తిరుమల..శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం మరియు ఏడు కొండలు నెలవుగా వున్న ఆలయాలు, తీర్థాలు

0
తిరుమల... శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న కలియుగ వైకుంఠం. చారిత్రక, పురాణ ప్రాశస్త్యమున్న ఎన్నో ఆలయాలు, తీర్థాలకు ఏడు కొండలు నెలవుగా ఉన్నాయి. ఒక విధంగా తిరుమల ఎన్నో విశేషాల సమాహారం. సప్తగిరులే శయన రూపంలో ఉన్న శ్రీనివాసుడి ముఖాన్ని పోలి కనిపించడం ఎంతో విశేషమైనది. ఒకసారి తిరుమలకు వెళితే తప్పకుండా చూడాల్సినవేంటో తెలుసుకుందాం. తిరుమల గురించి అరుదైన విశేషాలను కూడా తెలుసుకుందాం.

లోక కల్యాణార్థం, ప్రజల సంరక్షణార్థం తిరుమలలో నారాయణుడు శ్రీ వెంకటేశ్వరుడిగా వెలిశాడని అందరికీ తెలిసిందే. వైకుంఠ లోకం నుంచి స్వామి వారు భూలోకంలోని ఏడుకొండలపై దిగిపోయి పద్మావతీ అమ్మవారిని పరిణయమాడిన కథనం గురించి వినే ఉంటారు. విషయం తెలుసుకుని లక్ష్మీదేవి అమ్మవారు భూలోకానికి వచ్చి స్వామి వారిని నిలదీయడం, దాంతో స్వామి వారు విగ్రహ రూపంలోకి మారిపోవడాన్ని ఆలయ స్థల పురాణం చెబుతోంది. స్వామి వారు శిలామూర్తిగా మారిపోయిన వెంటనే లక్ష్మీదేవీ అమ్మవారు స్వామి ఎడమ వక్షస్థల ప్రాంతంలో, పద్మావతీ అమ్మవారు కుడి వక్షస్థల ప్రాంతంలో అంతర్లీనమైనట్టు చెబుతారు. చూడ్డానికి స్వామి వారి విగ్రహం ఒక్కటే కనిపిస్తుంది. కానీ అక్కడ స్వామి, అమ్మవార్లు కూడా ఉన్నట్టు భావించాలి.

భూ వరాహస్వామి:
భూ వరాహస్వామి - Bhu varahasawmy
భూ వరాహస్వామి - Bhu varahasawmy
స్వామి వారి ఆలయం ఉత్తర దిశగా పుష్కరిణిని ఆనుకుని ఉండే ఆలయమే శ్రీ భూవరాహ స్వామి ఆలయం. బ్రహ్మపురాణం ప్రకారం తిరుమల ఆది వరాహ క్షేత్రం. భూవరాహస్వామి వారి ఆధ్వర్యంలో ఉన్నది. శ్రీ మహావిష్ణువు భూమిపైకి రాక ముందు భూ వరాహస్వామి ఏడుకొండలపై నివసించేవారు. ఏడుకొండలపై నివాసం ఉండాలన్న శ్రీనివాసుడి కోరిక మేరకు వరాహస్వామి అక్కడి భూమి అంతటినీ స్వామి వారికి కేటాయించేశారు. ఇందుకు స్వామి వారు కృతజ్ఞతతో తొలి దర్శనం, తొలి నైవేద్యం భూవరాహ స్వామి వారికే దక్కాలని అనుగ్రహించారు. ఫలితంగా తిరుమలకు వచ్చే భక్తులు ముందుగా భూ వరాహస్వామి వారిని దర్శించుకున్న తర్వాతే శ్రీనివాసుడ్ని దర్శించుకోవాలని స్థల పురాణం చెబుతోంది. దీని ద్వారా స్వామి వారి కృపకు పాత్రులు కావడానికి వీలుంటుంది.

భూ వరాహ స్వామి ఆలయం ప్రతి రోజు ఉదయం 5.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటలకు దర్శనాల కోసం తెరిచి ఉంటుంది. వరాహ స్వామి జన్మనక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని శ్రావణ మాసంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు.

