పిల్లలు, కన్నవారి కలలు - Pillalu Kannavari Kalalu

కన్నవారి కలలు!

భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రాశస్త్యం ప్రపంచ దేశాల ప్రశంసలకు నోచుకుంది. విశ్వానికి ఆదర్శప్రాయమై నిలిచింది. సీతాపహరణం పిదప రాముడి వియోగ విలాపాలు - ప్రణయ దాంపత్య జీవన సఖ్యతా మాధుర్యాన్ని లోకానికి రుచి చూపించాయి. ‘సీతారాముల పోల్కి మీరలు శుభశ్శ్రీలంది వర్ధిల్లుడంచు ఏతథ్యోక్తి ముహూర్తపుం గడియ తానేతెంచి ఆశీర్వచో జాతంబు కురిపించెనో’ అని కవులు వర్ణించినట్లు అగ్నిసాక్షిగా ముడివడగానే దంపతులు గృహస్థు ధర్మనిర్వహణ బాధ్యతలను తలకెత్తుకుంటారు.

‘కుటుంబం’ అనే ఒకానొక అద్భుత వ్యవస్థకు అదే అంకురారోపణ! నూతన దంపతుల మధ్య ‘... ఎవో అన్యోన్య అనురాగమ్ములు అంకురించి’ క్రమంగా సఖ్యత ఏర్పడుతుంది. బంధం బలపడుతుంది. కాలక్రమంలో ప్రేమలు ఫలించి, జంటకు ‘తల్లిదండ్రులు’ అనే హోదా దఖలుపడుతుంది.

మహాకవి జాషువా చెప్పినట్లు ‘తల్లిదండ్రుల తనూవల్లరీ ద్వయికి వన్నియబెట్టు తొమ్మిది నెలల పంట’ చేతికి అందుతుంది.

‘ప్రసవాబ్ధి తరియించి వచ్చిన పరదేశి తమ యింట క్రొత్త పెత్తనపుదారు’గా అవతారం దాలుస్తాడు. ‘ఇద్దరు నొక్కటై మరియునొక్కరు ముగ్గురయి...’ వారి చుట్టూ కుటుంబం అనే అపురూప భావపరీమళం అల్లుకుంటుంది. బతుకులోని మాధుర్యం, అవసరం అనుభవానికి వస్తాయి.

‘భార్య భర్త అనే రెండు తాళ్లు ముడివేస్తే ఆ ముడి సంతానం!’ అన్న భర్తృహరి మాటలకు తాత్పర్యం తెలిసొస్తుంది. అప్పుడప్పుడు వారి మధ్యలో మనస్పర్ధలు ఏర్పడినా వేటూరి ప్రభాకరశాస్త్రి వర్ణించిన ‘అరయన్‌ ఆల్మగళ్ల హృదయంబులనంబడు రెండు రజ్జువుల్‌... ఇక వేరుపడకుండగా ఏర్పడున్‌ సుతాకారపు ముళ్లు...’ ఆ అపశ్రుతులను సరిజేస్తాయి. జీవనరాగం కొత్త పల్లవిని అందుకుంటుంది.

‘అను’ అంటే ‘ఎడతెగని’ అని అర్థం. పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య బలపడే బంధం ఎడతెగనిది కనుకనేదానికి ‘అనుబంధం’ అని పేరు. అందుకు మూలం అయ్యేవాటిలో అమ్మది పేగుబంధం, నాన్నది వంశానుబంధ సుగంధం! నిరుపేదలే అయినా, ‘దినమెల్లన్‌ శ్రమియించి చెమ్మటలలో దేహంబు నీరార్చి, చిక్కిన పైకమ్ము...’తో తమ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటారు అమ్మానాన్నలు! ఆ ప్రభావం పిల్లలపై గాఢమైన ముద్రలు వేస్తాయి.

‘ఇంటి నిర్వహణము నొంటి చేతను పూని, తులసి మొక్కవోలె మెలగెనమ్మ! ఆమె జీవశక్తి ఆలంబనమ్ముగా...’ స్వీకరించిన అమ్మాయి అత్తవారింటా అమోఘంగా రాణిస్తుంది. ‘ఇంటి పరువునెపుడు మంట కలప’కుండా ప్రవర్తిస్తుంది. ‘తాను పస్తులుండి తనయుల పోషింప ఇష్టపడుచు తండ్రి కష్టపడును కోరి కరిగిపోవు కొవ్వొత్తి పోలిక...’ తనకు భవిష్యత్తును కానుక చేసిన తండ్రి పోలికలు తనయులను విజేతలుగా మారుస్తాయి. ఆదర్శవంతులుగా మలుస్తాయి.

