పాతతరాల, కొత్తతరాల మధ్య ఘర్షణ ఎందుకు వస్తోంది ? - Why is the confrontation between old and new?

0

ఇప్పుడు పాతతరాల, కొత్తతరాల మధ్య ఘర్షణ కనిపిస్తోంది. వయోధికుల అనుభవమూ, యువతకున్న శక్తీ రెండూ కలిసి పనిచేసేటట్లు చేయడం ఎలా?

వాళ్లు ఇప్పుడే కాదు, ఎప్పుడూ పరస్పర వ్యతిరేకంగానే ఉన్నారు. అసలు సమస్య ఏమిటంటే ముసలితరం తాము ముసలి వాళ్లమనుకోవడం లేదు. యువతరం తీసుకోవాలనుకుంటున్న స్థానాన్ని వృద్ధతరం ఖాళీ చేయడం లేదు. ఇది కేవలం మనుషుల్లోనే కాదు. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే జంతువుల పరిస్థితీ ఇదే. మీరు కొన్నిసార్లు గమనించవచ్చు. యౌవనావస్థలోని మగ ఏనుగు క్రోధంతో అన్నీ విరిచి వేయడం, ధ్వంసం చేయడం చూడవచ్చు. గుంపులోని మరో పెద్ద మగ ఏనుగుతో అది పోరాడ వలసి రావడమే దీనికి కారణం. ఆ మగ ఏనుగు తన స్థానం ఖాళీ చేయడంలేదు,  ఆ స్థానం కోసం ఈ యువ మగ ఏనుగు పోరాడుతూ ఉంది. కాని దానికింకా ఆ శక్తి రాలేదు, అందుకే అంత కోపం – అదే కౌమారం..!

అందుకే భారతీయ సంస్కృతిలో వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరిచారు. 0-12 సంవత్సరాల వరకు బాలావస్థ, ఈ దశ కేవలం ఆట పాటలకే – శరీరమూ, బుధీ వృద్ధి చెందాలి. 12-24 సంవత్సరాల మధ్య బ్రహ్మ చర్యం – మీ శరీరానికి, మనస్సుకు క్రమశిక్షణ అలవారిచే సమయం. మీ శక్తిని అభివృద్ధి చేసుకోవాలి, శక్తిమంతులు కావాలి. 24 ఏళ్ల వయస్సులో జీవితాన్ని మీరు స్పష్టంగా చూడగలిగితే, ఈ సంసారాన్ని సాగరాన్ని ఈద దలచుకోకపోతే, సన్యాసులవుతారు. లేకపోతే పెళ్లి చేసుకుని, గృహస్థులవుతారు. మీరు 24 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకుంటే, రెండు సూర్య ఆవృత్తుల తర్వాత అంటే మరో 24 ఏళ్ల తర్వాత మీరు 48 ఏళ్ల వాళ్లవుతారు. అంటే ఆ సమయానికి మీ పిల్లలు యుక్తవయసుకు వస్తారు-  పొట్ల గిత్తల స్వభావం ఉంటుంది. మీరు తప్పుకోవాలని వాళ్లనుకుంటారు, కానీ చెప్పలేరు.