బేడీ ఆంజనేయస్వామి ఆలయం
తిరుమలకు వచ్చే వారు ఆలయ ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండే ఆంజనేయస్వామి ఆలయాన్ని కూడా దాదాపు చూసే ఉంటారు. ప్రతి రోజూ నిత్య నైవేద్యాన్ని తొలుత భూ వరాహస్వామి వారికి తర్వాత వెంకటేశ్వరస్వామి వారికి సమర్పణ చేసిన తర్వాత ఆ నైవేద్యాన్ని బేడీ ఆంజనేయస్వామి ఆలయానికి కూడా తీసుకెళ్లి ఆరగింపు చేస్తారు. ఆంజనేయుడు యుక్త వయస్సులో ఉన్నప్పుడు తిరుమల నుంచి వెళ్లిపోవాలని భావిస్తాడు. తల్లి అంజనాదేవి ఇది తెలుసుకుని ఆంజనేయుడి రెండు చేతులను కలిపి బేడీలు వేసినట్టు కట్టేసి తాను తిరిగి వచ్చే వరకు కదలవద్దని చెప్పి అదృశ్యం అవుతుంది. ఆకాశగంగ వెనుక భాగంలోకి వెళ్లిన అంజనాదేవి ఎంతకీ తిరిగి రాలేదు. దాంతో ఆంజనేయుడు అలానే ఉండిపోతాడు. బేడీ ఆంజనేయస్వామి అనే పేరు ఇలానే వచ్చింది. స్వామి వారికి ప్రతీ ఆదివారం అభిషేకం నిర్వహిస్తారు.

విమాన వెంకటేశ్వరుడు
తిరుమలలో స్వామి వారిని దర్శించుకుని గర్భగుడి చుట్టూ తిరిగి వెళ్లే క్రమంలో విమాన వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం కనిపిస్తుంది. గర్భగుడి బయట పై భాగంలో స్వామి వారి రూపు వెండి, బంగారు తొడుగుతో దర్శనమిస్తుంది. 16వ శతాబ్దంలో వ్యాసతీర్థులు విమాప వెంకటేశ్వరుడిని ఆరాధించి మోక్షం పొందినట్టు స్థల పురాణం.

స్వామి పుష్కరిణి
స్వామి వారి ఆలయం పక్కనే ఉండే పుష్కరిణికి చాలా విశిష్టత ఉంది. వైకుంఠంలోని పుష్కరిణియే ఇదని చెబుతారు. స్వామి భూమిపైకి రావడంతో ఆయన వాహనమైన గరుత్మంతుడు పుష్కరిణిని ఇక్కడకు తీసుకొచ్చినట్టు చెబుతారు. ధనుర్మాసంలో ముక్కోటి ద్వాదశి రోజున ముక్కోటి పుష్కరిణిగా మారుతుందని నమ్మకం. ఆ రోజున ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే నదుల్లో చేసినంత పవిత్రత, పుణ్యం వస్తుందంటారు. పురాణాల ప్రకారం పుష్కరిణిలో ముక్కోటి తీర్థాలు కలుస్తాయని, ఇక్కడ దేవతలు సైతం స్నానాలు ఆచరిస్తారని చెబుతారు.
తీర్థాలు: tirumala Pilgrimages

తీర్థాలు: Pilgrimages
పాండవతీర్థం, కుమారధార, తుంబుర తీర్థం, రామకృష్ణ, చక్ర, వైకుంఠ తీర్థం, శేష తీర్థం, సీతమ్మ తీర్థం, పసుపు తీర్థం, జాబాలి తీర్థం, సనక సనందన తీర్థం ఇవి కొన్నే. తిరుమల అంతటా పవిత్ర తీర్థాలు కోటి వరకు ఉన్నాయని చెబుతుంటారు.

తీర్థాల వద్ద జరిగే ముఖ్యమైన పండుగలు
కుమారధార వద్ద మాఘ పౌర్ణమి రోజున, రామకృష్ణ తీర్థం వద్ద పుష్య పౌర్ణమినాడు, తుంబురు తీర్థం వద్ద ఫాల్గుణ పౌర్ణమి నాడు, చక్రతీర్థం వద్ధ కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజున ప్రత్యేక పూజలు జరుగుతాయి.

శిలాతోరణం
ఆలయం ఉత్తర దిశలో కిలోమీటరు దూరంలో ఉండే అటవీ ప్రాంతంలో ఇది కనిపిస్తుంది. రెండు భారీ రాతి శిలలు సూక్ష్మ పరిమాణంలో అనుసంధానమై ఉండడం ఇక్కడి విశిష్టత. ఇటువంటి అరుదైనది అమెరికాలోని రెయిన్ బో ఆర్చ్, ఆస్ట్రేలియా మినహా మరెక్కడా లేదని చెబుతారు. స్వామి వారు శిలా రూపంలోకి మారిపోవడానికి సంబంధించి కీలక సమాచారం ఇక్కడే సమాధి కాబడిందని చెబుతారు. 10 అడుగుల ఎత్తులో, 25 అడుగుల వెడల్పుతో ఉండే ఈ రాతి ఆర్చ్ దగ్గరకు ప్రైవేటు వాహనంలో వెళ్లాల్సి ఉంటుంది. నడచి వెళ్లాలనుకుంటే వరాహస్వామి ఆలయం నుంచి 20 నిమిషాలు పడుతుంది. చక్ర తీర్థం కూడా ఇక్కడే ఉంటుంది.
పాపవినాశనం - Papavinasanam
పాపవినాశనం - Papavinasanam
 పాపవినాశనం
కొండల్లోంచి సహజసిద్ధంగా వచ్చే జలధార ఇది. ఈ జలాల్లో స్నానమాచరించడం ద్వారా పాపాలు నశించిపోతాయన్నది భక్తుల విశ్వాసం. అందుకే దీనికి పాపనాశనం తీర్థమనే పేరు స్థిరపడింది. భక్తుల నీటి అవసరాల కోసం ఇక్కడ ఏర్పాటు చేసిన డ్యామ్ కూడా చూడవచ్చు. తొలుత పాపవినాశనం తీర్థ జలాలను స్వామి వారికే వినియోగించేవారు. ఆలయానికి దూరంగా ఉండడంతో ప్రస్తుతం ప్రత్యేక దినాల్లోనే ఈ జలాలను తీసుకెళుతున్నారు.

