నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Tuesday, November 14, 2017

సంధ్యా వందనము మరియు ఫలితములు

sandya-vandana-phalitamulu

సంధ్యా వందనము ఎందుకు మరియు ఫలము:
ఎన్నోవేల కోట్ల జీవరాసుల మధ్య జడమై,అజరమై, జడపదార్థం కాని ఎన్నెన్నో జీవరాసుల మధ్యలో ఉన్న తేజస్సుకొరకు సంధ్యావందనం. లోకంలో స్థావరమై, జంగమమైన అనేక రూపాలలో మానవ జన్మ అత్యున్నతమైనది. జీవన సాఫల్యం చెందడానికి,(ఎందుకు జన్మించాము) తన చుట్టూ ఉన్న సమాజమును ఉద్దరించ డానికి, ఒక వ్యక్తిగా ఉపాసించడమే సంధ్యావందనము.

గాయత్రి అనగా భూదేవియే ఉపస్తుగా, విష్ణువే హృదయంగా, శివుడే సర్వవ్యాపి తముగా ఉండే దేవి పరదేవత. విశ్వభూతరాళాంత మధ్యలో అంతర్గతంగా ఉండే స్వరూపం ఈ గాయిత్రి మాత. ఒక యోగిగా, ఒక ఋషిగా మనము ఎక్కడికో వెళ్ళి తపస్సు చేయనవసరం లేదు. ప్రతి రోజు ఒక 25 ని||ములు ఈ గాయత్రీ జపం చేయడం వలన తన జన్మకు సాఫల్యం చేకూర్చినవాడు కాగలడు. మన జీవన యానాన్ని మన చుట్టూ ఉండేవారి జీవనా న్ని, కుటుంబాలని, సమాజాన్ని, నవోన్వేషణము వైపుకు నడపడం, అమ్మకు(తల్లి) నాన్నకు(తండ్రి) గురువులకు, పితృదేవతలకు, మాతృ దేవతలకు, మనకు కనిపించని హితోపదేశులకూ, అందరికీ వారిని స్మరించుచూ వారి శ్రేయస్సుకు, వారి పురోగమనానికి, ఒక నీటి చుక్క విడువడమే, సంధ్యావందన పరమార్థం. మరియు ఈ మాన ఉపా ధిని ప్రసాదించిన తల్లి తండ్రులకు, ఈ ఉపాధిని సన్మార్గంలో నడపడానికి చుక్కానియైన గురువు గార్లకు, హితులకు,సన్నిహితులకు, మిత్రులకు, దైవోపగతు లకు, ఆత్మీయులకు, ఆత్మజులకు, మన ఇరుగు పొరుగులకు,సర్వులకు నమస్కరించి వారి అభ్యున్నతిని, శ్రేయస్సును, త్రికరణ శుద్ధిగా అభిలషిస్తూ చేయడమే సంధ్యావందనము.

సంధ్యావందనము:

సంద్యావందన సమయ వివరణ:
 • ప్రాతః సంధ్యాసమయము ఉదయం 5-12 AM నుండి 6.00 AM వరకు
 • మద్యహ్నసంధ్యాసమయము ఉదయం 11-12 AM నుండి 12.00 వరకు
 • సాయం సంధ్యాసమయము సా II 5-12 PM నుండి 6.00 PM వరకు
ప్రతి రోజూ ప్రాతః సంధ్యావందనము, ఉత్తర సంధ్యావందనము విధిగా ఎక్కడ ఉన్నా ఏ ప్రదేశములో(దేశములో) ఉన్నా సంధ్యావందనము తప్పనిసరి.

సూర్యోదయమునకు ముందు శౌచముతో శుచిగా (స్నానం చేసి) తూర్పు దిశగా కుడి కాలును సగం మడచి ఎడమకాలును పూర్తిగా మడచి, గొంతుకు కూర్చొని అంటే (ఎడమ కాలు మిడిము మీద పృష్టభాగము పిర్రలు ఆనించి) పృష్టభాగము (ముడ్డి,గుదము) నేలను (భూమిని) తాకకుండా కూర్చొని, ఆచమనం చేయాలి.అలా ఆచమనం చేయడం వలన స్థూల, సూక్ష్మ, కారణ శరీరము యందలి తాపములు, వెంటనే ఉప శాంతిని పొందుతాయి.అపుడు మనస్సు నిలబడుతుంది.
ఎప్పుడు ఆచమనం చేసినా ఇదే విధానంలో చేయాలి.

