తెలుగు సంస్కృతిలో ఆటపాటలు - Telugu samskriti lo atalu, patalu

0

 ఆటపాటలు
ఆట.. పాటలు... ఇందులో చిన్న పిల్లలు ఆడే ఆటలు, పెద్ద పిల్లలు ఆడే ఆటలు, పెద్ద వారు ఆడే ఆటలు వుంటాయి. బాలబాలికలు సాయం వేళల్లో ముఖ్యంగా వెన్నెల రోజుల్లో ఎన్నో సంప్రదాయ బద్ధమైన ఆటలు ఆడుకొనే వారు.

‘చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అట్లు పోయంగ ఆరగించంగ’ అని పాడుతూ ఇద్దరు లేక నలుగురు అమ్మాయిలు అడుగులు వేసి ఎగురుతూ చప్పట్లు కొడుతూ ఆనందంతో ‘చెమ్మ చెక్క’ ఆట ఆడేవారు. ‘గిన్నెరగోల్‌’ తిరుగుతూ ‘ఒప్పుల కుప్పా వయారి భామా గూట్లో ముక్కురాయ్‌ నీ మొగుడు సిపాయ్‌’ అని చమత్కారంగా పాడుకంటూ అమ్మాయిలు ఆడుకొనే వారు.

‘చిటిమిటి దంతులు చిన్నారి దంతులు దాదీ మీరేమంటారు జాజీ మొగ్గళ్ళూ’ అంటూ స్త్రీలు రెండు జట్లుగా ఏర్పడి ఒక జట్టును మరొక జట్టు పెళ్ళికి సంబంధించిన ప్రశ్నలు అడిగేవారు. ఇది ఒక్కొక్క జట్టు ఐకమత్యాన్ని చాటి చెబుతుంది. 

‘అట్ల తద్దోయ్‌ ఆరట్లోయ్‌ ముద్ద పప్పోయ్‌ మూడట్లోయ్‌’ అని ఆశ్వయుజ మాసంలో అమ్మాయిలంతా ఉయ్యాల లూగుతూ, గాలిలో తేలుతూ వారు వీరు అనే భేదం లేకుండా పాడుకొనే వారు. ఈ పాట పాడుకొనే కన్నెపిల్లలకు మంచి మొగుడొస్తాడంటారు. పిల్లలందరూ కాళ్ళు చాచుకొని కూర్చుంటే ఒకడు ఒక్కొక్కరి కాలు తాకుతూ 

‘కాళ్ళా గజ్జి కంకాళమ్మ వేగుచుక్క వెలగా మొగ్గ మొగ్గాకాదుర మోదుగనీరు కాలుదీసి కడగా పెట్టు!’అని పాడుతాడు. ఈ ఆటలో కాళ్ళు తాకడంలో భేదభావం లేక అందరూ ఒకటేనని పిల్లలంతా కలిసిపోయే అవకాశముంది. ఈ పాటలో కాళ్ళకు లేచే గజ్జికి మందు సూచితమైందని పెద్దలంటారు. 

ఇలాగే ముక్కులు గిల్లే ఆట, వెన్నెల కుప్పలు, కోతికొమ్మచ్చులు, తొక్కుడు బిళ్ళ, గోలీలాట, బొంగరాలాట, పేడబుర్రాట మొదలుగా ఎన్నో ఆటలు, పాటలు నాటి గ్రామాల్లోని సంస్కృతికి, సంప్రదాయానికి నిదర్శనాలు. ఇటువంటి ఆటలు, పాటలు అతి ప్రాచీనకాలం నుంచి గ్రామాల్లో సాగుతూ ఉండేవని చరిత్ర ద్వారా మనకు తెలుస్తున్నది. కాని నేడు అవి కనుమరుగై పోతున్నాయి. 

గతంలో పల్లెల్లోని చిన్న పిల్లలు అనేక విధాల ఆటలు ఆడె వారు. ప్రాంతాల వారిగా కొన్ని ఆటల పేర్లు వేరుగా వుండొచ్చు.

