నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

- ఆర్ఎస్ఎస్ -

ఆర్ఎస్ఎస్
తెలుగు పండుగలు - Telugu Festivals లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తెలుగు పండుగలు - Telugu Festivals లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, ఏప్రిల్ 2020, ఆదివారం

అక్షయ తృతీయ - Akshaya Truteeya

లక్ష్మీదేవి - Goddess Lakshmi devi
లక్ష్మీదేవి - Goddess Lakshmi devi
వైశాఖ శుద్ధ తదియనాడు అక్షయ తృతీయ జరుపుకుంటారు . కొందరు వైశాఖ శుక్లపక్ష తృతీయ(తదియ ) రోహిణియుతమైన రోజునే, అక్షయతృతీయ పర్వదినంగా జరుపుకుంటారు . ఇది ఒక నమ్మకం మాత్రమే . పూజలు , వ్రతాలు , నోములు , యజ్ఞాలు ,యాగాలు చేస్తే ధనము , ఐశ్వర్యము వస్తుందనేది ఎంతమాత్రము శాస్త్ర సమ్మతం కాదు . . . కాని నమ్మకం మూలానా మానవుడు కొంతవరకు ఆదా చేసే అవకాశము , కనీసము ఆరోజైనా భవిష్యత్తు అవసరాలకు ఆదాచేసే అవకాశము ఉంది . ఒక తరము నుండి మరొక తరానికి " జ్ఞాపకాల " బదలాయింపు జరుగుతూ ఉండాలి ... ఉంటేనే మన సంస్కృతి , సంప్రదాయాలు కలకాలము నిలిచిఉంటాయి.

ఈనాడు మనం 21వ శతాబ్దంలోకి అడుగు పెట్టాము. ఇది ఎంతో స్పీడు యుగం, అయినప్పటికి ఈ జీవితాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకునేందుకు చివరిగా పరమేశ్వర సాయుజ్యం పొందేందుకు మన హిందూ సంస్కృతి సంప్రదాయాలలో మన జీవిత గమ్యం గాడి తప్పకుండా ధర్మార్ధ కామ, మోక్షాల కొరకు చక్కని మార్గాన్ని తల్లి గర్భధారణ మొదలుకొని క్రమపద్ధతిలో జరిగే షోడశ సంస్కారాలతో మనకు ఆరంభమవుతాయి. అట్టి పూలబాటలో అలనాటి మన ఋషులు ఆదర్శవంతంగా ఆచరించి మనకు మార్గగమ్యాన్ని చూపించారు. ఆ బాటలోనివే ఈ నోములు వ్రత్రాలు, ఉపవాసాలు, పండుగలు అన్నవి. వాటికన్నిటికినీ యుగయుగాలనాటి చరిత్రతో మేళవించబడినవి.

అటువంటి పండుగయే ఈ "అక్షయ తృతీయ-ఉగాది" పర్వదినం. . .అక్షయం అంటే క్షయం లేకుండుట. జీవితంలో అన్నింటిని అక్షయం చేసే పర్వదినం కనుక దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది. ఈ రోజున చేసిన హోమాలు, దానాలు, పిత్రుదేవతలకూ, దేవతలకూ చేసే పూజలు, క్షయం కాకుండా, అక్షయంగా ఉంటాయని, అందుచేతనే ఈ రోజుకు అక్షయ తృతీయ అని పేరు వచ్చిందని శ్రీ కృష్ణుడు, ధర్మరాజుకు చెబుతాడు. ఈ అక్షయ తృతీయ నాడు బంగారాన్ని తప్పకుండా కొనాలని తద్వారా లక్ష్మిదేవిని తమ తమ ఇళ్లల్లో సుస్థిరంగా నివాసం ఉండేలా చేయాలని పెద్దలు చెబుతుంటారు. బంగారం కొనుగోలు చేయలేనివారు లవణం (అంటే ఉప్పు)ను కొనుగోలు చేయవచ్చు. ఉప్పు కూడా శ్రీ మహాలక్ష్మికి కటాక్షం కలిగిన వస్తువు కనుక బంగారం కొనలేనివారు ఉప్పును అయినా కొనుగోలు చేస్తే సుఖంగా జీవిస్తారని అంటారు.

వైశాఖ శుద్ధ తదియనాడు జరుపుకునే అక్షయ తృతీయకు చాలా విశిష్టత ఉంది. ఈ రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి విష్ణువును ప్రార్థిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఈ రోజున బదిరీనారాయణ మందిరం ద్వారములు భక్తుల దర్శనం కోసం తెరిచే ఉంటాయని వారు చెబుతున్నారు.

వైశాఖ శుక్లపక్ష తృతీయ రోహిణియుతమైన రోజునే, అక్షయతృతీయ పర్వదినంగా జరుపుకుంటారు. ఈ రోజున దేవతలను, పితృదేవతలను ఆరాధించడం ద్వారా పుణ్య ఫలము సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. గోదానము, భూదానము. సువర్ణదానము, వస్త్రదానము చేసేవారికి సుఖసంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.

అందుచేత అక్షయ తృతీయ రోజున స్త్రీలు చిన్ని కృష్ణునికి, గౌరీదేవీకి డోలోత్సవము జరిపించి ముత్తైదువలను కన్యలను పూజించి ఫలపుష్పాదులను శనగలు వాయనమిచ్చి సత్కరిస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు ఆ గృహం సిరిసంపదలతో వెల్లివిరుస్తుందని విశ్వాసం.
-----------
శ్రీ నరసింహుడు ప్రహ్లాదునికి అనుగ్రహించిన రోజునే "అక్షయ తృతీయ"గా పిలువబడుతోందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున శ్రీ మహాలక్ష్మిదేవిని పూజించడం సంప్రదాయం. ఈ రోజున బంగారం కొని ఇంటికి తెచ్చుకుంటే ఏడాదంతా సిరిసంపదలతో వర్ధిల్లుతారని విశ్వాసం.
బంగారం కొనలేని పక్షంలో శ్రీ మహాలక్ష్మి ప్రతిమ లేదా ఫోటో ముందు.. ఉప్పు, పచ్చిబియ్యం, పసుపును ఓ అరటి ఆకుపై పోసి నిష్ఠతో ప్రార్థించి, కర్పూర నీరాజనాలు సమర్పించుకునే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు.
అదేవిధంగా ఇదే రోజున నరసింహస్వామిని పుష్ప, ఫలాలను అర్పించి దైవ నామస్మరణ చేసిన వారికి సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తాయని ప్రతీతి. ఇంకా చెప్పాలంటే... ఈ రోజున గోధుమలు, శెనగలు, పెరుగన్నం దానం చేసిన వారికి సకల పాపాలు హరించి, శాశ్వతంగా శివసాయుజ్యం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. వీటితో పాటు గొడుగు, పాదరక్షలు, భూమి, బంగారం, వస్త్రాలను దానం చేసే వారికి పుణ్యం లభిస్తుందని విశ్వాసం.
--------------
విష్ను లక్ష్మీ - vishnu lakshmia
విష్ను లక్ష్మీ - vishnu lakshmia
అక్షయ తృతీయ

"వైశాఖమాసస్య చ యా తృతీయా నవమ్య సౌ కార్తీక శుక్లపక్షే
నభస్య మాసస్య తమిస్రపక్షే త్రయోదశీ పంచదశీ చ మాఘే"

కావున ఇది కృతయుగ ఆరంభ ఉగాది అని విష్ణు పురాణాదులు పేర్కొనుచున్నవి. కొన్ని ప్రాంతములలో వైశాఖశుద్ధ తదియనాడు ఈ పండుగ చేయుచుందురు. ఈనాడే "బదరీనారాయణ" మందిర ద్వారములు భక్తుల దర్శన నిమిత్తం తిరిగి తెరుతురు. అంతవరకు ఈ ఆలయం మంచుతో నిండియుండి అగమ్య గోచరమైన ఈ హృషీకేశము భక్తులచే కిటకిటలాడుచు పూజాదికాలు ప్రారంభమగును. ఈ దినమున కొన్ని ప్రాంతములందు స్త్రీలు చిన్నికృష్ణునికి, గౌరీదేవికి డోలోత్సవము జరిపించి ముత్తైదువలను కన్యలను పూజించి ఫలపుష్పాదులు, శనగలు వాయనమిచ్చి సత్కరించెదరు.

ఈ పుణ్యదినమందు దేవతలను, పితృదేవతలను ఆరాధించుట, గోదానము, భూదానము, సువర్ణదానము, వస్త్రదానము, పూర్ణఘటముతో నిండియున్న ఉదక దానము మున్నగునవి, మరియు ఈ దినమందు చేయు జప, హొమ, దానాదులన్నియు "అక్షయము" పొందునుగాన! ఇది "అక్షయతృతీయ" మని కృష్ణభగవానుడు స్వయముగా ధర్మరాజుకు వివరించినాడు.

ఇందులకొక పురాణగాధకలదు. పూర్వము ఒక వైశ్యుడు ఎన్నో దారిద్ర్య బాధలు వెంటాడుతున్నా; సత్ప్రవర్తన వీడక జీవించుచు ఒకసారి ఒక పౌరాణికుడు "వైశాఖశుద్ధ తృతీయ నాడు చేయు స్వల్పదానమైనను అక్షయ ఫలప్రదము" అని చెప్పగా విని, ఆ దినమందు గంగలో పుణ్యస్నానమాచరించి దేవతలకు, పితృదేవలకు తర్పణమాచరించి, ఇంటికి వచ్చి సద్‌బ్రాహ్మణులను ఆహ్వానించి వారికి యథాశక్తి భోజన తాంబూలాదులతో దానమిచ్చెను. అలా ఆచరించిన పుణ్యఫలమే వాని వెంటవచ్చి మరుజన్మమున అతడు కుశావతీ నగరమునకు రాజుగా జన్మించెను. అయినను అతడు ఎన్నో యజ్ఞయాగాదులు, దానధర్మాలు నిర్వర్తించుచున్నను వాని సంపద అక్షయమగుటే గాని తరుగలేదుట. "అందువల్లనే మన పౌరాణికుల మాటలు పెడచెవిని పెట్టకుండా, విశ్వసించే వారికి విశ్వసించినంత ఫలం ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు.

"వైశాఖ శుక్ల పక్షేతు తృతీయా రోహిణి యుతా,
దుర్లభా బుధచారేణ సోమనాపి యుతా తథా"

వైశాఖ శుక్లపక్ష తృతీయ రోహిణీయుతమైన అత్యంత పుణ్యప్రదమైనది అని విష్ణుపురాణాదులు చెప్పుచున్నవని, పరమభాగవతోత్తముడు నారదీయవచనమును నిర్ణయామృతకారుడు ఉదహరించినాడు. అట్టి పుణ్య ఫలాన్ని అందించే ఈ అక్షయ తృతీయను భక్తి శ్రద్ధలతో ఆచరించి సర్వులము పునీతులౌదాము.

ఈ క్రమంలో ఈ నెల 16వ తేదీన వచ్చే అక్షయ తృతీయ నాడు జాతక రీత్యా 12 రాశులకు చెందిన జాతకులు, ఏయే దేవతలు పూజించాలనే విషయాన్ని జ్యోతిష్య నిపుణులు ఇలా చెబుతున్నారు.

అక్షయ తృతీయ నాడు మేషరాశిలో పుట్టిన జాతకులు వినాయక, సుబ్రహ్మణ్య స్వాములను పూజించడం మంచిది. ఇంకా విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యులకు అర్చనలు చేసి పాయసం దానం చేసే వారికి సకల సంపదలు, సుఖసంతోషాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.

అలాగే వృషభ రాశిలో జన్మించిన జాతకులు శాంతరూపంలో దర్శనమిస్తున్న అంబికాదేవికి స్మరించడం, పూజించడం చేయాలి. అమ్మవారికి చక్కెర పొంగలి, పాలతో చేసిన పాయసం లేదా రవ్వలడ్డును నైవేద్యంగా సమర్పించుకుంటే.. ఈతిబాధలు తొలగిపోతాయి. ఇంకా ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేయిస్తే శుభ ఫలితాలుంటాయి.

ఇక మిథున రాశిలో పుట్టిన జాతకులు అక్షయ తృతీయనాడు విష్ణు, మహాలక్ష్మీలను పూజించడం శ్రేయస్కరం. విష్ణు, మహాలక్ష్మీదేవిని అష్టోత్తరాలతో పూజించి, బ్రాహ్మణులకు, పేదలకు చేతనైనా సహాయం చేయడం ద్వారా ఆర్థికాభివృద్ధి చేకూరుతుందని పురోహితులు చెబుతున్నారు.

కర్కాటక రాశిలో జన్మించిన జాతకులు దుర్గమ్మ తల్లిని పూజించడం చేయాలి. దుర్గమ్మ తల్లికి నేతితో దీపమెలిగించి బియ్యం పిండితో చేసే పదార్థాలను దానం చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

ఇక సింహరాశిలో పుట్టిన జాతకులు పరమేశ్వరుడిని, కన్యారాశిలో జన్మించిన జాతకులు విష్ణు, మహాలక్ష్మీదేవిలను ఆరాధించడం ద్వారా సకల సంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు. సింహ, కన్యారాశిలో పుట్టిన జాతకులు అక్షయ తృతీయ నాడు శివావిష్ణులువుండే ఆలయాలను సందర్శించడం చాలా మంచిది.

