విశ్వహిందూ పరిషత్ దిగ్గజం డాక్టర్ బి. మాణిక్యాచారి ఇకలేరు - Vishwa Hindu Parishad giant Dr. B. Manikyachari is no more

0
ప్రముఖ విశ్వహిందూ పరిషత్ కార్యకర్త, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలకు అధ్యక్షులుగా వ్యవహరించిన డా. బొడ్డుపల్లి మాణిక్యచారి గారు నిన్న (06.03.2021) స్వర్గస్తులయ్యారు. వీరు నిరాశ్రయ బాలుర వసతి గృహం కారుణ్యసింధు వ్యవస్థాపకులు కూడా.

E.N.T. స్పెషలిస్ట్ గా వైద్యవృత్తిని చేపట్టిన బొడ్డుపల్లి మాణిక్యచారి గారు విదేశాలలో ఉండి వైద్య‌ సేవలందించారు. మాతృదేశంపై, మాతృ సంస్కృతిపై అవ్యాజమైన ప్రేమ కలిగిన వారైనందువల్ల  భారత్ కు తిరిగి వచ్చి హిందుత్వానికి నిలువెత్తు ప్రతీకగా నిలబడి,  విశ్వహిందూ పరిషత్  కార్యాన్ని చేపట్టారు. అంచెలంచెలుగా అనేక బాధ్యతలను నిర్వహిస్తూ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  కమిటీలో  భాగస్వామ్యం వహించి, అనంతరం పశ్చిమ ఆంధ్ర ప్రాంతానికి (తెలంగాణ, రాయలసీమ ప్రాంతానికి) అధ్యక్షులుగా చాలాకాలం పనిచేశారు.
   తన మేనమామను రజాకార్లు హత్యచేయడం చూసి చలించిపోయిన మాణిక్యాచారి గారు చిన్నతనంలోనే ఈ దుర్మార్గాలకు చరమగీతం పాడాలని  మనసులోనే ప్రతినబూనారు. భాగ్యనగరంలోని పాతబస్తీలో తమ కుటుంబం ఉన్న కారణంగా ముస్లింల  అణచివేతలను, అత్యాచారాలను స్వయంగా చూసారు. చిన్నప్పటి నుండే హిందుత్వ భావాలతో  స్వాభిమానంతో జీవించాలని  అందరికీ చెప్పడమే కాదు తాను కూడా ఆచరించి చూపేవారు.
మాననీయ అశోక్ సింఘాల్ గారి  ప్రేరణతో పుల్లారెడ్డి గారి సాన్నిహిత్యంతో స్థానిక ప్రజలకు సేవ చేస్తూ ధర్మ నిష్టతో హిందూ సమాజాన్ని చైతన్యం చేసే పనికి పూనుకున్నారు.  శ్రీ రామజన్మభూమి మందిరం నిర్మాణం కోసం జరిగిన అనేక ఆందోళనలలో ప్రత్యక్షంగా పాల్గొన్న బొడ్డుపల్లి మాణిక్యచారి గారు మందిర నిర్మాణం జరుగుతుందన్న విషయాన్ని కోర్టు తీర్పు ద్వారా విని ఎంతగానో ఆనందించారు.  ఆగస్టు 5వ తేదీ అయోధ్య మందిర నిర్మాణం కోసం జరిగిన భూమిపూజలో భారత ప్రధాని, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ పరమ పూజనీయ సర్ సంఘచాలక్  డా. మోహన్ భాగవత్ గారు పాల్గొన్న కార్యక్రమాన్ని దూరదర్శన్ ద్వారా కళ్ళారా చూసిన వీరు పరమానంద భరితులయ్యారు.

 సహజంగానే సేవా ప్రవృత్తి కలిగిన  శ్రీ మాణిక్యాచారి గారు కారుణ్యసింధు నిరాశ్రిత బాలుర వసతిగృహం సంస్థాపక అధ్యక్షుడిగా, ఉంటూ అనేక జిల్లా కేంద్రాల్లో మరెన్నో సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. విశ్వహిందూ మాసపత్రిక కొనసాగడంలో గాని,  కార్యాలయం భవనం నిర్మాణంలోగాని వారి చొరవ కొనియాడదగినది.
      వారి జన్మదినం సందర్భంగా ఒకసారి  మొత్తం కుటుంబ సభ్యులను మరియు అప్పటి విశ్వహిందూ పరిషత్ ప్రాంత కమిటీ మొత్తాన్ని కూడా ఆహ్వానించారు. సుమారుగా 200 మందికి పైగా పాల్గొన్న  అందరి ముందు వారి కుటుంబ సభ్యులతో “విశ్వహిందూ పరిషత్” అనే ఒక అద్భుతమైన నాటకాన్ని ప్రదర్శింపజేశారు. ఒకరు అశోక్ సింఘాల్ గారివలె, మరొకరు శ్రీపుల్లారెడ్డి గారివలె, మరొకరు సాధ్వి ఋతంభర గారి వలె మరొకరు శ్రీ రాఘవరెడ్డి గారి వలె అనేక మందితో వేషధారణలు వేయించి శ్రీరామజన్మభూమి ఉద్యమం, అనేక ధార్మిక అంశాలపై విశ్వహిందూ పరిషత్ వైఖరి తెలియజేసే అద్భుత నాటకం అది.  పాత్రధారులందరూ అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్న వారి కుటుంబ సభ్యులే. అందరూ కలిసి పరిషత్ గీతం పాడడం అనేక సంఘ గీతాలు పాడడం అందరికీ మరపురాని అనుభూతిని మిగిల్చింది. వారి ఒక ఇంటిని కుటుంబ సభ్యులందరితో కలిసి విశ్వహిందూ పరిషత్ కు రాసిచ్చారు.

__విశ్వ సంవాద కేంద్రము 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top