అటు వంటి ఆటలు :

1. చిన్న పిల్లలు ఆడే ఆటలు: వామన గుంతలు, వెన్నే కుప్పలు, గుచ్చు గుచ్చు పుల్ల, వత్తొత్తి వారొత్తి, గోలీలాట, బొంగరాలాట,ముట్టాట, దొంగ పోలీసు, నేల బండ, తోలుబొమ్మలాట, కుంటాట. 

2. పెద్ద పిల్లలు ఆడే ఆటలు: బిల్లంగోడి, (జిల్లంగోడి,) ఉప్పర పట్టి, చెడుగుడు, ముట్టాట, గెచ్చక్కాయలాట,, కోతి కొమ్మచ్చి, పులి మేక, నాలుగు స్థంబాలాట, ఈత కొట్టడం, ఉట్టి కొట్టడం, తోలు బొమ్మలాట. 

3. పెద్దవారు ఆడే ఆటలు: పులి మేక, చింత పిక్కలాట, మొదలగునవి ఆడే వారు. వాటి గురించి వివరణ క్లుప్తంగా: 

వత్తొత్తి వారొత్తి ఆట:
కొంత మంది పిల్లలు గుండ్రంగా కూర్చొని తమె రెండు అరచేతులను వెనకకు పెట్టి వుంటారు. మధ్యలో ఒకరు తన చేతులతో కళ్లు మూసుకొని నిలబడి వుంటాడు. మరొక పిల్లవాడు ఒక చిన్న చేతి గుడ్డను పట్టుకొని కూర్చున్న వారి వెనక తిరుగుతూ ప్రతి ఒక్కరి వద్దా వంగుతూ వారి చేతిలో ఆ చేతి గుడ్డను పెట్టి నట్లు నటిస్తూ వత్తొత్తి వారొత్తి చూసినోళ్ల కళ్లల్లో సూరొత్తి.. అని పాట పాట పాడుతు తిరుగుతూ చివరికి ఎవరి చేతిలోనో ఆ చేతి గుడ్డను పెట్టేసి ధనా దన్ ఘల్ బీగాల్. అని తన పాటను ముగిస్తాడు. అప్పుడు మధ్యలో నిలబడిన పిల్లవాడు కళ్లు తెరిచి అందరి వైపు పరిశీలనగా చూసి ఎవరి చేతిలో ఆ గుడ్డ వున్నదో కనిపెట్టాలి. అలా కనిపెట్ట గలిగితే మధ్యలో నిలబడే వంతు ఆ అబ్బాయికి వస్తుంది. అలా కనిపెట్టలేనంత వరకు ఆ పిల్లవాడు మధ్యలోనె నిలబడాలి. ఇదీ ఈ ఆట ఆడె పద్దతి. అప్పట్లో ఈ ఆటను ఎక్కువగా ఆడపిల్లలే ఆడే వారు. 
వామన గుంతలు.

ఇది ఎక్కువగా ఆడపిల్లలు ఆడే ఆట. వరుసగా ఆ రు చిన్న గుంతలు, సమాంతరంగా క్రింద ఆరు గుంతలుంటాయి. నాలుగు చింత పిక్కలు అరచేతిలోకి తీసుకొని వాటిని పైకి ఎగుర వేసి అవి కిందపడే లోపున అరచేతిని తిరగేసి వాటిని పట్టుకోవాలి. ఎన్ని పట్టుకోగలిగితే వాటిని ఆ గుంతలలో పెట్టాలి అలా కొన్ని సార్లు ఆడిన తర్వాత ఏ గుంతలో నాలుగు పిక్కలు చేరుతాయే వాటిని గెలుచు కున్నట్టు. వాటి తీసుకుంటారు. ఇలా పలు మార్లు ఆడి ఎవరు ఎన్ని చింత పిక్కలు గెలుచుకున్నారో చూసి వారు నెగ్గి నట్లు. ఇదే ఆటను వివిధ విధాలుగా ఆడుతారు. దీనికి కావలసిన గుంతలు పల్లెల్లో వుండే రచ్చ బండమీద శాశ్వత పద్ధతి మీద చెక్కి వుంటాయి. మడిచి ఇంట్లో పెట్టుకోడానికి వీలుగా చక్కలతో చేసిన వామన గుంతలు కొన్ని ఇళ్లలో వుండేవి. వాటితో పెద్దా ఆడ వారు కూడా ఆడేవారు. ప్రస్తుతం ఈ ఆట పూర్తిగా కనుమరుగైనది. 
'వెన్నేకుప్పలు"

