Page Nav

HIDE
FALSE
HIDE_BLOG

Classic Header

{fbt_classic_header}

తాజా విశేషాలు:

latest

పాపం – ప్రాయశ్చిత్తం – పశ్చాతాపం!

పాపం - శిక్షలు పాపం – ప్రాయశ్చిత్తం – పశ్చాతాపం  పూ ర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితాం... పూర్వ జన్మలో మనం చేసిన పాపం రోగం రూపములో అనుభ...

పాపం – ప్రాయశ్చిత్తం – పశ్చాతాపం: Papam, Prayuschittam, Pashchattapam
పాపం - శిక్షలు
పాపం – ప్రాయశ్చిత్తం – పశ్చాతాపం
 పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితాం... పూర్వ జన్మలో మనం చేసిన పాపం రోగం రూపములో అనుభవములోనికి వస్తుంది అని శాస్త్ర వచనము. పూర్వ జన్మలో మనము చేసిన పాప పుణ్యములను బట్టి మన జన్మ వుంటుంది. మన జాతక చక్రం తదనుగుణంగా తయారు అవుతుంది. మన కర్మే గ్రహాల రూపములో వచ్చి మనల్ని బాధ పెట్టడమో లేదా సుఖ పెట్టడమో జరుగుతుంది. అనవసరంగా గ్రహాలను తిట్టుకొంటాము మనము. ఆ గ్రహాలు కూడా ఎదో మనిషి రూపములోనో లేదా రోగాల రూపం లోనో వచ్చి మనల్ని బాధ పెడుతుంటాయి.

మరి పాపం అంటే ఏమిటి? చెడు కర్మ, చెడు పని పాపం అన్నారు. మరి చెడు పని అంటే? శాస్త్ర వచనమునకు తద్భిన్న మైనది, విరుద్ధ మైనది. అంటే ఒక జీవి పట్ల అనుచితముగా ప్రవర్తించడం. ఉదాహరణకు:- ఒకర్ని తిట్టినాము, కొట్టినాము, అనరాని మాటలు అన్నాము, ఒక ప్రాణిని హింసించినాము. ఎదుటి వారిని బాధ పెట్టినాము, అన్యాయంగా ప్రవర్తించినాము, ఇతరులను మోసం చేయుట, దొంగతనము, ఇలా ఎన్నో చెప్పుకోవచ్చును.
శ్లో||  నా భుక్తం క్షీయతే కర్మ, కల్ప కోటి శతైరపి, అవశ్యమను భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్ ||
అనగా అనుభవించనిచో కర్మ ఫలము కోటి బ్రహ్మ కల్పములు గడిచిననూ నశింపదు. అది శుభమైననూ, అశుభమైననూ దాని ఫలమును మనము తప్పక అనుభవింపవలసినదే అని అర్ధము. 
  అందుకని పరమాత్ముడి కైననూ తిప్పలు తప్పవు అని అనడంలో అర్ధం ఏమిటంటే ఎంతటి వాడికైనా జన్మ తీసుకొంటే కర్మ అనుభవించ వలసినదే అని అర్ధము. ఇక్కడ పరమాత్మ అంటే పరమాత్మ అని అర్ధము కాదు. కోటీశ్వరుడి కైనా క్షుద్భాధ తప్పదు అని అంటే. కోటీశ్వరుడు అని అర్ధము ఎంతటి వాడి కైనా ఆకలి బాధ తప్పదు అని అర్ధములో కోటీశ్వరుడు అని వాడుతాము. నా భార్య బంగారం అంటే MY WIFE IS GOLD  అని కాదు అర్ధము నా భార్య చాలా మంచిది అని అర్ధము. ఒక పదాన్ని ఏ సందర్భంలో వాడినామో తెలుసుకోకుండా, పరమాత్మకు జన్మ లేదు, ఆయనకు తిప్పలు లేవు, పరమార్ధం తెలుసుకోవాలి అని దురుసుగా పెద్దా చిన్నా లేకుండా మాటలాడ కూడదు. అదే పాపం అనేది.

