ఆర్శ మొలలు.. ఆయుర్వేద చికిత్స - Molalu - Ayurveda treatment for Piles

0
ఆర్శ మొలలు.. ఆయుర్వేద చికిత్స - Molalu - Ayurveda treatment for Piles
Ayurveda treatment for Piles 

డాక్టర్ చిరుమామిళ్ల మురళీమనోహర్
లద్వారం లోపల సిరలు ఉబ్బిపోయి పెద్దవిగా మారటాన్ని మొలలు లేదా పైల్స్ అంటారు. వైద్య పరిభాషలో హిమరాయిడ్స్ అని, ఆయుర్వేదంలో ఆర్శస్సు అనీ పేరు. అరి అంటే శత్రువు. ఒకసారి వచ్చిన తరువాత మూలవ్యాధి శత్రువు మాదిరిగా బాధిస్తుందని భావం. ఈ వ్యాధి అసౌకర్యాన్ని కలిగిస్తుంది తప్పితే సాధారణంగా ప్రాణ ప్రమాదాన్ని కలిగించదు. మలద్వారం లోపల మెత్తని కణజాలం ఉంటుంది. మలవిసర్జనకు దోహదపడటానికిగాను దీనికి అధిక మొత్తాల్లో రక్తసరఫరా ఉంటుంది. ఒకవేళ అధిక ఒత్తిడి తదితర కారణాలవల్ల ఈ మెత్తని కుషన్ మాదిరి కణజాలంలోని సిరలు ఉబ్బి సాగిపోయి మెలికలు తిరిగి ఆర్శమొలలు తయారవుతాయి. జనాభాలో దాదాపు ప్రతివారికీ జీవితంలో ఏదో ఒక సందర్భంలో పైల్స్ ఇబ్బంది పెడతాయి. కాకపోతే 30 ఏళ్ళ వయసు తరువాత ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. 50 ఏళ్లు దాటిన వ్యక్తుల్లో 50 శాతం మందికి ఎప్పుడో ఒకప్పుడు నిశ్చయంగా పైల్స్ తయారవుతాయి.

మలద్వారం లోపల సిరలు ఉబ్బిపోయి పెద్దవిగా మారటాన్ని మొలలు లేదా పైల్స్
మలద్వారం లోపల సిరలు ఉబ్బిపోయి పెద్దవిగావున్న మొలలు లేదా పైల్స్

కారణాలు

ఒత్తిడి పెరిగేకొద్దీ సిరల్లో రక్తం ఎక్కువగా పోటేసి గోడలను ఉబ్బిపోయేలా చేస్తుంది. ఉబ్బిపోయిన సిరలు క్రమంగా చుట్టుప్రక్కల నిర్మాణాలను, కండరాలను సాగిపోయేలా, డీలాపడేలా చేస్తాయి. బలహీనపడిన నిర్మాణాలు సిరలను అదుపులో ఉంచలేవు. పర్యవసానంగా పైల్స్ తయారవుతాయి.
 • -పైల్స్ తయారవడానికి ప్రధాన కారణం మలవిసర్జన సజావుగా, నిరాటంకంగా, దానంతట అదే జరగకపోవడం. మలవిసర్జన త్వరత్వరగా జరిగిపోవాలనే భావంతో ముక్కటం, మలద్వారపు కండరాలను బిగపట్టడం చేస్తే మలద్వారం లోపలి రెక్టల్ సిరల మీద ఒత్తిడి పెరిగి పైల్స్ తయారవుతాయి.
 • కాగా దీర్ఘకాలంనుంచి విరేచనాలు, లేదా మలబద్ధకం బాధిస్తున్నప్పుడు మలద్వారం మీద ఒత్తిడి పడి పైల్స్ తయారయ్యే అవకాశం ఉంది.
 • స్థూలకాయమూ పైల్స్ కు కారణమే అధిక బరువువల్ల ఉదరంలోనూ కటీవలయంలోనూ ఒత్తిడి పెరిగి మలద్వారపు నరాలమీద పడుతుంది. దీని ఫలితంగా మలద్వారం వద్ద మొలలు తయారవుతాయి. -గర్భధారణ, ప్రసవం వంటివి మహిళల్లో పైల్స్ తయారవడానికి ప్రధాన కారణాలు. గర్భధారణలో సంభవించే హార్మోన్ల తేడాలవల్ల కటివలయపు నిర్మాణాలకు రక్తసరఫరా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో సిరలు ఉబ్బిపోయి పైల్స్‌గా రూపాంతరం చెందుతాయి. గర్భధారణ సమయంలో గర్భంలో పెరిగే పిండంవల్ల చుట్టుప్రక్కల నిర్మాణాలమీద ఒత్తిడి పెరగడంతోపాటు మలద్వారం సిరల మీద కూడా ఒత్తిడి పెరిగి పైల్స్ తయారవుతాయి.
 • ప్రసవ సమయంలో పిండాన్ని బయటకు వెలువరించడానికి బలవంతంగా ముక్కవలసి వస్తుంది. ఇలాంటి సమయంలో మలద్వారం మీద ఒత్తిడి పడి పైల్స్ తయారవుతాయి.
 • *గుండె జబ్బులు, కాలేయ సమస్యలవల్ల ఉదర ప్రదేశంలో రక్తం అధిక మొత్తాల్లో చేరి ఒత్తిడి కలిగించటంవల్ల కూడా మొలలు తయారయ్యే అవకాశం ఉంది.
 • *ఎక్కువ సమయం పాటు ఒకే భంగిమలో కూర్చోవటం, నిలబడటం వంటివి చేయాల్సిన వృత్తుల్లో వుండేవారికి పైల్స్ తయారయ్యే అవకాశం ఎక్కువ. కూర్చున్నప్పుడు మలద్వారం వద్ద ఉండే సిరలమీద ఒత్తిడి పడటం, నిలబడినప్పుడు గురుత్వాకర్షణ వల్ల సిరల్లో రక్తం సంచితమవటం దీనికి కారణాలు.
 • -బరువులు లేపటం, బరువులను ఎత్తే సమయాల్లో ఊపిరి బిగపట్టటం వంటివి చేసేటప్పుడు మలాశయపు సిరలమీద ఒత్తిడి ఎక్కువై మొలలు తయారవుతాయి.
 • -కాగా శ్రోణి ప్రదేశంలో తయారయ్యే కణితులు, గడ్డలు వంటి పెరుగుదలలవల్ల మలద్వారపు సిరల మీద ఒత్తిడి పెరిగి పైల్స్ తయారయ్యే వీలుంది. అయితే ఇలా జరగటం చాలా అరుదు.

