హిందూత్వానికి సైన్యముగా "నాగసాధు - అఖాడాలను" ఏర్పాటు చేసిన శాశ్వత హిందూ ధర్మ పరిరక్షకులు జగద్గురు ఆది శంకరాచార్యుల వారు.
- పలికినవాడు మునిపల్లె జ్యోతిస్వరూప్ పలికించినవాడు పరమేశ్వరుడు.
ప్రపంచములో చాలా మందికి నాగసాధువులు అఖాడాలు అనేవారు ఉంటారనేది తెలిసినా అసలు వాళ్ళు ఎందుకు ఉంటారు. అలా ఎందుకుంటారు, దేనికోసం వాళ్ళు శూలం, కత్తి, గద, వంటి ఆయుధాలు ధరించి ఉంటారనే ప్రాధమిక విషయాలే చాలా మందికి తెలియని విషయమైతే, అసలు వారిని హిందూ ధర్మానికి సైనిక వ్యవస్ధగా జగద్గురు ఆది శంకరాచార్యుల వారు ఏర్పాటు చేశారనేది 90 శాతం హిందువులకే తెలియని విషయం.
- అసలు ముందుగా వారెవరు, వారి జీవన విధానం ఏమిటి, ఎందుకు ఉత్తరభారతములోనే ఉంటారు?
- ఎందుకు మనుష్యులలోకి రారు, ఎందుకు కుంభమేళాలోనే వస్తారు?
- ఎందుకు వారికి సైన్యముకి ఉండే విధముగా ఆయుధాలు ఉంటాయి?
- ఇవన్నీచాలా మందికి సమాధానములు తెలియని ప్రశ్నలు.
నాగ సాధువులను వివిధ అఖాడాలుగా ఒకే కాషాయ జెండా కిందకు వచ్చే సైన్యముగా ఏర్పరిచినది సాక్షాత్ శివావతారులైన ఆదిశంకరాచార్యుల వారే. నాగ అనగా హిమాలయాలలో కొండలలో నివసించే వారు అని అర్ధము. వారంతా అలా నాగసాధువులుగా ఏర్పడడానికి కఠోరమైన శారీరక శ్రమతో కూడిన సైనిక శిక్షణతో పాటు జ్ఞానమును వైరాగ్యమును కూడా అలవర్చుకున్నవారు. పరిపూర్ణమైన శారీరక మానసిక ధృడత్వం పొందిన వారే నాగ సాధువులు అవగలరు.
నాగసాధువులు పూర్వకాలం నుంచి ఉన్నప్పటికీ శంకరాచార్యుల వారు శివావతారులుగా గ్రహించగలిగి వారిచే ప్రేరణపొంది హిందూత్వ సైన్యముగా ఈ నాగసాధువులంతా హిందూత్వ ధర్మరక్షణకు కట్టుబడినవారు. తమకు తామే పిండప్రదానం చేసేసుకుని జీవన్ముక్తులుగా భావించగలిగే వైరాగ్య సంపన్నులు, శంకరాచార్యుల వారి సూచన మేర ఆయుధములని వినియోగించగలిగే యుద్ధ శిక్షణ కూడా పొందే వారు. రోజుకి ఒకసారి మాత్రమే తింటూ నైష్ఠిక బ్రహ్మచారులుగా ఉంటూ మంత్రసాధనతో తపస్సు చేసుకుంటారు. వారు ఇంద్రియ నిగ్రహం పొంది కట్టుకునే బట్టలను లెక్క చేయకుండా తలకు జటలనూ మరియు రుద్రాక్ష ధారణ చేయువారు. ఏకాంతముగా ఉత్తరభారత పర్వతాలలో నివసిస్తూనే ఈ దేశానికీ హిందువుల సంరక్షణకి మరియు ధర్మ రక్షణకి ఆది శంకరాచార్యుల వారి ప్రేరణచే పూర్తిగా కట్టుబడి ఉన్నవారు.
