కాశ్మీరం: ధ్వంసమైన హైందవ వారసత్వ సంపద - Kashmiram

కాశ్మీరం, ధ్వంసమైన హైందవ వారసత్వ సంపద - Kashmiram

19 ఆగష్టు మొదటివారంలో జమ్ముకశ్మీర్ ప్రత్యేక హోదా రద్దును పార్లమెంట్ అంగీకరిస్తూ చట్టం చేసింది. ఆ సమయంలో పత్రికల్లో వ్యాసాలు టెలివిజన్ ఛానళ్లలో చర్చల్లో పాల్గొన్న ఒక వర్గం విచిత్రమైన వాదన చేసింది. అది పాకిస్తాన్ వాదనలాగా ఉండటం కాకతాళీయం అనుకోలేం.

ఆ వాదనలో మూల అంశం ముస్లిం మెజారిటీ ఉన్న ఏకైక రాష్ట్రంపై ఢిల్లీ నుండి 'హిందూ వర్గాలు చేస్తున్న దాడీ' అనేది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జమ్ము కశ్మీర్ ప్రాంత ముస్లిం మెజారిటీ స్థితిని కాపాడుతామని తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఇచ్చిన హామీ మరచి పోకూడదని వారు వాదించారు.
  • అసలు జమ్ము-కశ్మీర్ ప్రాంతం ఏ మతంవారిది? 
  • ఏ సంస్కృతి అక్కడ విలసిల్లింది? 
  • ఏ సమయంలో ముస్లింలు దండయాత్ర చేసి అక్కడ బలవంతపు మతమార్పిడిలు చేశారు? 
ఆ ప్రాంతం ముస్లిం మెజారిటీని ఆ తర్వాత సంతరించుకుందన్న వాస్తవాన్ని కప్పిపెట్టి అది చాలాకాలంగా ముస్లిం మెజారిటీ ప్రాంతంగా చిత్రీకరించడానికి చేసిన ప్రయత్నం అది. పాకిస్తాన్ చేస్తున్న వాదన అదే జమ్ము-కశ్మీర్ ప్రాంతం ముస్లిం మెజారిటీ ప్రాంతం కాబట్టి అది ఇస్లాం పేరుతో ఏర్పడిన పాకిస్తాన్ కి దక్కాలనేది వారి వాదన.

పాక్ తొత్తులుగా భారత దేశంలో భిన్నవర్గాలు చేస్తున్నది తప్పుడు వాదన అనేందుకు సాక్ష్యం శ్రీనగర్ లోయలో ఉన్న పురాతన దేవాలయాలు దేశంలోని పురాతన దేవాలయాలన్ని పురావస్తు శాఖ అధీనంలో ఉంటాయి.

జమ్ము-కశ్మీర్ లోనివి మినహాయింపు కాదు. అయితే రాష్ట్రం కూడా తన పురాతన వారసత్వ సంపద గురించి గర్వంగా ప్రచారం చేసుకుంటాయి. తంజావురు దేవాలయం, కోణార్క్ దేవాలయం గురించి తమిళనాడు, ఒరిస్సా గర్వంగా ప్రచారం చేసుకుని, దేశ విదేశీ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయని మనందరికి తెలిసిందే.

కాని జమ్ము-కశ్మీర్ రాష్ట్రం మాత్రం ఆ ప్రాంతంలోని పురాతన మందిరాల సమాచారం బయటకు చెప్పదు. వారి పర్యాటకశాఖ ప్రచార కరపత్రాలలో వెయ్యేళ్లపై చిలుకు వయసు, చరిత్ర కలిగిన దేవాలయాలున్న విషయం ఒక్కసారి కూడా ప్రస్తావించదు. దురదృష్టం ఏమిటంటే భారత ప్రభుత్వం అధీనంలో ఉన్న 'అర్కియ లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ' వారు కూడా ఈ పురాతన మందిరాల విశిష్టత గురించి ప్రత్యేకంగా ప్రచారం చేయటం లేదు. 2014 తర్వాత కూడా ఈ విషయంలో మార్పు రాకపోవడం కశ్మీర్ లోయ లో ఆశ్చర్యం.


కశ్మీర్ లోయలో 'ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా' వారి ఆధీనంలో చాలా కట్టడాలు ఉన్నాయి. అయితే వాటిలో మొఘల్ గార్డెన్స్, ముస్లిం పాలకుల సమాధులు వంటి వాటి మీద చూపే శ్రద్ధ 'హైందవ దేవాలయాల' మీద లేదు.

