జపశాంతులు, పూజలు, హోమాలతో పాప ప్రక్షాళన జరుగుతుందా? - Poojalu, Hoomalu, Paapalu

జపశాంతులు, హోమాలతో పాప ప్రక్షాళన జరుగుతుందా?
హైందవ ధర్మానికి ఒకానొక మూల స్థంభం కర్మ సిద్ధాంతం. మనం చేసే కర్మ, మంచైనా, చెడైనా మనతో పాటే వస్తుంది. అది జన్మ జన్మలకు మన తోటే వుండి కర్మ పరిపక్వం అయినప్పుడు దాని ఫలితం ఇస్తుంది. సత్కర్మ పుణ్యాన్ని సంపాదించి పెడితే దుష్కర్మ పాపాన్ని పెంచుతుంది. ఏది సత్కర్మ, ఏది దుష్కర్మ అన్నది ధర్మ గ్రంధాలు చెబుతాయి. కర్మ పరిపక్వం కాకుండా దాని ఫలితం దక్కదు. ఒకడు ఒక ధనవంతునికి పుట్టాడన్నా, లేక పేద కుటుంబంలో పుట్టాడన్నా, అన్నీ సమంగా వున్న శరీరం వచ్చినా, లేక ఏదైనా వైకలవ్యం తో పుట్టినా దానికి కారణం ఆ జీవి అంతకు ముందు జన్మలలో చేసిన పాపపుణ్యాల ఫలితమే. ఒకరికి స్వర్గ సౌఖ్యాలు కలగడం, ఒకరికి ఎంత కష్ట పడినా ఫలితం దక్కక పోవడం అన్నీ కూడా అంతకు ముందు చేసిన కర్మల ఫలితమే. కొందరు పండితులు జాతకాన్ని పరిశీలించి కొన్ని శాంతులు, హోమాలు, జపతపాలు ప్రతిపాదిస్తారు. కొందరి పాపం సద్గురువులను ఆశ్రయించగానే పటాపంచలు అయిపోతాయి. అసలు నిజంగా పాప ప్రక్షాళన ఈ విధంగా జరుగుతుందా? దానికి ఏమిటి హేతువు అని ప్రశ్నిస్తూ వుంటారు.
కర్మ సిద్ధాంతము
దానికి సంబంధించి కొన్ని ఉదాహరణ ద్వారా ముచ్చటించుకుందాం. పాలు పెరుగుగా మారాలంటే ఆ రసాయన చర్యకు నిర్దుష్ట సమయం పడుతుంది. కొన్ని రసాయనాలు ఆ పాలలో కలపడం ద్వారా, దాన్ని ఒక సరైన ఉష్ణోగ్రతలో ఉంచడం ద్వారా ఆ చర్యను వేగవంతం చేయవచ్చును. మన కర్మ కూడా ఇటువంటిదే. అది పరిపక్వం అవ్వడానికి కొంత సమయం పడుతుంది. కర్మ అనుభవిస్తే పోతుంది. శాంతులు, హోమాలు వేగిర పరిచే ప్రక్రియ. మరింతగా మనకు నేటి పద్ధతిలో అర్ధమయ్యే రీతిలో చర్చించుకుందాం. మనం ఒక బ్యాంకు లో ఎకౌంటు తీసుకున్నాం అనుకుందాం. దానిలో కొంత పైకం దాచుకుంటాం. అలాగే అప్పుడప్పుడు వారి దగ్గర నుండి కొంత పైకం అప్పు లేక లోను రూపంగా తీసుకుంటాం.

ఉదాహరణకు:
  • మనం ఒక గృహ లోను తీసుకున్నాం అనుకుందాం. ఆ ఇల్లు కట్టే వరకు మనకు pre-emi కట్టమని చెబుతారు.
  • ఆ ఇంట్లోకి మనం గృహప్రవేశం చేసిన నాటి నుండి emi వసూలు చేస్తారు. 20 ఏళ్ళకు ఆ లోను అనుకుందాం. దాన్ని మనం ప్రతి నెల కట్టవలసి వుంటుంది.
  • మనకు ఎప్పుడైనా కొంత ధనం సంప్రాప్తించినప్పుడు ఆ లోన్ ను మనం pre-pay చేస్తాము. అలా కొంత భారం తగ్గించుకుంటాము.
  • లేదా మనం దాచుకున్న సొమ్మును మొత్తం ఆ లోన్ కు కట్టేసి ఋణ విముక్తులం అవుతాము. ఏదైనా లాటరి తగిలో లేక మన అదృష్టం బావుండి మరొక రూపంలో మనకు పైకం అందినప్పుడు ఆ లోన్ మొత్తం కట్టేసి హాయిగా ఆ భారం నుండి తప్పింపబడతాము.
  • మనం చేసిన పాపమే మనం తీసుకున్న లోను. మన ప్రస్తుత జన్మలో దాని పూర్తి భారం తీరకపోవచ్చును.
  • అప్పుడు ఆ జన్మలో pre-emi రూపంలో కొంత మాత్రమె అనుభవం లోకి రావచ్చును .
  • మన పాపం పండినప్పుడు అది emi రూపంలో మనం కట్టవలసి వుంటుంది ఒక నిర్దుష్ట సమయం వరకు.
  • ఆ సమయం లోపు మనం అనుకున్నా తీరకపోవచ్చును. అది కొన్ని జన్మల దాకా అనుభవించ వలసి రావచ్చును.
అదే ఒక సద్గురువుల సన్నిధికి వెళ్లాం అనుకోండి. వారు మన క్రెడిట్- డెబిట్ ఎకౌంటు ఒకసారి పరిశీలించి కొన్ని శాంతులు చెబుతారు.