ఆదిశంకరాచార్యుల వారు ఈ నాగసాధువులు సైన్యముగా విడివిడిగా ఎవరికీదారే అన్నట్టుగా ఉండకుండా అఖాడా వ్యవస్ధ ఏర్పాటు చేశారు. అఖాడా అంటే యుద్ధ శిక్షణా శిబిరము లేదా సమూహం, ఒక్కొక్క అఖాడాకు ఒక నాయకుడు ఉంటారు, ఆ అఖాడాలలో ప్రతినాగసాధువూ యుద్ధశిక్షణనే కాక వైరాగ్యమును కూడా అలవర్చుకుంటారు.
అఖాడాలంతా ఆది శంకరాచార్యుల వారిచే వారి కాలములోనే నియమించబడిన హిందూత్వ సైన్యం. హిందూత్వ ధర్మరక్షణ అంటే కేవలం ధర్మ భోధతోనే కాదు, హిందూత్వానికి ఎప్పుడైనా ఏ కాలంలో అయినా ఎవరైనా సైన్యముతో శత్రువులుగా వస్తే హిందూ ధర్మమును మన క్షేత్రాలను కాపాడడానికి సైన్యము ఆవశ్యకమని తెలిసి దూరదృష్టితో ఆ కాలంలోనే ఆది శంకరాచార్యుల వారు హిందూత్వానికి సైన్యముగా నాగసాధువులను ఒకటి చేసి వాళ్ళని ఆయుధములను ఉపయోగించే విధముగా యుద్ధ శిక్షణ ప్రక్రియను మార్గదర్శనం చేసి వారిని దశనామి సాంప్రదాయాల అనుసారంగా వివిధ అఖాడాలుగా ఏర్పాటు చేశారు. జనం సంచారంలోకి రాని వీళ్ళని లక్షలుగా వీళ్ళ ఉనికి ప్రపంచానికి తెలియడానికి వీరిని కుంభమేళాలో అందరినీ ఒకచోటికి చేరమని చెప్పి అలాగే శంకర పరంపరలోని ఉత్తరామ్నాయ శంకరాచార్యుల వారి మాటకు కట్టుబడి ఉండమని ఆది శంకరాచార్యుల వారు వారికి మార్గదర్శనం చేశారు. ఈ విషయాలు అన్నీ కొన్ని పుస్తకాలలో లేక Blogలలో ఉన్నప్పటికీ హిందువుల ఐక్యత రుచించని వారు ఇంకా ఎన్నోవిషయాలు జనాలకు అందుబాటులోకి ఇవ్వరు. మనమే ప్రయత్న పూర్వకముగా తెలుసుకోవాలి, మునిపల్లె జ్యోతి స్వరూప్ అనబడే నేను ఉత్తరామ్నాయ శంకరాచార్య జద్గురువుల శిష్యులని అడిగి తెలుసుకున్న అనేక విషయాలలో కొన్ని ఇక్కడ వ్రాస్తున్నాను.
శంకరాచార్యుల వారిచే ఏర్పాటు చేయబడిన హిందూత్వ సైన్యమైన నాగసాధు, అఖాడాలు. హిందూత్వ ధర్మ యుద్ధం చేసిన సంధార్భాలు కూడా చరిత్రలో అనేకం ఉన్నాయి. క్రీశ 1664లో ఔరంగజేబు కాశీ విశ్వనాధ మందిరం పై తన సైన్యముతో దండయాత్ర చేసినప్పుడు నాగసాధువులే వచ్చి అతడి అక్కడి సైన్యాన్నిసమూలంగా సంహరించారు. వారికి భయపడి ఔరంగజేబు కాశీ విశ్వనాధ మందిరం పై దాడిని కొన్ని ఏళ్ల పాటు ఆపేసుకున్నాడు.
