భీమవరం - శక్తీశ్వర ఆలయం - Bhimavaram Shaktiswara Aalayam

0

శక్తీశ్వర ఆలయం
స్వయంభువుడిగా శివుడు వెలసిన శక్తీశ్వర ఆలయం:శీర్షాసనంలో మహాశివుడు అదీ సతీ, పుత్ర సమేతుడైన ఆలయం శక్తీశ్వర ఆలయం. ఇలాంటి ఆలయం మరొకటి ఎక్కడా వుండి వుండకపోవచ్చు. స్వయంభువుడిగా శివుడు వెలసిన శక్తీశ్వర ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి 4 కి.మీ. దూరంలో గల యనమదుర్రు గ్రామంలో కలదు. 

ఈ శివాలయం ఎంతో ప్రత్యేకమైంది.శివాలయాలలో స్వామి లింగరూపంలో దర్శనమిస్తాడు. కానీ శక్తీశ్వరాలయంలో మాత్రం శివుడు పార్వతీ సమేతుడై, ఒడిలో కుమారస్వామితో విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. ఇది ఈ ఆలయానికున్న ప్రత్యేకత. శివపార్వతులు వెలసిన పీఠం ఏకపీఠం కావడం ఒక విశేషమైనతే, ఇదంతా ఒక పెద్ద శిలగా భూగర్భంలో నుంచి చొచ్చుకుని వుండడం మరొక అద్భుతం. శక్తీశ్వరుడు ఈ ఆలయంలో శీర్షాశనంలో తపోనిష్టుడై ఉండడం మరో మహాద్భుతం. జటాఝూటం, నొసట విభూతి రేఖలు, నాగాభరణము స్వామి వారి విగ్రహంలో స్పష్టంగా కనపడతాయి.

స్థల పురాణం : శంబరుడనే రాక్షసుని సంహరించేందుకు యముడు శివున్ని ప్రార్థించాడు. ఆ సమయంలో శివుడు యోగముద్రలో ఉండండతో పార్వతీ అమ్మవారు తన శక్తిని వరంగా అనుగ్రహించి యముడి బలాన్ని గొప్పగా పెంచింది. ఆ శక్తితో యముడు శంబరుణ్ని సంహరించాడు. యమధర్మరాజు కోరిక మేరకు శీర్షాసన స్థితిలో ఉన్న శివుడు అమ్మవారితో సహా ఈ క్షేత్రమునందు వెలిశాడు అనీ చరిత్రం.

శక్తిగుండం ప్రత్యేకత: ఈ ఆలయానికి తూర్పువైపున శక్తి గుండం అనే చెరువు వుంది. కాశీలోని గంగ అంతర్వాహినిగా ప్రవహించి ఈ చెరువులో కలుస్తుందని భక్తుల విశ్వాసం. ఈ చెరువు తవ్వకాలలో సర్పం ఆకారంలో ఉన్న ఆరు అడుగుల శిల ఒకటి బయటపడింది. ఈ శిలను సుబ్రహ్మణ్యేశ్వరునిగా భావించి ఆలయంలో ప్రతిష్ఠించి, ఆనాటి నుంచి పూజాదికాలు నిర్వహిస్తున్నారు. ఈ శక్తి గుండంలోని నీటితోనే స్వామి వారికి అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. పూర్వం ఒకసారి ఈ చెరువును శుభ్రపరిచే క్రమంలో ఈ నీటిని వాడడం ఆపి, ఆ సమయంలో స్వామి వారి నైవేద్యానికి సమీపంలోని మరొక చెరువు నుంచి నీటిని తెచ్చి ప్రసాదం తయారు చేయడానికి ప్రయత్నించగా అది ఎంతకీ ఉడకలేదు. అప్పుడు శక్తి గుండంలోనే చిన్న గొయ్యిని తవ్వి, ఆ నీటితో ప్రసాదం తయారు చేయగా వెంటనే ఉడికింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ స్వామి వారికి శక్తి గుండంలోని నీటినే ఉపయోగిస్తారు.

మహాశివరాత్రి పర్వదినాన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, తెప్పోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. శరన్నవరాత్రులు, కార్తీక మాసంలో స్వామి వారికి రుద్రభిషేకం, అభిషేకాలు లక్షపత్రి పూజలు, అమ్మవారికి కుంకుమపూజ చేస్తారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి సందర్భంగా అఖండ అన్నసమారాధన జరుగుతుంది. ఆ ప్రత్యేక ఉత్సవాలలో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి
కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top