దేవాలయాలలో చేయకూడనివి ఏవి ? - Aalaya నియమాలుదేవాలయాలలో చేయకూడనివి ఏవి ? - Aalaya నియమాలు
దేవాలయాలలో చేయకూడనివి ఏవి ?
చేయవలసిన పని ఎంత ప్రధానమో చేయకూడని పని అక్కడ చేస్తే పాపం కూడా అలాగే వస్తుంది.  దేవాలయంలో చేయకూడని పని ప్రధానంగా ఏమిటి అంటే అక్కరలేని మాటలన్నీ అక్కడ మాట్లాడడం. దేవాలయంలోకి వెళ్ళి ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చో మంచిది. దేవాలయంలోకి వెళ్ళి భగవంతుడి స్తోత్రాలు చెయ్యి మంచిది.
 • ⭄ కానీ దేవాలయంలోకి వెళ్ళి లౌకిక ప్రసంగాలు చేయడం, వాడిమీద చాడీలు, వీదిమీద చాడీలు, అక్కడే కూర్చుని అక్కరలేని ప్రసంగాలు చేయడం, 
 • ⭄ సెల్ ఫోన్ పట్టుకుని అక్కడ గట్టిగా మాట్లాడడం, అక్కడికి వెళ్ళి లోపల ఉన్న అరిషడ్వర్గాలను బయట పెట్టడం, 
 • ⭄ తోటి భక్తులకు ఇబ్బంది కలిగేటట్లుగా ప్రవర్తించడం, 
 • ⭄ వాళ్ళ మనస్సులో కూడా రజోగుణం కలిగేటట్లుగా చేయకూడని పనులు చేయడం, 
 • ⭄ ఎటువంటి పవిత్రమైన వస్త్రములను ధరించి దేవాలయంలోకి ప్రవేశించాలో ఆ నియమాలు పాటించకుండా అర్థరహితమైన వస్త్రధారణ చేసే దేవాలయాలలోకి ప్రవేశం చేయడం, 
 • ⭄ నియమం ఏది పాటించాలో అది పాటించకపోవడం, 
 • ⭄ శౌచం లేకుండా, స్నానాదులు లేకుండా దేవాలయాలలోకి ప్రవేశించడం, 
 • ⭄ బొట్టు పెట్టుకోకుండా దేవాలయం లోకి వెళ్ళడం, 
 • ⭄ దేవాలయంలోకి వెళ్ళినప్పుడు కనీసం చేతిలో ఒక్క పండైనా పట్టుకొని వెళ్ళకపోవడం, 
 • ⭄ ఒక ప్రదక్షిణ చేయకుండా గబగబా నడుస్తూ తిన్నగా మూలమూర్తి దగ్గరికి వెళ్ళిపోవడం, దేవాలయంలో ఉండే గోడలకు, 
 • ⭄ స్తంభాలకీ వీపు ఆన్చి కూర్చోవడం. 
దేవాలయంలో ఉన్న ప్రతి ఇటుక మహా తపస్సు చేసి ఈశ్వరా నేను నీ సన్నిధానంలో ఉండాలి అని కోరుకున్న భక్తులు దేవాలయాలలో స్తంభాలుగా, గడపలుగా, గోడలుగా వస్తారు.

ఇప్పటికీ మనకు వేంకటాచలంలో కులశేఖరాళ్వారు పడి అంటారు. వేంకటేశ్వర స్వామి ఎదురుగుండా ఉండే మొదటి గడప ఆళ్వారులలో ఒకరైన కులశేఖరాళ్వారు. నేనెప్పుడూ నిన్ను చూడాలి నానుంచి భక్తులు దాటినప్పుడు వాళ్ళ పదరజస్సు నామీద పడాలి అని కోరుకున్న మహాత్ములు దేవాలయంలో గోడలౌతారు, ఇటుకలౌతారు, స్తంభాలౌతారు. అక్కడకు వచ్చి వాటికి వీపు ఆన్చి కూర్చోవడం, కాళ్ళు చాపడం, ఆవలించడం, లౌకిక ప్రసంగాలు చేయడం, బయట నుంచి తెచ్చుకున్న పదార్థాలు దేవాలయాలలో కూర్చుని తినడం, దేవాలయాల పవిత్రతకు భంగం కలిగేటట్లుగా ప్రవర్తించడం, ఇవేవీ కూడా దేవాలయంలో చేయకూడదు.

ఆ ఒక్క సూత్రాన్ని గుర్తు పెట్టుకుంటే చాలు. దేవాలయం దేనికొరకు నిర్దేశింపబడిందో డానికి వ్యతిరేకమైన పని దేవాలయమునందు జరుగరాదు. తనకు ఏమి వచ్చు అన్నది చూడడు భక్తుడు. తనకు వచ్చిన దానిని ఈశ్వరుడికి సమర్పించి సంతోషపడిపోతూ ఉంటాడు. ఏమీ రాని వాడు గోవింద నామం చెప్తూ చిందులేసి సంతోషపడి వెళ్ళిపోతాడు. నీకు మనస్సు ఉంటే వాడికి ఒక నమస్కారం చెయ్యి.

అంతేకానీ అక్కడికి వెళ్ళి ఎగతాళి చేయడానికి, వెటకారాలు ఆడడానికి, భగవద్విరోధమైన మాటలు నేర్పడానికి భగవంతుడి యందు విశ్వాసం తరిగిపోయేటటువంటి మాటలు చెప్పడానికి అనాచారంతో అవైదికమైన ఆరాధనలు అటువంటి పనులు చేయడానికి దేవాలయాలను కేంద్రములుగా వాడరాదు. దానిచేత మనమే పాడైపోతాం. కాబట్టి దేవాలయంలో చేయకూడని పనులు అంటే వీటిని ప్రధానంగా మనస్సులో పెట్టుకుని ప్రవర్తించాలి.

వ్యాఖ్యానం: బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు
Translate this post ⬇

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top