ఈ చారిత్రక సత్యము The Illustrated Encyclopedia Of Hinduism అనే పుస్తకంలో పేర్కొనబడి ఉన్నది. తరువాత అక్బర్ కాలంలో కూడా అక్బర్ సైన్యము అమాయకులైన పూజారులను సాధువులనూ చంపడం తెలిసి అప్పటి ఉత్తరామ్నాయ శంకరాచార్య జగద్గురువుల సూచన మేర అద్వైత గురువులైన మధుసూధనానంద సరస్వతీ స్వామి వారు అక్బర్ సభకే వెళ్ళి ఈ హింసను ఆపమని కోరితే అక్బర్ నిరాకరించడంతో, స్వామి వారు నాగసాధువులకు కబురు పంపితే వారొచ్చి ఆ అక్బరు అక్కడి సైన్యాన్ని అంతా అతి క్రూరముగా ఖండఖండాలుగా నరికేశారు.
ఆ భయానికి అక్కడి ప్రాంతీయ ముస్లిములు కొన్ని తరాలపాటు వందలయేళ్లు హిందువుల జోలికి పోలేదనే చారిత్రక సత్యాన్ని Soldier Monks & Militant Sadhus అనే పుస్తకంలో పేర్కొన్నారు. టిప్పు సుల్తాన్ మరియు షా జహాన్ సైన్యము కూడా హిందూ సాధువులు క్షేత్రాల జోలికి వచ్చి హిందూ సైన్యముతో సంహరింపబడ్డారని తెలుసుకోవచ్చు. నేడు 2020లో కూడా మహారాష్ట్రలో ఇద్దరు సాధువులని హిందూ ద్వేషులు హత్య చేస్తే నాగసాధువులు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే పరిష్కరించమని లేకపోతే త్వరలో తామే వచ్చి పరిష్కరించవలసి వస్తుందని తమ మాటగా తెలుపడం దానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు మొదలు పెట్టడమూ చూశాము. ఈ విధంగా శంకరాచార్యుల వారిచే ఏర్పాటు చేయబడిన హిందూత్వ సైన్యము హిందువులకి సైన్యం ఆవశ్యకమయినప్పుడు తప్పక వస్తారు.
శంకరాచార్యుల వారిచే పఠిష్ఠ సైన్యముగా వీరంతా ఉత్తరభారతంలో హిమాలయాలలో పర్వతాలలో ఉండేవారు కనుక వారు ఉత్తర ఆమ్నాయ పీఠ పరిధికి చెందుతారు. ఆది శంకరాచార్య స్వరూపులే తనచే స్థాపించబడిన నాలుగు ఆమ్నాయ పీఠాధిపత్య శంకరాచార్యుల వారని అందరూ గుర్తించాలని శివావతార ఆది శంకరాచార్యులవారే తెలిపారు. నేడు 12 నుంచి 14 అఖాడాలుగా ఉన్నాయి అందులో కొన్ని విష్ణు భక్తులుగా ఉంటారు, అయినప్పటికీ వారు కూడా ఆది శంకరులచే ఏర్పాటు చేసిన అఖాడా సైన్య వ్యవస్థలో ఒకరు కనుక వారితో పాటుగా అన్నీ అఖాడాలూ ఉత్తరామ్నాయ శంకరాచార్యుల వారికి ఆజ్ఞా బద్ధులు.
కుంభమేళా |
కుంభమేళా మొదటి రోజున ఏమవుతుందో చాలామందికి తెలియదు, కుంభమేళా మొదలు అయ్యేది ఆమ్నాయ జగద్గురు శంకరాచార్యుల వారి పూజతో, తరువాత కుంభమేళా స్నానాలు అవుతాయి. అప్పుడు అక్కడ నాగసాధువులు అఖాడాలు జగద్గురు శంకరాచార్యుల వారికి గౌరవ వందనం చేసి "మేము దేశం లోపలికి వచ్చి మా యుద్ధంతో చేయవలసిన పరిస్థితి ఏమైనా వచ్చినదా, అనుజ్ఞ ఇవ్వండి" అని అడుగుతారు.