తులారాశిలో పుట్టిన జాతకులు దుర్గమ్మను, వృశ్చిక రాశి జాతకులు వినాయకస్వామి, సుబ్రహ్మణ్యులను పూజించడం మంచిది. అలాగే ధనుస్సురాశిలో పుట్టిన జాతకులు దక్షిణామూర్తిని ఆరాధించడం మంచిది. ఇంకా దక్షిణామూర్తికి తెల్లటిపువ్వులతో కూడిన మాలను సమర్పించుకోవడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

ఇకపోతే.. మకరరాశిలో జన్మించిన జాతకులు విఘ్నేశ్వరుడు, హనుమంతుడిని పూజించడం మంచిది. అక్షయ తృతీయ నాడు హనుమంతునికి తమలపాకులతో మాల, వెన్నను సమర్పించుకునే వారికి మనోధైర్యం ఏర్పడుతుంది. ఇంకా ఈతిబాధలు తొలగిపోయి మానసిక ప్రశాంతత నెలకొంటుంది. అలాగే విఘ్నేశ్వరునికి గరిక మాలను సమర్పించుకోవచ్చు.

అలాగే కుంభ రాశి జాతకులు శనీశ్వరుడు, హనుమంతుడిని, మీన రాశి జాతకులు నందీశ్వరుడిని పూజించడం ద్వారా వ్యాపారాభివృద్ధి, కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

24, మార్చి 2020, మంగళవారం

ఉగాది - మీకు తెలియని ఎన్నో ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోండి - Ugadi festival

ఉగాది - మీకు తెలియని ఎన్నో ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోండి - Ugadi festival
సంవత్సరంలో మొదటి రోజైన ఉగాదికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాముఖ్యత  "జనవరి ఫస్ట్’కి లేదు. ఆ ప్రాముఖ్యత భూమి లోపల జరుగుతున్నదానికీ, మనిషి శరీరంలో, మనస్సులో జరుగుతున్నదానికీ సంబంధించినది. ఉగాది మనిషి శరీర నిర్మాణంతో ప్రత్యక్ష సంబంధం ఉన్న చంద్రమాన-సౌరమాన పంచాంగాన్ని(క్యాలండర్‌ని) అనుసరిస్తుంది. గ్రహగతితో మిమ్మల్ని అనుసంధానం చేస్తూ ఉండటం వల్ల భారతీయ క్యాలండర్ సాంస్కృతికంగానే గాక, శాస్త్రీయంగా కూడా ప్రాముఖ్యత కలిగి ఉంది.

తరతరాలుగా భారతీయులు అనుసరిస్తున్న చంద్రమాన-సౌరమాన పంచాంగం ప్రకారం సంవత్సరంలోని మొదటి రోజుని “చంద్రమాన ఉగాది” అంటారు. తూర్పు సంస్కృతి నుంచి వచ్చే అన్నిటి లాగానే, పంచాంగం(క్యాలండర్) కూడా మనిషి శరీరంలో, చేతన(consciousness)లో జరుగుతున్న వాటికి అనుగుణంగానే ఉంటుంది. ఉగాది నుండి మొదలయ్యే మొదటి 21 రోజులలో భూమి ఒక పక్కకు వొంగి ఉండటం వల్ల ఉత్తరధృవం అత్యధిక సూర్యశక్తిని పొందుతుంది. ఉష్ణోగ్రత ఎక్కువ కావడం వల్ల మనుషులకు ఇబ్బందికరంగా ఉంటుండవచ్చు కానీ, భూమి యొక్క బ్యాటరీలు నింపబడేది కూడా ఈ సమయంలోనే.
ఉగాదిని ‘నూతన సంవత్సర ఆరంభదినం’ గా జరుపుకుంటున్నది కేవలం నమ్మకం వలనో లేదా అనుకూలంగా ఉంటుందనో కాదు. దాని వెనుక మానవ శ్రేయస్సును ఎన్నో విధాలుగా పెంపొందించే ఒక శాస్త్రవిజ్ఞానమే ఉంది
ఉష్ణమండలాల్లో సంవత్సరంలో అత్యధిక ఉష్ణోగ్రత ఉండే ఈ సమయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. ఈ సాంప్రదాయంలో, సంవత్సరంలో ఈ భాగాన్ని శరీరానికి చల్లదనాన్నిచ్చే ఆముదం లాంటి నూనెలను విస్తృతంగా పూసుకొని ప్రారంభిస్తారు. గ్రహగతితో మానవ అనుభావానికి ఉన్న సంబంధాన్ని పట్టించుకోని ఆధునిక క్యాలండర్ల మాదిరిగా కాక, చంద్రమాన-సౌరమాన క్యాలండర్ గ్రహగతి వల్ల మనిషిలో కలిగే అనుభవాన్ని, అతనిపై పడే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. అందుకే ఈ క్యాలండర్‌ని అక్షాంశాల ఆధారంగా సరిచేస్తారు.

ఉగాదిని ‘నూతన సంవత్సర ఆరంభదినం’ గా జరుపుకుంటున్నది కేవలం నమ్మకం వలనో
లేదా అనుకూలంగా ఉంటుందనో కాదు. దాని వెనుక మానవ శ్రేయస్సును ఎన్నో విధాలుగా పెంపొందించే ఒక శాస్త్రవిజ్ఞానమే ఉంది.మన దేశంలోని ప్రగాఢ జ్ఞానాన్ని ఈ రోజున ఒక పనికిమాలిని విషయంగా పరిగణిస్తున్నారు. దానికి కారణం కొన్ని దేశాలు మన దేశం కంటే ఎక్కువ ఆర్ధిక పురోగతిని సాధించడమే. మనం కూడా ఆ ఆర్ధిక పురోగతిని తొందరలోనే సాధిస్తాం, కాని ఈ సంస్కృతి అందిస్తున్న ప్రగాఢ జ్ఞానాన్ని కొన్ని సంవత్సరాలలో సృష్టించలేం. ఇది వేలాది సంవత్సరాల కృషి ఫలితం.

నూతన సంవత్సరం ఆరంభించడానికి మీరు చేయగలిగే అతి సులభమైన పని ఏమిటంటే మీరు ఫోన్ ఎత్తుకున్నప్పుడు, “హలో”, “హాయ్” లేదా అలాంటిదేదో అనకండి. “నమస్తే”, “నమస్కారం”, “నమస్కార్”  అని అనండి. ఇలాంటి పదాలను మన జీవితంలో ఉచ్చరించడంలో ఒక ప్రాముఖ్యత ఉంది. అదేమిటంటే మనం భగవంతునితో ఏమైతే అంటున్నామో లేదా చేస్తున్నామో, అదే మన చుట్టూ ఉన్న వాళ్లకు చేస్తున్నాము. ఇది అత్యున్నత జీవన విధానం.

మీకు ఒకటి ప్రవిత్రమైనదీ, మరొకటి అపవిత్రమైనదీ అయితే, అసలు విషయాన్ని మీరు ఏ మాత్రం గ్రహించటం లేదని అర్ధం. ఈ నూతన సంవత్సరాన్ని అందరిలో దైవత్వాన్ని గుర్తించే అవకాశంగా మీరు మలచుకోవాలని నేను ఆశిస్తున్నాను.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

15, జనవరి 2020, బుధవారం

భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు - Bhogi, Sankranthi, kanuma festivals

భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు - Bhogi Sankranthi kanuma festivals

భోగి, సంక్రాంతి, కనుమ :
సంక్రాంతి అభ్యుధయ కాముకులను కూడా సంప్రదాయం వైపు మళ్ళిస్తుంది. పండుగలు, పర్వాలు వచ్చినప్పుడల్లా అభ్యుదయ కవులు సైతం సంప్రదాయం వైపు మొగ్గుచూపుతారు. అసలు అదే ఈ పండుగల లక్ష్యంగా కనబడుతుంది.

సంక్రాంతికి ముందే నెల పెట్టడం అని ముగ్గులు పెట్టడం, గొబ్బెమ్మలతో అలంకరించడం నెలరోజులపాటు సాగుతుంది. చివరి రోజున రధం ముగ్గును వేస్తారు. జానపదుల కళలు ఈ సంక్రాంతి పండుగ . ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా బహిర్గతమవడమే కాకుండా ప్రదర్శింపబడతాయి. వీటిలో చెప్పుకోతగ్గది "గంగిరెద్దుల" ఆట. కొన్ని గ్రామాలలో ఐతే 'కోడి పందాల ఆట' ,పొట్టేలు పందేలు కూడా ఆడుతారు. ఆనందతో ఎన్ని ఆటలైనా ఆడవచ్చును .

ఇంకా సంక్రాంతి ప్రత్యేకత శాస్త్రపరంగా చాలా ఉంది. నక్షత్రాల ఇరువది ఏడు. మళ్ళీ ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు. మొత్తం 108 పాదాలుగా విభజింపబడినాయి. తిరిగి 108 పాదాల్నీ 12 రాశులుగా విభాగించారు. సూర్యుడు నెలకొకరాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి ఆ సంక్రాంతిగా వ్యవహరింపబడుతుంది. ఇలా సంవత్సరానికి 12 సంక్రాంతులు ఉంటాయి . సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశిని 'మకర సంక్రాంతి' అని అంటారు.

రాసులు
1.మేషము 2.వృషభము 3.మిధునము 4.కర్కాటకము 5.సింహము 6.కన్య 7.తుల 8.వృశ్చికము 9.ధనుస్సు 10.మకరము 11.కుంభము 12.మీనము . మళ్ళీ సంవస్తరాన్ని రెండు ఆయణములు గా విభజించారు . ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం అయితే 6 నెలలు దక్షిణాయణం . ఖగోళ శాస్త్రం ప్రకారము ప్రతిసంవత్సరము జూలై 16 నుండి జనవరి 14 వరకు ఉండే కాలాన్ని ఉత్తరాయణం అని , జనవరి 15 నుండి జూలై 15 వరకు దక్షిణాయణం అని అంటారు . ఇంతటి మార్పుకు సంబంధించిన రహస్యాన్ని లోకం లోని అతిసామాన్యులకు అర్ధమయ్యేలా వివరించేందుకు పండగను చేసుకునే అలవాటును ప్రచారం లోనికి తెచ్చారు .

హిందువులు అంతా పెద్దల నుండి పిన్నల వరకు అత్యంత ప్రీతిపాత్రంగా ఆచరించే పండుగలలో "సంక్రాంతి" ప్రముఖస్ధానం సంపాదించుకుంది. ఇది పుష్యమాసంలో సూర్యుడు "మకరరాశిలో" ప్రవేశించిన పుణ్యదినం.

ఈ సంక్రాంతిలో "సం" అంటే మిక్కిలి "క్రాంతి" అంటే అభ్యుదయం. మంచి అభ్యుదయాన్ని ఇచ్చు క్రాంతి కనుక దీనిని "సంక్రాంతి" గా పెద్దలు వివరణ చెబుతూ "మకరం" అంటే! మొసలి. ఇది పట్టుకుంటే వదలదు అని మనకు తెలుసు. కాని మానవుని యొక్క ఆధ్యాత్మిక మార్గానికి అడుగడుగునా అడ్డుతగులుతూ, మొక్షమార్గానికి అనర్హుని చేయుటలో ఇది అందవేసినచేయి! అందువల్ల ఈ "మకర సంక్రమణం" పుణ్యదినాలలో దీని బారినుండి తప్పించుకునేందుకు ఒకటేమార్గం అది ఎవరికి వారు యధాశక్తి 'లేదు' అనకుండా దానధర్మాలు చేయుటయే మంచిదని, శాస్త్రకోవిదులు చెబుతూ ఉంటారు. అలా! కేవలం అప్పుడే కాకుండా! నిత్య జీవనంలో కూడా దాని బారిని పడకుండా చూచుకుంటూ ఉండాలికదా! మరి. ఇక ఈ పండుగల లోని విశిష్టత ఏమిటో తెలుసుకుందాం.

తెలుగువారికి అత్యంత ప్రియమైన పండుగలు, వరుసగా మూడు రోజులు వచ్చే పండుగలు ఇవే! ముఖ్యంగా 'సంక్రాంతి' అని పిలుచుకుంటాం. దీనిని పెద్ద పండుగ అని కూడా అంటారు. పుష్యమాసంలో వచ్చే ఈ పండుగకు ఇంటికి ధనధాన్య రాశులు చేరతాయి. పౌష్యలక్ష్మితో కళకళలాడే గృహ ప్రాంగణాలతో, ఇల్లిల్లూ ఒకకొత్త శోభతో వెలుగుతూ ఉంటుంది. ఇంకా ఈ పండుగ వస్తుందంటే పిండి వంటలతో ముఖ్యంగా అరిసెలు, చక్రాలలతో అందరి ఇళ్ళు ఘుమ ఘుమ లాడుతూ ఉంటాయి.

