుని దాన శీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు, తన నిజరూపాన్ని చూపి, 'మయూరధ్వజా! నీ దానగుణం అమోఘం! ఏదైనా వరం కోరుకో! అనుగ్రహిస్తాను' అన్నాడు. 'పరమాత్మా! నా శరీరం నశించినా, నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా, నిత్యం మీ ముందుండేలా అనుగ్రహించండి' అని కోరాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణుడు, 'తథాస్తు' అని పలికి, 'మయూరధ్వజా! నేటి నుంచీ, ప్రతి దేవాలయం ముందూ, నీ గుర్తుగా, నీ పేరున ధ్వజస్థంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ, నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి, ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే, ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతి నిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో, వారి జన్మ సఫలం అవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం, రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది' అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచీ, ఆలయాల ముందు ధ్వజస్థంభాలు తప్పనిసరిగా ప్రతిష్టించడం, ఆచారమయింది. భక్తులు ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి, ఆ తర్వాతే మూలవిరాట్టు దర్శనం చేసుకోవడం, సాంప్రదాయంగా మారింది..

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top