ఆదోని తిక్కలక్ష్మమ్మ (1815 - 1933)
జీవితకాలంలో భౌతిక శరీరంతోను, సమాధి చెందిన తరువాత సూక్ష్మ శరీరంతోను ఆంధ్ర కర్ణాటక ప్రజల పూజలు అందుకొంటున్న అవధూత ఆదోని తిక్క లక్ష్మమ్మ. కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణంలో ఆమె సమాధి ఒక యాత్రా స్థలం. ఆదోనికి ఏడుమైళ్ళ దూరంలో గల మూసాన పల్లెలో మాదిగ మంగమ్మ, బండెప్ప దంపతులకు మొదటి సంతానంగా 1815లో జన్మించిన యోగిని తిక్క లక్ష్మమ్మ, ఆమె బాల్యం నుంచే అన్న పాదాదులు, ఆట పాటలపై ఆసక్తి లేక మౌనంగా ఉండేది.
వివాహం చేసిన ఆమె తీరు మారలేదు. ఇరవైఏళ్ల వయసులో ఆమె ఆదోని పట్టణ వీధుల్లో నిద్రాహారాలు, ఎండవానలు లెక్కచేయక మౌనంగా ఏదో వెతుకుతున్నట్లు కూనిరాగాలు తీస్తూ తిరుగుతుండేది. ఒక సత్పురుషుడు ఆమె చివిలో ఉపదేశం చేయడంతో సమాధి స్థితిలో పడింది. గంటల తరబడి సమాధిలో ఉన్న తరువాత లేచి ప్రతిరోజూ వీధుల వెంట తిరుగుతూ కసువు తాట్ల వద్ద కూర్చోవడం, పరుండటం చేయటంతో ఆమెను తొట్టిలక్ష్మమ్మ, తిక్క లక్ష్మమ్మ అనిపేర్లు పెట్టారు. కాని ఆమెను త్రికాలజ్ఞానిగా, నిగ్రహానుగ్రహ సమర్ధురాలుగా గ్రహించిన కొందరు ఆమెను భక్తి ప్రేమలతో ఆదరించేవారు. ఆమె ఎన్నో మహిమలు ప్రదర్శించేది. ఆమెకు ఖండ యోగం తెలుసు. ఆమెకు దూరదృష్టి, దూరశ్రవణం, పరచిత్త జ్ఞానం, భవిష్యత్ జ్ఞానంతో భక్తుల, దీనుల సమస్యల పరిష్కారాన్ని, భవిష్యత్తును సూచించేది. ఆమె ఆరు బయట పడుకున్నప్పుడు వర్షం పడితే ఆమె మీద పడేది కాదు. ఒక్కొక్కప్పుడు రెండు మూడు రోజులు వరుసగా నిర్వికల్ప సమాధిలో బ్రహ్మానుసంధానం చేస్తూ ఉండిపోయేది.
శ్రీముఖ నామ సంవత్సర వైశాఖ బహుళ సప్తమి మంగళవారం ఉదయం 16-5-1933న ఆమె దేహం చాలించింది. తరువాత ఆమె పేరిట మఠం నిర్మించి ప్రతి శుక్రవారం విశేష పూజలు, ప్రతిరోజూ నిత్య పూజలు, అభిషేకాలు ప్రతియేటా ఆదోనిలోను, కర్ణాటకలోని రాయచూరు జిల్లా ఎలుబుగిరిలోను అమ్మ ఆరాధనోత్సవాలు ఈనాటికీ వైభవంగా నిర్వహిస్తున్నారు.