మొదటి రోజు 'భోగి'. ఇది జనవరి 14న వస్తుంది. ఈ రోజున ఉదయం తెల్లవారక ముందే, అంటే 3:30, 4:00 మధ్యలో అందరూ లేచి భోగి మంటలు వెలిగిస్తారు. దీనిని సంవత్సరంలో ఆ కాలంలో ఉండే చలి పారద్రోలటానికే కాక ఇంకో సందర్భంగా కూడా జరుపుకుంటారు. ఇంట్లో ఉండే పాత చీపుర్లూ, తట్టలూ, విరిగిపోయిన బల్లలూ వగైరాలను వదిలేసి, భోగి మంటలు వీసి , కొత్తవాటితో నిత్య నూతన జీవితం ఆరంబించటానికి గుర్తుగా కూడా ఈ రోజున భోగి మంటలు వెలిగిస్తారు.

సాయంత్రం పూట చాలా ఇళ్ళలో చిన్న పిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. బొమ్మల కొలువు లో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆటవస్తువులను ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు. ఇంకొంత మంది భోగి పళ్ళ పేరంటం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పేరంటాళ్ళు మరియు బందువులు సమావేశమై, రేగిపళ్ళు, శనగలు, పూలు, చెరుకుగడలు, మరియు కొన్ని నాణాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చినవారికి తాంబూలాలతో పాటు పట్టుబట్టలు, పసుపు, కుంకుమలు పెట్టడం ఆనవాయితీ. పంట చేతికొచ్చిన ఆనందలో ఇళ్ళకు అల్లుళ్ళని, కూతుళ్ళని ఆహ్వానిస్తారు.

రెండో రోజు 'మకర సంక్రాంతి'. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే శుభదినం. ఈ పండుగకు కొత్తశోభ తీసుకురావడానికి, వారం, పది రోజుల ముందే ఇళ్ళకు సున్నాలు, రంగులు వేయడం ఆనవాయితీ. .

సంక్రాంతి రోజున పాలు పొంగించి, దానితో మిఠాయిలు తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్ళలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, సాకినాలు, పాలతాలుకలు, సేమియాపాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలయిన వంటకాలు చేసి, కొత్తబట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు.ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు.ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. కాని మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు. సంక్రాంతి రోజులలో మనము చూసే ఇంకో సుందర దృశ్యం.. గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తూ కొత్తగా వచ్చిన ధాన్యాన్ని అడుక్కుంటారు. హరిలో రంగ హరీ అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు త్రొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడి తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు.

Bhogi, Sankranthi, kanuma festivals
మూడో రోజు 'కనుమ'. దీన్నే పశువుల పండుగ అని అంటారు. తమ చేతికొచ్చిన పంటను తామేకాక, పశువులూ, పక్షులూ పాలుపంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. పల్లెల్లో పశువులే గొప్పసంపద. అవి ఆనందంగా ఉంటే రైతుకి ఉత్సాహం. పంటల్లో వీటి పాత్ర ఎంతో ఉంది. వాటిని ప్రేమగా చూసుకొనే రోజుగా కనుమను భావిస్తారు. గొబ్బెమ్మల పూజ, గంగిరెద్దుల హడావుడి, హరిదాసుల రాకడ, కోడిపందాలు, ఎడ్లపందాలు, బంతిపూల తోరణాలు, కొత్త జంటల విహారాలు, ఎంతో ఆహ్లదకరంగా కనిపిస్తాయి.

ఇంతటి విశిష్టమైన పండుగ వింతశోభలు తిలకించాలి అంటే గ్రామసీమలే పట్టుగొమ్మలు. ప్రతి ఇల్లు నూతనంగా ముత్యాల ముగ్గులతో పచ్చని తోరణాలతో, కళకళలాడుతూ! "సంక్రాంతి" లక్ష్మీని ఆహ్వానిస్తూ ఉంటాయి. ఇక ధనుర్మాసము ప్రారంభమైన నాటినుండి వివిధ ఆలయాలలోని అర్చకస్వాములు "సంక్రాంతి" నెలపట్టి సూర్యోదయానికి పూర్వమే మంగళవాయిద్యాలతో నదీజలాలను "తీర్ధంబిందులలో" తోడ్కొని వచ్చి విశేషార్చనలు నిర్వహిస్తారు. ఇంటిముందు కన్నెపిల్లలు కళ్ళాపులు చల్లుతూ! ప్రతిరొజు వివిధ రకాల ముగ్గులతో! సప్తవర్ణాల రంగవల్లికలను తీర్చిదిద్ది "ఇంద్రధనుస్సులను" ముంగిట చూస్తున్నట్లు భ్రమింపచేస్తారు.

ఇంత చక్కని ఆనందాన్నీ మనకు అందించే "సంక్రాంతి" పండుగలు మనం జరుపుకుని మహారాణిలావచ్చే ఆ సంక్రాంతి లక్ష్మీని మన ముంగిటలోనికి ఆహ్వానం పలుకుదాం.

సంక్రాంతి రోజులలొ శుభాలనిచ్చే కొన్ని వ్రతాలు :

సంక్రాంతి నెలపట్టాక కన్నెలు , ముత్తయిదువులు ఎన్నోవ్రతాలు , నోములు నోచుకుంటారు . వాటిలో

1 . బొమ్మల నోము : గతం లో ఆడపిల్లలకు చిన్నవయసు లోనే వివాహము చేసేవారు . వారితో ముక్కనుమ నాడు బొమ్మలనోము పేరిట "సావిత్రి గౌరీదేవి నోము నోయించేవారు . ఈ వ్రతాన్ని వరుసగా తొమ్మిదేళ్ళు చేయాల్సివుంది. దీనివల్ల గృహిణులకు శుభాలు కలుగుతాయని నమ్మకం .

2 . గొబ్బిగౌరీవ్రతం : ఈ వ్రతం భోగి రోజు మొదలవుతుంది . భోగిపండుగనాడు సాయంత్రం నట్టింట్లో ఓ వైపు మండపం కట్టి అలంకరిస్తారు . ఈ కాలము లో దొరికే పండ్లు , కూరగాయలు , చెరకు గడలతొ అలంకరిస్తారు . మండపం మధ్య బియ్యం పోసి నడుమ గౌరీదేవిని ఉంచి పూజలు చేస్తారు . భోగి నుండి నాలుగో రోజు ఉద్వాసన పలికి , మండపం లో అలంకరించిన కూరగాయలఓ కూర వండుకుంటారు . దీన్నేగొబ్బి కూర అంటారు .

3. గోదాదేవి నోము : పూర్వము గోదాదేవి ' పూర్వఫల్గుణ నక్షత్రం లో , కర్కాటక లగ్నం లో తులసి వనం లో జన్మించినది . ఆమె గోపికలతో కలిసి శ్రీకృష్ణిణ్ణి ఆరాధించినది . ఈమె నెలపెట్టిన రోజు నుండి ధనుర్మాషమంతా ఒక నెలరోజులు వ్రతమాచరించి చివరి రోజైన మకర సంక్రాంతి నాడు విష్ణుమూర్తిని పెళ్ళి చేసుకుంది . ఈ వ్రతకాలము లో ఆమె గోపికలతో కలిసి పూజించినారు ... మనం ఈ నాడు పెట్టే ఆ గొబ్బెమ్మలే గోపికలు .. జనవాడుకలో గోపీ బొమ్మలే గొబ్బెమ్మలుగా పిలవబడుతున్నాయి .

పెళ్ళి కాని ఆడపిల్లలంతా గొబ్బెమ్మలు పెట్టి వాటి చుట్టూపాటలు పాడుతూ , ప్రదక్షిణలు చేస్తూ , తాము గోపికలు గా ఊహించుకొని కృష్ణభగవానుణ్ణి మదిలో అర్పిస్తే మంచి భర్త లభిస్తాడనేది ఓ నమ్మకం .

సంక్రాంతి దేవతకు ఏడు పేర్లు :

ఒక్కో పండుగనాడు ఒక్కో దేవుడిని , దేవతను పూజించడం మన సంప్రదాయం . అలాగె సంక్రాంతి పండుగకూ ఓ అధిష్టానదేవత వుంది . ఆ దేవి పేరు పండుగ నాటి వారం తో ముడిపడి వుంటుంది .
పండుగ
 1. ఆదివారం వస్తే దేవత పేరు ....... ఘోర.
 2. సోమవారం వస్తే దేవత పేరు ......ధ్వంక్షి .
 3. మంగళవారం వస్తే దేవత పేరు ....మహోదరి ,
 4. బుధవారం వస్తే దేవత పేరు ........మందాకిని ,
 5. గురువారం వస్తే దేవత పేరు ........మంద ,
 6. శుక్రవారం వస్తే దేవత పేరు .........మిశ్ర ,
 7. శనివారం వస్తే దేవత పేరు ...........రాక్షసి ,
పండుగ ప్రత్యేకతలు:

ముగ్గులు
రాళ్ళూ రప్పలూ లేకుండా ఒక పద్దతిలో అలకబడిన నేల, మేఘాలు లేని ఆకాశానికి సంకేతం. ఒక పద్దతిలో పెట్టబడు చుక్కలు రాత్రి వేళ కనిపించే నక్షత్రాలకు సంకేతం. చుక్కలచుట్టూ తిరుగుతూ చుక్కలను గళ్ళలో ఇమిడ్చే ముగ్గు ఖగోళంలో ఎప్పడికప్పుడు కనిపించే మార్పులకు సంకేతం. ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మద్య గడిలో పెట్టే చుక్క సూర్యు స్థానానికి సంకేతం. ఇక వివిధ ఆకారాలతో వేయు ముగ్గులు విల్లు ఆకారం పునర్వసు నక్షత్రానికీ, పుష్పం పుష్యమీ నక్షత్రానికీ పాము ఆకారము ఆశ్లేష కూ, మేక, ఎద్దు, పీత, సింహం, ఇలాంటివి మేష , వృషభ, మిధున, కర్కాటక రాసులకూ, తొమ్మిది గడుల ముగ్గు నవగ్రహాలు కూ సంకేతాలుగా చెప్పచ్చు.

రధం ముగ్గు
మూడు రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు పుట్టినదే రధం ముగ్గు. అందరూ ఒకరికి ఒకరు తోడుంటూ కలసి సహజీవనం సాగించాలి అనే సంకేతాలతో ఒక రధం ముగ్గు తాడును మరొక ఇంటి వారి ముగ్గుతో కలుపుతూ పోతూంటారు.

గొబ్బెమ్మలు
పెద్ద వయసు స్త్రీలు ముగ్గులు పెడుతుంటే చిన్న వయసు ఆడపిల్లలు ఆవు పేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళ్ళైన గోపికలకు సంకేతం. ఈ ముద్దల తలమీద కనుపించే రంగుల పూలరేకులు, పసుపు కుంకుమలు ఆ గోపికలందరూ భర్తలు జీవించియున్న పునిస్త్రీలకు సంకేతం. ఆ గోపికా స్త్రీల రూపాలకు సంకేతమే గోపీ+బొమ్మలు= గొబ్బెమ్మలు. మద్య ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణ భక్తి తమకూ కలగాలని ప్రార్ధిస్తుంటారు. దీనిని సందె గొబ్బెమ్మ అంటారు. గొబ్బెమ్మలు పొద్దున పూట ముగ్గులో ఉంచి, దానిపై గుమ్మడి పూలు తొ అలంకారం చేస్తే చాలా అందంగా ఉంటుంది.
Bhogi, Sankranthi, kanuma festivals
బోగిమంట:

భోగిలో వేయడానికి భోగిముళ్ళు ఈడ్చుకుని వస్తున్న దృశ్యం

మూడురోజులపాటు సాగే సంక్రాంతి పండుగలో మొదటి రోజున నాలుగు మార్గాల కూడలిలో వేయబడే పెద్ద మంట. అప్పటి నుండి ఇంతకంటే మరింత వేడితో ఉత్తరాయణ సూర్యుడు రాబోతున్నడనే సంకేతం. దక్షణాయంలో ఉండే నిద్ర బద్దకంతో సహా దగ్ధం చేయాలనే సంకేతంతో చీకటితోనే బోగిమంట వేస్తారు. ఇంట్లో ఉండే పాత కలపసామానులు, వస్తువులు, ఎండుకొమ్మలు లాంటివి బోగి మంటలో వేసి తగులబెడుతారు. వీటన్నిటినీ దారిద్ర్య చిహ్నాలుగా బావించి తగులబెట్టాలంటారు. వేసవిలో వేడికి తగులబడే వాటిని గుర్తించాలనే మరొక సంకేతం కూడా ఇందులో దాగిఉంది.

బోగిపళ్ళు
బోగి పండ్లు అంటే రేగుపండ్లు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగ. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపండ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో బోగిపండ్లు పోస్తారు.

తిల తర్పణం
సంవత్సరంలో మిగిలిన రోజులలో నల్ల నువ్వులు వాడరు. కాని సంక్రాంతి పర్వధినాన మాత్రం నల్లనువ్వులతో మరణించిన పిత్రుదేవతలందరికీ తర్పణములివ్వడం ఎక్కువగా చేస్తుంటారు. దీన్నే పెద్దలకు పెట్టుకోవడం అంటుంటారు. సంక్రాంతి పర్వధినాలలో వారి వారి ఆచార సంప్రదాయాలను అనుసరించి ఈ కార్యక్రమము చేస్తుంటారు. ఈ రోజు బూడిద గుమ్మడి కాయ దానము ఇస్తారు.