రకాలు

మొలల ఉత్పత్తిని ఆధారం చేసుకొని రెండు రకాలుగా విభజించవచ్చు. మలాశయ మార్గం (యానల్ కెనాల్) లోపల తయారయ్యే అభ్యంతర ఆర్శస్సు (ఇంటర్నల్ హెమరాయిడ్స్) అంటారు. మలద్వారం వద్ద లేదా చుట్టుప్రక్కల తయారైతే బాహ్య అర్శస్సు (ఎక్స్‌టర్నల్ హెమరాయిడ్స్) అంటారు. ఒకే సమయంలో రెండు రకాలూ ఉండవచ్చు. మొలలు ఏర్పడిన స్థానాన్ని బట్టి లక్షణాలు, పురోగతి, చికిత్సలు మారుతుంటాయి.

తీవ్రతను బట్టి అభ్యంతర అర్శస్సును (ఇంటర్నల్ పైల్స్) నాలుగు దశలుగా విభజించవచ్చు. ఈ నాలుగు దశల్లోనూ రక్తం కనిపించవచ్చు.
 1. మొదటి దశలో మలద్వారం నుంచి ఆర్శస్సు వెలుపలకురాదు.
 2. రెండవ దశలో మలవిసర్జన సమయంలో వెలుపలకు వచ్చి విసర్జన తరువాత లోపలికి వెళ్ళిపోతుంది.
 3. మూడవదశలో మలవిసర్జన సమయంలో వెలుపలకు వచ్చిన ఆర్శస్సు దానంతట అదే తిరిగి లోపలకు వెళ్లదు. అయితే వేలితో తోస్తే లోపలకు వెళుతుంది.
 4. నాలుగవ దశలో అర్శస్సు ఎల్లప్పుడూ మలద్వారం వెలుపలే ఉంటుంది. మలాశయ మార్గం లోపలకు నెట్టడానికి ప్రయత్నించినప్పటికీ లోనికి వెళ్ళకుండా వెలుపలే ఉండిపోతుంది.

లక్షణాలు

-మల విసర్జన చేసే సమయంలో రక్తస్రావమవ్వటం, మలద్వారం వద్ద దురద, మలద్వారం లోపలా వెలుపలా నొప్పి రావటం వంటివి మొలల వ్యాధిలో ప్రధాన లక్షణాలు.

-బాహ్య అర్శస్సు (ఎక్స్‌టర్నల్ పైల్స్)లో ప్రధాన లక్షణం నొప్పి. వెలుపలకు వచ్చిన మలం మీద కొంచెం లోతుగా నిలువునా గీత వంటిది కనిపించవచ్చు. ఒకోసారి రక్తపు చారిక కూడా కనిపిస్తుంది. కొన్ని అరుదైన సందర్భాల్లో ఆర్శస్సు లోపల ఉండే సిర చిట్లుతుంది. ఇలా జరిగినప్పుడు చర్మం కింద రక్తం చేరి గడ్డకట్టి కఠినంగా తయారవుతుంది. దీనివల్ల లోపల పొడుస్తున్నట్లు నొప్పి వస్తుంది. దీనిని వైద్య పరిభాషలో త్రాంబోస్ట్ లేదా క్లాటెడ్ హిమరాయిడ్ అంటారు. దీనికి భిన్నంగా మలవిసర్జన సమయంలో హఠాత్తుగా పదునైన నొప్పి వచ్చి మలం మీద చిన్న రక్తపు మరక కనిపిస్తే అది పైల్స్ కంటే ఫిషర్ (చర్మం గాటుపడి చీరుకుపోవటం) అయ్యే అవకాశం ఎక్కువ.

