గతించిన మన పితృదేవతలకు ఆహారం ఎందుకు సమర్పిస్తారు - Pitrudevatalu

0
పితృదేవతలు ఆహారం స్వీకరించడం ఏమిటి?
దేహధారులకు ఆయా దేహానికి సంబంధించిన ఆకలిదప్పులు తప్పవు. ఇప్పుడు మనం ఉన్నది మాంసశరీరం. ఈ శరీరాన్ని విడిచిన తరువాత వారికి యాతనాశరీరం ఇవ్వబడుతుంది. దేవతలకు దివ్య శరీరం. ఒకొక్కరికి ఒకొక్క రీతిలో శరీరనిర్మాణం జరుగుతుంది.
శరీరం ఉన్నవారికి యాతనలు తప్పవు. దేవతలు కూడా మనం ఇక్కడ చేసిన యజ్ఞయాగాదులు హవిస్సులను గ్రహించి మనకు ఇక్కడ కావలసిన వరాలను ఇస్తున్నారు. ఈ విషయం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినది ప్రామాణికం. 
ఇక్కడ శరీరం వదిలిన 13 రోజులలో యాతనాశరీరం తయారవుతుంది. వారికి ఆ యాతనాశరీరం సంపూర్ణంగా తయారయే విధంగా మనం 11 రోజులూ క్రతువులతో సపిండీకరణ కావించి వారికి ఆ శరీరపటుత్వాన్ని కలుగ చేస్తాం.
ఇదేలాగా అంటే మనకు పుట్టబోయే బిడ్డ కోసం మనం డాక్టర్ల వద్దకు వెళ్లి ఐరన్, ఇతర పోషక పదార్ధాలు కలిసిన మందులు తీసుకుంటూ, వారికి ఆరోగ్యంగా ఉండేట్టు ఇంజక్షన్లు తల్లి తీసుకున్నట్టు, శరీరం విడిచిన జీవునికి ఆ సంవత్సర యాత్రా సుఖంగా ఉండేటందుకు వారికి పటుత్వం ఉండేటందుకు ఈ అపరకర్మలు చేస్తాము. అంతేకాక నెలనేలా మాసికాలు, 180 రోజులకు ఊనశన్మాసికాలు, ఇతరత్రా వ్యవాహారాలు వారికి ఆ శరీరం యందు సుఖం కలుగ చెయ్యడం కోసమే. ఏమి అవి చెయ్యకపోతే వారికి శరీరాలు రావా అంటే వస్తాయి, ఏ జాగ్రత్తలు తీసుకొని తల్లులకు కూడా పిల్లలు పుట్టినట్టు. కానీ తెలిసిన విధానంలో వారికి తగుపోషణ తీసుకుంటే ఏవిధంగా ఆరోగ్యవంతమైన శిశువు పుడతాడో, అదే రకంగా శాస్త్రం చెప్పిన కర్మలు చేస్తే వారికి అంత సౌకర్యవంతమైన శరీరం అందుతుంది.

దేవతలకు అగ్నిపూర్వకంగా హవిస్సులు స్వాహాకారంతో అర్పించగా హవ్యవాహనుడు అయిన అగ్నిభట్టారకుడు వారికి ఆ హవిస్సులను అందచేస్తున్నాడు. ఇదే విధంగా స్వధాకారాలతో అర్పించిన పిండాలను యాతనాశారీరంలో ఉన్న పితృదేవతలకు వారికి అందచేస్తున్నాడు. అంతేకాక మనం నల్లనువ్వులతో కలిపి అర్పించిన అన్నపిండాలను పశుపక్ష్య, జలచరాల రూపంలో, నువ్వులతో వదిలిన తర్పణాలను సూక్ష్మరూపంలోనూ, బ్రాహ్మణులకు పెట్టిన భోజనాన్ని వసురుద్రఆదిత్య రూపంలో అతని ద్వారా గ్రహిస్తున్నారు. కాబట్టి పితృదేవతలు మనం ఇచ్చిన భక్ష్యభోజ్యాలను, పిండాలను, తర్పణాలను తగువిధంగా వారికి తగ్గరీతిలో గ్రహిస్తున్నారు, గ్రహించి మనల్ని అనుగ్రహిస్తున్నారు. ఇక్కడ పితృదేవతలు అంటే కేవలం శరీరం వదిలిన తల్లితండ్రులు మాత్రమె కాదు, వసు, రుద్ర ఆదిత్య రూపంలో ఉన్న గణాలు. మనం వీరిద్వారా ఆ పిత్రుగాణాలను సంతృప్తి పరుస్తున్నాము.


మరి ఆయా పితృదేవతలకు చేసే క్రతువులలో ఎలా ఉండాలి యజమాని, ఆ గృహిణి అంటే శాస్త్రం ఎన్నో కట్టుబాట్లు చెప్పింది. కొంతమంది ఏమి మేము పంజాబీ డ్రస్సులు వేసుకుంటే వారు రారా అన్న వితండ వాదం చేస్తుంటారు. వారికి సమాధానం కొన్నింటికి కొన్ని మర్యాదలు ఉంటాయి. ఇప్పుడు అదే చెఫ్ గా ఉండమనండి, ఒక apron వేసుకుని నెత్తిన ఒక టోపీ పెట్టుకుని తయారవుతారు, లేదా ఒకడిని ఇంటర్వ్యూ కి వెళ్ళమంటే సూటు, బూటు వేసుకుని టై కట్టుకుని హుందాగా వెళ్తాడు, ఏమి ఇవి లేకుండా వెళ్ళలేరా అంటే అది సభామర్యాద. ఏ పని చేసేటప్పుడు ఆ విధంగా ఉండాలి. ఇక్కడ ఎంతో శ్రద్ధతో చేసే శ్రాద్ధానికి శాస్త్రం మడి బట్టను కచ్చ పోసి కట్టుకోమంది. నువ్వు చేసే శ్రద్ధను గమనిస్తారు పెద్దలు. శ్రాద్దాలలో నీ శ్రద్ధనే ప్రధాన పెట్టుబడి, మిగిలినవి అన్నీ శాస్త్రం చెప్పినట్టు చెయ్యడమే. నీ శ్రద్ధకు మురిసి నీ పితృదేవతలు మిగిలిన దేవతలతో పోట్లాడి అయినా సరే నీకు జరగవలసిన మంచిని జరిపిస్తారు. నీ పితృదేవతలు నీకు అతిదగ్గరగా ఉన్న దేవతలు, ఇతర దేవతలకన్నా నీమీద అనురాగం మరింతగా ఉన్నవారు. శాస్త్రం ముందు పితృదేవతలను చెప్పి అటుపై దేవతార్చన చెబుతుంది, అంటే వారి ప్రాముఖ్యత ఏమిటో గ్రహించండి. అటువంటి వారికి మనం చేసే క్రతువులలో మరెంత శ్రద్ధ కనబర్చాలో తెలుసుకోండి.

!! ఓం నమో వేంకటేశాయ !! 
!! సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు !!


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top