 ఆకాశగంగ
ఆలయానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో పాపవినాశనానికి వెళ్లే మార్గంలోనే ఇది ఉంది. ఇది కూడా సహజసిద్ధ తీర్థమే. ఈ తీర్థంతో శ్రీవెంకటేశ్వస్వామి వారికి నిత్య అభిషేకం నిర్వహిస్తుంటారు.

 స్వామివారి పాదాలు
తిరుమల బస్ స్టేషన్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో నారాయణగిరి పర్వత ప్రాంతంలో రాతి రూపంలో ఉన్న స్వామి వారి పాదాలను చూడవచ్చు. ఏడుకొండలపై మొదట స్వామి వారు అడుగు పెట్టింది ఇక్కడేనని, ఆ పాద ముద్రలే ఇవని చెబుతారు. ఈ పాదాల చుట్టూ గ్లాస్ బాక్స్ ను ఏర్పాటు చేసి భక్తులు తాకకుండా రక్షణ కల్పించారు. దీనికి సమీపంలోనే శిలా తోరణం కూడా ఉంటుంది. ప్రైవేటు ట్యాక్సీ లేదా షేర్ ట్యాక్సీలో ఇక్కడికి వెళ్లవచ్చు.

⊍ చక్రతీర్థం
శిలాతోరణానికి సమీపంలోనే చక్రతీర్థం ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ బ్రహ్మ తపస్సు చేసుకోవాలని భావిస్తారు. తనకో మంచి ప్రదేశం చూపాలని కోరడంతో వెంకటేశ్వరస్వామి తన సుదర్శన చక్రంతో రాతిని చీల్చి బ్రహ్మకు స్థానం చూపించారు. కొండపై నుంచి వచ్చిన నీటితో ఇక్కడ తీర్థం ఏర్పడింది. బ్రహ్మోత్సవ సమయంలో స్వామి ఉత్సవమూర్తిని ఇక్కడకు కూడా తీసుకొస్తారు.

 తుంబురు తీర్థం
తిరుమల నుంచి 12 కిలోమీటర్లు, పాపవినాశనం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఈ తీర్థం ఉంది. ఏటా ఫాల్గుణ పౌర్ణమి సమయంలో ఈ తీర్థానికి వెళ్లే దారిని తెరుస్తారు. దట్టమైన అటవీ మార్గంలో మొత్తం ఐదు జలపాతాలను దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. గంధర్వుడైన తుంబురుడు తన భార్యను శపించడంతో ఆమె కప్ప రూపంలో మారి తుంబుర తీర్థంలో ఉంటుంది. అగస్త్య ముని ఓరోజు ఇక్కడి తీర్థానికి రావడంతో ఆమె తన చరిత్ర గురించి చెప్పగా, అగస్త్యుడు అనుగ్రహం వల్ల ఆమె తిరిగి తన యథా రూపాన్ని సంతరించుకుంటుంది. అప్పటి నుంచి ఇది తుంబుర తీర్థంగా వెలుగులోకి వచ్చింది. మరో కథనం ప్రకారం తుంబురు మహర్షి ఇక్కడ ఘోరమైన తపస్సు చేయడం వల్ల ఈ తీర్థానికి తుంబుర తీర్థం పేరు స్థిరపడినట్టు చెబుతారు.