పర్యాటకులను ఈ కోటలు, సమాధుల సమాచారం ద్వారా ఆకట్టుకునే యత్నమే తప్పించి, పురాతన మందిరాలను దర్శించమని ఆహ్వానించే కరపత్రాలు లేవు. ఆయా దేవాలయాలకు ప్రచారం లభిస్తే హిందువుల రాక మొదలవుతుందేమోనన్నది అసలు భయం. ఆ దేవాలయాలను, వాటిని ధ్వంసం చేసిన తీరును చూసి హిందువులు స్పందిస్తారన్న భయం, హిందువుల రాకవల్ల కశ్మీర్లో నేటివరకు జరుగుతున్న అవాస్తవ ప్రచారం పటాపంచలవు తుందన్న ఆందోళన. స్థానిక రాజకీయ నాయకులు పాకిస్తానీ అనుకూల ముస్లిం ఉగ్రవాదుల ఆటలు సాగవన్న భయం.

అందుకే మన దేశంలోని కొన్ని వర్గాలు ఎప్పుడు భారత్, పాకిస్తాన్ సంబంధాలు మెరుగవ్వాలని ప్రసంగాలు చేస్తుంటారుగాని, జమ్ము కశ్మీర్ ప్రాంతాలకు భారత్లోని ఇతర ప్రాంతాల వారితో సత్సంబంధాలు ఏర్పడి అందరూ భారతీయులుగా ఏకమవ్వాలని కోరుకోరు. భారతదేశంలో ఉంటూ, ఇక్కడి గాలి పీలుస్తూ, ఆహారం తీసుకుంటూ ఈ దేశానికి ద్రోహం చేస్తున్న ఈ వర్గాల వల్లనే మన దేశానికి తీవ్రంగా నష్టం జరుగుతున్నది. ఆ విషయం భారతీయులంతా తెలుసుకోవాలి.

భారతీయులు కశ్మీర్ లోయను తమదిగా భావించి తరచుగా దర్శించాలి. అందుకోసం వారు వెళ్లాల్సింది గుల్మార్గ్ వంటి విలాస కేంద్రాలకు కాదు శ్రీనగర్లోని దాల్ సరస్సులో విహారంతోనో సరిపెట్టు కోవటం కాదు. ఆ లోయలో తమ పూర్వీకులైన హైందవ పాలకులు నిర్మించిన దేవాలయాలను దర్శించాలి. ఆ దేవాలయాలలో అధిక భాగం ధ్వంసానికి గురయ్యాయి. అయినా మనం ఒక నలందా, తక్షశిల విశ్వవిద్యాలయాలు, కాలభైరవ కాశీ విశ్వేశ్వర, సోమనాథ దేవాలయాల శిథిలాల పునరుద్ధరించుకునేందుకు ఎలా యుద్ధం చేసామో అదే విధంగా కశ్మీర్ లోయలోని దేవాలయాల పునరుద్ధరణ కోసం క్రమేపి ఒత్తిడి తీసుకురావాలి.

ఇది మన లోయ, హైందవం కొలువుదీరిన పవిత్ర ప్రాంతం ఇది అని భారతీయుల గర్వపడాలంటే తప్పనిసరిగా ఆ పురాతన దేవాలయాలను తప్పకుండా సందర్శించాలి.

      ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ( ఏ.ఎస్.ఐ) వారి వెబ్ సైట్ సమాచారం ప్రకారం కశ్మీర్లో 11 పురాతన మందిరాలున్నాయి. వాటి పరిరక్షణ, నిర్వహణ బాధ్యత కేంద్ర విభాగానిది. అయితే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఈ పురాతన కట్టడాల దగ్గర ఆ నిర్మాణాల విశేషం చరిత్ర గురించిన సమాచారం సరిగా ఇవ్వకపోవటం పెద్ద లోపం. ఆ కట్టడం ఎ.ఎస్.ఐ. పరిధిలోకి వస్తుందని, ఆ కట్టడాలను ఎవరూ తాకలేదని, దానికి సమీవ పరిధిలో ఎటువంటి నిర్మాణాలను చేపట్టకూడదని, ఆ నిర్మాణాలను నష్టపరిచేవారిపై చర్యలు తీసుకుంటామన్న నోటీసు బోర్డులు తప్పించి ఆ కట్టడాల పరిరక్షణ గురించిన శ్రద్ధ ఎ.ఎస్.ఐ శ్రీనగర్ సర్కిల్ వారిలో ఎక్కడా కనిపించలేదు.

