పాల్గర్ సాధువుల హత్య వెనుక: ఆదివాసీ ఏక్తా పరిషద్ అసలు రూపం - Palghar, The true face of Adivasi Ecata Parishad


పాల్గర్ సాధువుల హత్య వెనుక: ఆదివాసీ ఏక్తా పరిషద్ అసలు రూపం - Palghar, The true face of Adivasi Ecata Parishad

త నెల 16న మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లాలోని గడ్ చించలే గ్రామంలో జునా అఖాడాకు చెందిన ఇద్దరు సాధువులను, వారి డ్రైవర్ ను హంతక మూకలు నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపాయి. ఈ సంఘటనలో 100మందికి పైగా నిందితులను అరెస్ట్ చేశారు. అయితే వీరిని విడిపించేందుకు ఆదివాసీ ఏక్తా పరిషద్ అనే సంస్థ వెంటనే రంగంలోకి దిగడంతో ఈ మూకుమ్మడి హత్యల వెనుక పరిషద్ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇంతకీ ఈ ఆదివాసీ ఏక్తా పరిషద్ ఏమిటి? గిరిజనుల్లో ఆ సంస్థ సాగిస్తున్న కార్యకలాపాలు ఏమిటి?

వామపక్ష సమూహాలు, చర్చ్ సంస్థల పనితీరులో అనేక పోలికలు ఉంటాయి. తమ అసలు రంగు బయటపడకుండా వివిధ సంస్థలను సృష్టించి వాటి ద్వారా కార్యకలాపాలు సాగిస్తుంటాయి. ఆ విధంగా తమ కుట్ర బయటపడకుండా,  పేరు వినిపించకుండా జాగ్రత్తపడుతుంటాయి. జాగ్రత్తగా తీగ లాగితేనేగానీ డొంక అంతా కదలదు, అసలు నిజాలు బయటకిరావు.

సాధువుల మూకుమ్మడి హత్యకు సామాజిక మాధ్యమాలలో జరిగిన అసత్య ప్రచారమే కారణమంటూ కొందరు ఓ వాదన లేవదీశారు. “కరోనా వైరస్ వ్యాప్తికి ముస్లిములు కారణం” అని సామాజిక మాధ్యమాల్లో సాగిన దుష్ప్రచారం ఒక కారణమని అన్నారు. అలాగే `పిల్లల మూత్రపిండాలను దొంగిలించే ముఠా తిరుగుతోందనే’ ప్రచారం ఈ సంఘటన జరగడానికి మరొక కారణం కావచ్చని వాదించారు. ఇంతకీ మూత్రపిండాలు ఏవైనా పువ్వులా, అలా తెంపుకుని ఇలా పట్టుకుపోవడానికి? ఈ అసంబద్ధమైన వాదనలు ఎక్కడ పుట్టాయి? ది ప్రింట్ మొదలైన మీడియా సంస్థల ప్రకారం ఈ వార్తలు, పుకార్లు కొందరు పుట్టించారని ఆదివాసీ ఏకతా పరిషద్ కు చెందిన రాజు పంధార చెప్పారు. ఈ పరిషద్ పశ్చిమ భారతంలో పనిచేసే ముఖ్యమైన సంస్థ  అంటూ ఆ మీడియా సంస్థలు కితాబు కూడా ఇచ్చాయి. ఇంతకీ ఈ ఆదివాసీ ఏకతా పరిషద్ వెనుక ఉన్నదెవరు?