ఇది చిన్న పిల్లల ఆట. ఆడపిల్లలు, మగపిల్లలు కలిసి ఆడే ఆట. వెన్నెల రాత్రులందు మాత్రమే ఆడే ఆట. ఒక పిల్లవాడు ఒక చోట కళ్లు మూసుకొని ఒకటి నుండి వంద వరకు లెక్క పెడుతుంటాడు. లేదా కొన్ని పాటలుండేవి ఒక్క పాటను ఇన్ని సార్లు పాడాలనె నియమం వుండేచి. ఇంతలోపల మిగతా పిల్లలు తలో దారిలో వెళ్లి మట్టితో వెన్నెల నీడలో చిన్న చిన్న కుప్పలు పెట్టే వారు. గోడ నీడలందు, బండల పైన, కొంత మరుగ్గా వుండే చోట ఎన్ని వీలైతే అన్ని కుప్పలను పెట్టే వారు. సమయం అయి పోగానె కళ్లు మూసుకున్న పిల్లవాడు కళ్ళు తెరిచి మిగతా పిల్లలు పెట్టిన మట్టి/ఇసుక కుప్పలను చెరిపి వేయాలి. అలా చెరప లేక పోయిన కుప్పలను లెక్క పెట్టుకొని వాటిని తాము గెలిచిన పాయింట్లుగా లెక్కించు కుంటారు. తర్వాత మరొక పిల్ల వాని వంతు. చివరిగా లెక్కించి ఎవరు ఎక్కువగా చెరపలేని కుప్పలుంటాయో వరు ఓడినట్లు. ఈ ఆట ప్రస్తుతం వాడుకలో లేదు. 

గోలీలాట
ఈ ఆటను కొంచెం పెద్ద పిల్లలు ఎక్కువగా ఆడే వారు. గోలీలను కుప్పలు కుప్పలుగా పెట్టి అనగా ముందు మూడు గోలీలను పెట్టి దాని మీద మరొక్క గోలీను పెడతారు. ఆ కుప్పను ఉడ్డ అంటారు. అలా ఒక్కొక్కరు ఒక ఉడ్డను పెట్టి ఒక నిర్ణీత దూరం నుండి ఒక్కొక్కరు ఒక్క పెద్ద గోలీతో ఆ కుప్పలను కొట్టాలి. దాంతో ఆ కుప్పలు పడి పోతాయి. తన వాటాగా వున్న ఒక కుప్పను తప్ప పడిపోయిన గోలీలను ఆతడు గెలుచుకున్నట్లు, ఆ తర్వాత మరొకని వంతు. ఇలా చివరన ఎవరెన్ని గోలీలను గెలుచుకున్నారో లెక్కించు కుంటారు. ఆ తర్వాత పెద్ద గోలీలతో ఆట మొదలవుతుంది. ఒక తన పెద్ద గోలీని కొంత దూరంలో వేస్తాడు. మిగిలిన వారు ఒక్కొక్కరుగా గురి చూసి ఆ గోలీను కొట్టాలి. అలా కొట్టగలిగితే ఆగోలీని వాడు గెలుచుకున్నట్టే. ఈ గోలీలాటలో చాల విధానాలున్నాయి. 