ముఖ్య గమనిక :-
సంద్యావందనసమయములో తుమ్మడం,దగ్గడం,అపానవాయువును (పిత్తులు,చెడు గాలిని) వదలడం జరిగిన వెంటనే ఆచమనము చేసి కుడిచేతితో కుడిచేవినితాకలి లేదా తడిగా ఉన్న భూమిని తాకాలి.
ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్తాంగతో పివా!
యస్స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శ్శుచిరి!
అంటూ శిరస్సు మీద జలము(శుద్ద జలము)కుడి చేతి బొటన వ్రేలితో శిరస్సు మీద చల్లుకొనుచూ
ఓం పుండరీకాక్ష! పుండరీకాక్ష! పుండరీకాక్షాయ నమః”
కేశవ నామాలు ఆచమనం.

కుడి కాలును సగం మడచి ఎడమ కాలును పూర్తిగా మడచి రెండు కాళ్ళ మీద పృష్టభాగము భూమికి తగులకుండా కాళ్లపైనే కూర్చొని(గొంతుకు)కూర్చొని ఆచమనం చేయాలి.

కుడిచేతి చూపుడు వ్రేలుకు, మధ్య వ్రేలుకు మధ్య, బొటన వ్రేలును ఉంచి, చూపుడు వ్రేలుతో బొటన వ్రేలిని అదిమి పట్టుకొని మిగతా వ్రేళ్లను చాపి ఉంచి, అంటే గోకర్ణాకృతిలో ఉంచి, ఎడమ చేతితో పంచపాత్రలోని శుద్దజలమును కేవలం మినపగింజ మునుగు నంత జలమును, ఉద్ధరణితో కుడిచేతిలో వేసుకొని (తీసుకొనేటప్పుడు కుడి చేతి అరచేతి చివరి భాగమును క్రింది పెదవికి ఆనించి శబ్దము రాకుండా) ముందుగా
 • “ఓం కేశవాయ స్వాహా” అని చెప్పుకొని శబ్దము రాకుండా, జుర్రకుండా ఆ జలమును నోటిలోకి తీసుకొనవలయును. అలా తీసుకొన్న నీరు కడుపులో బొడ్డు వరకూ దిగిన తర్వాత మరలా
 • “ఓం నారాయణాయ స్వాహా” అని చెప్పుకొని శబ్దము రాకుండా, జుర్రకుండా ఆ జలమును నోటిలోకి తీసుకొనవలయును. అలా తీసుకొన్న నీరు కడుపులో బొడ్డు వరకూ దిగిన తర్వాత మరలా
 • “ఓం మాధవాయ స్వాహా” అని చెప్పుకొని శబ్దము రాకుండా, జుర్రకుండా ఆ జలమును నోటిలోకి తీసుకొనవలయును. అలా తీసుకొన్న నీరు కడుపులో బొడ్డు వరకూ దిగిన తర్వాత మరలా
 • “ఓం గోవిందాయ నమః” అని చెప్పుకొనుచూ కుడిచేతిలోని జలమును, ఎడమ వైపు కాలు ప్రక్కన వదలవలయును.
ఎప్పుడు ఆచమనము చేసినా ఇదే పద్దతిన చేయవలయును.