సంకురుమయ / సంక్రాంతి పురుషుడు
మట్టి తో ఒక బొమ్మను (సంక్రాంతి పురుషుడు), తన వాహనాన్ని (ప్రతి సంవత్సరం వేరు వేరు వాహనాల పై పురుషుడు వస్తాడు. ఏ వాహనాన్ని ఎక్కితే ఆ వాహనానికి ఆ సంవత్సరం ఎక్కువ నష్టము అని ఒక నమ్మకం) , మేళ తారళాలను చేసి, సంక్రాంతి మూడు రోజుల్లొ పూజలు చేస్తారు. నాల్గవ నాడు ఈ బొమ్మలను వాల్లాడిస్తారు.

హరిదాసు
గొబ్బిళ్ళతో ఇంటి ముందరి భాగాన్ని అలంకరించి హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్ శ్రీకృస్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని సంకేతం. ఆయన తలమీద మంచి గుమ్మడి కాయా ఆకారంలో గల పాత్ర గుండ్రముగా ఉండే భూమికి సంకేతం దాన్ని తలమీద పెట్టుకొని ఉండటం శ్రీ హరి అయిన తానే భూమిని ఉద్దరిస్తున్నానని { ఉత్+దరించు= తలమీద పెట్టుకోవడం} అని చెప్పే దానికి సంకేతం. హరినామ కీర్తన చేస్తూ రావడం తను ఏ భోగాలకూ లొంగను కేవలం హరినామ సంకీర్తనకే వచ్చే వాడిననీ తనకు తమపర భేదాలు లేవనీ అందుకే ప్రతి ఇంటికీ తిరుగుతూ వస్తాడనే సంకేతం.

గంగిరెద్దు
ముందు వెనుకల చెరో ప్రమదునితో {శివ గణం} ఎత్తైన మూపురం శివలింగాకృతిని గుర్తుచేస్తూ శివునితో సహా తను సంక్రాంతి సంభరాలకు హాజరయ్యానని చెప్పే సంకేతం గంగిరెద్దు. ఆవు లేదా ఎద్దు ఇంటి ముందు ముగ్గులో నిలిచిందంటే ఆనేల ధర్మభద్దమైనదని అర్ధం. "జుగోప గోరూప ధరామివోర్విం" దీని అర్ధం ఆ నేల ఆవుకి సంకేతం ఆనేలనుండి వచ్చిన పంటకు సంకేతం ముంగిట నిలిచిన వృషభం. మీరు చేసే దానమంతా ధర్మభద్దమేనంటూ దానిని మేము ఆమోదిస్తున్నామని ఇంటింటికీ తిరుగుతుంటారు వృషభసహిత శంకర పరివారం.

కొన్ని విశేషాలు:
 • హిందువుల పండుగలలో సంక్రాంతి మాత్రమే సౌరగమనాన్ని అనుసరించి వస్తుంది. గ్రెగోరియను కాలెండరు కూడా సౌరమానాన్ని అనుసరిస్తుంది కనుక సంక్రాంతి ప్రతీ సంవత్సరం ఒకే తేదీన వస్తుంది. మిగిలిన పండుగలన్నీ భారతీయ సాంప్రదాయం ప్రకారం చాంద్రమానాన్ని అనుసరించి వస్తాయి. కాబట్టి గ్రెగోరియను కాలెండరు ప్రకారం ఏటికేడాది వేరువేరు రోజుల్లో వస్తాయి.
 • పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించినవారు స్వర్గానికి వెళ్తారని హిందువుల నమ్మకం. సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది.అంచేతే భారతంలో స్వచ్ఛంద మరణం కలిగిన భీష్మాచార్యుడు సంక్రాంతి పర్వదినం వరకూ ఆగి, ఉత్తరాయణం లో రథసప్తమి (మాఘ శుద్ధ సప్తమి) నాడు ప్రారంభించి, రోజునకు ఒక్కొక్క ప్రాణం చొప్పున వదులుతూ, చివరకు భీష్మఏకాదశి మాఘ శుద్ధ ఏకాదశి నాడు ఐదవ ప్రాణాన్ని కూడా వదిలి, తనువు చాలించాడు.
 • ఆది శంకరాచార్యుడు ఈరోజునే సన్యాసం పుచ్చుకున్నాడు.
 • ఆంధ్ర ప్రదేశ్ లో పెద్ద పెద్ద తారలు తమ సినిమాలను సంక్రాంతి సమయంలోనే విడుదల చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.
రచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి

13, జనవరి 2020, సోమవారం

సంక్రాంతి పండుగ రోజున బొమ్మల కొలువు, గొబ్బెమ్మలు, భోగిపండ్లు - ప్రాసిత్యం గురించి తెలుసుకోండి !

sankranti-bhogi-gobbemmalu-mariyu-bhogipandlu

బొమ్మల కొలువు, గొబ్బెమ్మలు, భోగిపండ్లు:
సంక్రాంతి పండుగ ముందు రోజు భోగి. ఇంటిలో ఒక ప్రక్కగా ఇసుక పోసి పార్కులాగా తయారు చేయాలి. రాగులు, మెంతులు, లేక ఆవాలు ఏవైనా ఒక ఆకారముగా ఇసుకలో చల్లాలి. అవి మొక్కలు వస్తాయి. 10 రోజుల ముందుగానే ఇలా చేయాలి. వాటికి మధ్య మధ్యలో చిన్న పెద్ద బొమ్మలతో అలంకరించాలి. మనసుకు నచ్చిన ఆలోచనలతో చేసుకొనవచ్చును. కృష్ణుణ్ని కూడా పెట్టి, ఆ కృష్ణునికీ భోగిపండ్లు పోయాలి. మెట్లు ఆకారములో చేసి ఒక గుడ్డపరచి వాని మీద కూడ బొమ్మలు పేర్చి అలంకరింపవచ్చును.

గొబ్బెమ్మలు:
ఆవుపేడతో 5 ముద్దలు చేసి ఒక పీట మీద 4 వైపులా మధ్యలో పెట్టవలెను. వీనికన్న చిన్నవి 5 ముద్దలు చేసి పెద్ద వాని పైన పెట్టవలెను. అన్ని 11 గొబ్బెమ్మలు అవుతాయి. వాటి మీద బియ్యంపిండితోను, పసుపు, కుంకుమతో గీతలు గీసి పూలతో అలంకరించాలి. ఆ పీటను మెల్లాలో మధ్యగా పెట్టి పిల్లలను 4 వైపులా కూర్చొన పెట్టాలి. లక్ష్మి అష్టోత్తరముతో పూజచేయించాలి. కొబ్బరికాయ కొట్టి, పండ్లు, నైవేద్యము పెట్టాలి. తరువాత పిల్లలు పీట చుట్టూ భజన చేయుచూ, కోలాటము చేయుచూ, తిరుగుతారు. కృష్ణుని మీద పాటలు, గొబ్బెమ్మల పాటలు పాడతారు.
పసుపు, కుంకుమ, అక్షింతలు, అగరుబత్తీలు, పండ్లు, టెంకాయ, కర్పూరము, గంట, హారతి, అరివేణి, ఉద్ధరిణ, పంచపాత్ర, కూర్చొనుటకు టవల్సు అన్ని రెడీ చేసుకోవాలి. 
భోగిపండ్లు:
పిల్లలను కుర్చీలో కూర్చో పెట్టి హారతి పట్టవలెను. ముందుగా కృష్ణునికి హారతి అద్ది తరువాత పిల్లలకు అద్దవలెను. కృష్ణునికి భోగిపండ్లు పోసి, తరువాత పిల్లలకు 3 సార్లు కొద్దికొద్దిగా పోయవలెను. అందరు పోయవచ్చును.

భోగిపండ్లు - రేగిపండ్లు, నానిన శనగలు, బంతిపూల రేకులు, చిల్లర నాణేలు అన్ని కలుపుకొనవలెను.

సంక్రాంతి పండుగ రోజున పోసిన పండుగ పండ్లు అందురు.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

13, మే 2019, సోమవారం

అట్లతద్ది - Atla Thaddi

అట్లతద్ది - Atla Thaddi
అట్లతద్ది:
ప్రతీ సంవత్సరం ఆశ్వీయుజ బహుళ తదియనాడు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ "చంద్రోదయ ఉమావ్రతం - అట్లతద్ది" స్త్రీలకు చక్కని ఆనందాన్ని జీవితంలో చక్కని విచిత్రానుభూతులను కలిగిస్తూ ఉంటుంది. ఈ పండుగలో ఒక విశేషం ఉన్నది. కొన్ని వ్రతాలైతే వివాహితులైన స్త్రీలు మాత్రమే నిర్వహిస్తారు. కానీ, ఈ పండుగ పిన్నలు, పెద్దలు కూడా కలిసి వయోభేదం లేకుండా ఆచరిస్తారు. పిల్లలతోబాటు తల్లులు కూడా 20 సం|| వెనకకి పోయి బాల్యజీవితంలోకి వెళ్ళి ఆనందం పొందుతారు. ఇక మూడుకాళ్ల ముదుసలి అయిన బామ్మగారు కూడా! వారి ఆటలాడుకుంటున్న వారినందరని తన దగ్గరకు రప్పించుకుని అమ్మాయిలూ... చూచారా... నా చిన్నప్పుడూ! అంటూ, వారి చిన్ననాటి జ్ఞాపకాలు, అనుభవాలు ..చూచారా... నా చిన్నప్పుడూ! అంటూ ఉంటారు. అటువంటి వృద్ధులలో నవయవ్వనం తొణికిసలాడేది ఈ పండుగలోనే. ఇట్టి ఆటపాటలు కనువిందుచెయ్యాలి అంటే పల్లెసీమలే పట్టుకొమ్మలు.

ఈ పండుగను పల్లెలలో అయితే ఊయల పండుగ అంటూ, మరికొందరు గోరింటాకు పండుగ అంటూ, ఇలా ఈ "చంద్రోదయ ఉమావ్రతం - అట్లతద్ది" పండుగను వివిధ నామాలతో పిలుచుకుంటూ ఉంటారు. స్త్రీలకు ఇటు చక్కని ఆనందాన్ని అటు సకల సౌభాగ్యాలను ఒసగే ఈ పండూగలోని ఆ "ఉమాదేవిని" ఒక్కసారి ఇలా ప్రార్థించి మరలా ముచ్చటించుకుందాం! 

అట్లతద్ది:
శ్లో|| ఓం హ్రీం కాలాభ్రాం భాం కటాక్షై రశికుల
భయదాం మౌలిబద్దేందురేఖాం
శంఖచక్రం కృపాణం త్రిశిఖమపి
కర్తైరుద్వహంతీ త్రినేత్రామ్
సింహస్కంధాదిరూఢాం త్రిభువన మఖిలం
తేజసా పూరయంతీం
ధ్యాయేత్ దుర్గాం జయాఖ్యాం
త్రిదశపరివృతాం సేవితాం సిద్ధికామైః || 
భోగి పండుగ 
ఇక ఈ పండుగ ముందు రోజు భోగి అంటారు. ఈ రోజు స్త్రీలు, పిన్నలు, పెద్దలు చేతులకు పాదాలకు గోరింటాకు పెట్టుకొని, ఎవరిచేయి బాగా పండితే వారు అంత అదృష్టవంతులై వారి అభీష్టాలు అన్ని నెరవేరుతాయని విశ్వసిస్తూ ఉంటారు. తరువాత ఒకరిచేతులు ఒకరికి చూపించుకుంటూ నాచేయి బాగా పండింది అంటే! నా చేయి బాగా పండింది అంటూ సంబరపడిపోతూ ఉంటారు.
ఊయల - Swing
ఊయల - Swing 
ఈ పండుగ కోసం ప్రతి ఇంటా వారి పెరిటిలో ఊయల కట్టుకుంటారు. మరుసటి రోజు ఆశ్వీయుజ బహుళ తదియనాడు (అట్లతద్ది) తెల్లవారు ఝామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని, "చద్దీన్నం గోంగూరపచ్చడి పెరుగు అన్నం" తో కడుపార భుజించి, ఇరుగు పొగురువారినందరిని లేపుతూ.... అట్లతద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లోయ్...అంటూ! పాటలు పాడుతూ ఇరుగు పొరుగువారిని లేపి వారికి తోడ్కొనివచ్చి వివిధరీతుల ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ, ఊయల ఊగుటలో ఒకరిపై ఒకరు పోటీపడుచూ పల్లెవాసులందరికీ మరింతగా కనువిందు చేస్తారు. 

ఇక ఆరోజు "చంద్రోదయము" అయ్యేవరకు భక్తి శ్రద్ధలతో ఉపవాసముండి, చంద్రోదయముకాగానే స్నానమాచరించి మడిగా అట్లు వేసుకొని నివేదనకు సిద్ధం చేసుకుంటారు. అనంతరం షోడశోపచారములతో 'ఉమాశంకరులను పూజించి అట్లతద్ది వ్రత కథను చెప్పుకుని, ఆ కథాక్షతలను శిరస్సులపై ఉంచుకొని ముత్తైదువులతో కలిసి భుజిస్తారు. ఇలా ఆచరిస్తే, కన్నెపిల్లలకు నవయవ్వనవంతుడైన అందమైన భర్త లభిస్తాడని, వివాహితులకైతే ఆ ఉమాదేవి అనుగ్రహముతో మంచి సౌభాగ్యము కలిగి సర్వసౌఖ్యములను అనుభవిస్తూ పిల్లపాపలతో సుఖమైన ఆనందమైన జీవితం అనుభవిస్తారని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం పై కూడా, ఒక గాధ ఉన్నది. 