అందువల్ల 48 సంవత్సరాల వయసులో దంపతులు వేరు వేరు మార్గాలలో వెళతారు. భర్త ఒక సంస్థలోకి, భార్య మరో సంస్థలోకి. 12 ఏళ్లపాటు తమ తమ ఆధ్యాత్మిక సాధనలో గడుపుతారు. 60 ఏళ్లకు మళ్లీ కలుసుకొని, పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు మీరు వేరువేరుగా పోవడం లేదు కాని 60లో మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు. మీరు పన్నెండేళ్లు ఎడంగా వెళ్లాల్సి ఉంది. మొదటిసారి మీరు పెళ్లి చేసుకున్నప్పుడు దేహావసరాలో, భావోద్వేగాలో, మరొకటో మిమ్మల్ని వశీకరించుకొని ఉండవచ్చు. ఇప్పుడవన్నీ అయిపోయాయి. మీరు 12 ఏళ్ల ఆధ్యాత్మిక సాధన చేశారు. మీరు భిన్న పద్ధతిలో ఒకటి కావడానికి వచ్చారు. కలిసి వాన ప్రస్థానానికి వెళతారు. మీ జీవితంలో చివరి భాగం గడపడానికి అడవికి వెళతారు.
ఇప్పుడు వెళ్ళదచుకోవడం లేదు, పిల్లలు వెళ్లాలనుకుంటున్నారు. ఒకవేళ పిల్లలు ప్రపంచంలో తమ కాళ్లూనుకుంటే వాళ్లు ఎట్లాగూ వెళతారు. వాళ్లు కూళ్లూనుకోకపోతేనే సమస్య, అప్పుడే ఘర్షణ.
ఎవరిస్థలం వారికి కావాలి:

తమంతట తాము తల్లిదండ్రులనో, పిల్లలమనో అనుకొంటున్నారు, దీనికి కారణం మనోభావాలే. కాని జీవిత వాస్తవంలోకి వస్తే స్థానంకోసం, ఆధిపత్యం కోసం సంఘర్షించే పెద్ద వృషభం, చిన్న వృషభం. పురుషులు ఒక విధంగా ప్రవర్తిస్తే, స్త్రీలు ఒక రకంగా ప్రవర్తిస్తారు. కాని ప్రాథమిక సమస్య ఒకటే – మీకు స్థానం కావాలి, వాళ్లు స్థానం ఖాళీ చేయడం లేదు – ఘర్షణలు జరుగుతాయి. తల్లిదండ్రులకు దూరంగా జీవించే పిల్లలు ఎప్పుడూ వారిని ప్రేమిస్తుంటారు. కానీ, వాళ్లు మీతో ఉంటే ఎప్పుడూ ఘర్షణ పడుతూ ఉంటారు – దీనికి కారణం మీరు చెడ్డవారో, వాళ్లు చెడ్డవారో కావడం కాదు. మీకు ఒక రకమైన వాతావరణం అవసరమైతే, వాళ్లకు మరో రకమైన వాతావరణం అవసరం. ఇద్దరూ ఒకే చోట ఉంటే వేడి పుడుతుంది.

ఇది కొత్త సమస్య ఏమీ కాదు. మానవుడు గుహల్లో జీవించినప్పుడు కూడా ఈ సమస్య ఉండి ఉంటుంది. మనం దీన్నెలా పరిష్కరించుకోవాలి? పెద్దలు పక్కకు తప్పుకోవడం నేర్చుకోవాలి. పిన్నలను ఆ స్థలం ఆక్రమించుకోనివ్వాలి. పెద్దలు ఒక స్థాయి వివేకాన్ని, అనుభవాన్ని ప్రదర్శించాలి, అది పిన్నలకు వారిపట్ల గౌరవాన్ని కలిగించాలి. మీరలా చేయకపోతే యువత మిమ్మల్ని ఏవగించుకుంటుంది, అనేక విధాలుగా మొరటుగా ప్రవర్తిస్తుంది. మీరు పెద్ద వాళ్లయ్యే కొద్దీ ఒక స్థాయి వివేకాన్ని, జీవితంలో అంతః దృష్టిని సంపాదించుకుంటే – దాన్ని పిన్నలింకా సంపాదించుకోవలసి ఉంటుంది – వాళ్లు ఆదర్శం కోసం మీ వైపు చూస్తారు. అప్పుడు దాదాపుగా మీరు అదే స్థలంలో ఉండవచ్చు. మీరు మొదటి అంతస్తులో ఉండండి.. వాళ్లను కింది అంతస్తులో ఉండి మీ కోసం పైకి చూడనీయండి.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top