అమ్మ ప్రేమ - Amma Prema, Mother Love


అమ్మ ప్రేమ - Amma Prema, Mother Love
అమ్మ
 • 🎔 అనిర్వచనీయమైన మాటే అమ్మ;
 • 🎔 ప్రేమ, అనుభూతులను పంచిచ్చేదే అమ్మ;
 • 🎔 తాను తిన్న ఆహారాన్ని ప్రేమరసంగా, ప్రాణరసంగా మార్చి ఇచ్చింది అమ్మ తన ప్రాణాన్నే పణంగాపెట్టి, త్యాగాన్ని నేర్పి, నాకు జన్మనిచ్చింది అమ్మ; 
 • 🎔 పుట్టగానే నా పనులు నేను చేసుకోలేనుగా అందుకే మలమూత్రాలను శుభ్రంచేసి, అందంగా ముస్తాబుచేసేది అమ్మ;
 • 🎔 నేను ఆరోగ్యంగా, బలంగా పెరగాలని, తన రక్తాన్ని పాలగామార్చి పట్టేది నాకు అమ్మ; అమ్మా, నాన్న, అత్త, అక్క అని మాటలు నేర్పింది అమ్మ;
 • 🎔 చేబట్టి, బుడిబుడి అడుగులు నేర్పింది అమ్మ;
 • 🎔 బడికివెళ్ళే వయసులో, అన్నంపెట్టి, బట్టలువేసి, తల అటు,ఇటు తిప్పుతుంటే, ఒక చేత్తో రెండు బుగ్గలను అదిమిపెట్టి, తలదువ్వి, బుగ్గలపై ముద్దులుపెట్టి, పుస్తకాల సంచి బుజానికి తగిలించి, వీధివాకిలివరకూ వచ్చి పంపించేది అమ్మ;
 • 🎔 ఆటల్లో దెబ్బతగిలి,రక్తంకారుతూ ఇంటికివస్తే చూసి తల్లడిల్లిపోయిన అమ్మ కళ్ళల్లో నీరుబుకుతుంటే, ముఖాన్ని పక్కకు తిప్పుకొని, చీరెకొంగుతో కళ్ళద్దుకొని, పళ్ళ బిగువన బాధను ఆపుకొని, తన గుండె గాయాన్ని మరచి, నా గాయానికి మందువేసి బుజ్జగించింది అమ్మ;
 • 🎔 పుట్టినరోజువస్తే, నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు జీవించమని దీవించింది అమ్మ;
 • 🎔 రాత్రులు నిద్రలో ఉలిక్కిపడి లేచి ఏడుస్తుంటే, గుండెలకద్దుకొని నిద్రబుచ్చేది అమ్మ;
 • 🎔 పట్టభద్రుడయ్యానని చెప్పిన రోజున కొడుకు విద్యాధికుడయ్యాడని సంతోషించింది అమ్మ;
 • 🎔 ఉద్యోగం వచ్చిందని చెప్పినప్పుడు, ఆనందించి, ఆలోచనలో పడిపోయింది అమ్మ;
ఎందుకో తెలుసా?
 • 🎔 తన వయసు మీద పడుతున్నది, వీడికిక తానేమీ చేయలేనేమో, పెళ్ళీచేసి, తనలాంటి ఒక ఆడబిడ్డ చేతిలో పెడితే సుఖంగా బ్రతుకుతాడనే ఆశతోకూడిన ప్రేమమయి అమ్మ;
 • 🎔 కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనుమరాళ్ళు, మనవళ్ళతో కూడిన చక్కటి కుటుంబాన్ని చూసి మురిసిపోయింది అమ్మ;
 • 🎔 అమ్మ మాకేకాదు అమ్మ;
 • 🎔 నాన్నకుకూడా అమ్మ;
 • 🎔 అమ్మ చనిపోయిన రోజున చితిమంటలు ఎగసిపడుతుంటే తడి ఆరని నాలోని అమ్మ అనుభూతులు కన్నీరుమున్నీరై ధారలుగా కారుతుంటే అమ్మకు ప్రదక్షణాలుచేసి నమస్కరిస్తుంటే అగ్నిపునీతురాలుగా కనిపిస్తున్నది నా యెదుట అమ్మ;
 • 🎔 అమ్మలుగన్న అమ్మ;
 • 🎔 నా అమ్మ;
అమ్మమీద ఒట్టు అమ్మా,నాన్నలను మరిచిన రోజులేదు నాకు అందుకే నేనెప్పుడు సంతోషంగా వుంటాను అమ్మా, ఆనందమయివమ్మా నీవు.
ఈరోజుల్లో మదర్స్ డే అని కొత్తగా అంటున్నారు. కానీ నాకు రోజూ అమ్మ రోజే! ఈ నా భావాలు అమ్మకే అంకితం.
రచన: పబ్బరాజు మాధవ్ రావు 

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top