విశ్వకర్మ వాస్తుశాస్త్రము
శాస్త్రీణానేన సర్వస్య లోకస్య పరమం సుఖమ్
చతుర్వర్ణఫల ప్రాప్తిస్సల్లోకశ్చ భవేద్ద్రువమ్
ఈ శాస్త్రము వలన సర్వజనులకు సుఖము కలుగును. ధర్మ, అర్ధ, కామ, మోక్షఫలము లభించును. సత్యలోకప్రాప్తి కలుగునని విశ్వకర్మ తెలిపెను. ఈ గ్రంథ కారుడైన విశ్వకర్మ పద్దెనిమిది మంది వాస్తుశాస్త్ర ప్రవర్తకులలో ప్రభానమైన శాస్త్రకారురునిగా దేవునిగా పూజలందుకొనుచున్నాడు.
  శాస్త్రపతనము ఆచరణము వలస స్వస్థజీవనము, సుఖజీవనము కలుగును ఆకారణవశమున సుమారుగా మూడువేల నంవత్సరములనుండి ఈశాస్త్రప్రాముఖ్యత లోకములో ప్రచులితమైనది. ఆచరణయోగ్యమైనది. బెంగాల్, ఒరిస్సా, గుజరాత్, రాజస్థాన్, కాశ్మీరముల, నుండి దక్షిణదేశములోని అన్ని ప్రాంతములలో ఈ గ్రంథము లోక ప్రియత్వమును పొందినది. విశ్వకర్మ వాస్తుశాస్త్ర మతమును పరంపరగా తర్వాత నిర్మించిన వాస్తుశాస్త్రకారులు తమ గ్రంథములలో నిక్షిప్తము చేసిరి. విశ్వకర్మ్యమతాను సారము అనేక గ్రంథముల నిర్మాణము జరిగినది.
ఈ గ్రంథములో 87 అధ్యాయములున్నవి, అధికాంశ శ్లోకములు అనుస్తఛందస్సులో నిర్మింపబడినవి. ఈ అధ్యాయములలో గ్రామ, నగర ఖర్చటాదుల నిర్మాణము దుర్గలక్షణములు, ప్రాసాదమందిరముల నిర్మాణము, దేవతామందిరముల నిర్మాణము, దేవతామందిరములు, రాజభవనముల లక్షణము లను వివరముగా తెలియ జేసెను. న్యాయశాల. సభాభవనము, కోశాగారము, అంత:పురము, రాణివాసము, శస్త్రగృహము, ఆయుధాగారము, వివిధములైన శాలలు క్రీడాగృహములు సుందరమైన తోరణములు, వేదికలు అధిష్ఠానము, ఉపపీఠము, గోపుర ప్రాకారాదుల నిర్మాణములను తెలిపెను.
విశ్వకర్మ నామముతో అనేక వాస్తుగ్రంథముల నిర్మాణము జరిగినది. విశ్వకర్మ మతము, విశ్వకర్మజ్ఞానము, విశ్వకర్మ పురాణము, విశ్వకర్మ ప్రకాశము, విశ్వకర్మ సంప్రదాయము, విశ్వకర్మీయ శిల్పశాస్త్రము మున్నగునవి ప్రస్తుత విశ్వకర్మవాస్తు శాస్త్రము కూడ ఆవిధముగా నిర్మింపబడినదే. ఈ గ్రంథము సుమారుగా 13 నుండి 16 శతాబ్ది మధ్యభాగములో రచింపబడినదని పండితుల అభిప్రాయము. ఈ గ్రంథమునకు అనంతకృష్ణ భట్టారకుడు వ్యాఖ్యానము రచించెను. కొన్నింట కఠిన శబ్దములకర్థము తెలియజేసెను. ఇతని వ్యాఖ్యానములో ద్రావిడ వాస్తు గ్రంథముల ప్రస్తావన కనబడును. ఇతని కాలమును గూర్చిన ఆధారము కనబడదు.