ఒకవేళ వాళ్లే దేశంలోపలికి వచ్చి యుద్ధం మొదలు పెడితే హిందూత్వ శత్రువులు మిగలరు, అంత పరిస్థితి ఇంకా రాలేదు వచ్చినప్పుడు కబురు పంపిస్తాము అని సమాధానం ఇచ్చి పంపిస్తారు ఉత్తర ఆమ్నాయ జగద్గురు శంకరాచార్యుల వారు. అఖాడాలు అనుజ్ఞని తీసుకుని గౌరవ వందనం చేసి మీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తుంటామని చెప్పి వెళతారు.
వీళ్ళ భయం అప్పటి రాజులకే కాక ఇప్పటి రాజకీయ నాయకులకి కూడా ఎప్పుడూ ఉంటుంది కానీ పైకి బయటపెట్టుకోరు. అందుకే వాళ్ళ జోలికి పోరు. మన హిందువులలో చాలా మంది ఈరోజు మాటలు ఏమిటయ్యా అంటే ఆది శంకరాచార్యుల వారి పరంపర విలువ తెలుసుకోకుండా చేతిలో Facebook Twitterలాంటివి ఉన్నవి కదా అని ప్రతి చిన్నదానికి శంకరాచార్యుల వారి పరంపరనే మనకు ఏమిచ్చారు ఏమి చేశారు అంటూ నోటికి వచ్చిన మాటలు అనేస్తారు. "సెక్కులర్ రాజకీయ నాయకులు" ప్రణాళికాబద్ధంగా హిందూత్వ గురువులైన ఆది శంకరాచార్యుల వారి పరంపర నుంచి హిందువులని విభజించి పాలించే పద్ధతితో దూరం చేస్తూ వస్తున్నారు, హిందువులేమో చాలామంది వాళ్ళ ప్రణాళికకు అనుగుణంగా ఆదిశంకర పరంపరకు దూరం అవుతున్నారు.
సాధు సైన్యం |
మరి హిందూత్వానికి సైన్యమే ఏర్పాటు చేసిన వారు కదా మరి చతురామ్నాయ శంకరాచార్య జగద్గురువులు నేడు మన దేశంలోని సమస్యలు అన్నీ పరిష్కరించలేరా అంటే తప్పక పరిష్కరించగలరు, కానీ దానికి శాసనాధికారం ఉండాలి కదా! అనాది కాలముగా పరిపాలించే వాడు శాసనాధికారి అయితే ఆ రాజుని కూడా శాసించేవాడు గురువు కదా.
ఎప్పుడో ఎందుకు శృంగేరి పరంపరలోనే వచ్చిన విద్యారణ్య స్వామి వారు పూనుకుని హరిహర రాయ బుక్కరాయలలను శాసనం చేసి అప్పటికే ఇస్లాం స్వీకరించిన వారిని తిరిగి హిందూత్వం స్వీకరింపజేసి వాళ్ళచే హిందూ సామ్రాజ్యాన్ని స్థాపింపచేయలేదా! అదే జరిగి ఉండకపోతే అసలు నేడు మన పరిస్తితి ఏంటి? హిందువులు మిగిలి ఉండేవారా! పాలకులపై శాసనాధికారం గురువులకి ఉండాలి కదా అప్పుడే కదా వాళ్ళు ధర్మ రక్షణ చేయగలిగేది! మరి రాజ్యాంగ వ్యవస్థలో ఆ అవకాశం ఉన్నదా? లేదు కదా! హిందువులు అందరూ ఇప్పటికైనా విషయం గ్రహించి హిందూ సైన్యాన్ని ఆదేశించగలిగే శంకర పరంపరకు కట్టుబడి ఉండాలి. అనేక రాజకీయ కోణాలలో దూరం చేయబడిన హిందువులంతా ఏకమయ్యి నాలుగు ఆమ్నాయ జగద్గురువులకి మనమంతా దగ్గరయ్యి జగద్గురువులని ఆశ్రయిస్తే అప్పుడు రాజకీయ నాయకులంతా ఓట్లకైనా లేక దేనికైనా హిందువుల కాళ్ళ బేరానికి వస్తారు.