⊍ జాబాలి తీర్థం
తిరుమలలో పాపవినాశనానికి వెళ్లే మార్గంలోనే ఈ తీర్థం ఉంది. ఇక్కడే ఆంజనేయస్వామి ఆలయాన్ని సైతం చూడవచ్చు. జాబాలి అనే ముని ఇక్కడ తపస్సు చేయగా ఆంజనేయుడు దర్శనమిచ్చినట్టు చెబుతారు. శ్రీరాముడు వనవాసంలో భాగంగా సీతమ్మవారు, లక్ష్మణ, ఆంజనేయస్వామి వార్లతో ఇక్కడ కొంత కాలం ఉన్నారని కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

⊍ నాగ తీర్థం
దేవాలయం నుంచి కిలోమీటరు దూరంలో ఉంటుంది నాగతీర్థం. అలాగే, ఈ తీర్థానికి సమీపంలోనే బాలతీర్థం కూడా చూడవచ్చు. ఇక్కడ స్నానం చేస్తే బాలల్లా మారిపోతారని, అంటే అలాంటి శక్తిని సంతరించుకుంటారని చెబుతారు. ప్రస్తుతానికి ఈ తీర్థంలో జలం కనిపించడం లేదు. సృష్టికి విరుద్ధం కనుక జలం అంతరించిందని అంటారు.

 శేషతీర్థం
సాక్షాత్తూ శ్రీ మన్నారాయణుడు ఆదిశేషుడు (నాగేంద్రుడు) రూపంలో కొలువై ఉన్న తీర్థం ఇది. తిరుమల పాపవినాశనం డ్యామ్ నుంచి దట్టమైన అటవీ ప్రాంతంలో కొంతదూరం ప్రయాణించడం ద్వారా చేరుకోవచ్చు. ఈ తీర్థాన్ని చేరుకోవాలంటే నీటి ప్రవాహాలను దాటాల్సి ఉంటుంది. చివరిగా పది మీటర్ల వ్యాసార్థంతో కూడిన పెద్ద తీర్థం ఉంటుంది. ఈత బాగా వచ్చిన వారు ఇందులోకి దిగి కొంత మేర లోపలికి వెళ్లినట్టయితే అక్కడ ఆదిశేషుడి శిలారూపాన్ని దర్శించుకోవచ్చు.

ఈత రాని వారు గాలి నింపిన వాహనాల ట్యూబులు, తాడును రక్షణగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. గైడ్ సహకారం తప్పనిసరి. ఎందుకంటే అటవీ ప్రాంతం... శేష తీర్థంలో పేరులో ఉన్నట్టుగానే నాగు పాములు ఈ తీర్థంలో, చుట్టు పక్కల సంచరిస్తుంటాయి. కనుక తెలియకుండా వెళ్లి అపాయాన్ని కొని తెచ్చుకోకుండా గైడ్ సాయం తీసుకుని వెళ్లడం మంచిది.

ఒకరోజు శ్రీ మహావిష్ణువుకు బాగా దాహం వేసింది. దాంతో జలాన్ని తీసుకురావాలని గరుత్మంతుడ్ని పురమాయించారు. కానీ ఆయన ఎంత సేపు అయినా నీరు తేకపోవడంతో అప్పుడు స్వామివారు ఆదిశేషుడ్ని కోరతారు. దీంతో ఆదిశేషుడు జలాన్ని తన తోక ద్వారా రప్పించి స్వామి వారి దాహం తీర్చారని, అందుకే ఇది శేష తీర్థం అయ్యిందని పురాణ చరిత్ర.

 పాండవ తీర్థం
వనవాస సమయంలో పాండవులు తిరుమలలో పర్యటిస్తూ ఈ తీర్థంలో స్నానం చేశారని చెబుతుంటారు. దీనికి గోగర్భ తీర్థం అని మరో పేరు కూడా కలదు. స్వామి వారి ఆలయానికి ఈశాన్య దిశలో ఉంది. ఈ నీటిని ఒడిసి పట్టుకునేందుకు టీటీడీ 1963లో గోగర్భం డ్యామ్ నిర్మించింది.

 కుమారధార తీర్థం
కుమారధార తీర్థానికి విశిష్ట చరిత్ర ఉంది. మాఘమాసంలో పౌర్ణమి రోజున సంతాన భాగ్యం లేని మహిళలు ఈ తీర్థంలో స్నానం ఆచరిస్తే సంతాన భాగ్యం సిద్ధిస్తుందని చెబుతుంటారు.

⊍ ధర్మగిరి
శిలాతోరణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుమల వేద విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో ఇక్కడ నాలుగు వేదాలు, స్మార్త విద్యలో విద్యార్థులకు బోధన ఉంటుంది. ఇక్కడే వేదాన్ని అభ్యసించే పిల్లలకు వసతి గదులు కూడా ఉన్నాయి.

ఉద్యానవనాలు
తిరుమలలో నాలుగు ఉద్యానవనాలు ఉన్నాయి. ట్రావెలర్స్ బంగళా, గోగర్భం డ్యామ్, శ్రీ పద్మావతీ గెస్ట్ హౌస్, దివ్యారామం ప్రాంతాల్లో ఉన్నాయి. వైష్ణవాచార్య శ్రీ రామానుజుల వారు, ఆయన శిష్యుడైన శ్రీ ఆనంతాళ్వార్ 14వ శతాబ్దంలో ఈ ఉద్యానవనాలను ప్రారంభించినట్టు భావిస్తారు.