నమస్కారము చేయుచూ ఈ క్రింది నామములు, భక్తితో త్రికరణ శుద్దిగా అంటే మనము ఉచ్ఛరించే ప్రతినామమూ యొక్క రూపమును, హృదయమునందు ఊహించుకొనుచూ శ్రద్ధాభక్తులతో మనో నేత్రముతో స్వామి వారి రూపమును చూచుచూ తదేక ధ్యానముతో ఉచ్చరించవలయును. (కరన్యాస ప్రక్రియ కూడా కలదు) చేయ దలచిన వారు చేయవచ్చు లేదా నామములను మాత్రమే కూడా ఉచ్ఛరించవచ్చు.
 • ఓం విష్ణవే నమః
 • ఓం మధుసూధనాయ నమః
 • ఓం త్రివిక్రమాయ నమః
 • ఓం వామనాయ నమః
 • ఓం శ్రీధరాయ నమః
 • ఓం హృషీకేశాయ నమః
 • ఓం పద్మనాభాయ నమః
 • ఓం దామోధరాయ నమః
 • ఓం సంకర్షనాయ నమః
 • ఓం వాసుదేవాయ నమః
 • ఓం ప్రద్యుమ్నాయ నమః
 • ఓం అనిరుద్దాయ నమః
 • ఓం పురుషోత్తమాయ నమః
 • ఓం అదోక్షజాయ నమః
 • ఓం నరసింహాయ నమః
 • ఓం అచ్యుతాయ నమః
 • ఓం జనార్థనాయ నమః
 • ఓం ఉపేంద్రాయ నమః
 • ఓం హరయే నమః
 • ఓం శ్రీ కృష్ణాయ నమః
భూశుద్ది :- ఈ మంత్రం చెప్తూ కొద్ది శుద్దజలమును కుడిచేతిలోనికి తీసుకొని మన చుట్టూ చల్లుకోవలయును. ఎందుకంటే మన గృహంలో నిన్నటి రోజున సింహాసనమునకు చేసిన అలంకారము మరియు భగవంతునికి సమర్పించిన ధూపదీప నైవేద్య ఫల పుష్పఫలాది నిర్మల్యాన్ని మనకంటే ముందు భూత పిశాచములు ఆ నిర్మాల్యాన్ని తీయడానికి ప్రయత్నిస్తాయి. అందుకొరకు మనము సూర్యోదయానికి పూర్వమే ఆ పని చేయాలి. అందుకొరకు ఈ మంత్రం.
“ఉత్తిష్ఠంతు భూతపిశాచాః యేతే భూమి భారకాః
ఏ తేషా మా విరోధేన బ్రహ్మ కర్మ సమారంభే ||”
ఈ మంత్రం చెప్పుకొన్న తర్వాత రెండు అక్షింతలు తీసుకొని వాసన చూచి వెనుకకు వేసుకోవలయును.

శ్లో || శుక్లాం భరధరం విష్ణుమ్ శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే ||
శ్లో|| అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేక దంతం భక్తానాం ఏక దంతం ఉపాస్మహే ||

అని చెప్పుకొని వినాయకుని కి కొద్ది అక్షింతలు, పసుపు, కుంకుమ, పూలు, సమర్పించాలి.

శ్లో || ఆపదామప హర్తారం దాతారం సర్వ సంపదాం
లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహమ్.
శ్లో || సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యేత్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే||
 • ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః
 • ఓం శ్రీ ఉమామహేశరాభ్యాం నమః
 • ఓం శ్రీ వాణీ హిరణ్యాగర్భాభ్యాం నమః
 • ఓం శ్రీ శచీ పురందరాభ్యాం నమః
 • ఓం శ్రీ అరుంధతీ వశిష్టాభ్యాం నమః
 • ఓం శ్రీ సీతారామాభ్యాం నమః
 • ఓం శ్రీ మైత్రేయీ కాత్యాయనీ సహిత యాజ్ఞ వల్కాభ్యాం నమః
 • ఓం శ్రీ సర్వదిగ్దేవతాభ్యాం నమః
 • ఓం శ్రీ సర్వభూదేవతాభ్యాం నమః
 • ఓం శ్రీ గ్రామదేవతాభ్యాం నమః
 • ఓం శ్రీ గృహదేవతాభ్యాం నమః
 • ఓం శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యాం నమః
ప్రాణాయామం:- తూర్పు వైపుకు తిరిగి గొంతుకు కూర్చొని ప్రాణాయామం చేయాలి.

పూరకం:- కుడి బొటన వ్రేలు ఉంగరపు వ్రేలుతో, ముక్కును పట్టుకొని, మధ్య వ్రేలినిలోనికి ముడువ వలెను. బొటన వ్రేలును కుడి ముక్కు పైన ఉంగరపు వ్రేలును ఎడమ ముక్కుపైన ఉంచి. ఎడమ ముక్కును మూసి కుడి ముక్కుతో, గాలి వదులుతూ, కుడి ముక్కును మూసి, ఎడమ ముక్కుతో, గాలిని పీల్చుతూ, చేయునది పూరకం.
“ ఓం భూః ,ఓం భువః, ఓం స్వః,ఓం మహః, ఓం జనః,ఓం తపః,ఓం సత్యం.”
కుంభకం:- రెండు ముక్కులు మూసి గాలిని లోపల బంధించడం.కుంభకం చేస్తూ
“ఓం తత్స వితుర్వరే ణ్యం భర్గోదేవస్య ధీ మహి! ధీయోయోనః ప్రచోదయాత్!
ఓ మాపో జ్యొతీ రపోమృతం బ్రహ్మ ”
రేచకం:- ఎడమముక్కును మూసి, కుడిముక్కుతో గాలిని పూర్తిగా వదలడం.

కుడిముక్కునుండి గాలిని వదులుతూ
“భూర్భువ స్సువరోమ్ ”
అని చెప్పిన తర్వాత కుడిచేతితో కుడిచివిని తాకవలెను.

