అలర్జిక్‌ రైనైటిస్ వ్యాధి అంటే ఏమిటి - What is Alzheimer's Rhinitis Disease?

0


ఇది చాలా పెద్ద సమస్య. మన సమాజంలో దాదాపు మూడో వంతు మంది ఈ రకం అలర్జీతో బాధపడుతున్నారు. మనకు 'అలర్జీ' కలిగించే ఆ శత్రువు.. మన పరిసరాల్లోనే.. మన ఇంట్లోనే ఉండొచ్చు. అది ఇతరుల్ని ఏ ఇబ్బందీ పెట్టకపోవచ్చు. కానీ మన పాలిట మాత్రం విలయం సృష్టిస్తుంటుంది. నిజం చెప్పాలంటే దాన్ని మనమేం చెయ్యలేం.

మరి దీన్నుంచి బయటపడేదెలా?

ధూళి, పూలు, పుప్పొడి, కాలుష్యం, చల్లటి వాతావరణం.. ఇవన్నీ చూడటానికి ఏమంత
ప్రమాదకరమైనవి కావు. కానీ కొందరి పాలిట ఇవే శత్రువులు! ఇవి తగులుతూనే శరీరంలో తీవ్రమైన అలర్జీ మొదలవుతుంది. ఇవే కాదు.. పెంపుడు జంతువుల బొచ్చు, సౌందర్య సాధనాలు, కొన్ని రకాల వాసనలు, రసాయనాలు, పాత పుస్తకాలు.. ఇలా అలర్జీ కారకాల జాబితా చాలా పెద్దది! సాధారణంగా ఎవరికీ ఎటువంటి హానీ చెయ్యని ఈ సాధారణ పదార్థాలే కొందరి పాలిట మాత్రం తీవ్ర సమస్యలు తెచ్చిపెడతాయి. ముక్కు, కళ్లు, చెవులు, గొంతు, వూపిరితిత్తులు, చర్మం.. ఇలా రకరకాల శరీర భాగాల్లో విలయం సృష్టిస్తుంటాయి. ముక్కుకు సంబంధించి చాలా ఎక్కువగా కనబడే సమస్య ఈ అలర్జీ. దీన్నే 'అలర్జిక్‌ రైనైటిస్‌' అంటారు. ఆ సరిపడని పదార్థాలేవో ముక్కుకు సోకినప్పుడు.. ముక్కులోని సున్నితమైన పొరలు తీవ్రంగా స్పందిస్తాయి. దీంతో 'అలర్జీ' బెడద ఆరంభమవుతుంది.

కొందరిలో ఎప్పుడూ..!
అలర్జీ అన్నది కొన్ని కొన్ని సీజన్లలో ఎక్కువగా వేధిస్తుంటుంది. ముఖ్యంగా చెట్లన్నీ పూలు పూసి, గాలిలో పుప్పొడి ఎక్కువగా ఉండే కాలంలో, అలాగే చల్లదనం పెరిగే శీతకాలంలో.. ఇలా కొన్నికొన్ని సీజన్లలో ముక్కు అలర్జీలు ఎక్కువగా కనబడుతుంటాయి. దీన్నే 'సీజనల్‌ అలర్జిక్‌ రైనైటిస్‌' అంటారు. గాలి ద్వారా వచ్చే పుప్పొడి పెద్ద అలర్జీ కారకం. అందుకే పాశ్చాత్య దేశాల్లో మన వాతావరణ హెచ్చరికల్లాగే గాలిలో ఈ పుప్పొడి శాతం (పోలెన్‌ కౌంట్‌) ఎంత ఉందన్నది కూడా చెబుతుంటారు. అయితే కొందరిలో ఇలా కాలాలతో, సీజన్లతో ఏ సంబంధం లేకుండా ఏడాది పొడవూనా అలర్జీ లక్షణాలు వేధిస్తుంటాయి. దీన్నే 'పెరీనియల్‌ అలర్జిక్‌ రైనటిస్‌' అంటారు. కొందరికి వంశపారంపర్యంగా కూడా ఈ అలర్జీ తత్వం రావచ్చు. ముఖ్యంగా చర్మం మీద అలర్జీలు, తుమ్ములు, ఉబ్బసం వంటివి కొన్ని కుటుంబాల్లో ఎక్కువగా కనబడుతుంటాయి. చిన్న పిల్లల్లో అంటే ఐదారేళ్ల వయసు వరకూ సాధారణంగా ముక్కు అలర్జీలు కనబడవుగానీ.. వూపిరితిత్తుల్లో అలర్జీ కారణంగా ఉబ్బసం (అలర్జిక్‌ ఆస్థమా) అన్నది చిన్నవయసులో కూడా కనబడుతుంటుంది. మొత్తానికి 'అలర్జీ' అన్నది ఎవరికైనా, వేటి కారణంగానైనా రావచ్చు. కాబట్టి ఎవరికివారు తమకు దేనివల్ల అలర్జీ వస్తోంది, ఆ సరిపడనిదేమిటి? అన్నది గుర్తించటం మంచిది.
అలర్జీ నుంచి ఆస్థమా!
ముక్కులో తలత్తే అలర్జీ లక్షణాల వంటివే వూపిరితిత్తుల్లోకి కూడా పాకితే.. అలర్జిక్‌ బ్రాంకైటిస్‌, ఆస్థమా వంటి బాధలూ తలెత్తుతాయి. వీరిలో శ్వాస ఆడనట్లుండటం, దగ్గు, ఆయాసం, పిల్లికూతల వంటి లక్షణాలు కనబడతాయి. 60-70 శాతం మందిలో ముక్కులోనూ, ఛాతీలోనూ కూడా ఈ అలర్జీ లక్షణాలు వేధిస్తుంటాయి.

దూరమే విరుగుడు
ప్రధానంగా అలర్జీ కారకాలు తగిలే అవకాశం లేకుండా చూసుకోవాలి. ఇంట్లో కిటికీలు మూసేసుకోవటం, కారులో వెళ్లేటప్పుడు విండోలు మూసెయ్యటం, పుప్పొడి వాతావరణంలో ఎక్కువగా ఉండే ఉదయం సమయాల్లో ఆరుబయటకు వెళ్లకుండా ఉండటం.. చలికాలంలో బయటకు వెళ్లేటప్పుడు మఫ్లర్‌ వంటివి కట్టుకోవటం.. ఇలా ముందు జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యం.

సమస్యల దొంతర అలర్జీ ఆరంభం
సరిపడనివేవో తగిలి ముక్కులోని పొరల్లో ఈ అలర్జీ మొదలైతే.. 'హిస్టమైన్‌' విడుదల అవుతుంది. దీనివల్ల ముక్కులోని రక్తనాళాలు ఉబ్బినట్త్లె.. ముక్కులోని పొరలన్నీ ఉబ్బిపోతాయి. అప్పుడు ఆగకుండా తుమ్ములు, ఆ వెంటనే ముక్కు వెంట నీరు ధారలా కారటం మొదలవుతుంది. తర్వాత మెల్లగా ముక్కు బిగిసిపోతుంది. ఇది 'అలర్జిక్‌ రైనైటిస్‌'. ఇది బాగా చికాకుపెట్టే సమస్య. ఈ దశలోనే దీనికి చికిత్స తీసుకుంటే మంచిది. ఇది ముదిరి.. దీర్ఘకాలిక సమస్యగా తయారైతే 'సైనుసైటిస్‌' వంటి దుష్ప్రభావాలు చాలా తలెత్తుతాయి.

హెచ్చరిక:
పై నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top