బొంగరాలాట
ఈ ఆటను పెద్దపిల్లలే ఆడగలరు. దీనిలో కొంత నేర్పరి తనముండాలు. చిన్న పిల్లలు బొంగరాలను వేయలేరు. శంకాకారంలో ఈ కర్ర బొంగరము క్రింది భాగాన చిన్న ములుకు వుంటుండి. ఆ ములుకు దగ్గరనుండి ఒక సన్నన్ని దారం చుట్టి దాన్ని చేతిలో వాటంగా పట్టుకొని ఒక ఉడుపున విసిరి నేల పైకి వేస్తే అది ములుకు ఆధారంగా అతి వేగంగా తిరుగు తుంటుంది. అలా తిరిగుతున్న బొంగరాన్ని మరొకడు తన బొంగరంతోగురి చూసి కొట్టాలి. ఒక్కోసారి ఆ బొంగరం పగిలి పోతుంది. సంతల్లో రంగు రంగు బొంగరాలు అమ్మే వారు. అవి అందంగా వుండి చాల తేలికిగా వుంటాయి. చాల వేగంగా తిరుగు తాయి. ఇవి పోటీలకు పనికి రావు. పెద్ద పిల్లలు తమ పెద్ద వారితో మంచి కర్రతో స్వంతంగా పెద్ద బొంగరాలను చేయించుకునే వారు. అవి బరువు ఎక్కువగా వుండి బలంగా వుండేవి. ఇలాంటివి పోటీలకు మాత్రమే వాడే వారు. నేర్పరులు బొంగరాలతో చాల విన్యాసాలు కూడా చేసె వారు. బొంగరానికి దారం చుట్టి గాల్లోకి విసిరి వేసి అది కింద పడకుండా గాల్లోనే దాన్ని ఒడుపుగా తన అరచేతిలో పడే టట్లు పట్టుకుంటారు. అలా అచి చేతిలో తిరుగు తుండగానె, అతడు వెనక్కి వంగి తన నుదిటిమీద తిరుగు తుండగానె పెట్టుకుంటాడు. బొంగరాలకు సంబంధించిన ఒక సామెత ఉంది. అది వాడు తాడు బొంగరము లేని వాడు. ఎవరైనా పని చేయకుండా గాలికి తిరుగు తుంటే ఈ సామెత వాడతారు. 

చింతపిక్కలాట
ఇది పెద్దవారు మాత్రమే ఆడే వారు. అది కూడా జాతరలపుడు, మహాభారత నాటకాలు జరిగే సందర్భంలోను డబ్బులు పెట్టిఆడే వారు. ఆడె విధానము:\ సుమారు ఒక అడుగు చదరములో సమానమైన వంద గడులు గీసి అందులో నున్న మధ్య గడిలో వరుసలో అనగా ఒకటి, రెండు, మూడు, నాలుగు ఇలా సుమారు ఇరవై గడులు వుంటాయి. ఆ సంఖ్య ఆ చదరము యొక్క సంఖ్యను తెలియ జేస్తుంది. మిగతా గడులలో అంకెలను ఆ ఇరవై చదరాలలో ఒక్కొక్క గడిలో ఒక్కొక్క అంకెను వ్రాసి వుంచు తారు. అనగా ఏ చదరములో వున్న అంకెలు యదా తదంగా మరొక చదరంలో వుండవు. ఈ ఇరవై చదరాలను ఇరవై మంది ముందు పెట్టుకొని వృత్తాకారంలో కూర్చుంటారు. మధ్యలో ఆట నిర్వహకులుంటారు. ఒక డబ్బాలో ఒకటి నుండి వంద వరకు అంకెలు వ్రాసి వున్న చిన్న బిళ్లలుంటాయి. వాటిని కలిపి ఒక్కోసారికి ఒక్క నెంబరు తీసి దాన్ని గట్టిగా అరిచి చెప్త్రారు. ఆట ఆడెవారు తమ చదరంలో వున్న ఆ అంకెకు సంబంధించిన చిన్న గడిలో ఒక చింత పిక్కను పెట్టాలి. ఇలా ఆట కొనసాగుతుండగా ఎవరి చదరంలో నైనా చింత పిక్కలు అడ్డంగా గాని, నిలువుగా గాని, లేదా మూలలకు గాని వున్న చిన్న గడులలో చింత పిక్కలు అమరితే ఆ వ్వక్తి గెలిచానని చెప్పి తన చదరం నెంబరు కూడా చెప్తాడు. నిర్వహకులు కూడా తమ ముందు ఒక చదరంలో వారు చెప్తున్న అంకెల ప్రకారము చింత పిక్కలను పెడ్తారు. గెలిచిన వ్వక్తి తాను పూర్తి చేసిన గడులలోని అంకెలను బిగ్గరగా అరిచి చెప్తాడు. నిర్వహకులు తమ ముందున్న చదరంలో సరిచూసుకొని గెలుపును నిర్థారిస్తారు. ఈ విధానంలో ఒకరికన్న ఎక్కువ మంది ఆటను గెలుస్తారు. ఆట ప్రారంబానికి ముందు ఆడే ప్రతి ఒక్కరి వద్ద ఒక నిర్ణీతమైన సొమ్మును వసూలు చేస్తారు. అందులో కొంత భాగాన్ని నిర్వహకులు వుంచుకొని మిగతా దాన్ని గెలిచిన వారికి ఇస్తారు. ఒక్కరికన్నా ఎక్కువ మంది గెలిస్తే వారి ఆ సొమ్మును సమానంగా పంచు తారు. ఇందులో మోసం ఏమి వుండదు. ఇది చింత పిక్కలాట. కొన్ని రోజుల పాటు జాతరలు, తిరుణాల్లు మొదలగు వినోద కార్యక్రమాలు జరిగే సందర్భంలో మాత్రమే ఆడే వారు. ఇప్పుడు ఈ ఆయ పూర్తిగా కనుమరుగైనది.

