రథం దగ్ధం వ్యవహారంలో కుట్ర ఉంది – హిందూ సంఘాల ఆగ్రహం – మంత్రుల ఘోరావ్


తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీనరసింహ స్వామి దివ్య రథం దగ్ధమైన ఘటనపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా అంతర్వేది పర్యటనకు వెళ్లిన రాష్ట్ర మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్‌, పినిపె విశ్వరూప్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హిందూ సంఘాల ఆగ్రహాన్ని చవిచూశారు.

రథం దగ్ధమైన ప్రదేశాన్ని పరిశీలించి తిరిగి వస్తుండగా.. వివిధ జిల్లాల నుంచి వచ్చిన విశ్వహిందూపరిషత్‌ (వీహెచ్‌పీ), భజరంగదళ్‌ నేతలు, కార్యకర్తలు మంత్రులను నిలదీశారు. ఈ ఘటనలో కుట్రకోణం ఉందని.. సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు అతికష్టంమీద మంత్రులను ఆలయంలోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో పోలీసులు, వీహెచ్‌పీ, భజరంగదళ్‌ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. నిరసకారులు బారికేడ్లను దాటి రావడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.


ఈ నిరసన కార్యక్రమానికి శివ స్వామి తన శిష్యులతో తరలివచ్చారు.  అలాగే ఉజ్జయిని కి చెందిన  అఘోరా  అఖాడా  స్వామీజీ,  వారి శిష్యులు తరలివచ్చారు.  రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల నుంచి తరలివచ్చిన విశ్వహిందూ పరిషత్,  బజరంగ్ దళ్ వంటి  వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు రథం దగ్ధం కావడంపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఒక దశలో ఎమ్మెల్యే కారుపై దాడి చేయబోయారు కూడా.  సహచర కార్యకర్తలు, నాయకులు  సంభాళించడంతో  ఆగారు.


నిందితులను కఠినంగా శిక్షిస్తాం: దేవాదాయ మంత్రి
అంతకుముందు మంత్రులు ఆలయ ఆవరణలో రథం దగ్ధమైన ప్రదేశాన్ని పరిశీలించి జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. వచ్చే కల్యాణోత్సవాలకు ప్రభుత్వం తరఫున నూతన రథాన్ని నిర్మిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. రథం దగ్ధమైన నేపథ్యంలో ఆలయ ఇన్‌ఛార్జ్‌ సహాయ కమిషనర్ చక్రధర్ రావును విధులను నుంచి తొలగించామని.. మరో ఇద్దరు ఆలయ ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి తెలిపారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా దేవాలయాల వద్ద కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

Source: Vishwa Samvada Kendra (Andra Pradesh)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top