పూర్వం ఒక మహారాజుకు రూప లావణ్యవతి అయిన కూతురు ఉండేది ఆమె పేరు "కావేరి". ఆమె తల్లి వలన ఈ వ్రతమహత్మ్యమును తెలుసుకుని తన రాజ్యమందుగల ఆమె స్నేహితురాళ్ళు మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురుతో కలిసి " ఈ చంద్రోదయ ఉమావ్రతాన్ని" అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించింది. కాని తోటి మంత్రికూతురికి, సేనాపతి కూతురికి, పురోహితుని కూతురుకి వివాహ వయస్సు రాగానే నవయవ్వనవంతులైన అందమైన భర్తలతో వివాహము జరిగింది. అంత మహారాజు! అమ్మాయి స్నేహితురాండ్రకు వివాహములు జరిగిపోవుచున్నవి అని తలచి తన కుమార్తెకు వివాహ ప్రయత్నములు చేయనారంభించగా కురూపులు, వృద్ధులైన పెండ్లికుమారులే తారసపడసాగిరి. మహారాజు ప్రయత్నములన్నీ విఫలములగుట చూచిన రాకుమార్తె చివరకు తన తండ్రి వివాహము చేయునేమో అని భయముచెంది, ఆ రాజ్యమునకు సమీప అరణ్యమునకు పోయి ఘోరమైన తపస్సు చేయసాగింది. 
పార్వతీ పరమేశ్వర

ఒకరోజు పార్వతీ పరమేశ్వరులులోక సంచారముచేస్తూ ఘోరమైన తపమాచరిస్తున్న ఆ ముక్కు పచ్చలారని రాకుమారైపై అనుగ్రహము కలిగి ప్రత్యక్షమై ఓ కన్యాకుమారీ! ఎందులకై ఈ ఘోరమైన తపమాచరించుచున్నావు? నీకు ఏ వరం కావాలో కోరుకోమనగా 'ఓ ఆది దంపతులారా! నేను నా స్నేహితురాండ్రముకలిసి నా తల్లి ద్వారా తెలుసుకున్న "చంద్రోదయ ఉమావ్రతం అట్లతద్ది వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించగా వార్కి మంచి భర్తలు లభించుట ఏమిటి? నా తండ్రిగారు చేయు ప్రయత్నములు ఫలించక కురూపులు, వృద్ధులు అయినవారు లభించుట ఏమిటి? ఇందులో నాదోషమేమిటి?' అని దుఃఖించసాగెను. 

ఓ సౌభాగ్యవతి! ఇందులో నీ దోషము ఏ మాత్రము లేదు. నీవు ఆ నోము నోచుసమయాన నీవు ఉపవాస దీక్షను తాళలేక సొమ్మసిల్లి పడిపోగా; విషయమంతా నీతల్లి ద్వారా నీ సోదరులు తెలుసుకుని ఒక ఇంద్రజాల విద్యను ప్రదర్శించి అద్దముగుండా నీకు చంద్రుని చూపించినారు. దానితో నీవు ఉపవాస దీక్ష విరమించినావు. ఆ వ్రత భంగమే ఇది. నీ సోదరులకు నీపైగల వాత్సల్యముతో అలా చేసినారు. అయినా! ఇందులో నీవు దుఃఖించవలసిన పనిలేదు, రేపువచ్చే ఆశ్వీయుజ బహుళ తదియనాడు విధివిధానంగా వ్రతమాచరంచు. నీ మనోభీష్టము తప్పక నెరవేరుతుంది అని "కావేరి"ని ఆశీర్వదించి అంతర్థానమైనారు. 

అలా ఆ రాకుమారై తిరిగి శ్రద్ధాభక్తులతో వ్రతమాచరించి మంచి అందమైనవాడు, తనమనసెరిగినవాడు, చక్కని శౌర్యపరాక్రమములు కలిగిన నవయవ్వన రాకుమారునితో వివాహమై నిరంతరము ఉమాశంకరులను సేవిస్తూ సమస్త సుఖభోగములను అనుభవించసాగినది. అట్టి పుణ్య ప్రదమైన "ఈ చంద్రోదయ ఉమావ్రతం "అట్లతద్ది" భక్తిశ్రద్దలతో ఈ వ్రతమాచరించి ఉమాశంకరుల అనుగ్రహపాత్రులౌదురుగాక.

28, మే 2017, ఆదివారం

బోనాలు పండుగ - Bonalu Panduga

బోనాలు మహాకాళిని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు మరియు తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది.సాధారణంగా జూలై లేక ఆగస్టులో వచ్చు ఆషాఢ మాసంలో ఈ పండుగ జరుపుకుంటారు. పండుగ మొదటి మరియు చివరి రోజులలో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు.

భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తల పై పెట్టుకుని, డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడి (తెల్ల ముగ్గు)తో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచడం కద్దు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మున్నగు పేర్లు కల ఈ దేవి గుళ్ళను దేదీప్యమానంగా అలంకరిస్తారు.

బోనాలు పండుగ ఆచారాలు:
 • ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం; అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు.
 • పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. నేడు దున్నపోతులకు బదులు కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది.
 • పండుగ రోజున స్త్రీలు పట్టుచీరలు, నగలు ధరిస్తారు. పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై కుండని (బోనం) మోస్తూ డప్పుగాళ్ళ లయబద్ధమైన మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు.
 • బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవీ అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసము; మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయమును సమీపించు సమయములో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్ళు కుమ్మరిస్తారు.
 • తమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్తబృందమూ ఒక తొట్టెలను (కాగితమూ, కర్రలతో కూర్చబడిన చిన్న రంగుల పరికరము) సమర్పించడం ఆచారంగా ఉంది.
 • బోనాల పండుగ సందోహం గోల్కొండ కోటలోని గోల్కొండ మహంకాళి ఆలయం వద్ద మొదలయ్యి లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయము, బల్కంపేట్ లోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్‌సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది.
 • పోతురాజు
 • దేవీ అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ. పోతురాజు పాత్రను పోషించే వ్యక్తి స్ఫురద్రూపిగా బలశాలిగా ఉంటాడు; ఒంటిపై పసుపు, నుదుటిపై కుంకుమ, కాలికి గజ్జెలు కలిగి, చిన్న ఎర్రని ధోతీని ధరించి డప్పువాయిద్యానికి అనుగుణంగా ఆడతాడు.
 • అతను భక్త సమూహము ముందు ఫలహారం బండి వద్ద నర్తిస్తాడు. అతను పుజాకార్యక్రమాల ఆరంభకుడిగా, భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడాతాడు. కొరడాతో బాదుకొంటూ, వేపాకులను నడుముకు చుట్టుకుని, అమ్మవారి పూనకములో ఉన్న భక్తురాండ్రను ఆలయములోని అమ్మవారి సమక్షానికి తీసుకెళతాడు.
బోనాలు పండుగ విందు సంబరాలు:
 • బోనాలు పండుగ దేవికి నైవేద్యము సమర్పించు పండుగ కావడం చేత, ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అతిథులతో పాటు స్వీకరిస్తారు. నివేదనానంతరం మాంసాహార విందు భోజనం మొదలౌతుంది.
 • పండుగ జరిగే ప్రాంతాలలో వేపాకులతో అలంకరించబడిన వీధులు దర్శనమిస్తాయి. జానపద శైలిలో ఉండే అమ్మవారి కీర్తనలతో నిండిన మైకుసెట్ల హోరులో పండుగ వాతావణం విస్పష్టంగా ప్రస్ఫుటమౌతుంది.
 • రంగం
 • రంగం, లేక జాతకం చెప్పడం పండుగ రెండవ రోజు ఉదయం జరుగుతుంది. భక్తుల అభ్యర్తన మేరకు పూనకంలో ఉన్నటువంటి యుక్తవయసు కన్నెపిల్లలు వచ్చే సంవత్సరం గురించి జాతకం చెబుతారు. ఈ కార్యక్రమం జాతర ఊరేగింపుకు ముందు జరుగుతుంది.
 • ఘటం
 • అమ్మవారి ఆకారములో అలంకరింపబడిన రాగి కలశాన్ని ఘటం అని సంబోధిస్తారు. సాంప్రదాయక వస్త్రధారణ, ఒంటి పై పసుపు కలిగిన పూజారి ఈ ఘటాన్ని మోస్తాడు. పండుగ మొదటి రోజు నుండి, చివరి రోజు నిమజ్జనం దాకా ఈ ఘటాన్ని డప్పుల మేళవాద్యాల నడుమ ఊరేగిస్తారు.
 • ఘటం ఉత్సవం రంగం తర్వాత జరుగుతుంది. హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయము వారి ఘటముతో ఏనుగు అంబారీపై, అశ్వాల మధ్య, అక్కన్న, మాదన్నల బొమ్మల నడుమ ఊరేగింపు మొదలయ్యి సాయంత్రానికి కన్నుల పండుగగా నయాపుల్ వద్ద ఘటముల నిమజ్జనతో ముగుస్తుంది.
 • లాల్‌దర్వాజా నుండి నయాపుల్ వరకు వీధుల వెంబడి వేలాదిమంది ప్రజలు నిలుచుని రంగ రంగ వైభవంగా అలంకరించబడిన ఘటాలను చూస్తారు. పోతురాజుతో పాటు, వివిధ పౌరాణిక వేషధారణలలో ఉన్న కుర్రవాళ్ళు తమదైన రీతిలో జానపదగీతాలు, వాయిద్యాల మధ్య నృత్యం చేస్తారు.
ఓల్డ్‌సిటీలో జరిగే ఘటాల ఊరేగింపులో హరిబౌలి అక్కన్న మాదన్న, లాల్‌దర్వాజా, ఉప్పుగూడ, మిరాలం మండీ, కాసరట్టలలోని మహంకాళి ఆలయాలు, సుల్తాన్‌షాహీలోని జగదాంబాలయం, షాలిబండ, అలీజా కోట్లా, గౌలీపురా మరియు సుల్తాన్‌షాహీలోని బంగారు మైసమ్మ దేవాలయాలు, ఆలియాబాదులోని దర్బారు మైసమ్మ మందిరం మరియు చందూలాల్ బేలాలోని ముత్యాలమ్మ గుడి పాల్గొంటాయి

రచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి

8, డిసెంబర్ 2016, గురువారం

సంక్రాంతి సంప్రదాయాల వెనకున్న మర్మం ఏమిటి - Sankranthi and its secrete Traditions

Sankranthi సంక్రాంతి

ఇక్కడ మనము -,సంక్రాంతి సంప్రదాయాల వెనకున్న మర్మం - గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకుందాం.

Sankranthi and its secrete of customs - సంక్రాంతి సంప్రదాయాల వెనకున్న మర్మం
హిందూ సంప్రదాయంలో ప్రతి ఆచారం, సంప్రదాయం వెనుక భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం అనే మూడు ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. సంక్రాంతి అంటే పిండివంటలు చేసుకోవడం, దేవాలయాలకు వెళ్లి దండం పెట్టుకోవడమే కాదు. మన పెద్దలు అనుసరించే సంప్రదాయాల వెనకున్న మర్మం ఏమిటి? వాటి నుంచి మనమేం నేర్చుకోవాలి? ఛాందసత్వానికి పోకుండా శాస్త్రీయంగా ఎలా అర్థం చేసుకోవాలి? అనే విషయాలను వివరించారు..  ప్రముఖ ఆధ్యాత్మిక ప్రసంగీకులు, ప్రఖ్యాత తెలుగు అవధాని.. గరికపాటి నరసింహారావు…

ముగ్గులు: ఓర్పును నేర్పే కళ…
ముగ్గులు
ఇంటి ముందు లోగిళ్లలో ఒక పెద్ద రథం ముగ్గో, నక్షత్రం ముగ్గో, సర్వవాకిళ్లు ముగ్గో వేస్తే చాలు. గంటసేపు ట్రెడ్‌మిల్ మీద వ్యాయామం చేసిన శ్రమకు సమానం. ముగ్గు వేయడం అంటే.. బోలెడన్ని చుక్కలు పెట్టాలి.  వాటన్నిటినీ కలుపుతూ లైన్లు వేయాలి.  ఒక ఆకారాన్ని తీసుకురావాలి. ఆ క్రమంలో ఎన్నిసార్లు పైకి లేవాలి, ఎన్నిసార్లు కిందికి వంగాలి.. లెక్కపెట్టుకోలేనన్నిసార్లు కదలాల్సి వస్తుంది.  అందులోను జారిపోయే కొంగును సరిచేసుకుంటూ.. ముందుకు పడే జెడను వెనక్కి వేసుకుంటూ.. ముగ్గు మీద ఏకాగ్రతను సంధించాలి. ముగ్గు ఇంటికి అలంకరణే కాదు.అదొక మానసికోల్లాసం. మనసుకు, శరీరానికి ఓర్పును, నేర్పును అందించే ఫజిల్‌సాల్వింగ్ లాంటిది. ముగ్గులు మనకో తాత్విక దృక్పథాన్ని తెలియజేస్తాయి.