ఈత కొట్టడం
గతంలో పల్లెల్లోని పిల్లలందరు ఆడ మగ తేడాలేకుండా అందరు ఈత నేర్చుకునే వారు. నదులు, కాలవలు వుండే ప్రాంతాలలో, బావులు వంటివి వున్న ప్రాంతాలలో పిల్లలు ఈతను తప్పక నేర్చుకునే వారు. బావులలో ఈత కొట్టే విధానము, నేర్చుకునే విధానము. ఎండా కాలంలో మాత్రమే ఈ కార్యక్రమము వుండేది. పిల్లలకు మొదటగా ఈత నేర్చుకునే టప్పుడు వారి నడుముకు బెండు లాంటి కర్ర ముక్కలను కట్టి బావులలో వదిలే వారు. ఈ కర్రలు ఎక్కువ కలబంద చెట్టు కర్రలై వుంటాయి. అవి మూరెడు పొడగున్నవి రెండు చాలు ఒక పిల్లవాణ్ని నీటిపై తేల్చడానికి. వాటిని తుండ్లు అంటారు. ఇలా ఈ తుండ్లతో కొంత కాలం ఈత నేర్పి రెండోదశలో ఆ తుండ్లను తీసేసి ఒక పొడవైన దారాన్ని పిల్ల వాని నడుముకు కట్టి బావిలో వేస్తారు. వాడు మునిగి పోతుంటే గట్టు మీద ఆధారాన్ని పట్టుకున్న పెద్ద వారు దారాన్ని పైకి లాగి వాడు ఈత కొట్టడానికి అనువుగా దారాన్ని వదులు చేస్తారు. ఇప్పుడు ఈ త నేర్చిన పెద్ద పిల్లలు పక్కన చేరు నేర్చుకునే పిల్లవానికి సహాయ పడుతుంటారు. ఈ విదంగా పిల్లలకు ఈత నేర్పుతారు. 

ఈ వినోధ కార్యక్రమాలే గాక కొన్ని ప్రత్యేక సందర్భాలలో అనగా తిరుణాలు, జాతరలు జరిగే చోట తోలుబొమ్మలాటలు, కీలుగుర్రం, రంగుల రాట్నం మొదలైన వినోద కార్యక్రమాలుండేవి. ఇలాంటివాటిని చూడడానికే కొంత మంది ప్రజలు జాతరలకు వచ్చేవారు. తోలు బొమ్మలాటలు, కీలుగుర్రం వంటివి ఈనాడు పూర్తిగా కనుమరుగైనాయి. రంగుల రాట్నం మాత్రం గతంకన్న మరికొన్ని సొబగులద్దుకొని ఈ నాటికి వినోదాన్నిస్తున్నది.రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top