  పెద్దలను, ఇతరులను నోటికి ఇష్టం వచ్చినట్లు అహంకారంతో మాటలు అంటే వాళ్ళు ఎంత నోచ్చుకొంటారో అనేది తెలియక పోతే, కనీసం ఆ తరువాత అయినా పశ్చాతాపం తో క్షమాపణలు చెప్పక పోతే ఎవరికి నష్టం. నోటి దురుసు తనమునకు జన్మ జన్మలు బాధ పడవలసి వస్తుంది. అసలు పరమాత్మ తత్త్వం ఎందులో కనిపించదు. సమస్త జీవ రాశిలో వున్నది ఆ పరతత్వం, పరమాత్మ తత్త్వం చూచే కన్నులు వుంటే. ఎందుకు అర్ధం చేసుకోలేక పోతున్నారో నాకు అర్ధం కాదు. విడిగా ఎక్కడన్నా కూర్చోని ఉంటాడా ఆ పరమాత్ముడు? ఆయనకు పేరు, రూపం, స్థితి, గుణం ఏవీ లేవు. అంతటా నిండి నిభిడీకృతమై వున్నాడు. ఎవర్ని అవును అంటావు? ఎవర్ని కాదు అంటావు? ప్రతి కణంలో వున్నాడు పరమాత్మ. ఆయన లేని చోటు లేదు. నీలో, నాలో అందరిలో వున్నాడు. మనం అజ్ఞానం లో వుండి చూడ లేకున్నాము, గుర్తించ లేకున్నాము. ఆ విశ్వకర్త అన్ని రూపాలలో వున్నాడు. ఆఖరాకి ప్రతి గాలి, ధూళి కణంలో కూడా వున్నాడు. ఆయన్ను గుర్తించ లేని అంధులము మనము. గిరి గీసుకొని బ్రతుకు తున్నాము.

  తెలిసి చేసినా, తెలియక చేసినా పాపం పాపమే. ఒకరి పట్ల మనము ఏదన్నా తప్పు చేసిన యెడల వెంటనే వారిని మనము క్షమాపణలు అడగాలి, లేదంటే అది జన్మ జన్మలు మనల్ని వెంట తరుముతూనే వుంటుంది. నిన్నే కాదు, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను కూడా వదలి పెట్టదు. మనము చేసిన తప్పులు వలన మన పిల్లలు అనుభవించాలి. తాతలు, ముత్తాతలు చేసిన తప్పులు ఆ వంశంలో ప్రతి ఒక్కరినీ వెంటాడుతూ వుంటాయి. కొందరి జాతకములు పరిశీలించి నప్పడు ఇలాంటివి బయట పడుతూ వుంటాయి. ముఖ్యముగా సర్ప దోషములు, రాహు కేతు దోషములు. కొడుక్కు వుంటుంది, కూతురుకి వుంటుంది, భార్యకు, భర్తకు, తల్లికి, తండ్రికి, తాతకు అందరికీ అందరికీ ఒకే విధముగా వుంటుంది. ఎందువలన? ఎవరో, ఎప్పుడో ఎక్కడో చేసిన చిన్న తప్పు, తరతరాలు వెంటాడుతూ వస్తుంది. ఇలాంటివే కాల సర్ప దోషములు కూడా. అల్లాడి పోతూ వుంటారు. ఎందుకని పాపం. అహంకారముతో చేసిన ఒక పని పాపం గా మారినది.

