వైదిక పవిత్ర గ్రంథాలు, వాటి సారాంశము - Vaidika Grandhaalu vaati saaramsamu

వైదిక పవిత్ర గ్రంథాలు, వాటి సారాంశము - Vaidika Grandhaalu vaati saaramsamu
వేదాలు, ఉపనిషత్తులు కాక మనకున్నఇతర పవిత్ర గ్రంథాలు, వాటి సారాంశము
హిందూధర్మంలో పవిత్రాలు అని భావించబడే గ్రంథాలు కోకొల్లలు. అయినా సాంప్రదాయికంగా అంగీకరించబడినవి, మరియు హిందూ సమాజంలోని అన్ని సంప్రదాయాలకు చెందిన వ్యక్తులచే ఆదరించబడే ప్రధానమైన కొన్ని గ్రంథాలు మాత్రం ఇక్కడ ప్రత్యేకంగా పేర్కొనబడుతున్నాయి.
  • రామాయణం, 
  • మహాభారతం,  
  • భగవద్గీత,  
  • మనుస్కృతి, 
  • పరాశరస్మృతి, 
  • యాజ్ఞవల్క్యస్మృతి మొదలైనవి, ఇతర ఆగమాలు, పురాణాలు మరియు దర్శనాలు.
వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో మానవాళికి శీలనిర్మాణాన్ని బోధించే శ్రీరామచంద్రుడి కథ వివరించబడింది. వ్యాస మహర్షి వ్రాసిన మహాభారతంలో కౌరవ పాండవుల కథ మరియు కృష్ణభగవానుని గురించి విశదంగా చెప్పబడింది. జీవితంలో అనివార్యంగా వచ్చే కష్టనష్టాలను మహాపురుషులు ఎలా ఎదుర్కోగలిగారో తెలుసుకుంటే మనకి కూడ అటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొనగలిగే ధైర్యము, మనశ్శక్తి లభిస్తాయి.

 భగవద్గీత, మహాభారతంలో ఒక భాగం. ఇది సర్వజనప్రియమైన ధర్మగంథము. ఉపనిషత్తులు గోవులైతే గీత వాటి పాలవంటిది.  భగవంతుడైన శ్రీకృష్ణుడికీ, మహావీరుడైన ఆర్జునుడికీ మధ్య కురుక్షేత్ర యుద్ధభూమిలో జరిగిన సంభాషణయే గీత.  చేయవలసిన కర్తవ్యాన్ని, అదెంత కష్టమైనది అయినా, పట్టుదలతో నిస్స్వార్ధబుద్దితో చేయాలి. దైవప్రీతి కోసం, లోకకల్యాణం కోసం సమాజానికి మనవంతు ఋణాన్ని తీర్చడం కోసం స్వధర్మాన్ని మనం ఆచరించి తీరాలి.
తీరాలి.

స్వశక్తితో సాధించగల ఒక ఉన్నతలక్ష్యాన్ని కలిగివుండి, దానిని సాధించడానికి కావలసిన పట్టుదలనూ,  సంకల్పశక్తినీ పెంపొందించుకుంటూ,  ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి ప్రయత్నిస్తూ జీవించడమే స్వధర్మం.  స్వధర్మంలోనే శ్రేయస్సు ఉంది. పరధర్మాన్ని గుడ్డిగా అనుకరించడం చాలా ప్రమాదభరితం కాబట్టి అది భయావహమైనదని చెప్పబడింది. ఇదే క్లుప్తంగా గీతాసందేశము.

శ్రుతులు ప్రతిపాదించే సర్వోత్కృష్టమైన శాశ్వతమైన సత్యాలను జ్ఞాపకం  పెట్టుకొని (సృతి=జ్ఞాపకం) అనగా దృష్టిలో ఉంచుకుని, మారిపోయే కాలమాన పరిస్థితులకు అనుగుణంగా
హిందూసమాజాన్ని నియమించి, మార్గదర్శకత్వం వహించేవే స్మృతులు. మనువు, యాజ్ఞవల్క్యుడు పరాశరుడు మొదలైన మహర్షులచే రచించబడిన ఈ స్మృతులలో ప్రతి హిందువు యొక్క వ్యక్తిగత, సామాజిక జీవితం ఎలా ఉండాలో స్పష్టంగా వివరించబడింది.

ఇంకా వివిధ దేవతా పూజావిధానాలు, దేవాలయాలను గురించిన వివరాలను కలిగివుండి, ఆధ్యాత్మిక సాధనలను గురించి వివరించే గ్రంథాలు ఆగమాలు. చారిత్రాత్మకమైన విషయాలు అక్కడక్కడ ఉన్నా, ఎక్కువభాగం కథల ద్వారా, రూపకాల ద్వారా దృష్టాంతాల ద్వారా ధార్మిక సత్యాలను సామాన్యులు కూడా స్పష్టంగా అర్థం చేసుకునేట్లు తెలియజేయటమే పురాణాల ముఖ్య ఉద్దేశం. కృష్ణలీలలను వివరించే భాగనతము, విష్ణుపురాణం, పురాణాలలో ఎక్కువ ప్రిద్ధి
పొందిన గ్రంథాలు. దర్శనాలు అనే గ్రంథాలు ఆరు.

ఈ జగత్తు, సృష్టి, మూలతత్త్వం, ఆత్మ, భగవంతుడు మొదలైనవాటి గురించి వీటిలో చర్చించబడ్డాయి. వీటిలో పతంజలి విరచిత యోగశాస్త్రం, వ్యాసమహర్షి రచించిన వేదాంత దర్శనాలు ఇప్పటికీ జనప్రియాలుగానే విరాజిల్లుతున్నాయి.

రచన: స్వామి హర్షానంద
అనువాదం: శ్రీ దయాత్మానంద స్వామి

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top