ఆదివాసీ ఏక్తా పరిషద్ రెండు ముఖాలు
“సమస్త మానవాళి, ప్రకృతి కోసం పనిచేస్తాం” అంటూ ఆదివాసీ ఏకతా పరిషద్ తమ అధికారిక వెబ్సైట్ లో పేర్కొంది. ఇటీవల జనవరిలో పాల్ఘార్ దగ్గర ఈ సంస్థ ఏర్పాటు చేసిన “సాంస్కృతిక” సభకు మధ్యప్రదేశ్ గవర్నర్ అనసూయ, స్థానిక ఎంపీ రాజేంద్ర గావిట్ తో సహా పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ ఉత్సవం ప్రతిసంవత్సరం జరుగుతుంది. దీనికి 2 లక్షలకు పైగా ప్రజలు హాజరవుతారని ఈ సంస్థ గొప్పగా చెపుతుంది కూడా. గత సంవత్సరం (2019)లో ఈ ఉత్సవాన్ని దాద్రా నాగర్ హవేలి లోని సిల్వాసా లో నిర్వహించారు. అప్పటి నుంచి పాల్ఘార్ తోపాటు చుట్టుపక్కల ప్రాంతాలలో సంస్థ కార్యకలాపాలు పెరిగాయి.

తెర వెనుక కధ
ఈ 2019 దాద్రా నాగర్ హవేలి ఉత్సవం గురించి కాథలిక్ బిషప్స్ ఆఫ్ ఇండియా(CBCI) సంస్థ కూడా తమ వెబ్ సైట్ లో ప్రస్తావించింది. `కాథలిక్ బిషప్స్ కు చెందిన గిరిజన వ్యవహారాలు చూసే ఫాదర్ నికోలస్ బర్లా కూడా ఈ ఉత్సవ నిర్వాహకులలో ఒకరు. అలాగే ఆయన ఆదివాసీ ఏకతా పరిషద్ సభ్యుడు కూడా. అలాగే సిస్టర్ లలితా రోషిణి లక్రా కూడా ఆ మూడు రోజుల కార్యక్రమానికి హాజరయ్యారు” అని సంస్థ వెబ్ సైట్ పేర్కొంది. “ఫాదర్ బర్లా ఆ ఉత్సవంలో `గిరిజన అంశాలపై ఐక్యరాజ్యసమితి’ అనే విషయాన్ని గురించి మాట్లాడారు కూడా” అని కాథలిక్ బిషప్స్ సంస్థ వెబ్ సైట్ వెల్లడించింది.

“పాల్ఘార్ లో జనవరి 13 నుంచి 15 వరకు జరిగిన సమావేశాలను కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేసింది’’ అని ఇటలీలోని రోమన్ కాథలిక్ పాంటిఫికల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఫారిన్ మిషన్స్ (PIME) తన అధికారిక వార్తా సంస్థ asianews.it ద్వారా వెల్లడించింది. “ఈ కార్యక్రమం చర్చి కార్యకలాపాల్లో  ఒకటి, అలాగే అది జీసస్ సందేశాన్ని, దివ్య ప్రబోధపు విలువలను తెలియజేసింది” అని కూడా పేర్కొంది.

“ఐక్యరాజ్య సమితికి చెందిన స్థానిక జాతుల అంశాలపై శాశ్వత ఫోరం ఉపాధ్యక్షుడు ఫూల్ మన్ చౌదరి కూడా ఈ కార్యక్రమానికి హాజరుకావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది” అంటూ ఫాదర్ బర్లా పేర్కొన్న విషయాన్ని కూడా రోమన్ కాథలిక్ సంస్థ ప్రస్తావించింది.
ఈ ఐక్యరాజ్యసమితి ఫోరం ఏమిటి?
ఇది ఐక్యరాజ్యసమితి సలహా సంఘం. ఇందులో వివిధ ప్రభుత్వాలు నామినేట్ చేసిన 8 మంది సభ్యులతోపాటు స్థానిక జాతుల సంస్థలకు చెందిన మరో 8 మంది సభ్యులు ఉంటారు. ఇందులో ఫూల్ మన్ చౌదరి స్థానిక జాతుల సంస్థల ద్వారా నేపాల్ నుంచి నామినేట్ అయిన వ్యక్తి. ఆదివాసీ ఏకతా పరిషద్ మాదిరిగానే ఈ `స్థానిక జాతుల సంస్థలు’ కూడా చర్చ్ కి సంబంధించిన మరొక సంస్థగా భావిస్తారు. అయితే ఐక్యరాజ్యసమితి సంస్థ కావడంతో దీనికి అపారమైన నిధులతో పాటు, గౌరవం, పరపతి కూడా లభిస్తాయి. వాటిని ఉపయోగించి ఈ సంస్థ `పేద స్థానిక జాతుల’ కోసం పనిచేస్తుంది. ఇలాంటి సంస్థలో ఫాదర్ నికోలస్ బర్లా ప్రముఖ పాత్ర పోషిస్తుంటారు. బర్లా ద్వారా ఆదివాసీ ఏకతా పరిషద్ కార్యకర్తలు విదేశీ ప్రయాణాలు చేస్తూ అంతర్జాతీయ వేదికలపై తమ వాదనలు వినిపిస్తుంటారు. అయితే సామాజిక మాధ్యమాల్లో మాత్రం బర్లాను కేవలం నికలస్ బర్లాగానే పేర్కొంటారు తప్ప ఆయన క్రైస్తవ ఫాదర్ అనే సంగతి తెలియనివ్వరు.

