ప్రతికాశి ఆలయం, కాశీకి ప్రతిరూపమైన ప్రతికాశి - Prati kasi temple

0


హిందువుగా పుట్టిన ప్రతివాడూ జీవితంలో ఓ సారైనా కాశిని సందర్శించాలని అనుకుంటూ ఉండటం కద్దు. ఒకవేళ ఎవరైనా కాశిని చూడటం సాధ్యం కాకపోతే చనిపోయాక అతడి అస్థికలను గంగలో కలిపితే చాలని జనం భావిస్తుంటారు. అయితే కాశీనగరానికి ఏ మాత్రం తీసిపోని మరో ఆలయం కూడా మన దేశంలో ఉంది మరి. దాని పేరు ప్రతికాశి. తీర్థయాత్రలో భాగంగా ఈ వారం మిమ్మల్ని ఈ ప్రతికాశి ఆలయానికి తీసుకుపోతున్నాం. ప్రతికాశిని ఒకసారి సందర్శిస్తే చాలు వందసార్లు కాశీని సందర్శించినంత పుణ్యం సిద్ధిస్తుందని ఇక్కడ ప్రతీతి.
గుజరాత్, మధ్యప్రదేశ్ సరిహద్దు సమీపంలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నందుర్బార్ జిల్లాలో ప్రతికాశి ఆలయం ఉంది. తపతి, పులుంద, గోమై నదుల సంగమస్థలంలో ఈ ఆలయం నెలకొని ఉంది. ఈ సంగమ స్థలంలో 108 ఆలయాలు ఉండటం కారణంగా దీనికి ప్రతికాశి అని పేరు వచ్చింది. 
ప్రపంచం నలుమూలలనుంచి వేలాది మంది భక్తులు ప్రతికాశీని నిత్యం సందర్శిస్తూ ఉంటారు.
పురాణాల ప్రకారం చూస్తే ఒకప్పుడు పగలు ఆరునెలలు, రాత్రి ఆరునెలలుగా కాలం నడిచేదట. ఆ కాలంలో శివుడు ఓ భక్తునికి కలలో కనిపించి, ఒకే రాత్రి 108 దేవాలయాలు నిర్మించే ప్రాంతంలో తాను నెలకొని ఉంటానని చెప్పాడట. అందుకనే ఇన్ని ఆలయాలను ఒకే చోట నిర్మించడానికి తపతి, పులుంద, గోమై నదుల సంగమస్థలాన్ని పూర్వీకులు ఎంపిక చేశారట.

తర్వాత శివ భక్తులు ఒకే రాత్రిలో 107 ఆలయాలను కట్టారట. మరునాడు ఉదయానికి 108వ ఆలయం నిర్మించబడింది. అందుకే సూర్య కాంతి కిరణాలు నేరుగా పడిన ఈ 108వ ఆలయానికి ప్రకాశ అని పేరు స్థిరపడింది. మొత్తంమీద 108 ఆలయాలు నిర్మించబడిన తర్వాత కాశిలో నెలకొన్న శివుడు అప్పటినుంచి కాశీ విశ్వేశ్వరుడి రూపంలో ఉండిపోయాడు.

కాశీ విశ్వేశ్వరుడు, కేదారేశ్వరుడు ఇక్కడ ఒకే ఆలయంలో ఉంటారు. ఇక్కటి పుష్పదంతేశ్వరాలయానికి తనదైన ప్రాముఖ్యత ఉంది. ఇది కాశీలో లేదు. కాశీని సందర్శించిన తర్వాత పుష్పదంతేశ్వరాలయానికి వచ్చి ఉత్తర పూజలు జరపకపోతే వారికి పుణ్యలోకాలు ప్రాప్తించవు అని ఇక్కడి వారి నమ్మకం.

కేదారేశ్వరాలయం ముందు దీపస్తంభం ఉంటుంది. ఈ ఆలయం సమీపంలో అస్థికలను సమాధి చేసేందుకు, నదిలో వదిలి పెట్టేందుకు నది పక్కన గట్లు ఉన్నాయి.

గమ్యమార్గాలు 
రోడ్డుమార్గంలో నందర్బార్ నుంచి 40 కిలోమీటర్లు ప్రయాణిస్తే ప్రతికాశి వస్తుంది. నాసిక్, ముంబయ్, పుణె, సూరత్, ఇండోర్ నగరాలనుంచి బస్ సర్వీసులు లభ్యమవుతున్నాయి

సూరత్-భుశవాల్ రైలు మార్గంలో ఉండే నందర్బార్ రైల్వే స్టేషన్ ఇక్కడికి దగ్గరలో ఉంటుంది.

సూరత్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉండే నందర్బార్ విమానాశ్రయం ఈ అలయానికి సమీప విమానాశ్రయం.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top