పుణ్యతీర్థం - అత్తిరాల - Attirala (Hatyarala)

0
పుణ్యతీర్థం - అత్తిరాల -  Attirala (Hatyarala)
: పాపాలు కడిగేసే పురాతన క్షేత్రం - పుణ్యతీర్థం: అత్తిరాల :
రోజులలో పితృదేవతలకు అంటే మరణించిన తలిదండ్రులు, తాతముత్తాతలకు తర్పణలు వదిలి, వారి పేరిట అన్నదానాలు చేయడం వల్ల పితృదేవతలకు ముక్తి కలుగుతుందని ప్రతీతి. అయితే పితృదేవతలకు పిండప్రదానాలు చేసేందుకు కొన్ని ప్రత్యేక క్షేత్రాలున్నాయి. ఆయాక్షేత్రాలలో పిండప్రదానం చేయడం విశిష్ట ఫలదాయకం. అందుకే ఈ  క్షేత్రం గురించిన వివరణ.
   అత్తిరాల మహా భారత పురాణంలో పేర్కొన్న  క్షేత్రం. కడప జిల్లా రాజంపేటకు సమీపంలో ఉన్న ఈ క్షేత్రాన్ని ప్రతి మహాశివరాత్రి నాడు ప్రజలు భారీగా తరలివచ్చి దర్శిస్తారు. ఇక్కడ ఉన్న బాహుదానదిలో స్నానం చేస్తారు. పిండ ప్రదానాలకే కాదు పాప వినాశనానికి కూడా ఇక్కడ ఉన్న బాహుదా నది ఖ్యాతి పొందింది.
పారశురాముడు 
హత్యాపాతకం రాలడమే అత్తిరాల :
  సత్యయుగంలో పరశురాముడి తండ్రి జమదగ్నిని కార్తవీర్యార్జునుని కుమారులు సంహరించగా కోపోద్రిక్తుడైన పరశురాముడు ఇరవై ఒక్క మార్లు భూమండలంలో క్షత్రియులను సంహరించగా ఆ రక్తపాతం వలన సంక్రమించిన పాపంతో ఆయన గొడ్డలి హస్తానికి అంటుకొని రాలేదు. మహేశ్వరుని ఆజ్ఞ మేరకు పుణ్య నదులలో స్నానమాడుతూ క్షేత్ర దర్శనం చేస్తూ అత్తిరాల చేరుకుని ఇక్కడి బాహుదా నది (స్థానికులు చెయ్యేరు అంటారు)లో స్నానమాచరించగానే పరశువు రాలి కింద పడిపోయింది. అలా పరశురామునికి చుట్టుకొన్న హత్యాపాపం రాలిపోవడంతో ‘హత్యరాల’ అన్న పేరొచ్చింది. అదే నేడు వాడుకలో ‘అత్తిరాల’గా పిలవబడుతోంది. కురుక్షేత్ర యుద్ధానంతరం జరిగిన రక్తపాతానికి తనే కారణం అంటూ విచారంలో మునిగిపోయి ఉన్న ధర్మరాజుకు కర్తవ్యం బోధిస్తూ శ్రీ వ్యాస భగవానుడు పలికిన పలుకులలో అత్తిరాల ప్రస్తావన వస్తుంది (శాంతి పర్వం, ప్రథమాశ్వాసం).

శివకేశవుల క్షేత్రం :
   ప్రజాపతులలో ఒకరైన పులస్త్య బ్రహ్మ ఇక్కడ తపమాచరించి శివ సాక్షాత్కారం పొందాడని ఆయన కోరిక మీద ఇక్కడ  సదాశివుడు ‘శ్రీ త్రేతేశ్వర స్వామి’ అన్న నామంతో స్వయంభువుగా వెలిశాడని కథనం. ఇక్కడ ఉన్న శివలింగం అగ్నిగుండంలో నుంచి ఉద్భవించిందనీ ఈ సంఘటన త్రేతాయుగంలో జరిగింది కనుక ఇక్కడి శివుణ్ణి త్రేతేశ్వరుడు అని పిలుస్తారని మరో కథనం. అలాగే భృగుమహర్షి ఇక్కడ తపస్సు చేసి శ్రీహరిని ప్రసన్నం చేసుకొనగా ఆయన ఒక పాదాన్ని గయలో, రెండో పాదాన్ని అత్తిరాలలో ఉంచి ‘శ్రీ గదాధర స్వామి’గా ప్రకటితమయ్యాడు. ఆవిధంగా ఇది శివకేశవుల క్షేత్రం అయ్యింది. ఇక్కడ ఉన్న బహుదా నదిలో రక్త సంబంధీకులకు చేసే పిండ ప్రదానం, తర్పణం గయలో చేసిన వాటితో సమానమని ప్రతీతి. అందుకే అత్తిరాలకు ‘దక్షిణ గయ’ అన్న పేరొచ్చింది.

