ఆధ్యాత్మికత - ధార్మికత - Adhyatmikata, Darshanikata - Spirituality

0
ఆధ్యాత్మికత - ధార్మికత - Adhyatmikata, Darshanikata - Spirituality
Spirituality
: ఆధ్యాత్మికత - ధార్మికత :
  ధార్మికుడు ఎప్పుడూ నీతి, నిజాయతీలను, ఆధ్యాత్మికతను వదలిపెట్టడు. నీతి బాహ్యమైన జీవితం గడిపేవారికి పవిత్రత అంటే పట్టదు, అనేక తప్పులు చేసి మొద్దుబారిపోతాడు. అలా సున్నితత్వాన్ని పూర్తిగా కోల్పోయిన వారిలో నైతికత్వం  నాశనం అవ్వడమే కాకుండా సిగ్గులేకుండా ప్రవర్తిస్తుంటారు. నైతిక విలువలకు నిజమైన సాధకుడు, ధార్మికుడు ఎంతో ప్రాధాన్యతను ఇస్తాడు.

అటువంటి సున్నితమైన మనస్సు లేకపోతే పారమార్థిక జీవనం గడపలేము. హృదయ పవిత్రతనూ, ఆధ్యాత్మికతనూ విడదీయలేము. ఓ పవిత్రమైన మనస్సు మాత్రమే పరమాత్మను గురించి నిరాటంకంగా ఆలోచించగలదు, ధ్యానించగలదు. మరి పవిత్రమైన మనస్సు రావాలంటే ధార్మికమైన జీవనం రావాలి ...అది రావాలంటే తెలుసుకోవాలి ...తెలుసుకొని నడుచుకోవాలి. అప్పుడు రాక్షసత్వం నశిస్తుంది ..దానికి ఆహార శుద్ధి వుండాలి ....ఆహార శుద్ధి అంటే అన్నం శుద్ధి, శాఖాహారం అని కాదు...ఇంద్రియములకు ఇచ్చే ఆహారం ....ఆహార శుద్ధి వలన ఇంద్రియ శుద్ధి, తద్వారా సత్వగుణములు ఏర్పడుతాయి. ఇంద్రియములకు పవిత్రమైన విషయములనే ఆహారంగా ఇవ్వాలి.
ఆహారశుద్ధౌ సత్వశుద్ధిః సత్వశుద్ధౌ ధ్రువా స్మృతిః
స్మృతిలమ్భే సర్వగ్రంథీనాం విప్రమోక్షః ....(ఛాందోగ్యోపనిషత్తు)

   పవిత్రమైన ఆలోచనలు ద్వారా పుణ్యాన్ని గడించి పాప పరిహారం చేసుకోవాలి. ఆహారవిహారముల పట్ల చాలా జాగురూకత వుండాలి. జ్ఞాన, భక్తి, కర్మ మార్గములలో నైతికత చాలా అవసరం. పవిత్రత లేకుండా ఏ మార్గములోనైనా సరే ముందుకు సాగలేము. శారీరికంగా, మానసికంగా, ఇంద్రియపరంగా పరిశుద్ధంగా పవిత్రంగా వున్నప్పుడే నైతిక విలువలను సాధించగలము ...నైతిక విలువలను, ధార్మిక విలువలను కాపాడుకొన్నప్పుడే సమాజాన్ని రక్షించుకోగలం. సమాజాన్ని మార్చాలంటే ధార్మికంగా బ్రతకాలి ...ప్రతి ఓక్కరికీ ధార్మిక విలువలను బోధించాలి, ఆచరింపజేయాలి ... ధార్మక విలువలు అంటే ఏదో ఓక మతం గురించి, ఓ దేవుడ్ని గురించి చెప్పేది కాదు...