మ్యూజియం
తిరుమల బస్ స్టేషన్ కు కిలోమీటరు దూరంలో ఉండే మ్యూజియంలో తిరుమల చారిత్రక, శిల్ప సంపద గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు.

వెంగమాంబ సమాధి
తాళ్లపాక అన్నామాచార్యుని వలే తిరుమల శ్రీవెంకటేశ్వరుడిని తన భక్తితో, సంకీర్తనలతో కొలిచిన భక్తురాలు తరిగొండ వెంగమాంబ. ఈమె తిరుమలలో సమాధి చెందారని చెబుతారు. శ్రీ వరాహస్వామి ఆలయానికి ఉత్తరం వైపున వెంగమాంబ సమాధి, దాని చుట్టూ ఏర్పాటు చేసిన తులసివనం ఉంది. ఇక్కడే ఓ ప్రైవేటు పాఠశాల కూడా ఉంది. స్వామి వారిని తమ సంకీర్తనలతో అలరించిన భక్తులు అన్నమాచార్య, వెంగమాంబల సేవలకు గుర్తింపుగా తిరుమలలో స్వామి వారి సేవల సమయంలో అన్నమయ్య సంకీర్తనలు, వెంగమాంబ హారతి అని ఇస్తుంటారు.

హథీరాం సమాధి
సాక్షాత్తూ ఆ శ్రీహరితో పాచికలాడిన భక్తుడు హథీరాం బావాజీ. పాప వినాశనానికి వెళ్లే మార్గంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం అని ఒకటుంది. దీని పక్కనే బావాజీ సమాధి ఉంది. తిరుమల ఆలయ పాలనా వ్యవహారాలను 1843లో ఆంగ్లేయులు హథీరాం బావాజీ మఠానికి అప్పగించారని చెబుతారు. అప్పటి నుంచి 1933లో టీటీడీ బోర్డు ఏర్పడే వరకు తిరుమల ఆలయ నిర్వహణ వ్యవహారాలను బావాజీ మఠమే చూసింది. ప్రతిరోజూ వేకువ జామున సుప్రభాత సేవలో హథీరాం బావాజీ మఠం వారు సమర్పించే పాలు, వెన్నను స్వామి వారికి నివేదించడం ఇప్పటికీ ఆచరణలో ఉంది.

అనంతాళ్వార్ తోట
తిరుమలలో స్వామి వారికి నిత్యం పూలు సమర్పించి సేవ చేసుకునే భాగ్యం పొందిన తొలి భక్తుడు అనంతాళ్వార్. స్వామి వారికి పుష్ప కైంకర్య విధానాన్ని అమలు చేసినది అనంతాళ్వారేనని చెబుతారు. ఈ విధానాన్ని నేటికీ తిరుమలలో కొనసాగిస్తున్నారు. తిరుమలలో శ్రీవారి ఆలయానికి వెనుక వైపు అనంతాళ్వార్ నివసించే వారు. స్వామికి పూలు సమర్పించుకునేందుకు పూల తోట వేసి, దానికి నీటి కోసం బావి తవ్వాలని అనుకున్నారట. భార్యతో కలసి స్వయంగా బావి తవ్వే పని ప్రారంభించారు. ఈ పనిలో సాక్షాత్తూ శ్రీహరి బాలుడి రూపంలో వచ్చి సాయం చేయడం విశేషం.

అయితే, బావి తవ్వే పనిలో సాయం చేస్తానంటూ ఓ బాలుడు వచ్చి అనంతాళ్వార్ తో అనగా, ఆయన తిరస్కరిస్తారు. దీంతో బాలుడి రూపంలో వచ్చిన స్వామి వారు అనంతాళ్వార్ భార్యకు సాయం చేస్తారు. దీంతో ఆగ్రహించిన అనంతాళ్వార్ బావి తవ్వే గునపాన్ని బాలుడిపైకి విసరగా, స్వామి వారి గడ్డానికి గాయమైనట్టు చెబుతారు. అదే రోజు పూలు తీసుకుని స్వామి వారి సేవకు వెళ్లిన అనంతాళ్వార్ స్వామి వారి గడ్డం నుంచి రక్తం రావడాన్ని గమనించి బాలుడి రూపంలో వచ్చినది స్వామి అని గ్రహించి ఎంతో బాధపడతారు. స్వామి గడ్డానికి పచ్చ కర్పూరాన్ని అద్దుతారు. ఇప్పటికీ ఈ ఆచారం తిరుమలలో కొనసాగుతోందని అంటారు.