     నా కశ్మీర్ లోయ పర్యటనలో నేను ఆరు పురాతన దేవాలయాలను దర్శించాను. అందులో కేవలం ఒక దేవాలయం దగ్గరే సిబ్బంది కనిపించారు. అవంతిపురలోని ఆ దేవాలయ ప్రవేశ ద్వారం దగ్గర ప్రవేశ రుసుము తీసుకోవటం తప్పించి, ఆ శిథిల దేవాలయ చరిత్ర గురించి చెప్పగలిగిన విజ్ఞానం ఆ సిబ్బందికి లేదు. ఆ దేవాలయం దగ్గర మాత్రం ఎ.ఎస్.ఐ.వారు నిర్మాణ సమాచారం పెట్టారు. కాని ఆ దేవాలయం ఎందుకు ధ్వంసం అయింది? ఎవరు ధ్వంసం చేశారన్న వాస్తవాలను మాత్రం రాసే సాహసం చెయ్యలేదు.

ధ్వంసం కాబడిన నరనాగ్ దేవాలయం
ధ్వంసం కాబడిన నరనాగ్ దేవాలయం
నరనాగ్ దేవాలయం:
సింధునదికి ఉపనది అయిన వంగల్నది ఎడమ ఒడ్డున ఉన్న 'నరనాగ్ దేవాలయం' ఉంది. ఇది దేశం లోనే అత్యంత పురాతన ఆలయం అని ఎ.ఎస్.ఐ.వారు చెబుతారు. ఇది శివాలయం. 8వ శతాబ్దంలో లలితాదిత్యుడు నిర్మించాడంటారు. దీనికి సమీపంలోని వంగల్లో మరింత పురాతన దేవాలయాలున్నాయి. అవన్ని అశోకుడు క్రీ.పూ. మూడవ శతాబ్దంలో నిర్మించాడు. ఇవన్ని నాచురంగు ముగ్గురాళ్లతో నిర్మించిన దేవాలయాలు. ఈ దేవాలయం నుండే గంగబల్ యాత్ర ప్రారంభమవుతుంది.

200 సంవత్సరాల క్రితం వరకు అత్యంత ఘనంగా కశ్మీరీ పండితులు జరుపుకున్నారు. ఈ పర్వతాల పైన గంగబల్ సరస్సు ఉంది. ఇది మానస సరోవర్ వంటి సరస్సు. ఎంతో స్వచ్ఛమైన నీటిని కలిగినది. యాత్రీకులు అక్కడికి చేరి చుట్టూ ఉన్న మంచు పర్వతాల మధ్య ఏర్పడిన ఆ సరస్సు అందాల మధ్యలో పరమశివుని పూజిస్తూ హోమం చేయటం సంప్రదాయంగా ఉండేది. ఈ దేవాలయాలన్నిటిని ధ్వంసం చేశారు. ప్రస్తుతం అక్కడి పవిత్ర కొలనులు స్థానిక ముస్లింలు బట్టలు ఉతకటానికి వాడుతున్నారు. ఈ దేవాలయ సముదాయంలో గుర్రాలు మేపుతున్నారు. గుర్రాలు మేకలు వేసిన గొద్దెలతో ప్రాంగణం నిండి ఉంది. ఆ దేవాలయ సముదాయం చుట్టూ సరైన రక్షణ ప్రహరీ కూడా లేదు. దాని విశిష్టత తెలియని వారి మధ్య బిక్కు బిక్కుమంటు పూజలకు నోచుకోక పోవటంతో శివలింగం స్థానభ్రంశం చెందింది.