-అభ్యంతర ఆర్శస్సు (ఇంటర్నల్ పైల్స్)లో ప్రధాన లక్షణం రక్తస్రావం. మలంమీద ప్రకాశవంతమైన ఎరుపు రంగు రక్తం కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో మల విసర్జన తరువాత సిరెంజితో చిమ్మించి కొట్టినట్లు రక్తం సన్నటి ధారగా కారుతుంది. ఇంకా అనేక రకాలైన లక్షణాలుంటాయి. దురద, చిరాకు, అసౌకర్యం, నొప్పి వంటివి ఇబ్బంది పెడుతుంటాయి. అభ్యంతర అర్శస్సు జిగురు వంటి స్రావాన్ని విడుదల చేస్తుంది కాబట్టి స్థానికంగా దురదగా అనిపిస్తుంది. పెద్ద సైజు పైల్స్ వెలుపలకు వచ్చి చుట్టుప్రక్కల చర్మాన్ని రేగేలా చేస్తాయి కాబట్టి చిరాకుగా ఉంటుంది. మలాశయంలో అర్శమొలలు భారీగా పెరిగి ఒత్తిడి కలిగిస్తుండటం వల్ల మలవిసర్జన చేసినప్పటికీ అసంపూర్ణంగా జరిగినట్లు అసౌకర్యంగా అనిపిస్తుంటుంది. సాధారణంగా అభ్యంతర అర్శస్సువల్ల నొప్పి ఉండదు. అయితే పైల్స్ భారీగా పెరిగి వెలుపలకు చొచ్చుకు వస్తే మాత్రం నొప్పి అనిపించే అవకాశం ఉంది. వెలుపలకు వచ్చిన మొలలను మలద్వారపు కండరాలు బిగించేయటంవల్ల నొప్పి వస్తుంది. రక్తసరఫరా ఆగిపోతుంది కాబట్టి ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు వెంటనే శస్త్ర ప్రక్రియలు అవసరమవుతాయి. ఇక్కడే మరో ముఖ్యమైన విషయం ప్రస్తావించాలి. ఐదు పదుల వయసు దాటిన వారిలో కొత్తగా మలనిర్హరణ ప్రక్రియలో తేడా కనిపిస్తూ, మలద్వారం నుంచి రక్తస్రావం కనిపిస్తున్నట్లయితే మలాశయానికి సంబంధించిన క్యాన్సర్‌ని దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా కుటుంబ ఇతివృత్తం ఉంటే మరింతగా అప్రమత్తమవ్వాలి. కాగా పైల్స్‌ని పోలిన లక్షణాలు ఫిషర్ (గుద విదారం), కలాన్ పాలిప్స్ (కొయ్యగండలు లేదా పిలకలు), ఇన్‌ఫ్లమేటరీ బొవెల్ డిసీజ్ వంటి వ్యాధుల్లో కూడా కనిపించే అవకాశం ఉంది కాబట్టి సరైన వ్యాధి నిర్ణయం కోసం వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

వైద్య సహాయం పొందాల్సిన సందర్భాలు

మొలల వ్యాధిలో కనిపించే సాధారణ లక్షణాలు ఇతర ప్రమాదకరమైన వ్యాధుల్లో కూడా కనిపించే అవకాశం ఉన్నందున సాధారణమేదో, అసాధారణమేదో తెలుసుకోగలగాలి. మలవిసర్జనతో సంబంధం లేకుండా మలద్వారం నుంచి రక్తస్రావం జరుగుతున్నా, మలం పెన్సిల్ మాదిరిగా సన్నగా వెలువడుతున్నా, తీవ్రమైన మలబద్ధకం గాని, అనియతం విరేచనాలుగాని అవుతున్నా, మలం నల్లని రంగులో తారుమాదిరిగా కనిపిస్తున్నా, మలద్వారం నుంచి అసహజమైన పదార్థమేదైనా వెలువడుతున్నా, మొలల సమస్యతోపాటు జ్వరం కనిపిస్తున్నా, మలద్వారం వద్ద స్పర్శను కూడా తట్టుకోలేనంత నొప్పితో కూడిన పెరుగుదల తయారైనా ఎంతమాత్రమూ అశ్రద్ధ చేయకూడదు. వెంటనే వైద్య సహాయం పొందాలి.

గమనిక:
పై నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాగలరు...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
"తెలుగు-భారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. మన సంస్కృతీ, సంప్రదాయాలను మరింత లోతుగా విశ్లేషించి ప్రపంచానికి తెలియచేస్తూ మన ధర్మాన్ని కాపాడేందుకు మీ వంతు సహాయం చేయండి.
Supporting From Bharat:#buttons=(Accept !) #days=(20)

Our website uses cookiesLearn..
Accept !
To Top