లేదా కొన్ని మంచి పనులు చెయ్యమని ఆజ్ఞాపిస్తారు. ఆ శాంతులు, హోమాలు, తాపాలు చెయ్యడం వలన ఆ పాపానికి తగ్గ ప్రాయశ్చిత్తం చెయ్యగలిగే అమౌంట్ మన ఎకౌంటు లో పడుతుంది. అప్పుడు కట్టవలసిన emi లు త్వరత్వరగా కట్టించేసి మనల్ని ఋణ విముక్తులను చేయిస్తారు. కొన్ని సార్లు పాప భారం మరీ ఎక్కువగా లేకపోతే వెంటనే ఆ పాపం తొలగిపోతుంది. కొంచెం ఎక్కువగా వుంటే ఆ చెడు కర్మ ఒకొక్కసారి తక్కువ భారంతో అనుభవింప చేసి మనల్ని ఉద్దరిస్తారు. మనం అటువంటి గురువుల వద్దకు వెళ్ళాలంటే మనకు అంతకు సరిపడ్డా పుణ్యం వుండాలి. ఎప్పుడు ఆ పుణ్యం మనకు అనుకూలిస్తుందో అప్పుడు మనకు వారిని ఆశ్రయించాలని బుద్ధి పుడుతుంది, లేక ఆ పరిస్థితులు అనుకూలిస్తాయి. ఏది జరిగినా అది దైవ సంకల్పమే. మన కర్మ ఫలితమే.

ఒకొక్క సారి కొన్ని క్షేత్రాలను దర్శించినా అక్కడ ఉన్న పుణ్య విశేషం వలన మన పాపాలు పటాపంచలవుతాయి. మనకు దైవానుగ్రహం వుంటే ఎటువంటి కష్టాన్నైనా అవలీలగా దాటించగలడు.

కొందరు అప్పుడప్పుడు అంటారు. వాడెవడో ఇన్ని పాపాలు చేసినా కూడా ఇంకా ఎంతో గొప్పగా బ్రతుకుతూ వున్నాడు అని. అతడి పూర్వ జన్మ పుణ్య ఫలం నేడు అనుభవిస్తున్నాడు అని మనం సమాధాన పడాలి. అదే తర్కం, సత్యం కూడాను.

మరొక విషయం అంటారు. దేవుడిని నమ్ముకుని మనం కష్టపడుతున్నాము. ఏమి నమ్మని వాడు ఎంతో సుఖ పడుతున్నాడు అని. ఒక కత్తి దిగవలసిన పరిస్థితిలో దైవానుగ్రహం వుంటే అది ముల్లుతో సరిపోతుంది. దైవానుగ్రహం లేకపోతే వాడికి ఒక గొప్ప కేజీ మణి దక్కవలసిన చోట 10 గ్రాముల వెండి దొరుకుతుంది.

మనకు ఆ వేంకటేశుని దయ పరిపూర్ణంగా వుండాలని, మన పాప కర్మలను తీసేసి, మన చేత కేవలం పుణ్య కర్మలను మాత్రమె చేయించే అనుగ్రహం కలగాలని సర్వదా ప్రార్ధిస్తూ జై శ్రీరామ్

రచన: భక్తి బృంద
"తెలుగు-భారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. మన సంస్కృతీ, సంప్రదాయాలను మరింత లోతుగా విశ్లేషించి ప్రపంచానికి తెలియచేస్తూ మన ధర్మాన్ని కాపాడేందుకు మీ వంతు సహాయం చేయండి.
Supporting From Bharat:#buttons=(Accept !) #days=(20)

Our website uses cookiesLearn..
Accept !
To Top