అదే – ప్రకృతిలోని తోటి జీవుల పట్ల ‘భూతదయ’ కలిగి ఉండటం అన్నది.  అందుకే బియ్యపు పిండితోనే ముగ్గులేస్తారు.  ఆ పిండిని తినడానికి ఇంట్లోని సూక్ష్మక్రిములు, చీమలు, బొద్దింకలన్నీ లోగిళ్లలోకి వచ్చి చేరతాయి.  తద్వార ఇల్లు శుభ్రం అవుతుంది. సంక్రాంతికి 27 చుక్కల నక్షత్రం ముగ్గు ఎందుకు పెట్టేవారంటే – మనకున్న నక్షత్రాలు 27.  ఒక నక్షత్రంలో పుడితే మంచిదని, మరో నక్షత్రంలో పుడితే చెడ్డదనే అభిప్రాయాలు ఉన్నాయి.  అందుకు ప్రతీకాత్మకంగా 27 చుక్కల్ని కలిపి వేస్తే ఒక రంగవల్లిక ఏర్పడినట్లు.. ఏ నక్షత్రంలో పుట్టినా జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడం మన చేతుల్లోనే ఉందనే భరోసాను కలిగిస్తుంది ఈ ముగ్గు. ఎన్ని చుక్కలు పెట్టి వేస్తే అంత మంచి ముగ్గు వస్తుంది.  ఎంత మంది మనుషుల్ని కలుపుకు పోతే అంత ఓర్పు మన సొంతం అవుతుంది అని కూడా ముగ్గులు బోధిస్తాయి. ఏ జీవినైనా కలుపుకుపోయే మనస్తత్వం కంటే నేనొక్కన్నే అన్న భావన ఏ కోశానా మంచిది కాదు.

భోగిమంటలు: వ్యామోహానికి నిప్పు
మనుషుల మీదైనా, వస్తువుల మీదైనా వెర్రివ్యామోహం పనికిరాదు.  కరుడుగట్టిన అలాంటి కోరికలేవైనా ఉంటే వాటిని వదిలించుకోవాలి. అప్పుడే జీవితం నిశ్చింతగా ఉంటుంది.  ఈ మాటను ఊరికే చెబితే ఎవరు వినరు.  భోగిమంట రూపంలో చెబితే వింటారన్నది పెద్దల నమ్మకం.  మన లోపల పాతుకుపోయిన పాతను వదిలించుకోవడానికి భోగిమంట ఉపకరిస్తుంది. ఒక పూలతోట మీదుగా గాలి వెళితే అది సుగంధభరితం అవుతుంది.  అదే గాలి ఒక మురికికాలువ మీదుగా వెళితే దుర్గంధంగా మారిపోతుంది.  మనిషి ప్రాణం కూడా అంతే! మనిషి ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే ఆయువు గాల్లోకి కలిసిపోతుంది. ఆ స్థితిని బట్టే పునర్జన్మ దక్కుతుంది.  కాబట్టి వ్యామోహాలకు దూరంగా ఉండమంటుంది భోగిమంట. ఇంట్లోని కుర్చీకి ఒక కాలు విరిగిపోయి కుంటుతున్నా సరే దాన్ని వదలం.  “అది మా తాతగారిది. అదంటే నాకు సెంటిమెంటు” అని పట్టుకు వేళ్లాడతాం.  పాడైపోయిన పాతవస్తువునే అంత సులువుగా వదులుకోకపోతే.. రేప్పొద్దున తుచ్ఛమైన ప్రాణాన్ని స్వేచ్ఛగా ఎలా వదలగలుగుతావు? అంతవరకు ప్రాణభయంతో నిశ్చింతగా ఉండగలవా? ఉండలేవు.  అందుకే నీలోని పాతను భోగిమంటతోపాటు వదిలేయి.
భోగిమంటలకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. మంటల కోసం వంట చెరకును వాడరు. యజ్ఞయాగాదుల్లో వాడే సమిధల్నీ ఉపయోగించరు. కేవలం పాత సామాన్లు, దుంగలతోనే మంటల్ని వేస్తారు. భోగిమంటల వల్ల మరో ప్రయోజనం.. అగ్ని ప్రమాదాల్ని నిలువరించడం. ఏటా వచ్చే పండక్కి ఇలా భోగిమంటల్లో పాతసామాన్లు కాలిపోతే ప్రమాదాలు తగ్గిపోతాయి.

గంగిరెద్దులు, హరిదాసులు: భిక్షానికీ ఓ ధర్మం..
ఏ పనీ చేయకుండా బిచ్చమెత్తుకోవడం ధర్మం కాదు.  గంగిరెద్దుల వాడైనా, హరిదాసైనా ఏదో ఒక మంచి విషయాన్ని చెప్పే బిచ్చమెత్తుకుంటారు.  గంగిరెద్దుల వాడైతే ఇల్లు కలవాళ్లు ఏదిచ్చినా గంగిరెద్దు మీదే వేస్తాడు తప్ప చేతికి తీసుకోడు. పాత చీరలిస్తే వాటినే తీసుకుంటారు. హరిదాసు కూడా ఏడాదికి ఒకసారే వచ్చి హరినామకీర్తనలు పాడి.. గిన్నెడు బియ్యం తీసుకుని సంతృప్తిగా ఇంటికెళ్లిపోతాడు.  పండగ పోయాక మళ్లీ ఏ వీధిలోనూ కనిపించడు.  హరిదాసు ఇంటి ముందుకొచ్చి గొబ్బెమ్మల్ని తొక్కి వెళితే మంచిది.

గుమ్మడికాయ: తీగల్లా అల్లుకుపోవాలి..
ఎప్పుడూ గుర్తుకురాని గుమ్మడి సంక్రాంతి రోజున గుర్తుకొస్తుంది.  గుమ్మడి పోషకాల గని. ధాతుపుష్టికి, సంతానవృద్ధికి పనికొస్తుంది.  ఏడాదికి ఒకసారైనా గుమ్మడికాయ వంటల్ని తినాలన్నది పెద్దల మాట.  గుమ్మడి ఆకారం విశ్వస్వరూపానికి ప్రతీక. గుమ్మడి పాదు కూడా విస్తృతంగా అల్లుకుపోతుంది.  మనిషి జీవితాన్ని కూడా ఎంత విస్తృతి చేసుకుంటే అంత ఉత్తమం.  ఇరుకైన మనస్తత్వం కలిగుంటే ఇరకాటంలోనే ఉండిపోవాల్సి వస్తుందని గుమ్మడి చెబుతుంది.
గొబ్బెమ్మలు: అసహ్యం నుంచి అద్భుతం
కృష్ణ భక్తురాలైన గోపెమ్మ అనే పేరు నుంచి పుట్టిందే గొబ్బెమ్మ. ఈ భూమ్మీదున్న దేన్నీ అసహ్యించుకోకూడదు. ప్రతిదీ ప్రకృతి ప్రసాదితం. అసహ్యమైన పేడను కూడా అద్భుతంగా మలిస్తే అది గొబ్బెమ్మ అవుతుంది. జీవి కడుపులో ఉన్నంత కాలం పవిత్రమైనది. తల్లి కడుపు దాటి నేల మీద పడగానే అపవిత్రమైపోతుంది. అందుకే, నేల మీద పడని ఆవుపేడతోనే గొబ్బెమ్మలను చేస్తారు. గుమ్మడిపూలు, చామంతిపూలు, రేగుపండ్లను అలంకరిస్తారు. కులాలకు అతీతంగా మహిళలందరూ కలిసి గొబ్బెమ్మ పాటల్ని పాడతారు. వ్యష్టి కంటే సమిష్టి గొప్పదన్నది దానర్థం. ఆరోజుల్లో స్త్రీ సంబం«ధిత వ్యాధుల (గైనిక్)కు ఈ పాటలే చిట్కాలు చెప్పేవి. ఆరోగ్య చైతన్యాన్ని కలిగించేవి. ‘కాళ్లాగజ్జి కంకాళమ్మ’, ‘వేగూచుక్క వెలగామొగ్గ’, ‘చెమ్మచెక్క చారడేసి మొగ్గ’ వంటి పాటల్లో ఒక్కో జబ్బుకు ఒక్కో ఔషధ సూచన కనిపిస్తుంది.

భోగిపండ్లు: యోగిత్వం.. బదరీఫలం
సంక్రాంతి వస్తే పిల్లలకు భోగిపండ్లు పోసి.. మురిసిపోతుంటారు తల్లిదండ్రులు.  ఇప్పుడైతే ఈ సంప్రదాయం తగ్గింది కానీ ఒకప్పుడు పిల్లలున్న ప్రతి ఇంట్లో భోగిపండ్ల దృశ్యాలు కనువిందు చేసేవి. అనాధి నుంచి వస్తున్న సంప్రదాయం ఇది.  భోగిపండ్లు లేదా రేగుపండ్లలో ఎనలేని ఔషధగుణాలు ఉన్నాయి.  చలికాలంలో ఎవరికైనా జీర్ణశక్తి మందగిస్తుంది. పీచు (పైబర్) పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే కాని సమస్య తొలగిపోదు. ఒకప్పుడు ఇప్పుడున్నంత ఆరోగ్య చైతన్యం లేదు కనక.. ఆ లోటును పూడ్చేందుకు రేగుపండ్లను తినమనే వారు. రేగులోని జిగట పదార్థం అన్నవాహికను శుభ్రం చేస్తుంది. ‘భుక్త్వాచ బదరీఫలం’ అన్నది అందుకే.  భోంచేసిన తర్వాత రేగుపండ్లు తింటే మంచిదన్నది దాని అర్థం.  రేగుపండ్లు జఠరాగ్నిని ఉరకలెత్తిస్తాయి. శరీరంలో వేడిని పుట్టించే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి.

బదరీవనం (రేగుపండ్ల తోట)లో వేదవ్యాసుడు తపస్సు చేసేవాడన్న మరో ఐతిహ్యం కూడా ఉంది.  కాబట్టే ఆయనకు బాదరాయణుడు అన్న పేరొచ్చింది.  ఆధ్యాత్మిక కోణంలో చూస్తే – రేగుపండ్లు యోగిత్వానికి ప్రతీక. మరో విశేషమేమంటే రేగుపండ్లను జంతువులు తినవు. మనుషులే తింటారు.  హిందూ సంస్కృతిలో రేగుపండ్లకున్న ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకునే.. పండగపూట పిల్లలకు చిల్లర నాణేలతో కలిపి భోగిపండ్లు పోస్తారు.  ఆ సమయంలో తల మీద చిల్లర నిలబడితే ‘భోగి’ అవుతారని, రేగుపండ్లు మాత్రమే నిలబడితే ‘యోగి’ అవుతారన్నది ఒక విశ్వాసం.
గాలిపటం: దారంలాంటిది జీవితం
గాలిపటం: దారంలాంటిది జీవితం
ప్రతి మనిషికీ ఆత్మనిగ్రహం అవసరం.  అది లేకపోతే జీవితంలో ఎన్నో సమస్యల్ని కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. సన్నని దారంతో ఆకాశంలో ఎగిరే గాలిపటాన్ని అదుపులో పెట్టగలిగినట్లు.. మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలని చెబుతుంది గాలిపటం.  ఒడుపుగా లాగితే తెగిపోతుంది. వదలకుండా పట్టుకుంటే ఎగరలేదు.  ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఆడిస్తేనే గాలిపటమైనా, జీవితమైన ముందుకు వెళుతుంది.  అయితే చేతిలో దారం ఉంది కదాని ఎంతదూరమైనా గాలిపటాన్ని వదల్లేము.  ఏదో ఒక సమయంలో మళ్లీ చుట్టచుట్టి గుప్పెట్లోకి తీసుకోవాల్సిందే.  ఆ గుప్పెడు అనేది భగవంతుడులాంటిది. మనం ఎంత ఎత్తుకు ఎగిరినా భగవంతుని చేతిలోనే ఉన్నామన్న సంగతిని మరిచిపోకూడదు.  గాలిపటానికి ఎన్ని రంగులున్నా, ఎంత పొడవు తోక పెట్టుకున్నా, ఎవరింటి మీద వాలినా దారం చుట్టక తప్పదు. అదే సూత్రం మనిషికీ వర్తిస్తుంది.

కోడిపందేలు: యుద్ధనీతిని గెలిపించే పందెం
పండగ పరమార్థాన్ని మరిచిపోయి దాన్ని పరహింసగా మార్చాం.  నేడు జరుగుతున్న కోడిపందేలే అందుకు నిదర్శనం.  కోడిపందేలకు తరాల చరిత్ర ఉంది.  కాని ఆ రోజుల్లో కోళ్లకు కత్తులు కట్టి ఆనందించేవారు కాదు.  ఇప్పుడు కత్తులు కట్టి, డబ్బు కట్టలు పెట్టి జూదంగా మార్చేశారు.  పాతరోజుల్లో ఇద్దరి మధ్య వైరం ఏర్పడితే దాన్ని కోడిపందెం ద్వారా పరిష్కరించేవారు మధ్యవర్తులు.  పల్నాటి కాలంలో మాచర్ల, గురజాల మధ్య గొడవ యుద్ధానికి దారితీసింది.  అలాంటి సమస్యను కోడిపందెమే పరిష్కరించింది.  యుద్ధనీతిని తెలియజేసింది.