‘నీ యింటన్‌ పుట్టిన భాగ్యమొక్కటియె తండ్రీ! నన్ను కాపాడెడిన్‌...’ అన్న కృతజ్ఞతా భావాన్ని వారిలో రేకెత్తిస్తాయి. ‘కావడియందు మ్రోయుచును కష్టము నెంతయొ నోర్చి...’ శ్రావణ కుమారుడు అమ్మానాన్నలను తీర్థయాత్రలకు తిప్పడానికి కారణం అదే! ‘సన్న్యాసికి కర్మ చేయుటకు హక్కు హుళక్కి...’ అని ఛాందసులు శంకరులకు అడ్డుపడ్డారు.

వారిని ప్రతిఘటించి ‘తల్లిని తానె ధరించి శంభు సంవాసము చేర్చె శంకరుడు’ అని కవులు చేతులెత్తి మొక్కారంటే, తన తల్లి పట్ల శంకర భగవత్పాదులకు గల కృతజ్ఞతాభావమే మూలకారణం! మాంసం వ్యాపారి ధర్మవ్యాధుణ్ని చూసి ‘నావలె ఈతడు శాస్త్రపండితుడు కాదు... నిత్య కర్మఠుడునూ కాదు... వీనికి ఎటుల ఇట్టి గొప్ప జ్ఞానమబ్బె’ అని కౌశికుడు ఆశ్చర్యపడ్డాడు. ‘వీరు నా జననియు, జనకుండు సూవె! వీరలకు శుశ్రూష సేసి ఇట్టి పరిజ్ఞానము ఏను ప్రాప్తించితిని’ అని ధర్మవ్యాధుడి నోట పలికించి- మాతాపితరుల సేవ ఎంత ఉదాత్తమైనదో, పిల్లలను అది ఏ స్థాయికి తీసుకెడుతుందో మహాభారతం మనకు పాఠం చెప్పింది.

ఉప్పుమూటలా తనను వీపున మోస్తూ ముంగిట ముగ్గులు వేస్తూ అమ్మ నేర్పిన పాటలు ఇప్పటికీ మరిచిపోని ఏ బిడ్డకూ ‘అమ్మల రోజు’తో పనిలేదు. ‘ఏనుగమ్మా ఏనుగు’ పాటను జ్ఞాపకం ఉంచుకొని, బాల్యంలో తనను పట్టి నడిపించిన చేతికి తానిప్పుడు ‘వూతకర్ర’గా మారిన పిల్లవాడికి ‘నాన్నల రోజు’ వేరే అక్కరలేదు. అమ్మప్రేమలో వైశాల్యం, నాన్నప్రేమలో లోతు ఎరిగిన సంతానానికి ‘తల్లిదండ్రుల రోజు’ను గుర్తుచేసే పనిలేదు.

అయితే, పండులో గింజలన్నీ విత్తనాలుగా పనికిరావు. అలాంటి పొల్లుగింజలకు ‘ఈరోజు తల్లిదండ్రుల రోజు’ అని గుర్తుచేయాలి. వారిలో కొందరికి ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదు’ అన్న సామెత వర్తించడం దురదృష్టకరం.

అప్పుడు పెంపకం గీటురాయి అవుతుంది. సావాసాలు మరిగి వ్యసనపరులై పిల్లలు ‘పూప వయస్సునందె తనువుం బలిచేసిన దాఖలాలు... కనుల్‌ తడియారని దీనగాథలై’ జీవితాంతం పెద్దలు శోకతప్తులు కాకుండా ఉండాలంటే పెంపకం పట్ల జాగ్రత్త వహించాలి. అతి గారాలకు స్వస్తి పలకాలి. పెరుగుమీద మీగడ కోసం, పాయసంలో జీడిపప్పు కోసం, అరటిపళ్ల కోసం, అప్పడాల కోసం... పిల్లలు వాదులాడుకున్నప్పుడు తన వాటాను వారికి పంచిన అమ్మలు గుర్తుంటే పిల్లలు చెడిపోయే ప్రసక్తే తలెత్తదు. జాగ్రత్త పాటించలేకపోతే పెద్ద వయసులో అమ్మనీ నాన్ననూ పోలీసులు నిర్వహించే తరగతి గదులకు పంపే అగత్యం లేకుండా చేస్తే చాలు ‘తల్లిదండ్రుల రోజు’ను గుర్తుంచుకున్నంత పుణ్యం!

సంకలనం: కోటేశ్వర్

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top