ఎప్పుడు ప్రాణాయామము చేసినా ఇదేవిధముగా చేయాలి. సందర్భము ఏదైనా ఇందుకు భిన్నముగా ప్రాణాయామము చేయరాదు.

సంకల్పము:-

కరన్యాసము :- ఎడమ అరచేతిపై కుడి అరచేతిని అడ్డముగా బోర్లించిరెండు చేతులు కలిపి కుడి మోకాలుపై ఉంచి సంకల్పము చెప్పవలయును.

మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞ్యాయా ప్రవర్తమా నస్య ఆద్య బ్రాహ్మణ, ద్వితీయ, పరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వర, మన్వంతరే,కలియుగే, ప్రధమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరుహో, దక్షిణదిగ్భాగే, శ్రీ శైలస్య, ఈశాన్య ప్రదేశే, సమస్త బ్రాహ్మణ, హరి హర, గురు చరణ, సన్నిధౌ, అస్మిన్, వర్తమానస్య, వ్యావహారిక చాంద్రమనేనా, శ్రీ .......................... (నందన) నామసంవత్సరే, ..................(ఉత్తరాయణే) ఆయనే, .............. (వర్ష) ఋతౌ, ................ (వైశాఖ) మాసే,...........(శుక్ల) పక్షే, ........... (దశమీ) తిధౌ, ........ (సోమ) వాసరే, శుభ నక్షత్రే, (బ్రాకెట్లలో చూపిన సంవత్సర, ఆయన,ఋతు, మాస, పక్ష, తిధి, వారములు పేర్లు ఉదాహరణకు మాత్రమేనని గ్రహింప గలరు) శుభయోగే, శుభకరణ, ఏవంగుణ విశేషణ, విశిష్టాయామ్, శుభ తిధౌ శ్రీ పరమేశ్వర ముద్దిశ్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, ప్రాతః సంధ్యా, (ఎడమ చేతిలోని ఉద్దరిణితో జలము తీసుకొని కుడిచేతిని పాత్ర పైన ఉంచి ఉద్ధరిణిలోని జలమును కుడిచేతి మీదుగా పాత్రలోనికి వదలుతూ) ముపాశిష్యే, (అనిచెప్పుకోవాలి).

శుద్ధోదక స్నానం:-
ఉద్దరిణితో జలము తీసుకుని కుడి చేతి బొటన వ్రేలిని ఉద్దరణిలోని జలములో ముంచి తలపై చల్లుకొనుచూ ఈ క్రింది మంత్రమును అను సంధానము చేయవలయును. బ్రాకెట్లో (జ) అని ఉన్న చోటుకు ముందు ఆపి జలమును తలపై చల్లుకొనుచూ ఈ మంత్రమును అను సంధానము చేయవలయును.
ఓం “ ఆపోహిష్ఠమయో (జ) భువహ తాన ఊర్జే (జ)
తధా తన! మహేరాణా య చక్షసే (జ) యోవ శ్శివత యో రస్సః (జ)
తస్య భాజయతే హనః (జ) ఉశ తీరివ (జ) మాతరః (జ)
తస్మా ఆరంగ మామ వో (జ) యస్యక్షయాయ జిన్వథ! (జ)
అపో జనయథా చనః!” (జ)
ప్రాతఃస్సంధ్యా వందనములో అనుసంధానించవలసిన మంత్రము గోకర్ణాకృతిలో ఉంచుకుని యున్న కుడి చేతిలో జలము తీసుకుని
“ సూర్యశ్చేత్యస్య మంత్రస్య నారాయణ ఋషిః, ప్రకృతీ బంధః
సూర్య మామన్యు పాతయ రాత్రిర్దేవతాః జలాభి మంత్రణే వినియోగః”
మంత్రము:-
“ ఓం సూర్యశ్చ మామ న్యుశ్చ మన్యు పతయశ్చ మన్యు కృతేభ్యః
పాపే భ్యో రక్షన్తాo యద్రా త్ర్యా పాపమ కారుషం
మనసా వాచా హస్తా భ్యాం పద్భ్యా ముదరెణ శిశ్నా
రాత్రి స్తద వలుంపతు యత్కించ దురితం మయి
ఇద మహం మామ మృత యోనౌ సూర్యేజ్యోతిషి జుహోమిస్వాహా !!”
అని సంధానించుకొని చేతిలోని జలమును త్రాగవలెను.

ప్రాతః సంధ్యావందనం సంపూర్ణం


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

« PREV
NEXT »

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com