గర్వం తలకెక్కితే...గరుత్మంతుడికైనా అవమానం తప్పదు కాదా - Garutmantudi Garvabhangam, Garuda



గర్వం తలకెక్కితే...గరుత్మంతుడికైనా అవమానం తప్పదు కాదా - Garutmantudi Garvabhangam, Garuda

గర్వం తలకెక్కితే...గరుత్మంతుడికైనా అవమానం తప్పదు
 • ⧫ ఇంద్రుని రథసారధి పేరు మాతలి. ఆ మాతలికి ఒక అందమైన, గుణవంతురాలైన కూతురు ఉంది. ఆమె పేరు గుణకేశిని. గుణకేశిని యుక్తవయస్సుకి వచ్చేసరికి ఆమెకు తగిన వరుని కోసం మాతలి పధ్నాలుగు లోకాలనూ వెతికాడు.!
 • ⧫ తన కూతురికి సరిపోయే జోడీ ఎవ్వరూ ఆయనకి కనిపించలేదు. ఇదే విషయాన్ని నారదుని దగ్గర ప్రస్తావించగా... పాతాళలోకంలో ఆర్యకుడు అనే రాజుకి, సుముఖుడు అనే మనవడు ఉన్నాడనీ... అతను గుణకేశినికి తగిన వరుడు కావచ్చునని సూచించాడు నారదుడు.
 • ⧫ నారదుని సూచన మేరకు సుముఖుడిని చూసిన మాతలికి, నిజంగానే అతను తన కూతురికి తగిన వరునిగా తోచాడు. ఈ విషయం ఆర్యకునికి చెప్పగానే అతను సంతోషంతో ఉప్పొంగిపోయాడు. కానీ అంతలో ఏం గుర్తుకువచ్చిందో కానీ విచారంలో మునిగిపోయాడు.
 • ⧫ ‘మాతలీ! నీ కూతురిని మించిన సంబంధం మరేముంటుంది? కానీ నా మనవడికి ఒక గొప్ప ఆపద పొంచి ఉంది. విష్ణుమూర్తి వాహనమైన ఆ గరుత్మంతుడు మా జాతి మీద పగపట్టిన విషయం తెలిసిందే కదా! అతని పగని చల్లార్చేందుకు మేమే స్వచ్ఛందంగా మాలో ఒకరిని అతనికి ఆహారంగా పంపుతూ వస్తున్నాము.
 • ⧫ ఇప్పటికే అలా సుముఖుని తండ్రి గరుత్మంతునికి బలైపోయాడు. ఇక త్వరలో సుముఖుని వంతు కూడా రాబోతోంది. త్వరలో చావు మూడబోతున్న వ్యక్తికి చూస్తూ చూస్తూ నీ కూతురిని ఇచ్చి వివాహం చేయలేవు కదా!’ అని వాపోయాడు.
 • ⧫ ఆర్యకుని విషాదం విన్న మాతలికి ఏం చేయాలో పాలుపోలేదు. అలాగని సుముఖుని వదులుకునేందుకూ మనసు ఒప్పలేదు. దాంతో సుముఖుని తీసుకుని నేరుగా దేవలోకానికి వెళ్లాడు మాతలి. అక్కడ కొలువై ఉన్న ఇంద్రునికి తన సమస్యను నివేదించాడు. మాతలి సమస్యను విన్న ఇంద్రుడు వారిని తీసుకుని విష్ణుమూర్తి చెంతకు చేరుకున్నాడు.
 • ⧫ వైకుంఠంలో విష్ణుమూర్తి చెంత ఇంద్రుడు, మాతలి, సుముఖుడు వినమ్రంగా నిలబడి ఉండగానే... అక్కడికి ప్రవేశించాడు గరుత్మంతుడు. అక్కడ ఏం జరుగుతోందో గమనించగానే అతని క్రోధానికి అడ్డులేకుండా పోయింది.
 • ⧫ నిప్పులు కక్కతూ- ‘ఇంద్రా! నా మాట కాదని ఈ సుమఖుని చిరాయువుగా చేసే ప్రయత్నం చేస్తావా. దగ్గరుండి ఇతని వివాహం జరిపించాలని తలపెడతావా. నా శక్తి గురించి నీకు తెలియదా! నిన్ను నేను అవలీలగా ఓడించిన రోజులు మర్చిపోయావా. ఈ విశ్వం మొత్తాన్నీ ఒక్క ఈక మీద మోయగలను. సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తినే మోసే సామర్థ్యం నాకు ఉంది...’ అంటూ ఇంద్రుని వైపు దూసుకుపోయాడు.
 • ⧫ ఇదంతా గమనిస్తున్న విష్ణుమూర్తి- ‘గరుత్మంతా! నేను ఇక్కడున్నానన్న విషయం కూడా మర్చిపోయి ప్రగల్భాలు పలుకుతున్నావే! నువ్వు అంతటి వీరుడవా? నన్ను సైతం అవలీలగా మోయగలవా! సరే నీ శక్తి ఏ పాటితో చూద్దాం ఉండు,’ అంటూ తన చేతిని గరుత్మంతుని మీద మోపాడు. అంతే! గరుత్మంతుడు ఒక్కసారిగా నేలకరిచాడు.
 • ⧫ నోట మాటరాక చెమటలు కక్కుతూ దిక్కు తోచక మిన్నకుండిపోయాడు. విష్ణుమూర్తి తన చేతిని తీసిన తరువాత కానీ అతను ఊపిరిపీల్చకోవడం సాధ్యపడలేదు.
 • ⧫ ‘నేను నీకు మోసే అవకాశం ఇస్తున్నాను కాబట్టే నువ్వు నన్ను మోయగలుగుతున్నావు. కానీ నీ బాధ్యత గర్వంగా మారి తలకెక్కినట్లుంది. నువ్వు మోసే బరువుకంటే తలబరువే ఎక్కువగా ఉన్నట్లుంది. ఆ గర్వం తగ్గించుకుని బుద్ధిగా ఉండకపోతే ఇలాంటి పరాభవం తప్పదు,’ అంటూ హెచ్చరించాడు విష్ణుమూర్తి.
 • ⧫ దేవాదిదేవుడైన ఆ విష్ణుమూర్తి చేతిలో గర్వభంగం పొందిన గరుత్మంతుడు తన తప్పుని తెలుసుకున్నాడు. ఆ తప్పుని మన్నించమంటూ ఇంద్రుని వేడుకుని, తల వంచుకుని అక్కడి నుంచి నిష్క్రమించాడు.
సంకలనం: శృతి వేణుమొగుల

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top