రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గనక లేకపోతే ఇంత మంది హిందువులు కూడా బతికి వుండేవారే కాదని ప్రముఖ ప్రవచనకారులు, బాగేశ్వర్ ధామ్ ధీరేంద్ర శాస్త్రి అన్నారు. ఛతర్ పూర్ లో జరిగిన హిందూ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. మొదటగా సంప్రదాయ పూజలు చేసి, ఆ తర్వాత భారత మాత చిత్ర పటానికి పుష్పార్చన చేశారు.
ఈ సందర్భంగా ధీరేంద్ర శాస్త్రి మాట్లాడుతూ... హిందువులు ప్రాంతీయత, భాషా దురాభిమానాన్ని విడిచిపెట్టాలని సూచించారు. సంఘ్ కారణంగానే హిందువులు అత్యంత సురక్షితంగా వున్నారన్నారు. హిందువులు కులాలా వారీగా విడిపోతే, భారత్ కూడా బంగ్లాదేశ్ లాంటి పరిస్థితినే ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
‘‘భారత దేశంలో ఆరెస్సెస్ ఉనికిలో లేకుంటే, ఇంత మంది హిందువులు కూడా జీవించి వుండేవారే కాదు. డాక్టర్ హెడ్గేవార్ వారసులు అపూర్వమైన పని చేస్తున్నారు. వారు ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో యావత్ హిందూ సమాజాన్ని ఏకం చేశారు, చేస్తున్నారు. ప్రస్తుతం ఆరెస్సెస్ శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటోంది. ఎంతో గర్వంగా వుంది. ఈ వందేళ్ల తపస్సుతో హిందూ సమాజం తనను తాను సంఘటితం చేసుకుంటోంది. ధైర్యంతో జీవిస్తోంది. మరింత సంఘటితం కావాలి. మరింత బలాన్ని పుంజుకోవాలి. ఐక్యత లేకుంటే ఉనికి అసాధ్యం. "మన వ్యాపారాన్ని, మన ఆస్తిని భవిష్యత్తు తరాల కోసం కాపాడుకుంటాము, కానీ మన వ్యాపారం, ఆస్తితో పాటు మన సంస్కృతిని కూడా మనం అందించాలి." అని బాగేశ్వర్ బాబా అన్నారు.
అలాగే హిందువులు కుటుంబ వ్యవస్థను కూడా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కుటుంబ సభ్యులు తమ సుఖ దు:ఖాలను వ్యక్తం చేసుకోవడానికి కుటుంబం మొత్తం కలిసి కూర్చోవాలని, కలిసి భోజనం చేయాలని, కలిసి పూజలు చేయాలని, దీని ద్వారా తమలో తాము చర్చించుకునే సంప్రదాయాన్ని ప్రారంభించాలన్నారు. కలిసి కూర్చోవడం వల్ల పరస్పర అడ్డంకులు తొలగిపోతాయని, నైతిక భావం పెంపొందుతుందన్నారు.





