దుర్గమ్మ రథం పైనున్న మూడు సింహాలు మాయం

0

విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం వెండి రథానికి అమర్చిన నాలుగు సింహాల ప్రతిమల్లో మూడు అదృశ్యం కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. అంతర్వేది ఘటన తర్వాత ఆలయాల్లో రథాల భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో తాజాగా దుర్గమ్మ వెండి రథం సింహం ప్రతిమలు మాయమైన ఘటన వెలుగు చూసింది. ఆలయ సిబ్బంది మాత్రం అధికారికంగా దీనిని ధ్రువీకరించడం లేదు.

ఈవో ఏమంటున్నారంటే?
అంతర్వేది ఘటన తర్వాత రథాల పరిశీలన, భద్రత అంశాలపై వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌
ప్రాంగణంలో దేవాదాయశాఖ అధికారులతో 13న పశ్చిమ ఏసీపీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో వెండి రథాన్ని దేవస్థానం అధికారులు పరిశీలించారు. అప్పుడే సింహాల ప్రతిమలు కనపడలేదన్న విషయాన్ని గుర్తించారని సమాచారం. గత ఏడాది ఉగాది రోజున స్వామి వార్ల ఉత్సవమూర్తులను ఈ వెండి రథంపై ఊరేగించారు. ఈ ఏడాది కొవిడ్‌ దృష్ట్యా దేవస్థానం ఊరేగింపును రద్దు చేసింది. అప్పటి నుంచి ఆ రథానికి ముసుగు వేసి ఉంచారు. ఇటీవలి కాలం వరకూ తీయలేదు. దీనిపై దుర్గగుడి ఈవో సురేష్‌బాబు మీడియాతో మాట్లాడుతూ… ‘గత 18 నెలలుగా వెండి రథం మల్లికార్జున మహామండపంలో ఉంది. దానికి ఎన్ని సింహాలు ఉన్నాయో? వాటిని మరమ్మతులకు ఇచ్చారా? లాకరులో ఉన్నాయా? అన్నది పరిశీలన తర్వాతే స్పష్టమవుతుంది. దేవస్థానంలో ఉన్న వెండి, బంగారు వస్తువులు, వాహనాలకు బీమా సౌకర్యం ఉంది. పూర్తి స్థాయి పరిశీలన చేసిన తర్వాతే ఫిర్యాదు చేయాలా? వద్దా? అన్న విషయాన్ని నిర్ణయిస్తాం’ అని స్పష్టం చేశారు.

ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి : సోము వీర్రాజు
ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు పలువురు భాజపా నేతలు దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు. దుర్గగుడి ఈవో సురేశ్‌బాబుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. ”వెండి రథం విలువ సుమారు రూ.15లక్షల వరకు ఉంటుందని ఈవో సురేశ్‌బాబు చెప్పారు. దీన్ని బట్టి సింహం ప్రతిమల విలువ ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రథానికి ఉండాల్సిన నాలుగు సింహాల్లో ఒక సింహం ప్రతిమ మాత్రమే ఉండటాన్ని గమనించాం. ఉన్న ఒక సింహం ప్రతిమ కాళ్ల వద్ద కూడా పగుళ్లు ఉన్నాయి. నాలుగు సింహాల ప్రతిమలు ఉంటే రథానికే ఉండాలి, లేకపోతే నాలుగూ లాకరులో ఉండాలి. కానీ ఒక్కటి మాత్రమే రథానికి ఉన్నది. ఆలయ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగింది. అత్యంత ప్రాధాన్యత ఉన్న రథానికి భద్రత ఎందుకు ఏర్పాటు చేయలేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ జరిపించి పూర్తి వివరాలు వెల్లడించాలి” అని సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు.

__విశ్వ సంవాద కేంద్రము

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top