Guru Nanak Birth Day - గురునానక్ జయంతి

0
Guru Nanak Birth Day - గురునానక్ జయంతి
గురు నానక్ దేవ్ (Guru Nanak) 1469లో పాకిస్తాన్ లోని నన్కానా సాహిబ్ లో జన్మించాడు. ఇతను పది మంది సిక్కు గురువులలో మొదటి వాడు. ఇతను హిందూ మరియు ఇస్లామియా మత గ్రంథాలు చదివాడు కానీ ఇతను ఈ రెండు మతాలకి భిన్నమైన సిక్కు మతమును స్థాపించాడు. సిక్కు మతం ఏకేశ్వరోపాసక మతము. వీరు ఏక్ ఓంకార్(ఏకైక దేవుడు)ని నమ్మతారు.

పూర్తి వివరాలు :
గొప్ప సంఘసంస్కర్తగా, మత గురువుగా ప్రసిద్ధిని పొందిన గురునానక్ 15వ శతాబ్దానికి చెందిన అతి విశిష్టమైన వ్యక్తి. ఇతడు పవిత్రతనూ, న్యాయాన్నీ, మంచితనం, భగవత్ ప్రేమలాంటి విషయాలను గురించి ప్రజలకు ఉపదేశం ఇచ్చాడు. లాహోర్ (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న నగరం)కు సమీపంలో ఉన్న తల్వండి రాయె భోయిలోని ఖత్రీల కుటుంబంలో గురునానక్ 1469 ఏప్రిల్ 15వ తారీఖున పౌర్ణమి రోజున జన్మించాడు. తృప్త, మెహతా కలు ఇతడి తల్లిదండ్రులు. ఇతడి తండ్రి ధనవంతుడైన ఒక గొప్ప జమీందారు వద్ద కొలువు చేశాడు. తన తల్లిదండ్రులకు గురునానక్ మూడవ సంతానం. ఇతడి జన్మస్థలమైన తల్పండిని ఈ రోజు మనం నన్‌కానా సాహిబ్ అనే పేరుతో పిలుస్తున్నారు. పసితనం నుండీ నానక్‌కు గురుభక్తి మెండుగా ఉండేది. అందరికీ ముక్తి మార్గం చూపేందుకు అతడు ఒక చోటు నుండీ మరొక చోటుకీ పోయేవాడు. అతడు సుదూర ప్రాంతాల వరకు టిబెట్, బెంగాల్, దక్కన్, శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్, కందహార్, టర్కీ, బాగ్దాద్, మక్కా, మదీనాలను ప్రయాణం చేశాడు. అతడు భగవంతుడిని వాహేగురు అని పిలిచాడు. ప్రజలు తమను తాము అర్పించుకోవాలని ప్రజలకు అతడు సలహా ఇచ్చాడు. ఇతడు సిక్కుల మతాన్ని స్థాపించాడు. గొప్ప కవిగా, వేదాంతిగా, మానవతావాదిగా పేరును పొందాడు. ఇతడిని విశ్వకవి రవీంద్రనాధ్ టాగూర్ "మానవాళి గురుగు"గా అభివర్ణించాడు.

గురునానక్ అతి అమూల్యమైన కొన్ని ఉపదేశాలు :
  • బయట కనబడే తీరు ముఖ్యం కాదు. బయటి రూపాన్ని చూసి మనిషి ప్రాశస్త్యాన్ని మనం అంచనా వేయలేము.
  • భగవంతుడే అతి ముఖ్యమైన వాడు. దేవుడు ఒక్కడే అని అతడు ఉపదేశం చేశాడు.
  • ఇతరుల సంపాదనపై ఆధారపడి జీవించకూడదు.
  • దయ, సంతృప్తి, సహనం, సత్యం ఇవే ముఖ్యమైనవి.
  • ఆకలితో అలమటించే వారికి అన్నం యిచ్చేవారినీ, గుడ్డల అవసరం ఉన్నవారికి గుడ్డలను ఇవ్వగల్గే వ్యక్తినే భగవంతుడు ప్రేమిస్తాడు.
  • అందరూ గొప్ప పుట్టుక కలవారే.
  • పేరాశను జయించిన వారిని భగవంతుడు ప్రేమిస్తాడు.
  • అర్ధంలేని ఆచారాలు రూపరహితుడైన భగవంతుడిని అర్ధం చేసుకునే మార్గపు అవరోధాలు అవుతాయి.
  • పవిత్రమైన హృదయంతో అతడిని ధ్యానించడం, అతడిని ప్రశంశించడం అన్నవే ముక్తి మార్గాలు.
"గురుగ్రంధసాహిబ్" సిక్కుల పవిత్ర గ్రంధం. పదిమంది సిక్కు గురువుల ఉపదేశాలూ, వారి సూక్తులూ ఇందులో సంగ్రహించబడి వున్నాయి. ఇందులో హిందూమతపు, మహమ్మదీయుల మతపు పండితుల, భక్తుల రచనలు చాలా ఉన్నాయి. ఈ మత గ్రంధమే సిక్కుమతానికి మార్గదర్శకత్వం వహిస్తుంది.సిక్కులు తమ మత స్థాపకుడి పటాన్నె ఆరాధిచడంగానీ ఏ ఇతర గురువుల పటాన్ని తమ మత గ్రంధం వద్ద పెట్టడం కానీ చేయరు. గురుగ్రంధ సాహెబ్‌ను గౌరవిస్తారు. "నేను దేవుడిని కాదు.నేను అతడి అవతారం కూడా కాదు. అతని సందేశాన్ని అందజేసే మత ప్రవక్తను మాత్రమే" అని గురునానక్ చెప్పాడు.

నన్నాహాల్ సింగ్ రాసిన ఈ కవిత గురునానక్ సంపూర్ణ వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది "పవిత్ర హృదయంతో అతడు పవిత్రతను ప్రబోధించాడు. ప్రేమావతారుడైన అతడు ప్రేమనౌ నేర్పాడు. వినయ సంపన్నుడైన అతడు విధేయతను నేర్పాడు. సదాచార సంపన్నుడైన అతడు దైవత్వాన్ని బోధించాడు. శ్డాంతి దూత అయిన అతడు న్యాయాన్ని వాదించాడు. సమానత్వం, పైత్రతల సాకార రూపమైన అతడు భగవంతుడిపట్ల భక్తి, సదాచారం, గౌరవం ఉండాలని తెలియజేశాడు".

రచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top