అర్చకులు స్వామి వారి గడ్డానికి ప్రతి రోజూ పచ్చకర్పూరాన్ని అద్దుతారు. స్వామి వారిపైకి అనంతాళ్వార్ విసిరిన గునపం కూడా ఆలయ మహాద్వారానికి కుడివైపున చూడవచ్చు. స్వామి వారి సేవ కోసం పూల సాగుకు అనంతాళ్వారులు ఏర్పాటు చేసిన పూలవనాన్ని అనంతాళ్వార్ తోటగా పిలుస్తారు. దీన్ని క్యూ కాంప్లెక్స్ కు వెళ్లే దారిలో చూడవచ్చు.

నిత్యాన్నదానం... మహోన్నత కార్యక్రమం
ఈ ప్రపంచంలో ఒక రోజులో భారీ సంఖ్యలో అన్నదానం జరుగుతున్న ఒకే ఒక్క ఆలయం తిరుమల. నిత్యాన్నదాన ట్రస్ట్ ద్వారా ప్రతి రోజూ 1.2 లక్షల మంది భక్తులకు అన్నదానం చేస్తున్నారు.

తిరుమల లడ్డూ విశేషాలు
తిరుమల లడ్డూ అంటే భక్తులు మనసు పారేసుకుంటారు. రోజూ లక్షన్నర లడ్డూలను తయారు చేయించి టీటీడీ భక్తులకు పంపిణీ చేస్తోంది. ఏడాది మొత్తం మీద చూసుకుంటే లడ్డూల పంపిణీ 5 కోట్ల నుంచి 10 కోట్ల మధ్యలో ఉంటోంది. ఇక్కడ తయారయ్యే లడ్డూకు జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ గుర్తింపు ఉంది. అంటే తిరుపతి లడ్డూని అదే రూపంలో, అదే పేరుతో వేరొకరు తయారు చేయడానికి వీలులేదు. స్వామి వారికి లడ్డూ నైవేద్య సమర్పణ 1715 ఆగస్ట్ 2న ప్రారంభమైందని చెబుతారు.

లడ్డూలో కలిపే పదార్థాల ఫార్ములాలో ఇప్పటి వరకు ఆరు సార్లు మార్పులు జరిగాయంటారు. శనగపిండి, జీడిపప్పు, ఆవు నెయ్యి, పంచదార, యాలకులు, పటికబెల్లం, ఎండుద్రాక్షలతో లడ్డూలను తయారు చేస్తారు. రోజూ లడ్డూల తయారీకి సుమారుగా 10 టన్నుల శనగపిండి, 10 టన్నుల పంచదార, 700 కిలోల జిడిపప్పు, 150 కిలోల యాలకులు, 500 లీటర్ల వరకు నెయ్యి, 500 కిలోల వరకు పటికబెల్లం వినియోగిస్తుంటారు.

స్వామికి సమర్పించే లడ్డూల్లోనూ రకాలు
తిరుపతి లడ్డూ అంటే మనకు ఒకటే తెలుసు. కానీ ఇందులోనూ కొన్ని రకాలు ఉన్నాయి. సాధారణంగా భక్తులకు పంపిణీ చేసే లడ్డూలను ప్రోక్తం లడ్డు అంటారు. దీని బరువు 175 గ్రాములు. కల్యాణోత్సవ లడ్డూ అని మరొకటి ఉంది. స్వామి వారి కల్యాణోత్సవ సేవ చేయించుకున్న భక్తులకు అందిస్తారు. వీటిని తక్కువ సంఖ్యలోనే తయారు చేస్తారు. అలాగే ప్రత్యేక పర్వదినాల్లో స్వామి వారికి ఆస్తానం లడ్డూ అని 750 గ్రాములతో చేసి నివేదిస్తారు. ఈ లడ్డూలో జీడిపప్పులు, ఎండు ద్రాక్ష, బాదం, కుంకుమ పువ్వులను అధిక పరిమాణంలో వినియోగిస్తారు.
కపిల తీర్థం, కపిలేశ్వరస్వామి ఆలయం - kapila thirtam
కపిల తీర్థం, కపిలేశ్వరస్వామి ఆలయం - Kapilathirtam
కపిల తీర్థం, కపిలేశ్వరస్వామి ఆలయం
తిరుమలకు దిగువన ఉన్న ఈ కపిలేశ్వరస్వామి ఆలయంలో పరమశివుడు కొలువై ఉన్నాడు. పక్కనే తిరుమల ఏడు కొండల నుంచి జాలువారే జలాలతో ఏర్పడిందే కపిలతీర్థం. ఈ తీర్థానికీ, ఆలయానికీ ఎంతో విశిష్టత ఉంది. ఇక్కడి తీర్థంలో 16 తీర్థాలు కలసి ఉన్నాయని చెబుతారు. ఏటా శివరాత్రి సందర్భంగా విశేష పూజలు జరుగుతాయి. ఆ రోజు స్వామి దర్శనానికి కూడా పౌరాణికంగా ఎంతో ప్రాధాన్యం ఉంది.