సుదూరంగా వెలిగే దీపస్తంభాలు :
   చుట్టూ కొండలు, ఒక పక్క బాహుదా నదులతో అత్తిరాల క్షేత్రం ఆహ్లాదకర వాతావరణంలో ఉంటుంది. అన్నిపక్కలా ఆలయాలు కనపడుతూ ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంటుంది. కొండమీద రాజగోపురం చేరుకోవడానికి మెట్ల దారి ఉంది. ఇక్కడి శ్రీ త్రేతేశ్వర స్వామి ఆలయంలో ఎత్తై ప్రదేశంలో శివరాత్రి నాడు దీపారాధన చేయడం కోసం 15 అడుగుల ఎత్తు గల ద్వీపస్తంభం ఉంది. శివరాత్రి రోజు, కార్తికపౌర్ణమి రోజు ఇక్కడ దీపారాధన చేస్తారు. ఈ వెలుగు రాజంపేట పట్టణానికే కాకుండా సుదూరాన ఉన్న ఎర్రగుంట్లకు కూడా కనిపిస్తుందంటారు. ఈ వెలుగు చూసే వెంకటగిరి రాజులు ఒక్కపొద్దులు విడిచేవారని ప్రతీతి. గర్భాలయంలో త్రేతేశ్వరుడు పడమర ముఖంగా లింగరూపంలో   కుంకుమ చందన లేపనంతో విభూతి రేఖలతో కనిపిస్తాడు. ఇక్కడే శ్రీ కామాక్షి అమ్మవారికి, వినాయకునికి విడిగా సన్నిధులున్నాయి.

గదాధర స్వామి :
   ఈ కొండ పై నుండే శ్రీ గదాధర స్వామి ఆలయానికి మార్గం ఉంది. దీనిని 2005లో పునర్నిర్మించారు. పురాతనమైన స్వాగత ద్వారం గుండా ప్రాంగణంలోనికి ప్రవేశిస్తే ఉత్తర ముఖంగా ఉన్న ప్రధాన ఆలయ ముఖ మండపం లోనికి తూర్పు వైపు నుండి మార్గం ఉంటుంది. దానికి ఎదురుగా అంజనాసుతుడు దక్షిణం వైపునకు చూస్తూ ప్రసన్న రూపునిగా దర్శనమిస్తాడు. ముఖమండపంపై భాగాన శ్రీ రామానుజాచార్యులు, శ్రీ వేదాంత దేశికులు, ఆళ్వారుల, సప్తఋషుల విగ్రహాలు కనిపిస్తాయి. చిన్నగర్భాలయంలో కొంచెం ఎత్తై పీఠం మీద స్థానక భంగిమలో శ్రీ గదాధర స్వామి శంఖు, చక్ర, గదాధారులై అభయ ముద్రతో నయన మనోహరంగా దర్శనమిస్తారు. ఆలయ విమానం పైన అద్భుతంగా మలచిన దశావతారాలు, కృష్ణలీలల ఘట్టాలు నయనానందకరంగా ఉంటాయి.

అతి పురాతన ఆలయం :
   ఇక్కడ ఉన్న పరశురాముని ఆలయం అతి పురాతనమైంది. సాధారణంగా మన దేశంలో పర శురామ క్షేత్రాలు తక్కువ. వాటిలో అత్తిరాల ఒకటి కావడం దీని ప్రాశస్త్యాన్ని ఇనుమడింప చేస్తోంది. అందువల్లనే దీనిని పురావస్తు శాఖ ఆధీనంలోకి తీసుకుంది. అయినప్పటికీ ఇక్కడ నిత్యపూజలు లేకపోవడం విచారకరం. విశేషం ఏమిటంటే మనకు తెలిసిన పరశురాముడు, శిఖ, గడ్డం మీసాలతో, నారబట్టలు, రుద్రాక్ష మాలలు ధరించి ఉంటాడు. కాని ఇక్కడ మాత్రం పరశురాముడు తలపైన కిరీటం, మెడలో బంగారు ఆభరణాలు ధరించి, అత్యంత రమణీయంగా దర్శనమిస్తాడు.

తల నొప్పిని తగ్గించే తాతయ్య!
   ఈ ఆలయానికి ఎదురుగా గల ముఖ మండపంలో ఈ ఆలయ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన ఏకా తాతయ్య అనే వ్యక్తి విగ్రహం పద్మాసనం వేసుకొని, ధ్యానముద్రలో ఉన్నట్లుగా ఉంటుంది. తాతయ్య చేతిలో నాణెం పెట్టి ఆయన విగ్రహాన్ని కౌగలించుకొంటే మనోభీష్టాలు నెరవేరుతాయని నమ్మకం. అంతేకాదు, తలనొప్పితో, పార్శ్వపునొప్పితో బాధపడేవారు తాతయ్య భుజాలు పట్టుకుని, ఆయన తలకు తమ తలను ఆనించి, మూడుసార్లు మెల్లగా కొట్టుకుంటారు.
అలా చేస్తే చాలు.. ఎంతోకాలంగా బాధిస్తున్న తలనొప్పి కూడా మటుమాయం అవుతుందట. ఈ క్షేత్రానికి వచ్చేవారిలో తాతయ్య తలకు తమ తల ఆనించి, తలనొప్పిని పోగొట్టుకునేవారే ఎక్కువమంది. తాతయ్య వెనుక గోడకు ఉన్న రంధ్రం గుండా ప్రతి రోజు సాయం సంధ్యా సమయంలో సూర్యకిరణాలు నేరుగా మూల విరాట్టును తాకడం ఇక్కడి నిర్మాణ విశేషం.
 
ఎలా చేరుకోవాలి :
అత్తిరాల కడప జిల్లా రాజంపేటకు ఆరుకిలోమీటర్లు ఉంది. కడపకు 56 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతికి 50 కిలోమీటర్ల దూరం. రైలు, బస్సు మార్గాల ద్వారా సులభంగా ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు.

హత్యరాల పుణ్యక్షేత్రం (Google Map)

__Srinivas Gupta Vanama f - May 14 21

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top