కోర్టు - ప్రభుత్వాలు:
అసలు చతురామ్నాయ జగద్గురువుల నినాదమే గోహత్య నిషేధం మరియు ఇది హిందూత్వ దేశగా ప్రకటించడం కదా! ఇది చాలామంది హిందువులకే తెలీదు. ఎన్నోసార్లు ప్రతి చిన్నదానికీ ఈ దేశంలో రాజ్యాంగ సవరణ జరిగింది. హిందువులు ఏకతాటిపై నిలిచి శంకర పరంపరకు కట్టుబడి ఉండి పాలకులపై వారి శాసనాధికారం తిరిగి వారికే రాజ్యాంగ సవరణతో ఇప్పిస్తే మనకు ఏది కావాలో వారే ఇప్పిస్తారు. దానికి ఉదాహరణ రామసేతు అయినా రామమందిరం అయినా సుప్రీం కోర్టులో నిలబడి గెలిచిన వాదాలు శంకరాచార్యుల వారి పీఠానికి చెందిన వారిదే అనేది తెలుసుకోవచ్చు, అలాగే గోహత్య నిషేధానికి కూడా పై స్థాయిలో కృషి చేస్తున్నదే కాక భారత దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించమనే ఆదేశం కూడా ప్రభుత్వానికి ఎప్పుడో ఇచ్చారనేది అందరూ గ్రహించాలి.
హిందూత్వ పరిరక్షణ:
హిందూత్వ పరిరక్షణకు మనమేమి చేయాలి మరీ అనేది మనమంతా తెలుసుకోవలసిన అసలు విషయం, ఆది శంకరాచార్యుల వారు 72అవైదిక మతాలను ఖండించడమే కాకుండా షణ్మతాల రూపములో 6 మార్గాల ఆరాధనా విధానము కూడా ఇచ్చి - వేదము సూచించే అద్వైత స్థితి అయిన ముక్తి మార్గము చూపారు. దానిని మనకు తమ అనుగ్రహముతో సులువుగా అలవర్చుకునేందుకు నాలుగుదిక్కులలో నాలుగు ఆమ్నాయ పీఠాలను పెట్టి ముక్తి మార్గాన్ని సూచిస్తే, నేటి రోజున 70 శాతము హిందువులు పురోగతి మార్గములో కాకుండా తిరోగతి మార్గాలు వెతుకుతున్నారు తమకు తెలిసీ తెలియక. ఈ ప్రాపంచికములని దాటి పరమును చేరుకోడానికి నాలుగు ఆమ్నాయాలలో తన పరంపరను ఏర్పాటు చేశారు, ప్రాపంచికములో కూడా రాజ్యాంగము ఏర్పడక ముందు ఉన్న ప్రభువుల పై జగద్గురువులుగా శాసనం చేసేవారుగా జగద్గురువులుగా ఉండడమే కాక వాటితో పాటు సైన్య వ్యవస్థని కూడా ఇచ్చారు కదా ఇంకా ఏమి కావాలి !
ఏమి కావాలి అనుకోవడం కాదు, హిందూధర్మ పరిరక్షణకు గాను అన్నివిధాలలోనూ ఆది శంకరాచార్యుల వారు బీజమెప్పుడో దూరదృష్టితో వేశారు, దానికిగాను తన స్వరూపమే అయిన శంకర పరంపరను కూడా ఏర్పాటు చేశారు నాలుగు ఆమ్నాయ పీఠాలలో, మనము చేయవలసినదల్లా పైన సూచించిన విధముగా మనము వారిని భక్తితో చేరి తద్వారా హిందూ ధర్మానికి జగద్గురు ఆది శంకరాచార్యుల వారి మార్గదర్శకములో కట్టుబడి ఉండాలనేదే నేడు హిందువులందరూ గ్రహించాలి.
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం
నమామి భగవద్పాద శంకరం లోక శంకరం
హిందూ ధర్మ పరిరక్షకులైన జగద్గురు ఆది శంకరాచార్యుల వారికి జై
రచన/సంకలనం: పలికినవాడు మునిపల్లె జ్యోతిస్వరూప్