ఆదివాసీ ఏకతా పరిషద్ గురించి కొందరు స్వతంత్ర రచయితలు పరిశోధించినప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు బయటపడ్డాయి. హారీ గోల్బార్నే సంపాదకత్వంలో వచ్చిన `race and ethnicity’లో ఆదివాసీ ఏకతా పరిషద్ ప్రస్తావన కూడా ఉంది. `హిందువుల కబంధ హస్తాల నుండి విముక్తం కావాలని ఆదివాసీలకు పిలుపునిస్తుంది’ అని ఆదివాసీ ఏకతా పరిషద్ గురించి వ్రాసారు.

ఈ విషయాలన్నీ పరిశీలించిన మీదట `సామాజిక మాధ్యమాల్లో వచ్చిన పుకార్లు’ అసలు నిజంగా వచ్చినవా, లేక గిరిజనులను రెచ్చగొట్టేందుకు ఉపయోగించిన ప్రచారమా అని ఎవరికైనా సందేహం కలుగుతుంది. గిరిజనులను ఈ విధంగా రెచ్చగొట్టి `పత్తల్ గర్హి ఉద్యమం’ మాదిరిగా పాల్ఘార్ లోకి కూడా `ఇతరులు’ఎవరు ప్రవేశించకుండా అడ్డుకునే ప్రయత్నం సాగుతోందని అనిపిస్తుంది.

సమాధానం దొరకాల్సిన కొన్ని ప్రశ్నలు:
ఈ వ్యవహారమంతా ఈనాటిది కాదు. ఇది చాలా సంవత్సరాలుగా సాగుతోంది. అయితే సాధువుల మూక హత్యల సంఘటన నేపధ్యంలో ఆదివాసీ ఏకతా పరిషద్ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పవలసి ఉంది. అవి :
  • – చర్చ్ సహాయసహకారాలతో ప్రతి సంవత్సరం లక్షలాది మందితో కార్యక్రమాలు జరుగుతాయా?
  • – కాథలిక్ బిషప్స్ సంస్థ (CBCI)కు చెందిన ఫాదర్ నికోలస్ బర్లా పరిషద్ కార్యనిర్వహణ బోర్డ్ సభ్యుడా?
  • – కొన్ని పుస్తకాలు పేర్కొన్నట్లు పరిషద్ హిందూ వ్యతిరేక ప్రచారంలో పాల్గొంటున్నదా?
  • – సాధువుల మూకుమ్మడి హత్యలకు సోషల్ మీడియా పుకార్లు కారణమని చెప్పాలనుకుంటున్నవాళ్లు ఎవరు?
  • చర్చ్ సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు
  • – ఆదివాసీ ఏకతా పరిషద్ తో చర్చ్ కు ఉన్న సంబంధం ఏమిటి?
  • – అటువంటి సంస్థల ద్వారా చర్చ్ పాల్ఘార్, దాద్రా నాగర్ హవేలి వంటి ప్రాంతాలను ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తున్నదా?

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top