![]() |
| సృష్టి - రహస్యము | Srusti - rahasyamu - Creation - Mystery |
సృష్టి - రహస్యము | Creation - Mystery
ఈ అనంతమైన విశ్వాంతరాళములో అవ్యక్తమైన అందరూ నిర్వచించే ఆమోఖమైన దైవశక్తి అగోచరమై యున్నది అనుట సత్యము. అది సర్వదా అచలము, అనంతము, అభేద్యము, అవ్యక్తము, ఆగోచరము, అగ్రాహ్యము, అనూహ్యము, అద్భుతము, అతిశక్తివంతము, అతి ప్రభావంతము, అతి విశాలమై, విశ్వవ్యాప్తమై యున్నది. అట్టి శక్తి వివిధ నామములతో ఆదిశక్తి, మూలశక్తి, విశ్వశక్తి, దైవశక్తిగా, సృష్టికి ఆధారమై యున్నది. అట్టి అనంత దైవశక్తి సంజనితమే ఈ విశ్వము అని తెలియబడుచున్నది.
అచలమైన దైవశక్తి నుండి వెలువడిన చలనరూపమే ఈ సృష్టికి మూలము. సృష్టి సదా పరిణామదశలో పరిభ్రమిస్తూ ఉంటుంది. అందుచేత దీనిని “జగత్తు” అన్నారు. “జ” అనగా (జననము) - పుట్టుక గలది. “గత్" అనగా, గతించునది (నశించునది) అని అర్థము. అందుకే “బ్రహ్మ సత్యం - జగన్మిధ్య" అన్నది శాస్త్రం. బ్రహ్మ అగోచరము. భ్రమ “జగత్" సుగోచరము. మనలోని, భ్రమ - భ్రాంతుల వల్ల ఉన్నట్లుండి ఊడిపోయే ఈ జగత్తును సత్యంగా భావించి “పుట్టినప్పుడు సంతోషిస్తూ మరణించినప్పుడు విచారిస్తున్నాము. సహజంగా సుఖసంతోషాలకు నిలయమైన ఆత్మశక్తిని అధోగతిలో నడిపిస్తున్నాము. అట్టి అధోగమనములే - ఈ సృష్టిగమనాలు. అవే జనన మరణాలు. “పునరపి జననం - పునరపి మరణం" అన్నది ఆదిశంకరుని వాక్కు. ఊర్ధ్వగమనాల నెరిగి ఉత్తమ గతుల నందుకొన్నవారే మహర్షులు.
సృష్టికి మూలము పంచభూతములు. అవే "పృధి వ్యప్ తేజో వాయురాకాశములు” భూమి - నీరు - అగ్ని - వాయువు - ఆకాశములు ఐదు.
ఆకాశము :- ఆకాశం గగనం శూన్యం అన్నది శాస్త్రం. అనగా ఏమీ లేనిది. శూన్యరూపమైనదే గాని అట్టింటికీ ఆధారమైన అవకాశము (స్పేస్" వ్యవధి”) ఖాళీని అందించేదే ఆకాశము. మనం నిలబడాలన్నా! కూర్చోవాలన్నా, ఇల్లు కట్టాలన్నా, ఉపాధికి పంటలు పండించాలన్నా ఖాళీ స్థలముండాలి గదా. అట్లే సృష్టికి మూలాలైన భూమి, సూర్యుడు, చంద్రుడు మొదలైన గోళాలు - నక్షత్రాలు, అన్నియూ ఈ సువిశాలమైన ఈ ఆకాశంలోనే యిమిడి యున్నవి గదా! అందుకే “ఆకాశం గగనం శూన్యం" అన్నారు పెద్దలు.
అట్టి శూన్యమైన ఆకాశంలో ఆవిర్భవించినవన్నియూ కాలక్రమేణా అంతరించిపోక తప్పదు. "పుట్టుట - గిట్టుట కొరకే” నన్నారు పెద్దలు. అట్లే మనమంతా పుడుతూ, మరణిస్తూ ఉంటాము గదా! "జాతస్య మరణం ధృవం" అన్నది శాస్త్రము. అందుకు ఈ యాతనా శరీరాలకు సాధనా శరీరాలుగా మార్చుకొనుట అతి ముఖ్యము. “సాధనమున పనులు సమకూరు ధరలోన” అన్నారు యోగి వేమనగారు. అట్టి సాధనములలో ప్రధానమైనది యోగ సాధనము. దాని ప్రభావంతో భోగ రోగాలు దూరమై భగవదైశ్వర్యం చేరువాతుంది.
రచన: యోగాచార్య డా | వి.వి.రామరాజు

.png)