కల్యాణ వెంకటేశ్వరస్వామి
శ్రీనివాస మంగాపురంలో ఉన్నదీ ఆలయం. తిరుపతి నుంచి 12 కిలోమీటర్ల దూరం. శ్రీ పద్మావతీ అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాత తిరుమలకు వెళ్లక ముందు స్వామి వారు అమ్మవారితో కలసి ఇక్కడే ఉన్నట్టు స్థల పురాణం.

ప్రసన్న వెంకటేశ్వరస్వామి
తిరుపతికి 18 కిలోమీటర్ల దూరంలో అప్పలయ్యగుంటలో అభయ హస్తంతో వెలసిన వెంకటేశ్వరస్వామి వారి ఆలయం ఉంది. ఇక్కడ స్వామి వారు అమ్మవారితో కలసి వెలసినట్టు చెబుతారు.

చంద్రగిరి కోట
తిరుపతికి సమీపంలోని చంద్రగిరికోటకు చారిత్రక ప్రాశస్త్యం వుంది. 1640లో ఈ కోటను పూర్తిగా రాతితో నిర్మించారు. కొండపక్కనే దీన్ని నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయులకు ఇది విడిది కేంద్రంగా ఉండేది. శ్రీకృష్ణదేవరాయుల మహామంత్రి తిమ్మరుసు స్వస్థలం చంద్రగిరి. ఇక్కడ రాణి మహల్, రాజ్ మహల్ ను చూడవచ్చు.

గోవిందరాజస్వామి ఆలయం
తిరుపతికి గోవిందరాజపట్నం అని మరొక పేరు కూడా ఉంది. తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయం ఉండడంతో ఈ పేరు మీదుగా గోవిందరాజపట్నం అనే పేరు వచ్చింది. గోవిందరాజస్వామి వారు శ్రీవారి సోదరునిగా చెబుతారు. స్వామి వారి వివాహానికి కుబేరుడు ధన సాయం చేసినట్టు స్థల పురాణం చెబుతోంది. కుబేరుడు ఇచ్చిన ధనాన్ని కొలిచే పనిని గోవిందరాజస్వామి వారు చేపట్టారు. ఎంత సేపు కొలిచినా పని పూర్తికాక అలసిపోయి ఆ కొలమానికను తల కింద పెట్టుకుని శయనించినట్టు కథనాలు ఉన్నాయి. ఈ ఆలయం టీటీడీ
నిర్వహణలో ఉంది.

తిరుమలలో స్వామి వారికి జరిగినట్టే గోవిందరాజస్వామికి కూడా నిత్యం సుప్రభాతం, తోమాలసేవ, సహస్ర నామార్చన, నైవేద్యం, ఏకాంత సేవలు జరుగుతాయి. అలాగే, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఏటా వైశాఖ మాసంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. గోవిందరాజస్వామి ఆలయం ప్రాంగణంలోనే గోదాదేవీ, పార్థసారధి, కల్యాణ వెంకటేశ్వరస్వామి, లక్ష్మీదేవి ఇలా చాలా ఆలయాలను దర్శించుకోవచ్చు.

తిరుపతి సమీపంలో ఇతర ఆలయాలు
తిరుమలకు సమీపంలో ప్రసిద్ధి చెందిన కాణిపాక వరసిద్ధి దేవాలయం, శ్రీకాళహస్తీశ్వరాలయం, తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్, తిరుపతికి 70 కిలోమీటర్ల దూరంలోని నాగలాపురంలోని వేదనారాయణస్వామి ఆలయాలు తప్పకుండా సందర్శించాల్సినవి. వేదనారాయణస్వామి ఆలయంలో స్వామి మత్స్యావతారంలో దర్శనమిస్తారు. పక్కనే శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను కూడా దర్శించుకోవచ్చు. అలాగే, తిరుపతి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, తిరుపతికి 49 కిలోమీటర్ల దూరంలో ఉన్న తలకోన జలపాతాలు పర్యాటక ప్రదేశాలు.