చేసిన చిన్న తప్పు మహా పాపం గా మారకుండా ఉండాలంటే ఏమి చేయాలి? నీ కుటుంబాన్ని వేధించకుండా ఉండాలంటే ఏమి చేయాలి?
ప్రాయశ్చిత్తై రపైత్యేనః....... ప్రాయశ్చిత్తముతో పాపములు తొలగి పోవును.
→ పశ్చాతాపంతో కూడిన ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం చేసుకొంటే తప్పక పాపం పోవును అని శాస్త్రం చెప్పినది. పరాశర స్మృతి చెప్పినది.
శ్లో|| ప్రాయో నామ తపః ప్రోక్తం చిత్తం నిశ్చయ ఉచ్యతే, తపోనిశ్చయ సంయుక్తం ప్రాయశ్చిత్తం తదుచ్యతే.||
  ప్రాయాస్ అనగా తపస్సు. చిత్తము అనగా నిశ్చయము. నిశ్చయముతో కూడిన తపస్సు చేయడమే ప్రాయశ్చిత్తం అని అన్నారు. అంటే నీకై నీవు దండన విధించుకోవడం. లేదా మీ గురువుల దగ్గరకు వెళ్లి, పెద్దల దగ్గరకు వెళ్లి “ అయ్యా, నేను ఫలానా తప్పు చేసినాను, నా తప్పు పోవాలంటే ఏమి చేయాలో శెలవు ఇవ్వండి” అని విధేయతతో అడగాలి. గురువులు చెప్పిన విధముగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.
  ఆలస్యముగా లేచినావు, ఆలస్యముగా అర్ఘ్యం ఇచ్చావు. ప్రాయశ్చిత్తం చేసుకో. మూడు సార్లు ఇచ్చేది నాలుగు సార్లు చెయ్యి. అనుష్టానం లో లోపం జరిగినది, ఇంకో 108 గాయత్రి అధనముగా చెయ్యి.  అన్నదానం చేయాలి, ఆర్ధిక స్థోమత లేని వాడివి, ఇంకో పదివేలు మూల మంత్రం జపం చెయ్యి. ప్రతి దానికి, ప్రతి మంత్రానికి, ప్రతి కార్యానికి, ప్రతి తప్పుకు శాస్త్రములో ప్రాయశ్చిత్తం చెప్పబడి వున్నది. అది తెలుసుకో నీ గురువులను అడిగి. మీ ఇంటి పురోహితుడ్ని అడుగు చెబుతాడు. వెంటనే చెయ్యి.
  • ఎవరి పట్ల అయినా తప్పుగా ప్రవర్తించినావు, వెంటనే “అయ్యా, పొరబాటు అయినది, నన్ను క్షమించండి అని అడుగు.
  • క్షమించమని అడగ కుండా నేను ప్రాయశ్చిత్తం చేసుకొంటాను అంటే కుదరదు. పాపం పోదు. ఎవరి పట్ల మనము అగౌరవముగా ప్రవర్తించినామో, వారిని క్షమాపణలు అడిగి తీరాలి. అప్పుడే మనము చేసిన పాపం పోతుంది.
  • ఒక వేళ క్షమాపణలు అడగ లేని పరిస్థితి, ఆ వ్యక్తి కనిపించలేదు, లేదా ఏదన్నా ప్రాణిని తెలిసో, తెలియకో హింస పెట్టినావు, లేదా చూసుకోకుండా చంపినావు, అప్పుడు మాత్రమే మీ గురువులను అడిగి ప్రాయశ్చిత్తం తెలుసుకొని చేయాలి.
  • పశ్చాతాపంతో కూడిన ప్రాయశ్చిత్తం గాని, లేక క్షమాపణలు గాని ఎటువంటి పాపము నైననూ కడిగి వేస్తుంది. సులభమైనది మనస్పూర్తిగా క్షమాపణలు అడగడం.
  • గురువులు, పెద్దలు లేనప్పుడు, వీలు కానప్పుడు నీకై నీవు ప్రాయశ్చిత్తం విధించుకోవచ్చును. నీ సుఖాన్ని నీవు త్యాగం చేసుకోవడమే ప్రాయశ్చిత్తం. ఒక రోజు భోజనం మానేయడం, పది రోజులు ఉపవాసం వుండడం, లేదా మౌన వ్రతాన్ని పాటించడం, నేలపై పరుండడం, ఇలా....
  • దోషములు పోగొట్టుకొనుటకు ప్రాయశ్చిత్తములున్నవి, అంతే గాని దోషములు చేయుటకు కాదు.
  • ప్రాయశ్చిత్తం చెప్పబడినది కదా అని పాపములు చేయకూడదు. దానికి నిష్కృతి లేదు. అలాగే పశ్చాతాపం లేకుండా ప్రాయశ్చిత్తం చేసుకున్నా అది కూడా వ్యర్ధమే. పాపము పోదు.
శ్లో|| ప్రాయశ్చిత్త మకుర్వాణాః పాపేషు నిరతా నరాః, అపశ్చాత్తాపినః కష్టాన్నరకాన్ యాంతి దారుణాన్ ||
  పశ్చాతాపంను మించిన ప్రాయశ్చిత్తం లేదు అని పెద్దలు చెప్పుదురు. ఇది వీలుకాని పరిస్థితులలో మాత్రమే చేయ వలెను.   చేసిన తప్పుకు క్షమాపణలు అడగడమే ఉత్తమోత్తం. దానిని మించినది లేదు.
  ప్రాయశ్చిత్తము వలన దోష నిర్మూలన తప్పక జరుగును, అయితే బుద్ధి పూర్వకముగా చేసిన యెడల పాపము పోదు అని చెప్ప బడినది. శ్లో|| కామాకామకృతం తేషాం మహాపాపం ద్విధాస్మృతమ్ ||

  బుద్ధి పూర్వకముగా చేసినది, కోరక చేసినది అని పాపములు రెండు విధములు. తెలియక చేసిన పాపములు, తెలిసి కావాలని చేసిన పాపములు. తెలియక జేసిన పాపములు ప్రాయశ్చిత్తము వలన నిర్మూలనము అగును. కానీ పొగరుతో, తెలిసి తెలిసి కావాలని చేసిన పాపములు  ప్రాయశ్చిత్తముతో పోవు  అని తెలియవలెను.
   ఒకరు చేసిన పాపములు (పూర్వజన్మ) వారి జాతక రీత్యా తెలుసుకొనవచ్చును. ఒకరి పాపములను ఇంకొకరు తీసుకొని అనుభవించ వచ్చును. తమ పుణ్యమును ఇతరులకు ధార పోయ వచ్చును. మంత్ర శాస్త్రములో ఇది వీలు అగును. మహా గురువులు తమ శిష్యుల యొక్క భక్తుల యొక్క పాపములు తాము తీసుకొని అనుభ వించిన సందర్భములు ఎన్నో కలవు. మరొక మారు ఈ విషయము పై తెలుసు కొనెదము.

రచన: భాస్కరానంద నాధ {full_page}