పశు పూజలు: శ్రమకు కృతజ్ఞత
సంక్రాంతికి ఇంటి నిండా ధాన్యం వచ్చిందంటే.. అది పశువుల పుణ్యం.  ఏడాది పొడవునా పశువులతో చాకిరీ చేయించడమే కాదు.  పండగరోజైనా వాటిని పూజించి కృతజ్ఞత చెప్పుకోవాలంటుంది పశువుల పూజ.  ఆ రోజు రైతులు నాగలి కట్టరు.  ఎద్దుల మీద కాడి మోపరు. బండ్లు తోలరు.  అందుకే ‘కనుమ రోజు కాకైనా కదలదు’ అంటారు.

రచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి

4, డిసెంబర్ 2016, ఆదివారం

అమావాస్య అంటే ఏమిటి ? What is the Meaning of Amaavasya

అమావాస్య అంటే ఏమిటి ? What is the Meaning of Amaavasya
అమావాస్య,పౌర్ణమి ఏర్పడే విధానము -----------పౌర్ణమి రోజు చంద్రుడు------------అమావాస్య రోజు చంద్రుడు

అమావాస్య
చంద్రమానం ప్రకారం కృష్ణ పక్షము రోజులలో పదిహేనవ తిథి. అధి దేవత - చంద్రుడు . నెలకొక అమావాస్య చొప్పునాసంవత్సరానికి 12 అమావాస్ల్య్లుంటాయి . కొన్ని అమావాస్యలు హిందువులకు పవిత్రమైనవి . అమావాస్య కాలమానంలో చీకటి రోజు ... చంద్రుడుని చూడలేని రోజు . . . అయితే భూమండలం లో కొంతమందికే చీకటి , సగానికి చంద్రుడుకనిపిస్తాడు ... ప్రతివానికి ఏదో ఒక రోజు అమావాస్య వస్తుంది ... ఉంటుంది (చీకటి రోజు .. కష్టాలతో కూడుకున్న రోజు) .
అమావాస్య తిథి రోజున ఇంటి ముందు ముగ్గులు వేయకూడదని పండితులు అంటున్నారు. అమావాస్యకుముందురోజున పితృదేవతలు మన గృహానికి వస్తారని, ఆ సమయంలో పితృదేవతలకు-అర్ఘ్యమివ్వడంవంటి కార్యాలను చేయడం ద్వారా వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు.
అదేవిధంగా.. అమావాస్య రోజున ఇంటి ముందు చెత్తను శుభ్రం చేసి, నీటితో కల్లాపు చల్లడం వరకే చేయాలి. ఆ తర్వాతఇంటి ముందు ముగ్గులతో అలంకరిస్తే పితృదేవతలు వాకిలితోనే-ఆగిపోతారని పండితులు అంటున్నారు. అందుచేతఅమావాస్య నాడు ఇంటికొస్తారని విశ్వసించే పితృదేవతలను మనసారా ప్రార్థించి, దేవతామూర్తులకు ఇచ్చే నైవేద్యాలు, కర్పూర హారతులివ్వాలని పురోహితులు సూచిస్తున్నారు.

పితృదేవతలకు ప్రీతికరమైన రోజైన అమావాస్య నాడు -- దేవతలు స్మరించినా ఫలితం ఉండదని పండితులుచెబుతున్నారు. ఆ రోజున దేవతలకు సమానంగా పితృదేవతలను కొలిచే వారికి సకల సంపదలు చేకూరుతాయనివిశ్వాసం.

స్థూలంగా చెప్పాలంటే, తిథులు అంటే చంద్రుడి కళలు (Phases). వీటిల్లో అమావాస్య, పౌర్ణమి అంటే అందరికీ తెలుస్తుంది. భూమినుంచి చూస్తే ఆకాశంలో చంద్రుడు, సూర్యుడు ఒకరికొకరు ఎదురెదురుగా (నూట ఎనభై డిగ్రీల దూరంలో) ఉంటే అది పూర్ణిమ. ఇద్దరూ కలిసి ఉంటే (ఒకే డిగ్రీలో ఉంటే) అది అమావాస్య.

అమావాస్య నుంచీ పున్నమి వరకూ వచ్చే తిథుల్ని శుక్ల పక్షం అంటారు. మళ్ళా పున్నమి నుంచీ అమావాస్య వరకూ వచ్చే తిథులు కృష్ణ పక్షం లేక బహుళ పక్షం. శుక్ల పక్షపు తిథుల్నే శుధ్ధ తిథులని కూడా అంటారు. శుక్ల అంటే తెల్లని అని అర్ధం. కృష్ణ అంటే నల్లని అని అర్ధం.

పితృదేవతలు - అమావాస్య-- అనే పేరు ఎలా వచ్చింది ?:

పితృదేవతలనేవారిని శ్రాద్ధకర్మాదులతో అర్చించాలని చెప్పే సందర్భాలు అనేక పురాణాల్లో ఎదురవుతుంటాయి. ఈ పితృదేవతలు ఎవరనే సందేహానికి సమాధానమిస్తుందీ కథాసందర్భం.
ప్రతిమాసంలోను వచ్చే అమావాస్య అన్నా, మహాలయ అమావాస్య అన్నా పితృదేవతలకు ఎంతో ఇష్టమని, ఆ రోజున శ్రాద్ధ కర్మాదులను చేస్తే మంచి ఫలితం ఉంటుందని పెద్దలంతా అంటుంటారు. అసలీ పితృదేవతలకు, అమావాస్యకు ఉన్న సంబంధం ఏమిటి? పితృదేవతాగణాలు ఎన్ని? ఎలా ఉంటాయి? అమావాస్య ఎలా ఉద్భవించింది? అనే విషయాలను గురించి తెలియచెప్పే కథాంశం మత్స్యపురాణం పద్నాలుగో అధ్యాయంలో కనిపిస్తుంది.

పితృదేవతలు ఏడుగణాలుగా ఉంటాయి. వీరిలో మూడు గణాలవారికి ఆకారం ఉండదు. వైరాజులు, అగ్నిష్వాత్తులు, బర్హిషదులు అనేవారికి ఇలా ఆకారం ఉండకపోవడం విశేషం. అలాగే సుఖాలినులు, హవిష్మంతులు, ఆజ్యపులు, సోమపులు అనే నాలుగు గణాలకు ఆకారం ఉంటుంది. ఈ ఏడుగణాలవారూ ప్రాణులందరిలో అమితమైన సామర్థ్యాన్ని, చైతన్యాన్ని కలిగిస్తుంటారు. అందుకే ఈ పితృదేవతలకు కావల్సిన శ్రాద్ధవిధులను నిర్వర్తించాలని అంటారు. మూర్తి (ఆకారం) లేని పితరులు వైరాజుడు అనే ప్రజాపతి కుమారులు. అందుకే వీరిని వైరాజులు అని అంటారు. ఈ పితృదేవతలు ద్యులోకంలో ఉంటారు. ఈ అమృతాలైన పితృగణాలవారు శాశ్వతాలైన లోకాలను పొందగోరి ఓసారి యోగసాధనకు ఉపక్రమించారు. అయితే ఏకాగ్రత లోపించి యోగం నుంచి భ్రష్ఠులయ్యారు. ఇలా భ్రష్ఠులైన కారణంగా వీరంతా పితృదేవతలుగా మారారు. ఈ పితృదేవతల మానసపుత్రికే మేన. ఈమె హిమవంతుడిని పెళ్లాడింది. హిమవంతుడికి మైనాకుడు అనే కుమారుడు జన్మించాడు. మైనాకుడికి క్రౌంచుడు జన్మించాడు. ఆ క్రౌంచుడి పేరుమీదనే క్రౌంచద్వీపం ఏర్పడింది. మేనా హిమవంతులకు ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారు. ఉమ, ఏకపర్ణ, అపర్ణ అని ఆ ముగ్గురు కుమార్తెల పేర్లు. ఆ కన్యలు మంచి యోగసిద్ధి కలవారు. హిమవంతుడు ముగ్గురిలో పెద్దదైన ఉమను రుద్రుడికి, ఏకపర్ణను భృగువుకు, అపర్ణను జైగీషవ్యుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఇలా వైరాజ పితృదేవతల సంతతి వృద్ధి చెందింది. సోమపథాలు అనే లోకాలలో మరీచి అనే ప్రజాపతికి జన్మించిన పితృదేవతా గణాలు నివసిస్తుంటాయి. వీరిని దేవతలు కూడా ఆరాధించడం విశేషం. ఈ పితృదేవతలకు ఒక మానస పుత్రిక ఉంది. ఈమె పేరుమీదనే అనంతర కాలంలో అమావాస్య తిథి వచ్చింది. ఈమె జీవనకథనంలో నేటివారికి ఉపయుక్తమయ్యే ఓ సందేశం కూడా ఇమిడివుంది.

అగ్నిష్వాత్తుల మానసిక పుత్రిక పేరు అచ్చోద. ఆమె నదీరూపంగా ఉండేది. అచ్చోదను పితృదేవతలు ఒక సరస్సులో సృష్టించారు. ఓరోజున వారంతా కలిసి ఆమె దగ్గరకు వచ్చారు. ఏదైనా వరం కోరుకోమని తమ కూతురును అడిగారు. అయితే దివ్యపుష్పమాలికలు, దివ్యగంధాలు, మంచి అలంకారాలు చేసుకుని ఎంతో సుందరాకృతిలో ఉన్న మావసుడు అనే ఒక పితరుని చూసి అచ్చోద కామపరవశురాలైంది. ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి తండ్రి అయిన మావసుడినే కోరిన కారణంగా ఆమె అప్పటిదాకా సంపాదించిన యోగశక్తి అంతా నశించింది. దాంతో ఆమె తన దివ్యత్వాన్ని కోల్పోయింది. అసంబద్ధంగా ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి ప్రవర్తించినందువల్లనే ఆమెకు ఇంతటి నష్టం ప్రాప్తించింది. పితృదేవతలు అచ్చోద తమకు ఎంతో అభిమానపాత్రురాలైన మానసపుత్రికే అయినా ధర్మాన్ని అనుసరించి శిక్ష విధించడంలో... అంటే ఆమెకు దివ్యత్వం నశించాలని శపించడంలో వెనుకాడలేదు. మావసుడు మాత్రం అచ్చోదను కామించక ఇంద్రియ నిగ్రహంతోనే ప్రవర్తించాడు. అచ్చోద మావస్య కాలేదు. అంటే మావసుడికి ప్రియురాలు కాలేదు. అందుకే ఆమె అమావస్య అయింది. అమావస్య అంటే మావసుడికి ప్రియురాలు కానిది అనేది ఇక్కడి అర్ధం. అలా తదనంతర కాలంలో అచ్చోదకే అమావాస్య అనే పేరు ప్రాప్తించింది. ఈమె అంటే పితృదేవతలకు ఎంతో ప్రాణం. తమ మానస పుత్రిక మీద ఉండే మమకారంతో అచ్చోద అమావస్య (అమావాస్య తిథి) అయిన రోజున తమకు ఎవరైనా అర్పించిన శ్రాద్ధానికి అనంత ఫలితాన్ని ఆనాటి నుంచి పితృదేవతలు ఇస్తూ వచ్చారు.

రచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి

28, నవంబర్ 2016, సోమవారం

అట్లతదియ వ్రతవిధానము - Atla taddi Telugu Festival

Atla taddi Telugu Festival అట్లతదియ
ట్ల తద్ది లేదా అట్ల తదియ తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది ఆశ్వయుజ బహుళ తదియ నాడు జరుపుకొంటారు. "అట్లతద్దె ఆరట్లు ముద్దపప్పు మూడట్లు" అంటూ ఆడ పడుచులకు బంధువులకు ఇరుగు పొరుగులకు వాయినాలివ్వటం పరిపాటి. సాయం సమయమందు వాయినలు, నైవేద్యాలు పూర్తి చేసుకొని గోపూజకు వెళ్ళి, అటునుండి చెరువులలో కాలువలలో దీపాలను వదలి, చెట్లకు ఊయలలు కట్టి ఊగటం చేస్తుంటారు.