శంకరాచార్య మందిరం
శంకరాచార్య మందిరం
శంకరాచార్య మందిరం:
శ్రీనగర్లోని దాల్ సరస్సు ఒడ్డున ఉన్న కొండపై శంకరాచార్య మందిరం ఉంది. పలు దశాబ్దాల చీకటి రాజ్యం తర్వాత మొన్నటి శివరాత్రికి దీపకాంతులతో అలంకరణకు నోచుకున్నది. ఈ దేవాలయం కూడా క్రీ.పూ. 200 సంవత్సరాల క్రితానిది. ఇది బౌద్ధ నిర్మాణం అయి ఉంటుందనే నమ్మకం కొందరిది. అయితే క్రీ.పూ. 3వ శతాబ్దంలో గోపాదిత్యుడనే రాజు నిర్మించాడన్నది చరిత్ర. కల్హణుడి రాజతరంగిణిలో ఆ దేవాలయ నిర్వహణకు బ్రాహ్మణులకు అగ్రహారాలిచ్చినట్టు నమోదు చేశాడు. ఇది జ్యేష్టేశ్వర మందిరంగా నిర్మించారు. ఈ దేవాలయం నిర్మించిన కొండను గోపాద్రి అంటారు. ఈ గోపాద్రి మీద ఉండే ఆదిశంకరులు సౌందర్యలహరి రచించారు.

    దేవాలయంలో శివలింగం సర్పం చుట్టుకుని ఉంటుంది. శ్రీనగర్లో ఉన్నందునో లేక స్థానికు లందరికి ఈ దేవాలయం మీద విశ్వాసమున్నందునో తెలియదు కాని శంకరాచార్య మందిరం మాత్రం ఎటువంటి ధ్వంసానికి గురికాలేదు. ఒక తరం తర్వాత మరొక తరం అదనపు నిర్మాణాలు చేపట్టారు.  1974లో కొండమీదికి వాహనాలు వెళ్లేందుకు అనువైన రహదారి నిర్మాణం జరిగింది.

ధ్వంసం కాబడిన మార్తాండ మందిరం
ధ్వంసం కాబడిన మార్తాండ మందిరం 
మార్తాండ మందిరం:
సూర్యభగవానుడికి తూర్పు తీరంలో పలు దేవాలయాలున్నాయి. కోణార్క్, అరసవిల్లి వంటివి అందరికి పరిచయమే. తూర్పున సూర్యోదయ తొలి కిరణాలు ఆయా మందిరంలోని సూర్య విగ్రహాన్ని తాకేలా దేవాలయ నిర్మాణాలు సాగాయి.

పశ్చిమ దిశన అటువంటి దేవాలయాలు తక్కువ. అటువంటి చోటు పశ్చిమానికి సూర్యుడు అస్తమించేవేళ ఆ దేవుని కిరణాలు తాకేలాగా నిర్మించిన పురాతన మందిరం మార్తాండ మందిరం. ఇది 8వ శతాబ్దిలో లలితాదిత్యుడు నిర్మించిన దేవాలయం. అనంతనాగ్
పట్టణానికి 98 మీ. దూరం సముద్ర మట్టం నుండి 1720 మీటర్ల ఎత్తులోని పీఠభూమి మీద నిర్మించిన ఈ దేవాలయం నుండి చూస్తే కశ్మీర్ లోయ అనంతంగా కనిపిస్తుంది.

అయితే క్రీ.శ. 370-500 మధ్యకాలంలోనే ఈ దేవాలయానికి పునాది పడిందని, ఆ తర్వాత లలితాదిత్యుడు దానిని పూర్తిచేసి ఉంటాదనే అభిప్రాయం ఉంది. ఏమైనా అదొక సుందర
నిర్మాణం. 15వ శతాబ్దం వరకు ఒక వెలుగు వెలిగిన దేవాలయం. ఆ సమయంలో సుల్తాన్ సికిందర్ ఆ దేవలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు. ఆ దేవాలయాలు ధ్వంసం చేయటానికి ఒక రాజుకు సంవత్సరకాలం పట్టిందంటే అది ఎంత విశిష్ట శిల్పసంపదతో నిండి ఉంటుందో ఊహించుకోవచ్చు.

   నీలిరంగు ఖారీ సున్నపురాళ్లను, భారీ దిమ్మలుగా చేసి, సున్నం, ఇనుప సామాగ్రి ద్వారా అనుసంధానం చేస్తూ నిర్మించటం ఆనాటి నైపుణ్యాన్ని తెలియ చేస్తుంది. 84 వరుస స్థంభాలతో కూడిన విశాల ప్రాంగణం, మధ్యలో దేవాలయం నిర్మించారు. ఎటునుండి చూసినా, ఎంత దూరం నుండి చూసినా ఈ దేవాలయం కనిపించేలా నిర్మించారు. ధ్వంసం అయిన తర్వాత కూడా ఇంకా కొన్ని శిల్పాలు అలా నిలిచి ఉన్నాయి. సూర్యుడు, విష్ణు, గంగ, యమున వంటి నదీ దేవతల శిల్పాలు ఉన్నాయి.

