సనాతన ధర్మ పరిరక్షణకై కదలిన ధర్మాచార్యులు… తిరుపతిలో సనాతన ధర్మ సదస్సు.

0
సనాతన ధర్మ పరిరక్షణకై కదలిన ధర్మాచార్యులు… తిరుపతిలో సనాతన ధర్మ సదస్సు - The dharmacharyas who moved to protect the sanatan dharma... Sanatan Dharma Seminar in Tirupati
సనాతన ధర్మ పరిరక్షణకై కదలిన ధర్మాచార్యులు
హిందూ సమాజాన్ని, హిందూ మతాన్ని, హిందూ మత వ్యవస్థలను దారుణంగా దెబ్బతీసే ప్రయత్నాలు సాగుతున్న విషమ ప‌రిస్థితుల్లో ఐక్య కార్యాచరణకు పటిష్ఠమైన, విస్తృతమైన వేదికను రూపొందించేందుకు నాంది పలుకుతూ వివిధ పీఠాధిపతుల మధ్య సమాలోచనల పరంపర ప్రారంభమైంది. అందులో భాగంగా మొదటి సమావేశం ఈ నెల 3న తిరుపతి దగ్గరలోని పోన్పాడి గ్రామంలో జరిగింది. ఈ సనాతన ధర్మ రక్షణ సదస్సులో అనేక మతశాఖలకు, సంప్రదాయాలకు ప్రాతినిథ్యం వహించే పలువురు ధర్మాచార్యులు పాల్గొన్నారు.
   ఇందులో పాల్గొన్న ధర్మాచార్యులు:
  1. కంచి కామకోటి జగద్గురువు శంకర పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి మహా స్వామి వారు.
  2. శృంగేరి జగద్గురు పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి ప్రతినిథిగా శృంగేరి శారదా పీఠం ఎడ్మినిస్ట్రేటర్ శ్రీ గౌరీశంకర్ గారు.
  3. పెజావర్ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విశ్వ ప్రసన్న తీర్థ మహాస్వామివారు
  4. హంపి విద్యారణ్య మహా సంస్థాన పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి మహాస్వామివారు.
  5. పుష్పగిరి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ విద్యాశంకర భారతి మహాస్వామివారు
  6. తుని సచ్చిదానంద తపోవన పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి వారు.
  7. అహోబిల మఠాధీశ్వరులు శ్రీమతే శ్రీవన్ శఠకోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదశికన్ మహాస్వామి వారి ప్రతినిథి
  8. శ్రీ భువనేశ్వరీ మహాపీఠ ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి మహాస్వామివారు
  9. శ్రీ ముముక్షుజన మహా పీఠాధిపతి ముత్తీవి సీతారాం గురువర్యులు.
ఆరు గంటలకు పైగా సాగిన ఈ సమాలోచనలో అనేక ధార్మిక విషయాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా దక్షిణాదిన కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో సనాతన ధర్మం, హిందూ సంస్కృతి, హిందువుల విశ్వాసాలపై వివిధ దిశలలో జరుగుతున్న దాడులపై సదస్సు ఆవేదనను వ్యక్తం చేసింది.
  ఆంధ్ర ప్రదేశ్ లో దేవతామూర్తుల విధ్వంసం:
“ఆంధ్ర ప్రదేశ్ లో పూర్వపు రాష్ట్ర ప్రభుత్వం కృష్ణ పుష్కరాల సందర్భంగా దేవాలయాలను తొలగించిన తీరును రాష్ట్ర ప్రజలు మరచి పోలేదు. ముఖ్యంగా ఇటీవల ఒక సంవత్సరంగా ఆ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళన, ఆవేదన కలిగిస్తున్నాయి. దేవాలయ వ్యవస్థ, పవిత్ర దేవతామూర్తులపై ఆ రాష్ట్రంలో పథకం ప్రకారం దాడులు జరుగుతున్నాయి. అయోధ్యలోని రామజన్మభూమిలో ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుడికి దివ్యమైన గుడి కట్టేందుకు మొత్తం హిందూ సమాజం దీక్షాబద్ధమైన సమయాన రాముడు నడయాడిన పుణ్యభూమిలో రాములవారి విగ్రహానికి శిరశ్ఛేదం చేసే దారుణానికి తెగబడటం.. సహించరాని, క్షమించరాని దురాగతం. అటువంటి దుష్కృత్యాలకు పాల్పడిన దుండగులను రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా దండించాలని సదస్సు అభిప్రాయపడింది.