పెళ్ళీడు వచ్చిన ప్రతి ఆడపిల్ల కాబోయే భర్త గురించి, రాబోయే వైవాహిక జీవితం గురించి అలాంటి కలలు కనటం సహజం. ఆ కలలు నెరవేరాలని ఎన్నో వ్రతాలు, నోములు చేస్తుంటారు. ప్రతి ఏడాది జరుపుకొనే అట్లతద్ది నోము అందులో ముఖ్యమైనది.
Atla taddi Telugu Festival అట్లతదియ వ్రతవిధానము
ఆశ్వయుజ మాసంలో దసరా పండుగ తరవాత వచ్చే తదియనాడు ఈ పండుగ జరుపుకొంటారు. అయిదేళ్ళు దాటిన ఆడపిల్లల నుంచి పెద్దల వరకు చేసుకుంటారు. పెళ్ళికాని పిల్లలు మంచి భర్తకావాలని ఈ పూజ చేస్తే, పెళ్ళైనవారు మంచి భర్త దొరికినందుకు, ఆ భర్త ఆరోగ్యంగా ఉండటానికి చేస్తారు. సాధారణంగా- పెళ్ళి అయిన తరవాత పది సంవత్సరాలపాటు తప్పనిసరిగా చేస్తారు. సమాప్తం అయిందనడానికి గుర్తుగా ఉద్యాపన చేస్తారు. అంటే ఆఖరుసారి పూజచేసి పేరంటాలను పిలిచి వాయనాలిచ్చి కన్నులపండుగగా ముగిస్తారు
త్రిలోక సంచారి అయిన నారదుని ప్రోద్బలముతో గౌరీదేవి శివుని పతిగా పొందగోరి తొలుతగ చేసిన విశిస్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్రీలు సౌభాగ్యము కోసం చేసుకొనే వ్రతమిది.
ఉయ్యాలపండగ Atla taddi Telugu Festival
ఉయ్యాలపండగ Atla taddi Telugu Festival
చంద్రారాధన ప్రధానమైన పూజ, చంద్రకళల్లో కొలువైవున్నశక్తి అనుగ్రహం చేత స్రీసౌభాగ్యము పెరుగుతుంది. కుటుంబములో సుఖశాంతులు వర్దిల్లుతాయని శాస్త్రవచనం. ఈ పండగలో అమ్మవారికి అట్లు నైవేద్యముగా పెట్టడములో ఒక అంతర్ధానముంది. నవగ్రహాలలోని కుజుడుకీ అట్లంటే మహాప్రీతి, అట్లను ఆయనకు నైవేద్యముగాపెడితే కుజదోషపరిహారమై సంసారసుఖములో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకము. రజోదయమునకు కారకుడు కనుక ఋతుచక్రం సరిగావుంచి ఋతుసమస్యలు రానివ్వకుండా కాపాడుతాడు. అందువలన గర్భదారణలోఎటువంటిసమస్యలుండవు. మినుములు పిండి, బియ్యము పిండి కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువునకు, బియ్యము చంద్రునకు సంభందంచిన దాన్యాలు. గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనముగా ఇవ్వాలి. గర్భస్రావమురాకుండా, సుఖప్రసవం అయ్యేందుకు దోహదపడుతుందికూడా. అందుకే ముత్తయిదువులకు అట్లను వాయనముగా ఇస్తారు. అట్లతద్దిలోని 'అట్ల'కు ఇంతటి వైద్యవిజ్ఞానము నిక్షిప్తం చేయబడివుంది.
Atla taddi Telugu Festival అట్లతదియ వ్రతవిధానము
అట్ల తద్ది లేదా అట్ల తదియ వ్రతవిధానము

రోజు తెల్లవారుఝామునే మేల్కొని శుచి, శుభ్రత తో స్నానమాచరించి, ఉపవాసముండి, ఇంటిలో తూర్పుదిక్కున మంటపము యేర్పాటుచేసి గౌరీదేవి పూజ చేయాలి. ధూప, దీప, నైవేద్యాలు పెట్టి, వినాయక పూజ తర్వాత, గౌరీ స్తోత్రము, స్లోకాలు, పాటలు చదవడమ్, పాడడం చేస్తారు. సాయంత్రం చంద్రదర్సనము అనంతరము శుచియై తిరిగి గౌరీపూజచేసి, 10 అట్లు నైవేద్యముగాపెట్టి, ముత్తైదువులకు అలంకారము చేసి, 10 అట్లు, 10 ఫలాలు వాయనముగా సమర్పించి, అట్లతద్దినోము కధ చెప్పుకొని, అక్షతలు వేసుకోవాలి. ముత్తైదువులకు నల్లపూసలు, లక్కకోళ్ళు, రవిక గుడ్డలు, దక్షినతాంబూలాలు ఇచ్చి భోజనాలుపెట్టి, తామూ భోజనము చేయాలి. 10 రకాల ఫలాలను తినడం, 10 మార్లు తాంబూలం వేసుకోవడం, 10 మార్లు ఊయల ఊగడం, గోరింటాకు పెట్టుకోవడం, ఈపండుగలో విశేషము. దీనినే 'ఉయ్యాలపండగ' అనీ, 'గోరింటాకుపండగ' అనీ అంటారు. ఈపండగ చేయడం వలన గౌరీదేవి అనుగ్రహం తో పెల్లికాని అమ్మాయిలకు గుణవంతుడైన రూపసి భర్తగా లభిస్తాడని, పెళ్ళైనవారికి పిల్లకు కలుగుతారని, ఐదవతనముతోపాటు, పుణ్యము లభిస్తుందని తరతరాలనుంచి వస్తున్న నమ్మకము.

అట్ట్ల తద్దోయ్ ఆరట్లోయ్
ముద్దపప్పోయ్, మూడట్లోయ్

చిప్ప చిప్ప గోళ్ళు, సింగరయ్య గోళ్ళు
మా తాత గోళ్ళు, మందాపరాళ్ళు

ఈ వ్రతంలో ఒక కథ చదువుతుంటారు. పూర్వం ఒక రాజుకు కావేరి అనే అందమైన కూతురు ఉండేది. ఆమె స్నేహితులతో కలిసి ఈ అట్లతద్ది నోమును ఎంతో భక్తితో ఆచరించింది. అందరికీ అందమైన భర్తలు లభించారు. కావేరికి మాత్రం కురూపులు, వృద్ధులైన పెండ్లికుమారులు తారసిల్లేవారు. కావేరి ఎంతో కలతచెంది అడవికి వెళ్ళి తీవ్రంగా తపస్సు చేసింది. పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. వారికి తన బాధ చెప్పుకొంది.

అప్పుడు వ్రతంలో ఆమె చేసిన దోషం వలన అలా జరిగిందని ఆదిదంపతులు వివరించారు. ఆమె నోము నోచే సమయంలో ఉపవాసం వలన నీరసించిపోయింది. ఆమె అన్నలు అది తెలిసి, గడ్డితో మంటపెట్టి అది అద్దంలో చూపించి చంద్రుడని భ్రమింపజేసి ఉపవాసాన్ని విరమింపజేశారు. ఫలితంగా ఆమెకు సరియైన వరుడు దొరకలేదు. ఈ వ్రతాన్ని జాగ్రత్తగా మరొకసారి ఆచరించమని చెప్పి అంతర్థానమయ్యారు పార్వతీ పరమేశ్వరులు. కావేరి మళ్లీ శ్రద్ధా భక్తులతో వ్రతమాచరించింది. ఫలితంగా అందమైన, శౌర్యపరాక్రమాలు కలిగినవాడు భర్తగా లభించాడు- ఈ కథను చదువుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ ముగిస్తారు.

అట్లతద్దిలో పార్వతీ పరమేశ్వరుల్ని పూజించటానికి కారణం అర్ధనారీశ్వరత్వం. సాక్షాత్తూ భగవంతుడే రెండుగా వీడి ప్రకృతి పురుషుడిగా మారాడనీ, ఆ అర్ధ నారీశ్వరంలో నుంచి సమస్త సృష్టి జరిగిందనీ ఇతిహాసాలు చెబుతున్నాయి. అన్యమతాల్లోనూ ఇదే పద్ధతిలో ఉపవాసం ఉండి చంద్రోదయం తరవాత ఉపవాసాన్ని విరమించడం మనం చూడవచ్చు. మతాలు వేరైనా అభిమతం ఒక్కటే అని తెలియజెప్పే ఈ అట్లతదియ నోము మతసామరస్యానికి పెద్దపీట వేస్తుంది.

By: కోటీ మధవ్ బాలు చౌదరి

Atla taddi Telugu Festival అట్లతదియ వ్రతవిధానము

23, అక్టోబర్ 2016, ఆదివారం

తెలుగు పండుగలు యొక్క జబితా - List of Telugu Festivals

త చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి

దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . -
-సాంప్రదాయాలు, ఆచారాలు, శాంతిసహృద్భావాల మేలు కలయికే పండుగ (Festival). సాధారణముగా పండుగలన్నీ ఏదైనా దేవుడు లేదా దేవతకు సంబంధించి, జాతి మత పరంగా జరుపుకుంటారు. సంవత్సరం పొడవునా వచ్చే పండుగల్లో దేని ప్రాముఖ్యత , విశిష్టత దానికే వుంది. భాష లేదా ప్రాంతాన్ని బట్టి పండుగలు జరుపుకొనే విధానములో స్వల్ప తేడాలు వున్నప్పటికీ వాటిలోని ఏకసూత్రత మాత్రము చెడదు. సంవత్సరం పొడవునా చైత్ర మాసముతో మొదలిడి ఎన్నో పండుగలు వున్నాయి. పండుగ, పర్వదినం అంటే ఒక సంతోషకరమైన రోజు, శుభవేళ, ఉత్సవ సమయం అని అర్థం. పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తూ ఉంటాయి . ' పండుగ ' అనేది ఏ మతానికి సంబంధించినదైనా సరే..... దాని వెనుక ఒక సందేశం దాగి వుంటుంది. ' పండుగ ' మానావాళికి హితాన్ని బోధిస్తుంది.

కొన్ని హిందువుల పండుగలు:
 1. ముక్కోటి ఏకాదశి -- Mukkoti ekadasi
 2. భోగి --bhoogi
 3. మకర సంక్రాంతి --Makara sanqraanti
 4. కనుమ -- kanuma
 5. అయ్యప్ప - మకరజ్యోతి,
 6. త్యాగరాజ ఆరాధన,
 7.  సరస్వతి జయంతి,
 8. రథ సప్తమి -- Ratha saptami
 9. భీష్మ ఏకాదశి -- Bheesma Aekaadasi
 10. మహాశివ రాత్రి -- Maha Siva Raatri
 11. శివరాత్రి -హరహర మహాదేవ,
 12. రామకృష్ణ పరమహంస జయంతి,
 13. హోలీ -- Holi, Miladinabi ,
 14. గురుపౌర్ణమి-Guru paurnami ,
 15.  మంగళగౌరీ వ్రతం,
 16.  రాఖీ పండుగ,
 17.  వరాహజయంతి,
 18.  కల్కి జయంతి,
 19.  అనంతపద్మనాభ చతుర్దశి,
 20. మహర్నవమి,
 21. ఉగాది --Ugaadi (Telugu - New Year)
 22. శ్రీరామనవమి --Sri Raama Navami
 23. మహావీర్ జయంతి -- Mahaveer Jayanthi
 24. హనుమాన్ జయంతి -- Hanumaan Jayanthi
 25. కూర్మజయంతి -- Tortoise incarnation.
 26. మహాన్కాలి జాతర -- Mahankali Jataera ( Bonala panduga)
 27. వరలక్షి వ్రతం -- Varalakshmi Vratam
 28. కృష్ణాష్టమి -- Janmaastami (Krishnaastami)
 29. వినాయక చవితి -- Vinaayaka Chavithi
 30. ఉండ్రాళ్ళ తద్దె -- Undraalla Thaddhe
 31. ఆయుధపూజ --Aayudha Pooja
 32. విజయ దశమి -- Vijaya Dasami
 33. అట్లా తద్దె -- Atla తద్దె
 34.  ఋషి పంచమి,
 35. దేవీ నవరాత్రులు,
 36. ఏరువాక పున్నమి--Eruvavaka paurnami ,
 37. నరక చతుర్ధశి,
 38. దీపావళి -- Deepaavali
 39. నాగుల చవితి -- Naagula Chavithi,
 40. కార్తీక పౌర్ణమి,
 41. తులసీ పూజ,
 42. కేదారేశ్వర వ్రతము,
 43. ఆంధ్ర రాష్ట్ర అవతరణ --Andhra Rashtra avatarana dinotsavam,
 44. సత్యసాయి జయంతి -- Satya Sai Baba Janmadinam,
 45. అక్షయ తృతీయ--AkshayaTruteeya,
 46. శంకర జయంతి--Sankara jayanthi,
 47.  నృసింహ జయంతి--Nrusimha Jayanthi,
 48. పరశురామ జయంతి-- Parasurama Jayanthi ,
 49. శ్రీ వీరబ్రహ్మేందస్వామి ఆరాధన--Sri VeerabrahmendraSwami Aradhana,
 50. బతుకమ్మ పండుగ (Batukamma festival).
 51. మహాలయ అమావాస్య(Mahalaya Amavaasya),
 52. పోలేరమ్మ వ్రతం ,
 53.  దుర్గాష్టమి,
 54. దత్తాత్రేయ స్వామి జయంతి,
 55.  నూతన సంవత్సర వేడుకలు,
 56. కోజగారీ వ్రతము ,
 57. చుక్కలమావాస్య నోము ,
 58. చంద్రోదయ ఉమావ్రతం
 59. సత్యనారాయణ వ్రతము
 60. నృసింహజయంతి
 61. వామనజయంతి
 62. పరశురామజయంతి
 63. సుబ్రహ్మణ్య షష్టి(సుబ్బరాయషష్టి)-కుమార షష్ఠి,
 64. వసంతపంచమి
 65. నాగపంచమి
 66. చాతుర్మాస్యము
 67. జగన్నాథ రథయాత్ర (jagannadha radhayaatra)
బౌద్దుల పండుగలు : 
బుద్ద జయంతి

By: +Prof: కొటీ మధవ్ బాలు చౌదరి