1870లో బిటిష్ పాలకులు తిరిగి గుర్తించే వరకు ఆలయం ఎవరికి తెలియదు. ఇటీవలి కాలంలో నిర్మించిన హైదర్ సినిమాల్లో ఈ దేవాలయాల్ని ఒక దుష్ట ప్రదేశంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. ప్రాంత విశిష్టత, దేవాలయ సంప్రదాయ, గొప్పతనాలు తెలియని దుష్టుల యత్నం అది.

   మార్తాండ దేవాలయం దగ్గర రక్షణ కరువైంది మేము దర్శించిన నవంబర్ 2019 సమయంలో దేవాలయం లోపల ముస్లిం యువత సిగరెట్లు తాగుతూ, మాదకద్రవ్యాలు సేవిస్తూ కనిపించారు. దేవాలయ సంపద మీద ఏమాత్రం గౌరవం లేని జాతి సంతానం వారు. రాళ్లతో ఆ శిల్పాలను కొట్టే యత్నం చేస్తున్నారు. వారి కళ్లలో కనిపించిన నిర్లక్ష్యం బట్టి ఆ దేవాలయాన్ని మరింతగా రక్షించుకోవాల్సిన అవసరం ఉందని అనిపించింది.

బ్రిటిష్ ప్రభుత్వం శిథిలాలను ఆధారం చేసుకుని ఆ దేవాలయ పూర్వ నిర్మాణం ఎలా ఉండి ఉంటుందో ఉహాచిత్రాలు గీసారు. 19వ శతాబ్దంలో కనీసం వాటిని అయినా అక్కడ ప్రదర్శించే యత్నం ఎ.ఎస్.ఐ. చెయ్యలేదు.

ధ్వంసం కాబడిన అవంతిపుర మందిరాలు
ధ్వంసం కాబడిన అవంతిపుర మందిరాలు
అవంతిపుర మందిరాలు:
శిథిలాలుగా మారిన 9వ శతాబ్దపు దేవాలయాలు అవంతిపురంలో జాతీయ రహదారి పక్కనే కనిపిస్తాయి. అవంత వర్మన్ జీలమ్ నది ఒడ్డున వీటిని నిర్మించాడు. స్థానిక సమాచారం ప్రకారం
నేటి ఒరిస్సా ప్రాంతం నుండి వచ్చి కశ్మీర్ పాలించినవాడు అవంతివర్మ. ఆయన నిర్మించిన శైవ, విష్ణు దేవాలయాలు రెండింటి మధ్య దూరం అరకిలోమీటరును మించిలేదు.

అవంతిపురం ఒకనాడు కశ్మీరీ రాజుల రాజధాని. జీలమ్ నదిగా పిలుస్తున్న ఆ నది నాటిపేరు వితత్సనది. ఇప్పుడు శిథిలమైన ఆ ఆలయంలో ప్రతిమ వైకుంఠ విష్ణువురూపంలో ఉండేది. రెండు దేవాలయాల ప్రవేశ ద్వారాలు దాదాపుగా ఒకేలా ఉన్నాయి. చక్కని శిల్ప కళతో ఆకట్టుకుంటాయి. అయితే అవి ఊహించుకవాల్సింది. వీటిని కూడా సికిందర్ షా అనే సుల్తాన్
ధ్వంసం చేశాడు. కాని ఆ విషయం కప్పి పెట్టి అక్కడ సంతరించిన భూకంపల వల్ల ఆ దేవాలయాలు ధ్వంసమయ్యయన్నా ప్రచారం సాగిస్తుండేది ఆ రాష్ట్ర ప్రభుత్వం.