“దేవాలయ వ్యవస్థను రక్షించటం దైవాపచారాలకు పాల్పడే దుండగులను కఠినంగా శిక్షించటం ఫ్రభుత్వ ధర్మం. ధర్మానికి గ్లాని కలిగినప్పుడు ధర్మాచార్యులు తమకేమీ పట్టనట్టు మిన్నకుండజాలరు. రాజ్యాంగాన్ని అపహసించి, ఒక మతం పట్ల పక్షపాతంతో హిందూ మతాన్ని మట్టుపెట్టే వినాశకర ధోరణిని ప్రస్తుత పాలకులు తక్షణం విడనాడాలి” అని పూజ్య ధర్మాచార్యులు హితవు చెప్పారు.
  దేవాలయాల నిధులను ధార్మికేతర కార్యక్రమాలకు మళ్ళించరాదు:
దేవాలయాల నిథులలో ఒక్క పైసా కూడా హిందూ ధర్మంతో సంబంధం లేని సెక్యులర్, అవసరాలకు, సంక్షేమ పథకాలకు మళ్ళించకూడదు. ఆయా దేవాలయాల అభివృద్ధికీ ధర్మ ప్రచారానికీ మాత్రమే ఆలయ నిధులు వెచ్చించాలని సదస్సు ప్రభుత్వాలను కోరింది. ఉన్నత స్థాయి కమిటీ: దేవాలయవ్యవస్థ పై ప్రభుత్వ నియంత్రణ, దేవదాయ ధర్మదాయ శాఖ పనితీరు. దేవుడి అస్తుల, ఆభరణాల భద్రత, అర్చకుల సంక్షేమం,  భక్తుల సౌకర్యాలు వంటి అనేక అంశాలకు సంబంధించి ఉత్పన్నమైన వివాదాలను, అభియోగాలను, పెద్దల సూచనలను సాకల్యంగా అధ్యయనం చేసి పరిస్థితిని చక్కదిద్దే మార్గాన్ని సూచించేందుకు రిటైర్డ్ న్యాయముర్తి ఆధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించాలి. పీఠాధిపతులు, విజ్ఞుల సలహాలతో వివిధ రంగాలకు చెందిన నిపుణులను ఆ కమిటీలో సభ్యులుగా నియమించాలని సదస్సు సూచించింది.
  దేవాలయ కేంద్రంగా భక్త సంఘాలు:
దేవాలయ ఆస్తుల, సంప్రదాయాల, ఆచారాల పరిరక్షణ నిమిత్తం దేవాలయాలలో భక్త సంఘాలు ఏర్పడాలి. అలాగే -దేశ వ్యాప్తంగా అనేక ప్రాచీన దేవాలయాల్లో ఆర్క్యలాజికల్ విభాగపు ఏకపక్ష ధోరణి వల్ల ఆ దేవాలయాల్లో దీప, ధూప నైవేద్యాలు లేకుండా పోయాయని, అందువల్ల ఇప్పటికైనా అధికారులు ధర్మాచార్యుల తో సంప్రదింపులు జరిపి పూజలు జరిగేట్లు చూడాలని ధర్మ సదస్సు కోరింది.
  దీర్ఘకాలిక ధర్మ పోరాటానికి సిద్ధం కావాలి:
ప్రభుత్వాన్ని నడిపేవారు రాజ ధర్మాన్ని విస్మరించినప్పుడు ధర్మ సంరక్షణకు ప్రజలే ఆయత్తం కావాలి. సనాతన ధర్మాన్ని, హిందూ మతాన్ని కాపాడుకోవటానికి నిరంతరం జాగరూకత చూపాలి. హిందువులందరూ దీర్ఘ కాలిక ధర్మ పోరాటానికి సమైక్యంగా కదలాలని ధర్మాచార్యులు పిలుపునిచ్చారు.
  ధర్మాచార్యుల సంయుక్త పర్యటనలు:
ఈ దిశగా హిందూ సమాజాన్ని జాగృత పరచటానికి ధర్మాచార్యులు సంయుక్త పర్యటనలు చేస్తారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో ప్రకటిస్తారు.
  తిరుపతిలో విస్తృత సాధుసంతుల సభ:
   ఇటువంటి అతిముఖ్య అంశాలపై సమగ్ర సమాలోచన జరిపేందుకు రెండు తెలుగు రాష్ట్రాలలో వీలైనంత త్వరగా విస్తృత సమావేశాలు నిర్వహించాలని సదస్సు నిర్ణయించింది. ఈ క్రమంలో మొదటి అడుగుగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని సంప్రదాయాలకు, వివిధ హైందవ మత శాఖలకు చెందిన సాధు సంతుల, పీఠాధిపతుల మహాసభను త్వరలో తిరుపతిలో జరపాలని ధర్మాచార్యులు నిర్ణయించారు.

__విశ్వ సంవాద కేంద్రము (తెలంగాణ

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top