పతంజలి మహర్షి చెప్పిన యోగ సూత్రములలో 1. యమ (సాధారణమైనవి) , 2. నియమ (నిర్ధిష్టమైనవి)... అని ముఖ్యంగా చెప్పి వున్నారు ...ఇవి ప్రతి ఓక్కరూ తెలుసుకొని ఆచరించాలి.
మనస్సును శాంతపరచాలంటే పవిత్రత ఎంతో అవసరం ...పరిపూర్ణమైన, యోగ్యమైన, పవిత్రమైన ఆలోచనలే మనస్సుకు ప్రశాంతిని ఇస్తాయి ...ఆ నిర్మలత్వం కోసం మనం ప్రయత్నం చేయాలి, అందరికీ నేర్పించాలి ...రుద్ది రుద్ది ఇనుప ముక్కను అయస్కాంతం చేసినట్లుగా ...చెప్పి చెప్పి చెప్పి మనిషి యొక్క గుణములను మార్చాలి.....ఎందుకంటే అలవాటు పడిన రుచులు, పూర్వ వాసనలు అంత తేలికగా మనల్ని వదలిపెట్టవు ....కావున మనషిలో ఆధ్యాత్మికత ను పెంపొందించాలి, మనిషిలో చైతన్యం కలిగించాలి ....

ఆధ్యాత్మికత లో నిజంగా పరిపక్వత పొందిన వారు తప్పు చేయలేరు, వారికి ఇతరులకన్నా బాధ్యత ఎక్కువగా వుంటుంది. ఓ అనాగరికుడిలా ఓ సంస్కారవంతుడు ప్రవర్తించలేడు. ఆధ్యాత్మికత లో వున్న వారు చిన్న తప్పు చేయాలన్నా వెయ్యి సార్లు ఆలోచిస్తాడు, రాజీపడలేడు. తప్పు తెలుసుకొని ఓప్పుకోవాలి కానీ సమర్థించుకోకూడదు... మనసు పరిపక్వత చెందడానికి ఆధ్యాత్మికత ఎంతో అవసరం ...పరిపక్వత చెందిన మనసు సూక్ష్మతను పొంది ఆలోచనా స్థాయిలోనే చెడును అరికట్టగలదు. ఆధ్యాత్మిక జీవనంలో పనులకంటే ఆలోచనలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు సాధకుడు ....ఆలోచనా రూపంలోనే చెడును నిర్మూలిస్తాడు. నైతిక విలువలను పాటించడం అంటే త్రికరణ శుద్ధిగా పాటించడం అని అర్ధం. నైతికత అంటే చెడు పని చేయకపోవడమే కాదు చెడుకు కారణభూతం కూడా కాకూడదు అని శాస్త్రం మనకు చెబుతుంది ...చెడును ఆమోదించకూడదు.

ఓ సాధకుడు తను చెడు చేయకుండా, తన వల్ల చెడు జరగకుండా, చెడును ఆమోదించకుండా, చెడు ద్వారా లాభాన్ని ఆశించకుండా, పొందకుండా మసలుకొంటాడు ....ప్రలోభాలను తన దరిజేరనివ్వడు.
  నైతిక జీవనం ఆధ్యాత్మిక జీవనానికి దారి తీయాలి. ఓ సాధకుడు, ఉపాసకుడు తనను తాను నిత్యం పరీక్షించుకొంటూ ముందుకు సాగుతూ వుంటాడు. ఓ ఉపాసకుడు తన జప తప ధ్యానముల ద్వారా, సూక్ష్మ శక్తి ద్వారా తన చుట్టూ వున్న వాతావరణాన్ని, ప్రపంచాన్ని మారుస్తూ వుంటాడు, తద్వారా మనుషులలో వున్న అసురీ గుణములను పోగొట్టుతూ సమాజానికి తనవంతు కృషి చేస్తూ వుంటాడు. సాత్వికమైన తరంగములను సృష్టిస్తూ వుంటాడు. నైతిక విలువలను ప్రతి మనిషిలో చైతన్యపరచి సమాజాన్ని కాపాడుకొందాం.... స్వస్తి.

రచన: ఆచార్య భాస్కరానంద నాథ

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top