జాతీయ రహదారి పక్కనే ఉన్నందున ఆ దేవాలయాల నిర్వాహణ కొంచెం మెరుగ్గా ఉంది. అయితే ఇక్కడి పండిట్ల కుటుంబాలను తరిమి వేసిన తర్వాత ఆ దేవాలయాలను దర్శించేవారు కరువయ్యారు. దేవాలయాల పరిరక్షణ, పునరుద్ధరణ కోసం ఏర్పడిన కశ్మీరీ పండిట్ల సంఘం, కూడా ఎ.ఎన్.ఐ. అధీనంలో ఉన్న దేవాలయాలను
తాకేంద్రుకు వీలులేదు. కొందరు పండిట్ వంశాల నాయకులు ప్రత్యేక అనుమతితో ఈ దేవాలయ ప్రాంగణాలలో హోమం నిర్వహించి తమ సంస్కృతిని సంతతిని రక్షించమని ఆ దేవుని ప్రార్ధిస్తున్నారు.
దత్త మందిరం
దత్త మందిరం
దత్త మందిరం:
దత్త మందిరం బరాముల్లా జిల్లాలో యురికి సమీపంలో రహదారి పక్కనే ఉన్న మందిరం దత్త మందిరం. దీని నిర్మాణం జరిగి వెయ్యికిపైగా సంవత్సరాలు అయిందని ఎ.ఎస్.ఐ. చెపుతున్నప్పటికి వాస్తవంలో ఆ దేవాలయాన్ని పాండవులు నిర్మించిన దేవాలయంగా స్థానికులు చెపుతారు.

ఇది విష్ణు దేవాలయంగా చెపుతున్నప్పటికి వారు దానిని శైవ దేవాలయంగానే కొలుస్తున్నారు. ఈ దేవాలయం చుట్టూ ఇనుప కంచె ఉంది. దత్త దేవాలయంపై ఆ రహదారి వెంట వెళ్లేవారికి విశేషమైన విశ్వాసముంది. బారాముల్లా, యురి మధ్య వెళ్లే ఏ ట్రక్కు అయినా సరే ఒకసారి అక్కడ ఆపి డ్రైవర్ ఆ దత్తదేవునికి నమస్కారం చేసి వెళతారు. తమ ప్రయాణంలో క్షేమంగా చూసే దేవుడన్నది వారి నమ్మకం.

జీలమ్ నది ఒడ్డున ఉంది ఈ దేవాలయం. దేవాలయం పీఠభూమి మీద ఉండగా, దాని వెనక ఎత్తైన కొండ దాని మీద పచ్చని వృక్ష సంపద ఉంది. ఆ దేవాలయాన్ని అనుకునే సి.ఆర్.పి.ఎఫ్. దళాల శిబిరం ఉంది. వారి రక్షణలోనే ఆ మందిరం నేడు ఉంది. ఆ దేవాలయానికి ప్రతిరోజు పూజ చేసేందుకు పాండవ మధ్యముడైన భీముడు ఒక పెద్దరాతి కుండలో నీటిని తెచ్చేవాడట. ఆ కుండ నేడు దేవాలయ ప్రాంగణంలో భూమిలోకి వంగి ఉంది. బయటకు కనిపించే ఆ రాతి కుండమూతి, దాని వైశాల్యం బట్టి అది ఎంత లోతున, ఎంత పెద్దదో ఊహించుకోవచ్చు. ఆ రాతి కుండలో నీరు ఎన్నడూ ఇంకదు.
  • దేవాలయం ప్రాంగణంలో కనిపించే శివలింగాల రూపాలకు నిత్యాభిషేకం చేస్తున్నారు సి.ఆర్.పి.ఎఫ్. జవాన్లు.
ఈ దత్త దేవాలయం 1947లో దేశ విభజన సమయంలో ముస్లింలు చేసిన దాడుల్లో ధ్వంసం చేశారు.  నిజానికి కశ్మీర్ లోయలోని పురాతన మందిరాలలో నేను చూసినది పిసరంత చూడాల్సినది కొండంత. ఒక్కసారితో అయ్యేదికాదు. కశ్మీర్ అంటే వారు చూపించే పర్యాటక ప్రాంతాలు మాత్రమే కాదు. అద్భుతమైన హైందవ వారసత్వ సంపద ఉంది అక్కడ. ప్రతి ఒక్కరు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఆ శైవ క్షేత్రాల దర్శనకు వెళ్లి రావాలి.
అప్పుడే భారత్ దర్శన్ సంపూర్ణమవుతుంది.

రచన: దుగ్గిరాజు శ్రీనివాస రావు
మూలము/సంకలనం: జాగృతి
"తెలుగు-భారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. మన సంస్కృతీ, సంప్రదాయాలను మరింత లోతుగా విశ్లేషించి ప్రపంచానికి తెలియచేస్తూ మన ధర్మాన్ని కాపాడేందుకు మీ వంతు సహాయం చేయండి.
Supporting From Bharat:#buttons=(Accept !) #days=(20)

Our website uses cookiesLearn..
Accept !
To Top