తిరుమల గురించి అపోహలు... తెలుసుకోవాల్సిన నిజాలు

తిరుమలలో స్వామి వారి విగ్రహానికి తలనీలాలు ఉంటాయనే వదంతి ఒకటుంది. అలాగే, స్వామి వారికి సమర్పించే పూలు, పాలు, నెయ్యి ఇతర అన్ని రకాలను తిరుమల ఆలయానికి 22 కిలోమీటర్ల దూరంలోని ఓ గ్రామం నుంచే వస్తాయని ఇలా రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వీటి గురించి తిరుమల ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఓ టెలివిజన్ చానల్ తో మాట్లాడుతూ సందేహాలను తీర్చే ప్రయత్నం చేశారు. రమణ దీక్షితులు ఏం చెప్పారంటే...
  • స్వామి వారికి కేశములు ఉన్నాయన్నది కల్పితం. స్వామి వారికి వెంట్రుకలు లేవు. స్వామి వారి శరీరం మెత్తగా ఉందని, చెమట పడుతుందని, గోళ్లు పెరుగుతాయన్నవి అవాస్తవాలు. ఇలాంటివి ప్రాకృతమైన మానవ దేహ లక్షణాలను అప్రాకృతులైన స్వామివారికి ఆపాదించడం దోషం.
  • స్వామి వారికి ఉదయం తోమాల, రాత్రి తోమాల సేవలో, గురువారం పూలంగి సేవలో, ఉత్సవ సేవల్లో పూలు, పూల మాలలు సమర్పిస్తాం. స్వామి కైంకర్యానికి వినియోగించే పుష్పాలన్నింటినీ కూడా స్వామి వారి ఆలయం చుట్టూ ఉన్న ఉద్యానవనాల నుంచి వస్తున్నవే. అంతేకానీ, ప్రత్యేకంగా ఒక ఊరి నుంచి రావడం జరగలేదు.
  • స్వామి వారికి సమర్పించిన పూలను సడలింపు (తొలగించిన అనంతరం) తర్వాత స్వామి వారి విగ్రహం వెనుక భాగంలో ఉన్న నీటిలో వేస్తారన్నది కూడా అవాస్తవమే. స్వామి వారి వెనుక తిన్నె మాత్రమే ఉంటుంది. ఉదయం తోమాల సేవలో స్వామి వారికి సమర్పించిన పూలను సాయంత్ర తోమాల సేవకు ముందు తొలగిస్తారు. దీన్నే సడలింపు అంటారు. ఈ సడలింపు చేసిన పుష్పాలను అద్దాల మంటపం పక్కనున్న పూల బావిలో త్యజించేవాళ్లం. ప్రస్తుతం ఆ బావి నిండిపోవడం వల్ల విష్వక్సేనుల, గడుళార్వార్లకు సమర్పించిన పూలను స్వామి వారి ఉద్యానవనంలో, స్వామి వారి అలంకారానికి పెంచే పుష్పవనంలోనే వేస్తున్నాం.
  • స్వామి వారికి రోజూ పంచె, చీర ధరింపజేసేది కూడా నిజం కాదు. ప్రతీ శుక్రవారం అభిషేకం తర్వాత నూతన వస్త్రాలంకరణ జరుగుతుంది. 24 మూరల పొడుగు, నాలుగు మూరల వెడల్పు ఉన్న పట్టు ధోవతి దీన్ని మేల్ చాట్ అంటారు. 12 మూరలు ఉన్న ఉత్తరీయం దీన్ని అంగవస్త్రం అంటారు. దీన్ని ధోవతిలా స్వామివారికి కడతాం. ఎందుకుంటే స్వామి వారు పురుషోత్తముడు.
  • 1800 సంవత్సరంలో ఆలయం 12 సంవత్సరాలు మూసివేత గురించి మాట్లాడుతూ... విఖనస మహర్షి నైమిశారణ్యానికి వేంచేసి వైఖానస ఆగమనాన్ని ప్రసాదించినప్పటి నుంచి ఈ రోజు వరకు వైఖానస ఆగమోత్తంగా స్వామి వారికి నిత్య కైంకర్యాలు జరిపిస్తున్నాం. ఇటువంటి అపోహలను భక్తులు నమ్మవద్దని రమణదీక్షితులు సూచించారు.
తిరుపతి, తిరుమలకు రవాణా వసతులు
రైలు, రోడ్డు, విమాన మార్గంలో తిరుపతికి చేరుకోవచ్చు. తిరుపతి రైల్వే స్టేషన్ కు సమీపంలోనే ఆర్టీసీ బస్సులు నిలిపే స్టాండ్ ఉంటుంది. అక్కడి నుంచి తిరుమలకు నిమిషానికో బస్సు ఉంటుంది. ప్రధాన బస్ స్టేషన్ కు చేరుకున్నా అక్కడి నుంచి కూడా తిరుమలకు వెంట వెంట బస్సులు ఉన్నాయి. కొన్ని డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు నేరుగా తిరుమలకు నడుస్తుంటాయి. ప్రైవేటు ట్యాక్సీలు కూడా బోలెడన్ని అందుబాటులో ఉన్నాయి. విమానంలో అయితే రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్లాల్సి ఉంటుంది.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top