మనసు, బుద్ధి ఈ రెండింటిలో దేనిని ఏది సంస్కరించాలి?

0
manasu-bhuddi-mind-sou

మనసు బుద్ధి దేనిని ఏది సంస్కరించాలి?:

భగవంతుడు కేవలం శరీరమును మాత్రమే సృజింపడు. దానితో పాటు ఒక మనస్సును కూడా ఇస్తాడు. ఈ మనస్సు ఉందే, అది తోకలేని కోతి. ఈ మనస్సు ఎప్పుడూ సంకల్ప వికల్ప సంఘాతమై ఉంటుంది. ఇందులో స్పందన వేరు, కదలిక వేరు, కార్యము వేరు.

ఉదా: ఒక బావిలో కానీ, ఒక కొలనులో కానీ, నీరు చాలా ప్రశాంతముగా ఎలాంటి స్పందన, కదలిక లేకుండా ఉంటాయి. అందులో మనము ఒక రాయి వేస్తే, ఆ రాయి వెళ్ళి నీళ్ళ పై పడినపుడు, ఆ నీళ్ళలో కదలికలు ఏర్పడతాయి. ఆ కదలికల వలన స్పందన కలుగుతుంధి. ఆ స్పందన వలన సంకల్పము జరుగుతుంది. ఎప్పుడూ సంకల్పము జరిగిందో అది కార్యరూపము దాల్చుతుంది. కార్యమైతుంది.

మనసు నిజంగా చిన్నపిల్లవాడు లాంటిది. పిల్లవాడికి, నీటికి-మూత్రమునకు తేడా తెలియదు. అన్నానికి-మలమునకు తేడా తెలియదు. అగ్గికి-చల్లదనమునకు తేడా తెలియదు. మనస్సు కూడా అంతే.
  1. సంకల్పము - పట్టుకోవడం
  2. వికల్పము - విడిచిపెట్టడం
  3. మనస్సు - చిన్నపిల్లవాడు
  4. బుద్ధి - అమ్మ
ఉదా:- చిన్న బిడ్డ తెలియకుండా మట్టిలేదా, మలము తింటుంటాడు. అప్పుడు అమ్మ చూచి బిడ్డను ఒక దెబ్బ కొట్టి దూరంగా తీసుకెళ్ళి, బిడ్డ చేతులు కాళ్ళు శరీరం అంతా శుభ్రంగా కడిగి, ఒక శుభ్రమైన ప్రదేశంలో కూర్చోబెట్టి, తర్వాత బిడ్డ ఉన్నచోట శుభ్రం చేసి తర్వాత వస్తుంది. ఔనా? ఆలోచించండి? ఇక్కడ ఒక విషయం గమనించండి. ఆ బిడ్డను మరలా మట్టిగాని మలము తినాలని అనిపించినా దొంగతనంగా తింటాడు ఔనా? ఎందుకు? అమ్మ చూస్తే కొడుతుంది అని. బుద్ధిమంతుడైతే ఇక దానిని ముట్టుకోడు. దాని జోలికి వెళ్ళడు. ఔనా? కాదా? కాబట్టి బుద్ధి (అమ్మ) ఎప్పుడూ మనసు(బిడ్డ) పట్ల సర్వావస్తల యందు జాగృతమై బలంగా ఉండి మనస్సును (బిడ్డను) గమనిస్తూ ఉండాలి. లేదంటే మనస్సును అలా వదిలేస్తే బిడ్డ తినకూడని వన్నీ తిని అనారోగ్యం పాలై చివరకు బిడ్డ దక్కకుండా పోతుంది. ఔనా ఆలోచించండి.

కాబట్టి బుద్ధి బాగా పనిచేస్తే మనస్సు సంస్కరింపబడుతుంది. ఆ మనసు సంస్కరింపబడితే మనసు బుద్ధి రెండూ కలసి మంచి పనులు చేస్తాయి. అందుకే ఒక కవిగారన్నారు.
“గొరుగుచుందురు జుత్తు కొన్నివందల సార్లు
దాని పాపమేమె కానరాదు
అఖిల పాపములకు నిలయమైన
మనసు గొరగడేమి మానవుండు”
చూశారా మనసు పరిస్థితి.

మనసు ముందుకెళ్ళడానికి సాధన అవసరంలేదు. ముందుకు అంటే అనవసర ఆలోచనలకు అరిషడ్వర్గావలంబనకు సాధన సహాయము ఆసరా అవసరం లేదు.

ఉదా:- చిన్న బిడ్డను ఏదైనా అడిగితే “ఆ ఇది నాది” అంటాడు. ఎవరునేర్పారు. అలాగే మనస్సును వెనుకకు సత్యశోధనకు లాగడానికి సాధన కావలయును. హంస అంటే నీటిని, పాలను వేరు చేయగలదు. అవునా?ఎవరైనా హంసను చూచిన దాఖలాలు, చూచినట్లు సాక్ష్యం ఉందా? లేదు. అందుకే పరమహంస అంటే పరమాత్మను,జగత్తును విడకొట్టి సత్యాసత్యములను తెలియజేయునది. ఇది గ్రహిస్తే మనము ఏమిటో, మనకు మన పరిస్థితి తెలుస్తుంది. పూజ ఎందుకో భక్తి ఎందుకో మనకే అర్థమవుతుంది. మనము ఏమి చేయాలి అనే విషయం మనకే తెలుస్తుంది.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top